పోటీ ప్రపంచం!

13 Jun, 2015 01:20 IST|Sakshi
పోటీ ప్రపంచం!

కంటికి కనబడే ఈ వస్తుగత ప్రపంచంలో మరో ప్రపంచం అంతర్లీనంగా ఉన్నదని బడి చదువుల సమయంలోనే అందరికీ అర్థమవుతుంది. ఆ ప్రపంచం పోటీ ప్రపంచం. నిరంతరం శ్రమించడానికి సంసిద్ధులయ్యేవారికే అందులో చోటు. ఒకసారి విజేతగా నిలబడితే చాలదు. పదే పదే పోటీపడాలి. ఒక సబ్జెక్టులో మెరిసిపోతే కుదరదు. అన్నిటా ముందుండాలి. ఎప్పుడో వచ్చే పరీక్షల్లో కాదు... రోజూ తరగతి గదిలో టీచర్‌నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సైతం జవాబివ్వడానికి సిద్ధంగా ఉండాలి.

ఆల్ రౌండర్ అనిపించుకోవడంలో...అందుమీదట లభించే ఆధిక్యతాభావాన్ని అనుభవించడంలో ఉండే మజాయే వేరు. పై తరగతులకు వెళ్లేకొద్దీ ఇది విస్తరిస్తున్నది. యూనివర్సిటీ కావొచ్చు, మరో ఉన్నతశ్రేణి విద్యా సంస్థ కావొచ్చు...చదువు పూర్తవుతుండగా క్యాంపస్ ఇంటర్వ్యూల రూపంలో పతాక సన్నివేశం ఉంటుంది. విజేతలెవరో, పరాజితులెవరో ఆఖరుగా తేలి పోతుంది. దాంతో పోటీలో ఒక అంకం ముగిసి మరొకటి ప్రారంభమవుతుంది. సరిగ్గా ఇక్కడే పిల్లలు సందిగ్ధావస్థలో పడుతున్నారు.

చదువులో తదుపరి దశకు వెళ్లడమా... బహుళజాతి సంస్థలు ఆశపెట్టే డాలర్ డ్రీమ్స్ వెనక పరుగులెత్తడమా అనేది తేల్చుకోలేకపోతున్నారు. తమ అభిరుచులేమిటో, సామర్థ్యమేమిటో, తమకు సరిపడేదేమిటో నిర్ధారించుకోలేక పోతున్నారు. అమ్మానాన్నల నుంచి వచ్చే ఒత్తిళ్లు వారికి అలా తేల్చుకోవడానికి అవసరమైన సమయాన్ని కూడా ఇవ్వడంలేదు.

ఈ నేపథ్యంలో ఇటీవల చోటుచేసుకున్న రెండు ఉదంతాలు అందరినీ ఆలోచింపజేస్తాయి. మొదటిది కొన్ని రోజులక్రితం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన 22 ఏళ్ల యువకుడు సర్వశ్రేష్ట గుప్తాకు సంబంధించింది. ఢిల్లీ చదువుల అనంతరం అమెరికా వెళ్లి పెన్సిల్వేనియా యూనివర్సిటీలో పట్టభద్రుడైన సర్వశ్రేష్ట నిరుడు క్యాంపస్ ఇంటర్వ్యూలో ప్రముఖ బ్యాంకింగ్ రంగ దిగ్గజం గోల్డ్‌మాన్ శాక్స్‌లో ఫైనాన్షియల్ అనలిస్ట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రపంచం మొత్తాన్ని తన కనుసైగలతో శాసిస్తున్న వాల్‌స్ట్రీట్‌లో ప్రవేశించాడు.

మన దేశంలోని మధ్యతరగతి యువకులు ఎంతగానో ఆరాటపడే, కలలుగనే ఉన్నత శిఖరాన్ని అధిరోహించాననుకున్నాడు. కానీ ఆ ఉద్యోగంలో ఉండే ఒత్తిడి కొంచెం కొంచెంగా తన ప్రాణాన్ని పీలుస్తున్నదని తెలుసుకోలేకపోయాడు. తెలుసుకుని నాన్నను ఒప్పించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అప్పటికే కాలాతీతమైంది. తన అపార్ట్‌మెంట్‌లోని కారు పార్కింగ్‌లో విగతజీవుడిగా మిగిలిపోయాడు. అతను భరించలేని మానసిక ఒత్తిడిలో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చునన్నది స్థానిక మీడియా ఊహాగానం. తండ్రి సైతం ఇప్పుడు అదే చెబుతున్నాడు. ఎంతో భవిష్యత్తున్న తన గారాలపట్టీని పని ఒత్తిడే చిదిమేసిందని వాపోతున్నాడు.

‘ఎన్నటికీ మరణించని కుమారుడి’ స్మృతిలో ఎలిజీ రాసుకున్నాడు. మరణానికి కొద్దిరోజుల ముందు ‘ఇది మరీ దారుణం. గత రెండురోజులుగా నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నాను. మళ్లీ రేపు ఉదయాన్నే మీటింగ్ అంటున్నారు. అందుకు సంబంధించిన పని ఇంకా పూర్తికాలేదని కోప్పడుతున్నారు’ అని కొడుకు తనకు పంపిన ఎస్సెమ్మెస్‌ను అందులో ప్రస్తావించాడు. ఆ తండ్రిపై ఏం ఒత్తిళ్లు వచ్చాయో ఏమో బ్లాగ్‌లో ఉన్న ఆ ఎలిజీ మాయమైంది. వాల్‌స్ట్రీట్‌లో ఈ తరహా మరణాలు గత ఏడాది కాలంలో అనేకం సంభవించాయని ‘న్యూయార్క్ టైమ్స్’ చెబుతోంది. సిబ్బందిపై పనిభారాన్ని తగ్గిస్తే తప్ప వీటిని అరికట్టడం అసాధ్యమంటున్నది.

రెండో ఉదంతం ఖరగ్‌పూర్ ఐఐటీ విద్యార్థికి సంబంధించింది. ఆ సంస్థలో చదివిన శిఖర్ బీటెక్‌కు సంబంధించిన అన్ని విభాగాలకు చెందిన విద్యార్థులకంటే అత్యుత్తమంగా నిలిచి పట్టభద్రుడు కావడమేకాక ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు ఎంపికయ్యాడు. అయితే తాను చదివిన కంప్యూటర్ సైన్స్‌లో పరిశోధనలకే ప్రాముఖ్యతనీయాలని నిర్ణయించుకుని ఆ ఉద్యోగాన్ని తిరస్కరించాడు. ఈ విషయంలో తనకు రెండో ఆలోచన లేదని, కుటుంబసభ్యులంతా తన నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని చెప్పాడు.

అందరి పిల్లలకూ శిఖర్‌కున్న స్వేచ్ఛ ఉండదు.  పిల్లల అభిరుచులేమిటో, వారి ఆసక్తులేమిటో తెలుసుకుని అందుకనుగుణమైన రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛనివ్వకపోతే...ప్రతి అంశంలోనూ తామే శాసిస్తే...పోటీయే ప్రపంచంగా మిగిలిస్తే చివరికెలాంటి ఫలితాలు వస్తాయో తెలియడానికి సర్వశ్రేష్ట గుప్తా ఉదంతం ఉదాహరణగా నిలిస్తే శిఖర్ నిర్ణయం ఆరోగ్యకరమైన స్థితికి అద్దం పడుతుంది.

నిజానికి విద్యారంగంలోని రుగ్మతలే తల్లిదండ్రులను ఆలోచించలేని స్థితికి నెడుతున్నాయి. పిల్లలపై శక్తికి మించిన లక్ష్యాలను రుద్దేలా చేస్తున్నాయి. ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో మన వర్సిటీల స్థానం అట్టడుగున ఉంటున్నది. తొలి 200 యూనివర్సిటీల్లో చైనాకు సంబంధించినవి 6 ఉండగా మన దేశం స్థానం 400 దాటాక ఎక్కడో ఉంది. ప్రపంచ మేధోపరమైన హక్కుల సంస్థకు చైనా ఉన్నత శ్రేణి సంస్థలనుంచి పేటెంట్ల కోసం 2013లో 8,25,136 దరఖాస్తులు రాగా, భారత్‌నుంచి వెళ్లినవి కేవలం 43,031 మాత్రమే!

1995లో  ప్రాజెక్ట్-211 కింద చైనా వంద యూనివర్సిటీలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుని ఆ రంగంలో భారీయెత్తున నిధులు ఖర్చుపెట్టి అత్యుత్తమశ్రేణి వర్సిటీలను నెలకొల్పడంలో నిమగ్నమైతే... మనం ఇంచుమించు అదే సమయంలో ఉన్నత విద్యారంగాన్ని భ్రష్టుపట్టించే పనిని మొదలెట్టాం. విద్యారంగానికి నిధులివ్వడంలోగానీ, యూనివర్సిటీల్లో అవసరమైనంతమంది బోధనా సిబ్బందిని నియమించడంలోగానీ, పరిశోధనలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడంలోగానీ పూర్తిగా వెనకబడ్డాం. పెపైచ్చు సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరిట చదువులను కొనుక్కునే విధానాన్ని ప్రవేశపెట్టి సామాన్యులు ఆ వైపు అడుగుపెట్టకుండా జాగ్రత్తపడ్డాం.

సృజనకూ, పరిశోధనకూ అమిత ప్రాధాన్యతనిచ్చేలా కొత్తగా యూనివర్సిటీలను నెలకొల్పాలని ఉద్దేశించిన 2012నాటి బిల్లు అతీ గతీ లేకుండా అదృశ్యమైంది. దాని సంగతలా ఉండగానే రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్ పేరిట కొత్త పథకం పుట్టుకొచ్చింది. ఉన్నత విద్యారంగాన్ని ఉద్ధరిస్తానంటున్న ఈ పథకం ఏమవుతుందో చూడాలి. సర్వీస్ రంగంలో వచ్చే ఉద్యోగాలే, జీతాలే జీవితధ్యేయంగా మార్చి యువత  శక్తిసామర్థ్యాలను నీరుగారుస్తున్న... వారి ఉసురుతీస్తున్న ప్రస్తుత ధోరణులను మార్చడానికి ఏంచేయదల్చుకున్నారో పాలకులు సెలవీయాలి.

>
మరిన్ని వార్తలు