కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షలు

22 Jul, 2016 02:37 IST|Sakshi

అందరినీ ఇబ్బందులు పెట్టడంలో ఆరితేరిన కాంగ్రెస్ అధినేతలకు ఈమధ్య కష్టా లొచ్చిపడ్డాయి. రెండు కీలకమైన కేసులు వారిని వెంటాడుతున్నాయి. అందులో ఒకటి బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి తీసుకొచ్చిన నేషనల్ హెరాల్డ్ కేసు, రెండోది- తమ సంస్థపై రాహుల్‌గాంధీ అపనింద వేశారంటూ మహారాష్ట్రకు చెందిన ఆరెస్సెస్ కార్యకర్త ఒకరు దాఖలు చేసిన కేసు. నేషనల్ హెరాల్డ్ కేసు అవినీతి ఆరోపణలకు సంబంధించింది.
 
 ఆ పత్రిక ప్రచురణ కోసం ఎన్నడో 1937లో జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించిన అసోసియేట్ జర్నల్ లిమిటెడ్(ఏజేఎల్)కు ఇప్పుడున్న వేల కోట్ల విలువైన స్థిరాస్తులను చేజిక్కించుకునేందుకు యంగ్ ఇండియన్ అనే సంస్థను 2010లో స్థాపించారన్నది ఆ ఆరోపణల సారాంశం. న్యాయస్థానం విచారణలో ఉన్న ఆ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందన్నది వేచి చూడాల్సిన అంశం. డబ్బు రూపేణా కాకపోయినా దాన్ని మించిన కేసు ఆరెస్సెస్ సంస్థపై వేసిన నిందకు సంబంధించింది. మహాత్మాగాంధీ హత్య వెనక ఆరెస్సెస్ హస్తముందని 2014లో ఒక బహిరంగసభలో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణపై ఆ సంస్థ కార్యకర్త ఒకరు కింది కోర్టులో పెట్టిన కేసు అది.
 
 ఆ కేసును కొట్టేయాలన్న రాహుల్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘మీ ఆరోపణలు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 499కిందికి వస్తాయో, రావో తేల్చాల్సి ఉన్నద’ని స్పష్టం చేసింది. ‘పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారా లేక విచారణను ఎదుర్కొనడానికి సిద్ధ పడతారా’ అని కూడా ప్రశ్నించింది. ఈ సూటి ప్రశ్న చాలా జటిలమైనది. ఈ కేసులో ముందుకుపోయినా, వెనక్కొచ్చినా అంతిమంగా సంకటస్థితిలో పడేది కాంగ్రెసే. ముందుకెళ్లి విచారణను ఎదుర్కొనదల్చుకుంటే చేసిన ఆరోపణలకు సంబంధించి నిర్దిష్టమైన ఆధారాలను ఆయన చూపవలసి ఉంటుంది. దీన్నుంచి వెనక్కి రావడం ఉత్తమం అనుకుంటే సుప్రీంకోర్టు చెప్పినట్టు పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఆ పని చేస్తే కాంగ్రెస్ తగిలించుకున్న సెక్యులర్ భుజకీర్తులకు భంగం కలుగుతుంది.
 
 రాజీవ్ హయాంలో రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం, షాబానో కేసు తదితర అంశాల్లో వ్యవహరించిన తీరుతో మొదలుపెడితే అనేక సందర్భాల్లో ఆ పార్టీ వేసిన అడుగుల వల్ల దాని సెక్యులర్ ప్రభ అసలే అంతంతమాత్రంగా ఉంది. ఇప్పుడు ఆరెస్సెస్ కేసులో రాహుల్ ‘పశ్చాత్తాప’పడితే అది మరింత కొడిగట్టడం ఖాయం. బింకంగా ముందు కెళ్తే ఏమవుతుందో చెప్పలేం. ఆయన సమర్పించే సాక్ష్యాధారాలపైనా, వాటిని న్యాయస్థానం అంగీ కరించడంపైనా అది ఆధారపడి ఉంటుంది. కేసు సర్వోన్నత న్యాయస్థానానికి చేరే సరికి చాన్నాళ్లు పడుతుంది. మొత్తానికి ఆయన రెండో తోవ ఎంచుకున్నారు. రాహుల్ ‘చారిత్రక వాస్తవాలపై’ అవగాహన ఉన్నవారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఘంటాపథంగా చెబుతున్నారు. రాహుల్ అందజేసే ఆ ‘వాస్తవాల’ను న్యాయస్థానం అంగీకరిస్తే వేరుగానీ... తిరస్కరిస్తే పార్టీ పరువు పోవడంతోపాటు దాని సెక్యులర్ స్థానం మరింత కుంచించుకుపోతుంది. పైగా
 ఆ తీర్పు ఆరెస్సెస్‌కు అదనపు సర్టిఫికెట్ అవుతుంది.
 
 నిజానికి ఆరెస్సెస్‌పై ఇలాంటి ఆరోపణ చేసిన నేతల్లో రాహుల్‌గాంధీ మొదటివారేమీ కాదు. ఇంతక్రితం చాలామంది చేశారు. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్రమూ, అప్పటి జమ్మూ-కశ్మీర్‌లోని షేక్ అబ్దుల్లా ప్రభుత్వమూ కుట్రపన్నిన పర్యవసానంగానే జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ 1952లో కస్టడీలో మరణించారని బీజేపీ, సంఘ్ పరివార్ నేతలు అనేకులు పలు సందర్భాల్లో ఆరోపించారు. అలాగే 1984లో ఇందిర హత్య తర్వాత ఢిల్లీలో జరిగిన నరమేథంపైనా, 2001లో గోథ్రా మారణకాండ తర్వాత గుజరాత్‌లో చోటుచేసుకున్న ఊచకోతపైనా కాంగ్రెస్, బీజేపీ నేతలపై ఆరోపణలొ చ్చాయి.
 
 అందుకు సంబంధించిన కేసుల్లో ఆ రెండు పార్టీల నేతలపైనా న్యాయ స్థానాల్లో విచారణలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికీ ఎన్నికలొచ్చాయంటే ఆ రెండు పార్టీల ఆరోపణల జాబితాల్లోనూ ఈ అంశాలు ప్రధానంగా ఉంటాయి. మరో ఆరునెలల్లో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవి హోరెత్తుతాయి. ఈ బాణీకి భిన్నంగా రాహుల్ ఏమైనా మాట్లాడారా? ఆరెస్సెస్‌కు అదనంగా ఆగ్రహం తెప్పించారా? గతంలో ఆరెస్సెస్ ఇలాంటి ఆరోపణల్ని ఎదుర్కొన్నా వా టికి అంతే దీటుగా బదులివ్వడం తప్ప ఎన్నడూ న్యాయస్థానం తలుపు తట్టలేదు.  
 
 చట్టసభల్లోనూ, బహిరంగసభల్లోనూ, ఇతర వేదికలపైనా ప్రత్యర్థి పక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వర్తమానకాలంలో వింతేమీ కాదు. ఈమధ్య స్పీకర్ల పుణ్యమా అని చట్టసభల్లో కొందరు ఏం మాట్లాడినా చెల్లుబాట వుతోంది. కొందరు ఎలా మాట్లాడినా అపరాధమై రికార్డుల్లోంచి మాయమవు తోంది. ఆ సంగతలా ఉంచి బహిరంగసభలు, మీడియా సమావేశాల్లో నాయకులు చేసుకునే ఆరోపణలు మీడియాకు మేతగా తప్ప న్యాయస్థానాల వరకూ వెళ్లడం లేదు. అలా వెళ్తే సహజంగానే అది వేరే రూపం తీసుకుంటుంది. ప్రతి మాటా బలిగోరుతుంది. అడుగడుగునా ప్రశ్నల కొడవళ్లు అడ్డు తగులుతాయి. ఇక నీళ్లు నమలడం కుదరదు. ప్రతిదానికీ నిర్దిష్టంగా జవాబివ్వాలి. తగిన ఆధారాలివ్వాలి.
 
 రాహుల్‌కు ఇప్పుడు ఈ సమస్యే ఎదురైంది. మహాత్మాగాంధీ హత్య వెనక ఆరెస్సెస్ హస్తమున్నదని ఎలా చెప్పారని అడిగితే ఆయన తరఫు న్యాయవాది... పంజాబ్- హరియాణా హైకోర్టు తీర్పులో ప్రస్తావించిన అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గాంధీజీని హత మార్చిన గాడ్సే ఆరెస్సెస్ కార్యకర్త అని మాత్రమే అందులో ఉన్నది తప్ప ఆ సంస్థే చంపిందని ఎక్కడ నిర్ధారించిందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ కేసులో న్యాయ స్థానం ముందుంచబోయే ‘చారిత్రక వాస్తవాలు’ ఏమిటో రాగలకాలంలో తేలు తుంది. అయితే, దీని సంగతలా ఉంచి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో... గాలి కబుర్లు కాక బాధ్యతాయుతంగా మాట్లాడాలని, జవాబుదారీ తనంతో మెలగాలని నేతలు గ్రహిస్తే మంచిదే.

మరిన్ని వార్తలు