పల్లెలకు తిరుగుబాట

31 Mar, 2020 00:45 IST|Sakshi

ఇరుగు పొరుగు రాష్ట్రాలనుంచి... సుదూర ప్రాంతాల్లోని గ్రామసీమలనుంచి పొట్టచేతబట్టుకుని లక్షలమంది మహా నగరాలకు వలస వెళ్లడం గురించి ఎప్పటినుంచో వింటున్నదే. దశాబ్దాలుగా ఈ మహానగరాల మనుగడకు, వాటి ధగధగలకు జీవనాడుల్లా ఉపయోగపడుతున్న ఈ వలసజీవుల బతుకుల్లో లాక్‌డౌన్‌ హఠాత్తుగా చీకట్లు నింపింది. ఉన్నట్టుండి గూడు చెదిరి, ఎక్కడా పని దొరక్క, ఎటూ కదల్లేక, ఆకలి తీరే దోవ అసలే కనబడక, కూడబెట్టుకున్న కొద్దిపాటి సంపాదన హరించుకు పోయి మహానగరాల్లోని వలసజీవులంతా తమ తమ కుటుంబాలతో వేలాదిగా స్వస్థలాలకు కాలి నడకన పయనమవుతున్నారు. ఆ పని చేయలేనివారు ఎంతో కొంత ముట్టజెప్పి గాలి సరిగా ఆడని కంటైనర్లలో కూర్చుని వేలాది కిలోమీటర్ల ప్రయాణానికి సిద్ధపడుతున్నారు. సామాజిక మాధ్య మాలు, చానెళ్ల నిండా కనబడుతున్న ఈ దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. ఆలస్యంగానైనా మేల్కొన్న ప్రభుత్వాలు ఆదరా బాదరాగా  దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టగా, సుప్రీంకోర్టు సైతం సోమవారం జోక్యం చేసుకుని 24 గంటల్లో వాస్తవ పరిస్థితిపై తనకు నివేదిక అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కరోనా వల్ల ఇప్పుడు ఏర్పడిన పరిస్థితులు కనీవినీ ఎరుగనివి. వందేళ్లకొకసారి కూడా ఇంతటి మహా విపత్తు రాదని నిపుణులు చెబుతున్నారు. కనుకనే లాక్‌డౌన్‌ తప్పనిసరని కేంద్రం భావిం చింది. ఈ నెల 24నుంచి 21 రోజులపాటు దీన్ని అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది. కొన్నాళ్ల పాటు పౌరుల కదలికలను స్తంభింపజేస్తేనే కరోనా కట్టడి సాధ్యమని వైద్య నిపుణులు ఇచ్చిన సల హాయే ఇందుకు కారణం. దీనివల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయని కూడా అంటున్నారు. మంచిదే. కానీ ఈ నిర్ణయం ఏ వర్గాలకు ఏ సమస్యలు తెస్తుందో, ఎలాంటి అనుద్దేశిత పర్యవసానాలకు దారి తీస్తుందో ముందుగా అంచనా వేయలేకపోవడం ప్రభుత్వాల లోపం. మహానగరాల్లో పుట్టుకొస్తున్న ఆకాశ హర్మ్యాల నిర్మాణంలో, రోడ్ల నిర్మాణంలో, పారిశుద్ధ్యంలో, ఎన్నెన్నో వ్యాపారాల్లో, ఫ్యాక్టరీల ఉత్పత్తుల్లో, లక్షలాదిమంది సంపన్నుల నివాసాల్లో కార్యకలాపాలు సజావుగా సాగడం వెనక వీరి కృషి అపారమైనది. ఇందులో 99శాతంమందికి నిలకడైన ఉపాధి వుండదు. నికరమైన సంపాదన వుండదు. అసలు ఏ రిజిస్టర్‌లోనూ, ఏ రికార్డులోనూ వీరి పేర్లు నమోదైవుండవు. వారు నివాసం వుండే గూళ్లు కూడా మామూలు అర్థంలో నివాసగృహాలు కావు. అందుకు ఏమాత్రం పనికొచ్చేవి కాదు.

కానీ ఆ మహా నగరాల్లో బతకాలంటే అంతకన్నా వారికి గత్యంతరం లేదు. వారి బతుకులు ఎప్పుడూ అస్థిరత్వంలో కొట్టుమిట్టాడుతుంటాయి. హఠాత్తుగా లాక్‌డౌన్‌ వంటి ఊహించని విప త్తులు వచ్చిపడితే ఆ బతుకులేమైపోతాయో సులభంగా అంచనా వేయొచ్చు. కరోనాపై చాలా మందిలో వున్న భయాందోళనలే పెద్ద సమస్యని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్య కూడా వాస్తవమే కావొచ్చు. కానీ లాక్‌డౌన్‌తో అన్ని కార్యకలాపాలూ స్తంభించిపోయి, చివరకు ఇంటిచాకిరి చేసేవారిని కూడా ఎవరూ లోపలకు అడుగు పెట్టనీయని స్థితిలో వలసజీవులకు మరో దోవ లేదు. లాక్‌డౌన్‌ ప్రకటన వెంబడే వివిధ బస్తీల్లో నివాసం వుండేవారికి ప్రభుత్వాలనుంచి భరోసా దొరికితే వేరుగా వుండేది. నిత్యావసరాలు వారికి అందుబాటులోకి తెస్తే బాగుండేది. ఇవన్నీ జరగకపోవడం వల్లే వలసజీవులు వారి స్వస్థలాలకు పోవడం తప్పనిసరైంది.

ఎప్పుడూ ఉపాధి వెదుక్కుంటూ పల్లెటూళ్లనుంచి పట్టణాలకూ, నగరాలకూ వలస పోవడం తప్ప ఉపాధి లేమి వల్లనో, ఉత్పాతాల వల్లనో అటునుంచి వెనక్కి వచ్చిన ఉదంతాలు గతంలో ఎన్నడూ లేవు. అయాచితంగా వచ్చిన ఈ ‘సెలవు’ సమయంలో అయినవారితో కలిసి పండగ చేసు కుందామన్న యావతో వీరంతా బాధ్యతారహితంగా సొంత వూళ్లకు పోతున్నారని బీజేపీ నేత ఒకరు నోరు పారేసుకున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి మహా నగరాలనుంచి నిష్క్రమిస్తున్న వేలాదిమందివల్ల దేశంలోని అనేక ప్రాంతాలు కరోనా బారినపడే ప్రమాదం ఏర్పడిందన్నది ఆయన ఆందోళన. తర్వాత సొంత పార్టీ నేతల్లో కొందరు ఆయనకు చీవాట్లు పెట్టవలసి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సివచ్చిన నిర్ణయాలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవలసి వచ్చిందని, అందుకు క్షమించాలని ప్రధాని నరేంద్రమోదీ పెద్ద మనసుతో చెప్పడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. సొంత వూళ్లకు కాలినడకన పోతున్నవారి వల్ల కరోనా వ్యాప్తి బెడద వుండొచ్చన్న వాదనలో ఎంతో కొంత నిజం వుండొచ్చు.

కానీ అంతకన్నా వారికి గత్యంతరం ఏముంది? ఉన్నచోటే వుంటే కరోనా మాట అటుంచి, ఆకలిదప్పికలతో మరణించక తప్పని పరిస్థితులున్నాయి. ఈ తీవ్రతను ముందే అంచనా వేయలేకపోవడంపై ఆత్మవిమర్శ చేసుకోకపోగా ‘సెలవుల’ కోసం వెళ్తున్నారనడం అమాను షమనిపిస్తుంది. ఎలాంటి ప్రయాణ సాధనాలు లేకుండా, పగలూ రాత్రీ అన్న తేడా లేకుండా పిల్లా పాపలతో మండుటెండల్లో నడుచుకుంటూ పోతున్న ఈ వలస జీవుల్ని కదిలిస్తే వాస్తవాలేమిటో తెలు స్తాయి. వివిధ మాధ్యమాల్లో వీరి గురించి వెలువడుతున్న కథనాలు ఎలాంటివారినైనా కంటతడి పెట్టిస్తున్నాయి. వీరంతా భద్రంగా వారి వారి ఊళ్లకు వెళ్తున్నారని అనుకోవడానికి లేదు. రోగాల బారినపడి, ఆకలిదప్పికలకు తాళలేక, గుండెపోటు వచ్చి కొందరు చనిపోతున్నారు. ఇలాంటి కార ణాలతో ఈ నెల 24 మొదలుకొని ఇంతవరకూ 22మంది మరణించారు. ఇందులో అయిదుగురు పిల్లలున్నారు. వీరేకాదు... బిహార్‌లోని భోజ్‌పూర్‌లో ఆకలికి తాళలేక పదకొండేళ్ల బాలుడు చని పోయాడు. దశాబ్దాలనుంచి తమ చెమటతో, నెత్తురుతో ఆ మహా నగరాల నిర్మాణంలో, వాటి మను గడలో అనామకంగా ఉంటూనే సాయపడిన ఈ అభాగ్యజీవులకు ఇప్పుడు కావాల్సింది చేతలు. అవి ఎంత త్వరగా అమలైతే అంత త్వరగా ఈ వలసలు ఆగుతాయని గుర్తించాలి 

మరిన్ని వార్తలు