‘లోపలి మనిషి’ స్మృతిలో...

2 Apr, 2015 01:27 IST|Sakshi

దేశ రాజధానిగా మాత్రమే కాదు...ఢిల్లీ మహానగరానికి ఇతరత్రా కూడా పేరు ప్రఖ్యాతులున్నాయి. చరిత్రతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆ మహానగరంలో  ఘనంగా బతికినవారిని, జీవించినకాలంలో మంచి చేసినవారిని మరణించినంత మాత్రాన మరిచిపోరాదన్న సంస్కారం ఉంది. అందుకే అక్కడ ఏమూలకెళ్లినా ‘మృతజీవులు’ పలకరిస్తారు. వారి సమాధులు దర్శనమిస్తాయి. కనుకే ఆ నగరానికి ‘సమాధుల నగరం’గా కూడా పేరొచ్చింది.  
 
 దేశ ప్రధానిగా అవిచ్ఛిన్నంగా అయిదేళ్లు పనిచేసి, ఆర్థిక సంస్కరణలతో దేశ గతినే మలుపుతిప్పిన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు స్మారక స్థలి ఏర్పాటు చే సేందుకు అలాంటి మహానగరంలో చారెడు నేల దొరకలేదు! బతికుండగా ఆయనను ఎన్నో విధాలుగా అవమానించిన కాంగ్రెస్ పార్టీయే ఢిల్లీలో ఆయనకు మరణానంతరం స్మృతిచిహ్నం లేకుండా చేసింది.  ఈ నేపథ్యంలో... దశాబ్దకాలం తర్వాత కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆయనకు సముచిత రీతిలో స్మారక చిహ్నం ఏర్పాటుచేయాలని నిర్ణయించిందని వెలువడిన కథనం అందరికీ ఊరటనిస్తుంది.
 
 పీవీ నరసింహారావు స్వాతంత్య్ర సమరయోధుడు. కాంగ్రెస్ వాదిగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన పీవీ ఆజన్మాంతం అందులోనే కొనసాగారు. 1969లో పార్టీలో వచ్చిన చీలిక మొదలుకొని దేశంలో చోటుచేసుకున్న ఎన్నో పరిణామాల్లో ఆయన ఇందిరాగాంధీ వెనక దృఢంగా నిలబడ్డారు. అటు తర్వాత రాజీవ్‌గాంధీకి సైతం బాసటగా ఉన్నారు. వివిధ కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి వారిద్దరి ప్రశంసలూ పొందారు. ఈ క్రమంలో ఆయన నిర్వహించిన పాత్రపై ప్రత్యర్థి రాజకీయపక్షాలనుంచి విమర్శలు వచ్చి ఉండొచ్చు.
 
 కొన్ని సందర్భాల్లో ఆయన మరో విధంగా వ్యవహరించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమై ఉండొచ్చు. కానీ నమ్మినదాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించడం పీవీ విశిష్టత. రాజకీయ రంగంలో మాత్రమే కాదు... సాహిత్య రంగంలో సైతం ఆయన కృషి ఎన్నదగినది. ఆయన బహుభాషా కోవిదుడు. 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడటం, రాయడం వచ్చు. ‘ద ఇన్‌సైడర్’ (లోపలి మనిషి) వంటి నవల రాయడంతోపాటు విశ్వనాథ వారి వేయిపడగలను హిందీలోకి అనువదించిన పండితుడాయన. ఒకపక్క రాజకీయ రంగంలో క్షణం తీరిక లేకుండా గడుపుతూనే వీటన్నిటినీ ఆయన కొనసాగించారు. ఇన్ని రంగాల్లో నిష్ణాతుడైన పీవీ వాస్తవానికి రాజకీయ రంగంనుంచి స్వచ్ఛందంగా వైదొలగి తన శేష జీవితాన్ని తనకు ఎంతో ఇష్టమైన సాహితీరంగానికి అంకితం చేద్దామనుకున్నారు. అందుకోసమని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈలోగా ఉగ్రవాద దాడిలో రాజీవ్‌గాంధీ మరణించడంతో కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను స్వీకరించడంతోపాటు ప్రధానిగా పనిచేయాల్సివచ్చింది. ఆయన అభీష్టమే నెరవేరి ఉంటే దేశం పీవీ సాహితీ వైశిష్ట్యాన్ని మరింత నిశితంగా చూడగలిగేది. కానీ, ఒక విశ్లేషకుడన్నట్టు ప్రపంచీకరణ విధానాలను ఎంతో చాకచక్యంగా, సమర్థవంతంగా అమలుచేసి దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయగలిగిన నాయకుణ్ణి మాత్రం పొందలేకపోయేది. అందులో వాస్తవం ఉంది. ప్రధానిగా పీవీ బాధ్యతలు చేపట్టిన నాటికి దేశంలో విదేశీ మారక నిల్వలు నిండా రూ. 3,000 కోట్లు కూడా లేవు.
 
 ఆయన గద్దె దిగేనాటికి ఆ నిల్వలు 14,000 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 6 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. అప్పటికి ఆర్ధికవేత్తగా మాత్రమే పేరున్న మన్మోహన్ సింగ్‌ను కేంద్ర ఆర్థికమంత్రిగా తీసుకురావడం మాత్రమే కాదు... అయిదేళ్లలోనూ ఆయన తీసుకున్న నిర్ణయాలకు రాజకీయంగా ఎలాంటి ఆటంకాలూ లేకుండా చూశారు.  ఆర్థిక సంస్కరణలపై వివిధ వర్గాలనుంచి వచ్చిన విమర్శలకు పీవీయే జవాబిచ్చేవారు. కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో పూర్తి మెజారిటీ లేని సమయంలోనే ఈ సంస్కరణలను ఆయన జయప్రదంగా అమలుచేయగలిగారు. యూపీఏ పదేళ్ల పాలనాకాలంలో మలి దశ సంస్కరణల అమలుకు ఎన్ని పిల్లిమొగ్గలు వేయాల్సి వచ్చిందో, ఎలాంటి వైఫల్యాలను చవిచూసిందో గమనిస్తే పీవీ గొప్పతనం అవగతమవుతుంది. నెహ్రూ కుటుంబీకులు మినహా మరెవరూ దేశానికి సుస్థిర పాలన అందించలేరన్న వాదనను పీవీ పూర్వపక్షం చేశారు.
 
 ఢిల్లీలో మొఘల్ వంశస్తులు మొదలుకొని ఎందరెందరి సమాధులో ఉన్నాయి. స్వాతంత్య్రానంతరం మహాత్ముడి స్మారక స్థలి మొదలుకొని నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, జగ్జీవన్‌రామ్ వరకూ ఎందరివో స్మృతి చిహ్నాలున్నాయి. ఏ పదవీ చేపట్టని సంజయ్‌గాంధీకి కూడా సమాధి ఉంది. కానీ, పీవీకి అక్కడ చోటీయకుండా చేసి కాంగ్రెస్ తన సంస్కారాన్ని బయట పెట్టుకుంది.
 
 ఆయనకు సముచిత చిహ్నం నిర్మించాలని తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ప్రతిపాదన అందాక ఎన్డీయే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నదంటున్నారు. మంచిదే. అయితే, పదిహేనేళ్లక్రితం పీవీపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అప్పటికి ఎనిమిదో తరగతి హిందీ రీడర్‌లో పీవీ నరసింహారావు జీవిత విశేషాలతో ఉన్న ‘భారత్ కే ప్రధాన్‌మంత్రి’ పాఠ్యాంశాన్ని తొలగించిన ఘనత కూడా ఆనాటి తెలుగుదేశం సర్కారుదే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గొంతు సవరించుకుని పీవీ స్మారక చిహ్నం నిర్మాణం ప్రతిపాదనకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది.

ఆయన జీవించి ఉన్నప్పుడుగానీ, మరణించాక ఈ దశాబ్దకాలంలోగానీ పీవీకి తగిన గౌరవం ఎందుకీయలేదన్న విషయంలో మాత్రం సంజాయిషీ ఇవ్వలేదు. అంతేకాదు...ఢిల్లీలో ఇక స్థలం లేదన్న సాకుతో ప్రముఖుల స్మృతి చిహ్నాలకు అనుమతినీయరాదని 2013లో దేన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయించారో చెప్పలేదు. సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలిచ్చి నిలబెట్టిన నిరుపమానమైన నేతను సొంతం చేసుకోలేని దీనస్థితిలో కాంగ్రెస్ పడితే... చివరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఆయన సేవలను గుర్తించి గౌరవించాల్సివచ్చింది. ఇందుకు కాంగ్రెస్ సిగ్గుపడాలి!

మరిన్ని వార్తలు