ఢాకా మారణకాండ

5 Jul, 2016 01:25 IST|Sakshi

గత రెండేళ్లుగా దేశంలో సెక్యులర్ బ్లాగర్‌లపైనా, ఛాందసవాదాన్ని వ్యతిరేకిస్తున్న వారిపైనా, మైనారిటీ మతవర్గాలవారిపైనా వరస దాడులు జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోయినా క్రియాశీలంగా వ్యవహరించలేని బంగ్లాదేశ్ పాలకుల చేత గానితనం పైశాచిక మారణకాండకు ఊతమిచ్చింది. శనివారం దేశ రాజధాని ఢాకాలోని ఒక రెస్టరెంట్‌పై ఉన్మాదులు దాడిచేసి 20మందిని ఊచకోత కోశారు. భద్రతా బలగాల కాల్పుల్లో మరణించిన ఏడుగురు ఉగ్రవాదుల్లో కనీసం నలుగురు సంపన్న కుటుంబాలకు చెందినవారని, ఉన్నత విద్యను అభ్యసించినవారని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద మూకలు రెచ్చిపోతున్నాయి. అదును దొరికినచోటల్లా దాడులకు తెగబడుతున్నాయి. గత వారం రోజులుగా టర్కీ రాజధాని ఇస్తాంబుల్ మొదలుకొని ఢాకా వరకూ వివిధ ఉదంతాల్లో ఉగ్రవాదుల ఉన్మాదానికి దాదాపు 240మంది బలయ్యారు. ఇందులో ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఆత్మాహుతి దాడిలో మరణించినవారే 166 మంది.
 
 బంగ్లాదేశ్‌లో మతోన్మాదం పెచ్చరిల్లుతున్న వైనాన్ని గురించి అనేకులు హెచ్చ రిస్తూనే ఉన్నారు. దీన్ని సకాలంలో కట్టడి చేయకపోతే ముప్పు తప్పదని చెబుతూనే ఉన్నారు. మతాన్ని కించపరిచారనో, తమకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనో నెపం పెట్టుకుని ఇప్పటికి దాదాపు 46మందిని ఉన్మాదులు కాల్చిచంపారు. ఇవన్నీ అడపా దడపా సాగుతున్న దాడులు మాత్రమేనని, వీటి వెనక సంఘటిత ఉగ్ర వాదం లేదని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం బుసలు కొడు తున్నప్పుడు ఇలాంటి శక్తులపై దాని ప్రభావం ఉంటుందని అంచనా వేయడంలో బంగ్లా సర్కారు విఫలమైంది. దేశంలో సంఘటిత ఉగ్రవాదం వేళ్లూను కున్న జాడలు స్పష్టంగా కనబడుతున్నాయని, సకాలంలో మేల్కొనకుంటే ముప్పు తప్పదని విశ్లేషకులు హెచ్చరించినప్పుడల్లా ప్రభుత్వం పెడచెవిని పెట్టింది.
 
 తమను అపఖ్యాతిపాలు చేయడానికే ఇలాంటి వాదనలు చేస్తున్నారని ఆరోపిం చింది. దేశంలో ఆర్థిక స్థితిగతులు బాగున్నాయని, విదేశీ పెట్టుబడులు పెరుగు తున్నాయని... అలాంటి మంచి వాతావరణాన్ని చెడగొట్టేలా లేనిపోని ఆరోపణలు చేయవద్దని హితవు పలికింది. ఇప్పుడు సైతం ఢాకా ఉదంతంలో పాల్గొన్న ఉగ్రవాదులందరూ తమ పౌరులేనని, వారికి ఉగ్రవాద సంస్థలు ఐసిస్‌తో లేదా అల్‌కా యిదాతో ప్రమేయం లేదని ప్రభుత్వం అంటోంది. నిజమే కావొచ్చు. బంగ్లా ఉదంతానికి తామే కారకులమని ఐసిస్ ప్రకటించినా దాన్ని నమ్మనవసరం లేదు.

కేవలం ఉగ్రవాద ఉదంతాల ద్వారానే తన ఉనికిని చాటుకుంటూ కాలం గడుపు తున్న ఐసిస్... ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా అది తన ప్రతాపమేనని చెప్పుకో వడం మామూలే. ఇటీవలికాలంలో ఐసిస్ సిరియాలోని రక్కా, ఇరాక్‌లోని మోసుల్, ఫలుజా వంటి నగరాల్లో పూర్తిగా పట్టుకోల్పోయి పలాయనం చిత్తగిం చింది. అందుకే ఇలాంటి దాడుల్ని తన ఖాతాలో వేసుకోవడం దానికి అవసరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈమధ్య జరిగిన ఘటనల్లో ఉగ్రవాద సంస్థల నెట్‌వర్క్ పనిచేసినట్టు ఎక్కడా నిరూపణ కాలేదు. కొందరు వ్యక్తులు ఎవరికీ అను మానం కలగని రీతిలో సంచరిస్తూ అదును దొరికినప్పుడు మారణాయుధాలతో రెచ్చిపోతున్నారు.
 
 కనీసం అలాంటి పరిస్థితులు దేశంలో తలెత్తగలవన్న అను మానమైనా ప్రభుత్వానికి కలిగినట్టు లేదు. అదే ఉంటే ఢాకాలో అత్యంత కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే ప్రాంతంలో ఒక రెస్టరెంట్‌పై ఉగ్రవాదులు కత్తులతో దాడికి దిగే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఢాకాలో అత్యంత సంపన్నులు నివసించే ప్రాంతంలో ఉండే ఆ రెస్టరెంట్‌కు ఎక్కువగా విదేశీయులు, బంగ్లా సంపన్న కుటుంబాలవారూ వస్తుంటారు. అలాంటిచోట సహ జంగానే భద్రతా బలగాలు ఎంతో అప్రమత్తంగా ఉంటాయని అందరూ అను కుంటారు. ఇప్పుడు జరిగిన దాడి అలాంటి అభిప్రాయాన్ని పటాపంచలు చేసింది.
 
 ఢాకా ఉగ్రదాడిలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ పాత్ర ఉన్నదని ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీన్ని కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. 1971లో తననుంచి విడివడి బంగ్లాదేశ్ ఆవిర్భవించినప్పటినుంచీ ఆ దేశంపై పాకిస్తాన్‌కు కంటగింపుగానే ఉంది. ఆ దేశంలో సైనిక కుట్రలు, అలజడుల వెనక పాక్ ప్రమేయం ఉన్నదన్న ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. బంగ్లాలో ఇద్దరు దేశా ధ్యక్షుల్ని హతమార్చారు. వివిధ ఉదంతాల్లో 57మంది సైనికాధికారులతోసహా 74మంది ముఖ్యుల్ని కాల్చిచంపారు. ముఖ్యంగా నిరుడు బంగ్లా ప్రభుత్వం ఉగ్ర వాద సంస్థగా ప్రకటించి నిషేధించిన జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ) పార్టీలో దేశ విభజనను వ్యతిరేకిం చినవారి ప్రాబల్యం ఎక్కువుంది.
 
 దేశంలో మత రాజ్యం స్థాపించాలని కోరుకునే జేఎంబీ కీలక నేత మౌలానా అబ్దుర్ రెహ్మాన్‌ను, మరో అయిదుగురు నేతలను పలు పేలుళ్లకూ, హత్యలకూ బాధ్యులుగా నిర్ధారించి ఉరికంబం ఎక్కించింది. ఆ పార్టీ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నా అడపా దడపా పంజా విసురుతూనే ఉంది. ప్రజా భద్రతకూ ముప్పుగా పరిణమించిన శక్తులను ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారానే ఓడించడం సాధ్యంగానీ...ఎవరో కొందరిపై చర్యలు తీసుకోవడం వల్ల ఆశించిన ప్రయోజనం దక్కదని బంగ్లాలో చాలామంది హెచ్చరించినా హసీనా ప్రభుత్వం పట్టించుకోలేదు. తన ప్రత్యర్థి పార్టీ అయిన ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్‌పీ)ని ఎదుర్కొనడానికి, ఆ పార్టీతో నిషేధిత జేఎంబీకి సాన్నిహిత్యమున్నదని చెప్పడానికే ప్రభుత్వం సర్వశక్తులూ కేంద్రీకరించింది.
 
 బంగ్లాదేశ్ ఆర్థికంగా పురోగమిస్తున్నదని హసీనా సర్కారు చెబుతున్న మాటల్లో వాస్తవం ఉంది. ఆ దేశ వృద్ధి రేటు 6 శాతం పైగా ఉంది. విదేశీ మారకద్రవ్యం నిల్వలు ఎన్నడూ లేనంతగా 3,300 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిచెందిన పలు దుస్తుల తయారీ సంస్థల విభాగాలు బంగ్లాలో ఉన్నాయి. ఇవన్నీ ఇలాగే కొనసాగాలంటే అంతా సవ్యంగా ఉన్నట్టు కనబడాలని బంగ్లా సర్కారు తాపత్రయపడింది తప్ప దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యల పైనా, ముఖ్యంగా పటిష్టమైన నిఘా అవసరంపైనా దృష్టి పెట్టలేదు.  ఈ ఉదంత మైనా దాని కళ్లు తెరిపించాలి. ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారం, నిరంతర అప్రమత్తత ఉంటే తప్ప ఉగ్రవాదాన్ని నామరూపాల్లేకుండా చేయడం సాధ్యం కాదని గత వారం జరిగిన ఉదంతాలు నిరూపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు