పాక్‌ క్రికెట్‌లో వివక్ష

28 Dec, 2019 00:12 IST|Sakshi

మర్యాదస్తుల క్రీడగా అందరూ చెప్పుకునే క్రికెట్‌లో మళ్లీ చాన్నాళ్లకి తుపాను రేగింది. పాకిస్తాన్‌ క్రికెట్‌ టీంలో బాగా ఆడి, మంచి స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న డేనిష్‌ కనేరియాపై అప్పటి కెప్టెన్‌తోపాటు, తోటి ఆటగాళ్లు కొందరు వివక్ష ప్రదర్శించేవారని ఒక టీవీ షోలో పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అఖ్తర్‌ బాంబు పేల్చాడు. అతడు కేవలం హిందువు కావడం వల్లే ఈ వివక్ష ఉండేదని కూడా అన్నాడు. 

అయితే ఆ బాంబు తాలూకు చప్పుళ్లు పాకిస్తాన్‌ మాటేమో గానీ...మన దేశంలో బాగానే వినబడ్డాయి. వర్తమాన పరిస్థితుల్లో అది సహజం కూడా. అసలు అలాంటివారి కోసమే తాము పౌరసత్వ చట్టాన్ని సవరించామని కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ చెప్పగా, ఉత్తరప్రదేశ్‌ మంత్రి కనేరియాకు నేరుగా ఒక ఆఫర్‌ ఇచ్చారు. ఇక్కడకు వస్తానంటే పౌరసత్వం కల్పిస్తామని అభయమిచ్చారు. అయితే షోయబ్, కనేరియా మాదిరే క్రికెట్‌లో కీర్తిప్రతిష్టలు ఆర్జించి, ఇప్పుడు పాకిస్తాన్‌ ప్రధాని పీఠంపై వున్న ఇమ్రాన్‌ ఖాన్‌ మాత్రం ఇంతవరకూ మాట్లాడలేదు. ఈ విషయంలో చెప్పేదేమీ లేదని పాక్‌ క్రికెట్‌ బోర్డు చేతులు దులుపుకుంది. 

ఇలాంటివి జరగకుండా చూస్తామని మాటవరసకైనా అనలేదు. పైగా షోయబ్, కనేరియాలిద్దరూ ప్రస్తుతం మాజీ ఆటగాళ్లు కదా అంటూ తర్కం లేవనెత్తుతోంది. కనేరియా ఆడుతున్నప్పుడు ఇంజమామ్‌–ఉల్‌– హక్, రషీద్‌ లతీఫ్, యూనిస్‌ ఖాన్, మహమ్మద్‌ యూసుఫ్‌లు కెప్టెన్లుగా పనిచేశారు. వీరిలో ఇంజమామ్, యూనిస్‌ఖాన్, మహమ్మ ద్‌ యూసుఫ్‌లు తనను ప్రోత్సహిం చేవారని కనేరియా అంటున్నాడు కనుక రషీద్‌పైనే సహజంగా అందరికీ అనుమానాలు వస్తాయి. ఎటూ కనేరియా త్వరలో ఆ పేర్లు బయటపెడతానంటున్నాడు కనుక ఆ కెప్టెన్, ఇతర ఆటగాళ్లెవరో తేలిపోతుంది. 

వివక్ష ఒక మతానికి, కులానికి, దేశానికి లేదా జాతికి పరిమితమైన దురాచారం కాదని, ఇది అన్నిచోట్లా వ్యాపించివున్నదని గతంలో సైతం చాలాసార్లు వెల్లడైంది. నువ్వా నేనా అన్నట్టు ఆట సాగుతున్నప్పుడు ప్రత్యర్థి టీంల మధ్య స్పర్థలు పెరగడం, ఆవేశంతో ఎదుటివారిని జాతి పేరుతో, మతం పేరుతో దూషించడం, వారి ముఖకవళికలను హేళన చేయడం వంటివి క్రికెట్‌ అభిమానులు తరచు చూస్తున్నదే. దక్షిణాఫ్రికాకు చెందిన బేసిల్‌ డి అలివేరాను పూర్తి స్థాయి శ్వేత జాతీయుడు కాదన్న కారణంతో 1960లో క్రికెట్‌ టీంలోకి తీసుకోలేదు. దాంతో అతను అలిగి ఇంగ్లండ్‌ వెళ్లిపోయాడు. 

ఆ తర్వాత అక్కడి టీం తరఫున దక్షిణాఫ్రికా వెళ్లినప్పుడు కూడా ఆనాటి దక్షిణాఫ్రికా ప్రధాని జాన్‌ వోర్‌స్టర్‌ బేసిల్‌ గురించి అవమానకరంగానే మాట్లాడారు. తమ టీం కెన్యాపై ఓడినప్పుడు బ్రియాన్‌ లారా 1996లో కెన్యా ఆటగాళ్లతో మాట్లాడుతూ దక్షిణాఫ్రికా టీంపై చేసిన జాతిపరమైన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. పదేళ్లక్రితం సిడ్నీ టెస్ట్‌లో సైమండ్స్‌ని హర్భజన్‌ సింగ్‌ కోతి అంటూ వెక్కిరించడం, అప్పట్లో అది భారత్, ఆస్ట్రేలియా టీంల మధ్య పెను వివాదం సృష్టించడం ఎవరూ మరిచిపోరు. అయితే ఆటలో ఉత్కంఠ పెరిగి, నువ్వా నేనా అన్నట్టు సాగుతుండగా ఆటగాళ్లు ఆవేశానికి లోనై అప్పటికప్పుడు ఏదో అనడం వేరు. 

కనేరియాకు జరిగింది ఇది కాదు. పాక్‌ ఆటగాళ్లలో కొందరు అతనితో కలిసి భోంచేసేందుకు సిద్ధపడేవారు కాదని, కనేరియాను వేరేచోటకు వెళ్లమనేవారని షోయబ్‌ వెల్లడించాడు. కేవలం తాను అన్య మతస్తుడిననే ఇలా ప్రవర్తించేవారని కనేరియా కూడా చెబుతున్నాడు. నిజానికి మన దేశంలో దళితులకు, ఇతర కులాలకు ఇది నిత్యానుభవం. అన్య మతస్తులపై కత్తులు నూరేవారు అన్నిచోట్లా వున్నారు. కానీ అలాంటి ఉన్మాదులు క్రీడాప్రపంచంలోకి సైతం చొరబడ్డారని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. 

దాదాపు 87 ఏళ్ల చరిత్రవున్న మన క్రికెట్‌ టీంలో ఆధిపత్య కులాలకు చెందినవారే కనిపిస్తారన్న ఫిర్యాదు చాలా తరచుగా దళిత వర్గాల నుంచి వినబడుతుంటుంది. దళిత ఆటగాళ్లు ఇంతవరకూ కేవలం నలుగురు మాత్రమే వున్నారని ఆ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దళిత కులాలవారు క్రికెట్‌ చూడరని, ఆడరని ఎవరూ అనుకోరు. మరి ఆ వర్గాలవారు టీంలో ఎందుకు కనబడరన్నది జవాబులేని ప్రశ్న. 1993లో టెస్ట్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వినోద్‌ కాంబ్లీ మంచి ఆటగాడిగా రాణించాడు. కులం కారణంగా తనను పక్కనబెట్టారని కాంబ్లీ ఎప్పుడూ చెప్పలేదు. 

కానీ దళితుడన్న కారణంతో అతనికి అన్యాయం చేశారని మొన్నటివరకూ బీజేపీ ఎంపీగా వున్న ఉదిత్‌ రాజ్‌ ఆరోపించారు. క్రికెట్‌లో సైతం రిజర్వేషన్లు వచ్చినప్పుడే దళితులకు, వెనకబడిన కులాలకు అందులో చోటు దక్కుతుందని రిపబ్లికన్‌ పార్టీకి చెందిన కేంద్రమంత్రి రాందాస్‌ అథ్వాలే కూడా చెప్పారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వున్నప్పుడు క్రీడల్లో ఎందుకుండరాదన్నది ఆయన ప్రశ్న. క్రికెట్‌ టీముల్లో ఇంతవరకూ ఆడినవారు ఆధిపత్య కులాలవారే అయినా వారంతా డబ్బూ, పలుకుబడీ వున్న కుటుంబాల నుంచో, రాజకీయ నాయకుల కుటుంబాలనుంచో రాలేదని వాదించే వారున్నారు. అందులో అవాస్తవం లేకపోవచ్చు. కానీ దళితులు ఎందుకు రాలేకపోయారన్న ప్రశ్నకు జవాబులేదు. 

దక్షిణాఫ్రికా జాత్యహంకారంతో తన టీంలో శ్వేతజాతీయులకే చోటిస్తున్న దని నిర్ధారణయ్యాక ఆ దేశాన్ని ఐసీసీ 1970లో సస్పెండ్‌ చేసింది. ఇందువల్ల పొలాక్, రాబిన్‌ స్మిత్, టోనీ గ్రెగ్‌ వంటి మంచి ఆటగాళ్లు వేరే దేశాల టీంలకు వలస పోవలసివచ్చింది. 90వ దశకంలో దక్షిణాఫ్రికాలో జాత్యహంకార ప్రభుత్వం అంతరించినప్పటినుంచీ నల్లజాతీయులు కూడా ఆ టీంలో ఆడగలుగుతున్నారు. ఇప్పుడు కనేరియా ఉదంతంలో పాక్‌పై నాలుగు రాళ్లేయడం మాటెలా వున్నా మన క్రికెట్‌కు, ఇతర క్రీడలకు అలాంటి మచ్చ రాకుండా ఏం చేయగలమో చూడవలసిన అవసరం వుంది.

మరిన్ని వార్తలు