మండలి రద్దు సరైన నిర్ణయం

28 Jan, 2020 00:20 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి రద్దు కోరుతూ రాష్ట్ర శాసనసభ సోమవారం ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానం ఆహ్వానించదగ్గది. నిలకడలేని విధానాలతో, నిజాయితీ లేమితో సర్వ వ్యవస్థలనూ భ్రష్టుపట్టించడంలో ఘనాపాఠీ అయిన చంద్రబాబునాయుడు శాసనమండలిని సైతం తన రాజ కీయ క్రీడలో పావుగా మార్చుకోవడానికి ప్రయత్నించి, అది రద్దు కావడమే శ్రేయస్కరమన్న అభిప్రాయం అందరిలో ఏర్పడేందుకు కారకుడయ్యారు. కనుకనే ఈ రద్దు ప్రతిపాదనపై గత నాలుగైదు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశవ్యాప్తంగా సాగుతున్న చర్చలో సానుకూల ధోరణే వ్యక్తమైంది. బాబుకున్న రాజకీయ అనుభవం తక్కువేమీ కాదు. అవసరమున్నా లేకున్నా ఆయనే ఆ మాట పదే పదే చెప్పుకుంటారు. ముఖ్యమంత్రిగా ఆయనకున్న పాలనానుభవాన్నీ తోసిపారేయలేం. అలాంటి నాయకుడికి ప్రజాబలంతో ఏర్పడిన శాసనసభ కూలంకషంగా చర్చించి, ఆమోదించే బిల్లుల విషయంలో శాసనమండలి ఎలా మెలగాలో తెలియదనుకోగ లమా? దాన్ని పెద్దల సభగా అందరూ పిల్చుకుంటారు. ఆ పెద్దరికంతో శాసనసభ పంపే ఏ బిల్లు నైనా అది నిర్మాణాత్మకంగా చర్చించడాన్ని, అందులో లోటుపాట్లున్నాయని భావిస్తే సవరణలు ప్రతిపాదించడాన్ని ఎవరూ తప్పుబట్టరు.

కానీ అక్కడ మెజారిటీగావున్న పక్షం శాసనసభ పంపే తీర్మానాలను అటకాయించడమే ఏకైక ఎజెండాగా పెట్టుకోవడం, ప్రజానుకూల నిర్ణయాలు అమలు కాకుండా వీలైనంత కాలం ఆపాలనుకోవడం ఏం రాజనీతి? బాబు శల్యసారథ్యంలోని తెలుగుదేశం శాసనమండలిలో అక్షరాలా ఆ పనే చేసింది. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలను బీజేపీ, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు గతంలో సైతం పలుమార్లు తప్పుబట్టారు. మొన్నటికి మొన్న సీఆర్‌డీఏ రద్దు బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుల విషయంలోనూ తెలుగుదేశం వైఖరిని వారు వ్యతిరేకించారు. ఏం చేయడానికైనా శాసనసభకు సర్వాధికారం ఉన్నప్పుడు మండలిలో అనవసర వివాదాలు రేకెత్తించరాదని హితవు పలికారు. కానీ బాబు వాటన్నిటినీ బేఖాతరు చేశారు. ఈ రెండు బిల్లుల విషయంలో మాత్రమే కాదు... ఇంగ్లిష్‌ మీడియం విద్యనందించడానికి వీలుగా రూపొందించిన బిల్లునూ, ఎస్సీ, ఎస్టీ కులాలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేసే బిల్లునూ తెలుగుదేశం ఆ రీతిలోనే అడ్డుకునే ప్రయత్నం చేసింది. కనీసం వాటికి తోచిన సవరణలు కొన్ని ప్రతిపాదించింది. అనంతరం నిబంధనల ప్రకారం ఆ బిల్లులు రెండూ శాసనసభ ముందుకు రావడం, అక్కడ ఆమోదం పొందడం పూర్తయింది.

అయితే ఇందువల్ల కొంత కాలయాపన జరి గింది. ఇప్పుడు సీఆర్‌డీఏ రద్దు బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుల విషయంలో కూడా కనీసం ఆ బాణీనే కొనసాగించివుంటే ప్రజలు ఎంతోకొంత అర్థం చేసుకునేవారు. కానీ ఈ దఫా బాబు మరీ వింత పోకడలకు పోయారు. ఏకంగా శాసనమండలి గ్యాలరీ ఎక్కి అక్కడినుంచి తన కను సైగలతో సభను నడిపించేందుకు ప్రయత్నించారు. ఫలితంగా నిబంధనకు విరుద్ధంగా మండలి చైర్మన్‌ ఆ బిల్లుల్ని సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్టు ప్రకటించారు. ప్రజానీకం గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను చిత్తుగా ఓడించారని, రాష్ట్రాన్ని తన ఇష్టారాజ్యంగా నడిపించడం అసాధ్యమని ఏడు నెలలు దాటుతున్నా ఆయన గ్రహించుకోలేకపోతున్నారు. జనం గంపగుత్తగా వ్యతిరేకించిన పాత ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేసి తీరాల్సిందేనన్న ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఏ ప్రభుత్వానికైనా నిర్దిష్టమైన ఎజెండా ఉంటుంది. ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకూ, వారి శ్రేయస్సుకు పనికొస్తాయన్న విధాన నిర్ణయాలు తీసుకునేందుకూ హక్కు, అధికారమూ ఉంటాయి. కానీ ఓడినా నాదే పైచేయి కావాలని, జనం ఛీత్కరించిన గత నిర్ణయా లను అమలు చేసి తీరాలని భీష్మించడం మతిలేని పని.

అందుకోసం రాజకీయ కుట్రలు పన్నడం నీచాతినీచం. కానీ ఇవన్నీ మంచిదికాదని చంద్రబాబుకు చెప్పేదెవరు? గత బుధవారం తన కుట్ర పూరిత వైఖరితో ఆయన తన పార్టీ పరువునూ, శాసనమండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ పరువునూ తీయడమే కాదు... ప్రజాస్వామ్యాన్నే అపహాస్యంపాలు చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్ని సెలెక్ట్‌ కమిటీకి పంపడం నిబంధనలకు విరుద్ధమని ఆ రోజు షరీఫ్‌ ప్రకటించడం అందరూ చూశారు. తెలుగుదేశం ఇచ్చిన నోటీసు నిబంధనల మేరకు లేదని సైతం ఆయన తెలియజేశారు. ఈలోగా ఏమైందో ఆ బిల్లుల్ని సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తున్నట్టు రూలింగ్‌ ఇచ్చారు. బాబు నెరపిన మంత్రాంగంతో షరీఫ్‌ గందరగోళంలో పడ్డారని ఈ ఉదంతం నిరూపిస్తోంది. ఆ మర్నాడు తణుకు పర్యటనలో వుండగా ఆ బిల్లు సెలెక్ట్‌ కమిటీకి ఇంకా పంపలేదని, ఆ ప్రక్రియ మధ్యలోనే నిలిచి పోయిందని కూడా ఆయనే చెప్పారు. ఈలోగానే అది సెలెక్ట్‌ కమిటీకి పోయిందంటూ తెలుగుదేశం ప్రచారం లంకించుకుంది.

కరువేమో కాలమేమో అన్నట్టు చంద్రబాబు ఏకంగా గజమాలలు వేయించుకుని హడావుడి చేశారు. క్షీరాభిషేకాల డ్రామాలు సరేసరి.ఎటూ ఆపలేమని తెలిసికూడా రెండు బిల్లులకూ మోకాలడ్డేందుకు తెలుగుదేశం ఇంత హైరాన ఎందుకు పడినట్టు? రాజధాని కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన విలువైన సూచనలను బేఖాతరు చేసి, నారాయణ కమిటీ మాటున అమరావతి పేరిట లక్షల కోట్ల రూపాయల రియల్‌ ఎస్టేట్‌ బాగోతానికి వేసిన పథకమంతా కళ్లముందు కుప్పకూలుతుంటే ఏం చేయాలో దిక్కుతోచకే బాబు ఇదంతా నడి పించారు. కానీ ఆ క్రమంలో శాసనమండలి ఉనికినే ప్రశ్నార్థకం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నట్టు  ప్రజల ప్రయోజనాలు నెరవేర్చేందుకు అనువుగా నడవవలసిన ఆ సభను రాజకీయ దురుద్దేశాలకు వేదికగా మార్చే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితుల్లో దాన్ని రద్దు చేయమని కోరడం మినహా శాసనసభకు వేరే ప్రత్యామ్నాయం ఎక్కడుంటుంది?

మరిన్ని వార్తలు