వెంటాడుతున్న పాపం!

12 Aug, 2013 23:59 IST|Sakshi

సంపాదకీయం: పాతిపెట్టాలనుకున్న పాపం మందుపాతరై పేలింది. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకూ, డీఎల్‌ఎఫ్‌కూ మధ్య జరిగిన భూ లావాదేవీలపై ఏడాది క్రితం మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువడినప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతలు, హర్యానాలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు వాటిని ఏదోరకంగా మరుగుపరచాలని చూశారు. ఆ కథనాల్లో కుట్ర ఉన్నదని ఆడిపోసు కున్నారు. వాద్రాను సమర్థిస్తూ మాట్లాడారు. ఆ లావాదేవీల్లో ఎలాంటి అక్రమమూ లేదని వెనకేసుకొచ్చారు.
 
 వాటి కూపీ లాగడానికి ప్రయత్నించిన హర్యానా రిజిస్ట్రేషన్ విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్ అశోక్ ఖేమ్కాను ముప్పుతిప్పలుపెట్టారు. వాద్రా- డీఎల్‌ఎఫ్ భూ లావాదేవీల్లోని వాస్తవాలేమిటో దర్యాప్తు చేయాలని గుర్గావ్, ఫరీదాబాద్, పాల్వాల్, మేవాత్ జిల్లాల రిజిస్ట్రార్‌లకు ఖేమ్కా ఆదేశించాక నాలుగు రోజుల్లోనే ఎన్నెన్నో అక్రమాలు వెలుగులోకొచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా మ్యుటేషన్ జరిగిందని నిర్ధారిస్తూ వాద్రా-డీఎల్‌ఎఫ్ భూ లావాదేవీని రద్దుచేయాలని ఖేమ్కా ఆదేశాలిచ్చారు. ఆ సంగతి తెలిసిన కొన్ని గంటల్లోనే ఖేమ్కా బదిలీ అయ్యారు. వేరే కేసు విషయంలో పంజాబ్-హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఖేమ్కాను బదిలీ చేశామని నమ్మ బలికారు.
 
 అంతేకాదు... బదిలీ తర్వాతే ఖేమ్కా కావాలని భూ లావాదేవీల రద్దుకు ఆదేశాలిచ్చారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. అక్కడితో ఊరుకుంటే ఏమయ్యేదో గానీ... హర్యానా ప్రభుత్వం ఇంకాస్త ముందుకెళ్లింది. ఖేమ్కా నిర్ణయాన్ని, అందులోని సహేతుకతను సమీక్షించాలంటూ ముగ్గురు అధికారుల కమిటీని ఏర్పాటుచేసింది. అందరూ అనుకున్నట్టే ఆ కమిటీ ఖేమ్కాను తప్పుబట్టింది. వాద్రా-డీఎల్‌ఎఫ్ ఒప్పందంపై విచారణకు ఆదేశించే అధికారం ఆయనకు లేదని తేల్చిచెప్పింది.
 
  ఒక తప్పును కప్పిపుచ్చుదామని, అధినాయకురాలి మెప్పుపొందుదామని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కమిటీ నివేదికలో లేవనెత్తిన వివిధ అంశాలపై వివరణనిస్తూ ఖేమ్కా వంద పేజీల జవాబునిచ్చారు. అందులో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలున్నాయి. ఆయన వాద్రా-డీఎల్‌ఎఫ్ ఒప్పందాన్ని స్పృశించడంతోనే వదిలిపెట్టలేదు. రాజకీయ నాయకులు-అధికారులు-వ్యాపార దిగ్గజాల మధ్య సాగుతున్న కుమ్మక్కు వ్యవహారాలను వెల్లడించారు.
 
 అత్యంత విలువైన, ఖరీదైన భూములు ఎలా చేతులు మారుతున్నాయో, ఖజానాకు ఎంతగా నష్టం జరుగుతున్నదో ఆయన కళ్లకుకట్టారు. ఎనిమిదేళ్ల కాలవ్యవధిలో ఈ కుమ్మక్కు లావాదేవీల పర్యవసానంగా మూడున్నర లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయని ఆయన చెబుతున్నారు. రాబర్ట్ వాద్రా-డీఎల్‌ఎఫ్ ఒప్పందాన్నే చూస్తే... అందులో ఎన్ని లొసుగులున్నాయో, పలుకుబడిగల వ్యక్తులు ప్రజాధనాన్ని ఎలా తన్నుకుపోతున్నారో స్పష్టమవుతుంది. హర్యానా ప్రభుత్వానికి చెందిన పట్టణ, గ్రామీణ ప్రణాళికా విభాగం (డీటీసీపీ) నుంచి ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ అనే సంస్థకు కొంత భూమి బదలాయింపు జరగడం, అందులో 3.53 ఎకరాల భూమిని వాద్రాకు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటీ లిమిటెడ్‌కు  ఆ సంస్థ రూ.7.5 కోట్లకు అమ్మడం ఖేమ్కా ఇందులో ప్రస్తావించారు.
 
 ఇలా కొన్న భూమిలో 2.7 ఎకరాల ప్రాంతంలో కాలనీ ఏర్పాటుకు వాద్రాకు హర్యానా ప్రభుత్వం లెసైన్స్ మంజూరు చేసింది. కేవలం రెండునెలల వ్యవధిలో ఈ ప్రాంతాన్ని డీఎల్‌ఎఫ్‌కు వాద్రా రూ.58 కోట్లకు విక్రయించారు. ఇందులో ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ సంస్థకూ, స్కై లైట్ హాస్పిటాలిటీకి మధ్య కుదిరిన ఒప్పందమే లొసుగులమయమని ఖేమ్కా అంటున్నారు. సేల్ డీడ్ సమయంలో ఓంకారేశ్వర్‌కు స్కైలైట్ సమర్పించిన రూ.7.5 కోట్ల చెక్కు నకిలీదై ఉండవచ్చని ఆయన అనుమానిస్తున్నారు. ఇలా నకిలీ చెల్లింపులతో చేతులు మారిన భూమిలో కాలనీ ఏర్పాటుకు లెసైన్స్ మంజూరు చేయడం, అలా లెసైన్స్ పొందిన స్వల్పకాలంలోనే ఆయన కళ్లు చెదిరే మొత్తానికి డీఎల్‌ఎఫ్‌కు విక్రయించడం చూస్తుంటే ఆశ్రీత పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంతగా వేళ్లూనుకున్నదో అర్థమవుతుంది.
 
అచ్చం వాద్రా-డీఎల్‌ఎఫ్ ఒప్పందం తరహాలోనే ఎన్నెన్ని అక్రమాలు చోటు చేసుకుంటున్నాయో, ఏ మొత్తంలో భూమి చేతులు మారుతున్నదో ఖేమ్కా ఇచ్చిన వివరణ గమనిస్తే అర్థమవుతుంది.  2005-12 మధ్యకాలంలో 21,366 ఎకరాల భూమికి డీటీసీపీ కాలనీ లెసైన్స్‌లు మంజూరు చేసింది. ఈ లెసైన్స్‌ల స్కాం విలువ దాదాపు రూ.3 లక్షల 50 వేల కోట్లు ఉండొచ్చని ఖేమ్కా అంచనా వేస్తున్నారు. లెసైన్సుల మంజూరును అధికారుల ఇష్టారాజ్యానికి వదిలేయడం కాకుండా వేలం ద్వారా నిర్ణయిస్తే నేరుగా ఖజానాకే వేల కోట్ల రూపాయలు చేరుతాయి.
 
 కానీ, పలుకుబడి కలిగిన వ్యక్తులు దళారులుగా తయారై ప్రభుత్వంనుంచి స్వల్పమొత్తానికే సులభంగా లెసైన్స్‌లు సంపాదించి రియల్ ఎస్టేట్ దిగ్గజాలకు భారీ మొత్తంలో అమ్ముకుంటున్నారు. వాద్రా-డీఎల్‌ఎఫ్ వ్యవహారంపై నిరుడు ఖేమ్కా లేవనెత్తిన అభ్యంతరాలకు స్పష్టమైన జవాబు ఇచ్చి ఉన్నా లేదా చిత్తశుద్ధితో ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపించినా హర్యానా ప్రభుత్వ నిజాయితీ వెల్లడయ్యేది. కానీ, అందుకు భిన్నంగా ఆ ప్రభుత్వం వ్యవహరించింది. ఖేమ్కాపై కత్తిగట్టింది.
 
 ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనని మరికొందరు సీనియర్ అధికారులతో చెప్పించడానికి ప్రయత్నించింది. ఇప్పుడు ఖేమ్కా ఇచ్చిన వివరణతో ప్రభుత్వం తన పరువును పోగొట్టుకోవడమే కాదు... ఆ ముగ్గురు అధికారుల సచ్ఛీలతపై కూడా అనుమానాలు రేకెత్తించింది. ఈ విషయంలో  హర్యానా ప్రభుత్వాన్ని మాత్రమే తప్పుబట్టలేం. గత ఏడాది ఈ స్కాంపై అలహాబాద్ హైకోర్టులో కేసు దాఖలైనప్పుడు సాక్షాత్తూ ప్రధాని కార్యాలయమే వెనకా ముందూ చూడకుండా అవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టి పారేసింది. అందువల్ల ఇప్పుడు హర్యానా ప్రభుత్వంతో పాటు. ప్రధాని కార్యాలయం కూడా దేశ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సి ఉంది. ఖేమ్కా వివరణనిచ్చి మూడునెలలు దాటుతున్నా ఎందుకు మౌనంగా ఉండిపోయారో, తమ నిజాయితీ ఏపాటిదో చెప్పాల్సి ఉంది.

మరిన్ని వార్తలు