ట్రంప్‌ మెట్టు దిగాలి

5 Oct, 2019 01:00 IST|Sakshi

ముంచుకొస్తుందనుకున్న సంక్షోభం కాస్త వెనక్కి తగ్గినట్టే కనబడింది. ఆంక్షలతో అటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌...దేనికైనా సిద్ధం కాచుకోండంటూ ఇటు ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ దూకుడు ప్రదర్శిస్తున్న తరుణంలో ఫ్రాన్స్‌ జోక్యం చేసుకుని నడిపిన రాయబారం సత్ఫలితాలిచ్చినట్టే అనిపించింది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమానియెల్‌ మేక్రాన్‌ చర్చలకు ప్రాతిపదికగా రూపొందించిన నాలుగు అంశాల పత్రాన్ని అమెరికా, ఇరాన్‌లు రెండూ సూత్రప్రాయంగా అంగీకరించడం అందరిలో ఆశలు రేకెత్తించింది. 

బాహాబాహీ సవాళ్లు విసురుకునే రెండు దేశాల మధ్య చర్చలు జరగడం అంత సులభమేమీ కాదు. అవతలి దేశానికి తలొగ్గినట్టు కనబడితే చిన్నచూపు చూస్తారన్న భయం ఇద్దరిలోనూ ఉంటుంది. అమెరికా–ఇరాన్‌ చర్చలు అందువల్లే చివరి నిమిషంలో ఆగిపోయాయి.  చర్చలకు ముందు ఆంక్షలు ఉపసంహరించేది లేదని ట్రంప్‌ చెబుతుండగా...అలా జరిగితేనే చర్చలకు సిద్ధపడతానని రౌహానీ స్పష్టం చేశారు. ఆంక్షలు నిలిపివేస్తామని ప్రకటిస్తే తప్ప కనీసం ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడటానికి కూడా ఆయన నిరాకరించారు. పైగా ఆంక్షలు ఎత్తేయడానికి ట్రంప్‌ ప్రైవేటుగా అంగీకరించినా, బహిరంగంగా ప్రకటించడానికి ఆయనకు అహం అడ్డొస్తున్నదని రౌహానీ అనడంతో పరిస్థితి మొదటికొచ్చింది. రాయబారం ప్రక్రియ ఆగింది. 

ఇరు దేశాలూ దాదాపు మూడేళ్లుగా వాగ్యుద్ధంలో తలమునకలై ఉన్నందువల్ల పరిస్థితి వెనువెంటనే చక్కబడుతుందని ఆశించలేం. అది సద్దుమణగడానికి మరిన్ని దఫాల చర్చలు అవసరం కావొచ్చు. ఇరాన్‌ ఒక్క మెట్టయినా దిగకున్నా ట్రంప్‌ చర్చలకు సిద్ధపడటం ఇందులో గమనార్హమైన విషయం. బెదిరింపుల వల్ల ఆశించిన ఫలితం రాదన్న సంగతిని అది గుర్తించిందని ఈ పరిణామం తేటతెల్లం చేస్తోంది.  

ఇరాన్‌తో అమెరికా, యూరప్‌ దేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని అధికారంలోకొస్తే రద్దు చేస్తానని ప్రకటించిన ట్రంప్‌ నిరుడు ఆ పని చేశారు. అంతకు మూడేళ్ల ముందునుంచీ రెండు దేశాల మధ్యా నెలకొన్న ఘర్షణ వాతావరణం అందరిలోనూ ఆందోళన కలిగించింది. ముఖ్యంగా అణు ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్న యూరప్‌ దేశాల పరిస్థితి ముందు నుయ్యి– వెనక గొయ్యి అన్నట్టు మారింది. రివాజుగా తాము అమెరికాతో గొంతు కలిపి ఒప్పందం నుంచి తప్పుకోవాలో... ప్రస్తుతం వ్యాపారపరంగా తమకు లాభదాయకంగా ఉన్న ఇరాన్‌తోనే ప్రయాణం చేయాలో తెలియని స్థితిలో అవి పడిపోయాయి. 

అమెరికా వైఖరిని ఆ దేశాలు మొదట్లో తప్పుబట్టినా ఇరాన్‌ రోజురోజుకూ పెంచుతున్న దూకుడుతో అవి అయోమయంలో పడ్డాయి. ముఖ్యంగా సౌదీ అరేబియాలోని రెండు కీలక చమురు బావులు ద్రోన్‌ దాడుల్లో ధ్వంసమైన ఉదంతం తర్వాత ఆ దేశాలు తప్పనిసరై ఇరాన్‌ను తప్పుబట్టాయి. ఇది ఇరాన్‌కు కష్టం కలిగించింది. తమపై అమెరికా ఏకపక్షంగా ఆంక్షలు విధించినప్పుడు గట్టిగా వ్యతిరేకించడానికి సిద్ధపడని దేశాలు ద్రోన్‌ దాడితో తమకు సంబంధం లేదంటున్నా ఆరోపణలకు దిగుతున్నాయని ఇరాన్‌ తప్పుబట్టింది. 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ పల్టీలు కొడుతున్న వర్తమాన పరిస్థితుల్లో ‘పులి మీద పుట్ర’లా పశ్చిమాసియాలో యుద్ధం వచ్చి పడితే కష్టాలు మరిన్ని రెట్లు పెరుగుతాయని ప్రపంచ దేశాలన్నీ వ్యక్తం చేస్తున్న భయాందోళనలు సహేతుకమైనవే. ఆర్థిక వ్యవస్థలు అంతంతమాత్రంగా ఉండటం, ఉపాధి అవకాశాలు మందగించడం, అధిక ధరలు వగైరా ప్రపంచంలోని ఇతర దేశాల తరహాలోనే యూరప్‌ దేశాలను కూడా పట్టిపీడిస్తున్నాయి. ఈ విషయంలో అక్కడి అధికార వ్యవస్థలపై జనం ఆగ్రహావేశాలతో ఉన్నారు. క్రమేపీ విస్తరిస్తున్న ఆర్థిక మాంద్యం నుంచి బయటపడటానికి యూరప్‌ దేశాలు పడరాని పాట్లు పడుతున్నాయి. 

ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి యూరొపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ గత నెలలో అనేక చర్యలు ప్రకటించింది. డిపాజిట్లపై వడ్డీరేటు తగ్గించడంతోపాటు బాండ్ల కొనుగోలు పథకాన్ని కూడా ప్రారంభిస్తామని తెలిపింది. ఈ విషయంలో జర్మనీ, డచ్, ఫ్రాన్స్‌ సెంట్రల్‌ బ్యాంకులనుంచి  వ్యతిరేకత వ్యక్తమైనా అది ఖాతరు చేయలేదు. ఎగుమతులను పెంచుకోవడానికే కావాలని యూరో విలువ తగ్గేలా యూరొపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రయత్నిస్తున్నదని ట్రంప్‌ ఆరోపించారు కూడా. 

ఇలాంటి పరిస్థితుల్లో పశ్చిమాసియాలో చిచ్చు రేగితే ప్రపంచంలోని అన్ని దేశాలకూ అది జీవన్మరణ సమస్యగా మారుతుంది. యూరప్‌ దేశాలు అణు ఒప్పందంలో కొనసాగుతామని చెప్పినంత మాత్రాన తమకు ఒరిగేదేమీ లేదని, ఆంక్షల ఎత్తివేతకు ఆ దేశాలు ప్రయత్నించకపోతే తాము కూడా ఆ ఒప్పందం నుంచి తప్పుకోవాల్సి వస్తుందని ఇరాన్‌ చేసిన హెచ్చరిక ఆ దేశాలపై పని చేసింది. కనుకనే మేక్రాన్‌ అమెరికా, ఇరాన్‌ల మధ్య రాయబారం నడపడానికి సిద్ధపడ్డారు. 

ఇరాన్‌పై ఆంక్షలు విధిస్తే అక్కడి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి చెలరేగుతుందని, చివరకు అది కుప్పకూలుతుందని ట్రంప్‌ ఆశించారు. కానీ అదేమీ జరగలేదు. ఆంక్షల వల్ల ఇరాన్‌ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న మాట వాస్తవమే. దానికున్న ఏకైక ఆదాయ వనరు ముడి చమురును అమ్ముకోవడానికి అమెరికా విధించిన ఆంక్షలు అడ్డొస్తున్నాయి. కనుక ఖజానా నానాటికీ క్షీణిస్తూ అది గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది. ఆ దేశం నుంచి భారీగా చమురు కొనుగోలు చేసే మన దేశం అమెరికా ఒత్తిడితో తప్పుకుంది. 

అయితే పిల్లిని గదిలో బంధించి కొడితే అది కూడా తిరగబడుతుంది. కనుకనే ఇరాన్‌ రణభేరి మోగించింది. తటస్థతను నటిస్తున్న యూరప్‌ దేశాలపై ఒత్తిడి ప్రారంభించింది. ఏ యుద్ధమైనా సమస్యకు పరిష్కారం ఇవ్వదు. మరిన్ని జటిలమైన సమస్యల్ని రాజేస్తుంది. దాంతో సంబంధం ఉన్నా లేకున్నా అందరినీ ముంచేస్తుంది. ఇంతవరకూ తాను అనుసరించిన విధానాలు నిష్ప్రయోజనమయ్యాయని అమెరికా ఇప్పటికైనా గ్రహించి, చర్చలకు సిద్ధపడటం ఉత్తమం. ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తే చరిత్ర క్షమించదు. 

>
మరిన్ని వార్తలు