అక్కరకు రాని ప్యాకేజీలు

19 May, 2020 05:12 IST|Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12న జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీలో ఏమేం వుంటాయో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరసగా అయిదు రోజులపాటు అందరికీ తేటతెల్లం చేశారు. భారీ మొత్తం అని ప్రధాని చెప్పారుగనుక... జీడీపీలో పది శాతం అన్నారు గనుక ఈ ఉద్దీపనల పరంపరపై ఆశలు కూడా అదే స్థాయిలో భారీగా వున్నాయి. చివరాఖరికి ఇవి ఎవరినీ సంతృప్తిపరచకపోగా... ఈ వంకన ప్రైవేటీకరణకు, ఇతరత్రా సంస్కరణ లకు కేంద్రం పావులు కదుపుతోందన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది.

దీర్ఘకాల ప్రయోజనా లను దృష్టిలో వుంచుకుని ఈ ఉద్దీపనలను రూపొందించామని మంత్రి చెబుతున్నారు. కానీ లాక్‌డౌన్‌ పర్యవసానంగా పూట గడవడం కూడా కష్టమైన జనాభాకు తక్షణం చేసేదేమిటో చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై వుంది. కనీసం అంతంతమాత్రంగా వున్న జీడీపీని మందకొడిగా కదిలించడానికైనా ఈ ఉద్దీపనల పరంపర దోహదపడుతుందా అన్నది అనుమానమే. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ను మోదీ ప్రకటించిన నాటికే కేంద్రం, ఆర్‌బీఐ రూ. 9 లక్షల 94 వేల 403 కోట్ల విలువైన ఉద్దీపనలు ఇచ్చాయి. ఇప్పుడు ప్రకటించిన అయిదు ఉద్దీపనల విలువ రూ. 11 లక్షల 2 వేల 650 కోట్లు. ఈ రెండింటి విలువా లెక్కేస్తే అది రూ. 20 లక్షల 97 వేల 53 కోట్లు.

సారాంశంలో ప్రధాని ముందుగా చెప్పిన రూ. 20 లక్షల కోట్ల కంటే ఇది దాదాపు లక్ష కోట్లు అదనం. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో తాను చాలా ఉదారంగా వున్నానన్న అభిప్రాయం కేంద్రంలో దండిగా వున్నట్టే కనబడుతోంది. ఆ అభి ప్రాయం సామాన్యుల్లో కలగజేయడానికి కూడా ప్రయత్నించివుంటే బాగుండేది. ప్రకటించినదాన్లో వాస్తవంగా నగదు రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అందరికీ అందేది ఎంతన్నదే కీలకం. ఈ ఉద్దీపనల పర్యవసానంగా బడ్జెట్‌పై ఎంత శాతం భారం పడుతుందన్న ప్రశ్నకు మంత్రి జవాబివ్వ లేదు. ఆ మాట చెప్తే కరోనా వల్ల కేంద్రం అదనంగా మోస్తున్న భారమెంతో తెలిసేది. అది రూ. 2.02 లక్షల కోట్లని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతుంటే... లక్షన్నర కోట్లు దాటదని మరికొందరి నిపు ణుల అభిప్రాయం. మొత్తానికి జీడీపీలో ఒక శాతం దాటదని వారు లెక్కలు కడుతున్నారు. మరి కేంద్రం చేసిందేమిటి?

మొదటిరోజు నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఉద్దీపన ప్రధానంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలకు సంబంధించింది. వాటికి బ్యాంకుల నుంచి రూ. 3 లక్షల కోట్ల మేర రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు చెప్పడంతోపాటు అందుకు ఎలాంటి హామీ చూపనవసరం లేదన్నారు. కానీ కేంద్రంలో ఆ పరిశ్రమలకు సంబంధించిన శాఖను చూస్తున్న నితిన్‌ గడ్కారీ చెబు తున్న లెక్క ప్రకారం ఆ సంస్థలకు ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు చెల్లించాల్సిన బకాయిల విలువే రూ. 5 లక్షల కోట్లు! కనుకనే ‘మాపై అంత ఔదార్యం చూపాల్సిన అవసరం లేదు... మాకు రావాల్సిన బకాయిలేవో తీర్చండి చాల’ని ఎంఎస్‌ఎంఈలు మొత్తుకుంటు న్నాయి.
 

లాక్‌డౌన్‌కు ముందే అవి నానా అగచాట్లూ పడుతున్నాయి. ఇలాంటి సమయంలో వాటికి నగదు లభ్యత పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కేంద్రం పట్టించుకోలేదు. ఈ అయిదు ఉద్దీపనల్లోనూ మొత్తంగా కేంద్రం 40 రకాల చర్యల్ని ప్రకటించింది. కానీ వీటిల్లో అత్యధికం సంస్కరణ లకు సంబంధించినవే తప్ప లిక్విడిటీని పెంచగలిగేవి కాదు. ఈ కరోనా సమయంలో అందరికీ గుర్తొస్తున్న ప్రజారోగ్యానికి ఈ ఉద్దీపనల్లో చోటు దొరికింది. కానీ అందుకు ఎంత కేటా యించదల్చుకున్నదో కేంద్రం చెప్పలేదు. ఎంఎస్‌ఎంఈలు, చిన్న వ్యాపారులు మొదలుకొని రాష్ట్రాల వరకూ దాదాపు అందరికందరూ రుణాలు తెచ్చుకోవాలి తప్ప కేంద్రం తనకు తానుగా ఇవ్వదల్చు కున్నది లేదు.

వలసజీవులకు రెండు నెలలపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తామని, గ్రామీణ ఉపాధికి అదనంగా రూ. 40,000 కోట్లు కేటాయిస్తామని చెప్పడం బాగానేవుంది. కానీ వలసజీవుల్లో అత్యధికులు ఇప్పుడు నడిరోడ్లపై, రైలుపట్టాలపై వున్నారు. వందలు, వేల కిలోమీటర్ల దూరాల్లో వున్న స్వస్థలాలకు రాత్రనక, పగలనక నడిచిపోతున్నారు. ఆకలిదప్పులతో అలమటిస్తు న్నారు. గుజరాత్, యూపీ, మహారాష్ట్ర తదితరచోట్ల మమ్మల్ని పోనీయమంటూ బయటికొచ్చిన వారిని చావగొడుతున్నారు. అలాంటివారికి ఇప్పుడు ప్రకటించిన ఉద్దీపనల్లోని చర్యలు ఏమేరకు దోహదపడతాయో కేంద్రం ఆలోచించిందా? దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రం మీదుగా నడిచి వెళ్తున్న వలసకూలీల కష్టాలను చూసి చలించి ఆదరించి అన్నం పెడుతోంది. వారికి చెప్పుల జతతో సహా అన్నీ అందించి, రైళ్లు, బస్సుల్లో ఉచి తంగా వారి వారి స్వస్థలాలకు పంపుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి చొరవ చూపాల్సిన అవసరం వుందని గుర్తించి, ఆ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలి. 

కరోనా కష్టాలు మొదలైనప్పటినుంచీ దాదాపు అన్ని రాష్ట్రాలూ ఆదాయం పడిపోయి, ఖర్చు అమాంతంగా పెరిగి అప్పు తెచ్చుకోవడానికి అనుమతించాలని కోరుతున్నాయి. తెచ్చుకునే రుణాలు జీడీపీలో 3 శాతం మించి వుండకూడదన్న నిబంధన మార్చాలంటున్నాయి. అందుకు కేంద్రం కూడా ఒప్పుకుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి దాన్ని 5 శాతానికి పెంచడానికి అంగీకరించింది. కానీ అందుకు విధించిన షరతులు విస్తుగొలుపుతాయి. మొదటి 0.5శాతం వరకూ పేచీలేదు. ఆ తర్వాత పెంచ దల్చుకున్నవాటికి సంస్కరణలతో ముడిపెట్టింది. ఆ సంస్కరణల సారాంశం జనంపై ఆర్థిక భారం మోపడం. విద్యుత్‌చార్జీలు, మున్సిపల్‌ పన్నులు వగైరాలు పెంచితే ప్రభుత్వాలు అప్పులు తెచ్చు కోవచ్చని చెప్పడం అన్యాయం, అమానుషం. దేశ జనాభాలో అత్యధిక శాతంమంది ఇప్పుడు విప త్కర పరిస్థితుల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. వారిని రక్షించడమెలాగన్న అంశంపై దృష్టి పెట్టడం ఇప్పటి అవసరం. కేంద్ర ప్రభుత్వం ఈ సంగతి గ్రహించాలి.

మరిన్ని వార్తలు