కరోనాపై సమష్టి పోరు

28 Mar, 2020 00:24 IST|Sakshi

ప్రపంచం మొత్తాన్ని చుట్టుముట్టి కబళించడానికి సిద్ధపడుతున్న కరోనా వైరస్‌పై అన్ని దేశాలూ సమష్టిగా పోరాడటం ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత కీలకం. కానీ అమెరికా తీరు అందుకు అనుగుణంగా లేదు. ఈ వైరస్‌ ఎక్కడిది... దాన్ని ఎవరైనా కావాలని సృష్టించారా లేక దానంతటదే రూపుదిద్దుకుందా అనే విషయం శాస్త్రీయంగా నిర్ధారణ కాకుండానే చైనాను ముద్దాయి చేయడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారు. ఆ వైరస్‌ను అంతం చేయడం మాట అటుంచి కనీసం కట్టడి చేయడంలో అందరూ నిమగ్నమై విజయం సాధించాక ఆ ప్రశ్నలకు జవాబులు అన్వేషించవలసి వుండగా ఆయన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.

లాక్‌డౌన్‌కి దిగితే దేశంలో ఆత్మహత్యలు పెరిగిపోతాయంటూ సాకు చెప్పి వచ్చే నెల 12న ఈస్టర్‌ నాటికల్లా ఆంక్షలన్నీ తొలగిస్తానని చెబుతున్నారు. బాధ్యతాయుత స్థానాల్లో వున్నవారు అవగాహన పెంచుకోకుండా, అరకొర జ్ఞానంతో మాట్లాడితే దాని ప్రభావం సాధారణ పౌరులపై తీవ్రంగా వుండే అవకాశముంది. అమెరికాలో లాక్‌ డౌన్‌ను పట్టించుకోకుండా సముద్ర తీరాల్లో సంబరాలు చేసుకోవడం చూస్తే ఈ సంగతి అర్ధమవుతుంది. ఈ మహమ్మారి పెనువేగంతో ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తోంది. ఇప్పటికి కరోనా 199 దేశాలు, ప్రాంతాలను తాకింది. ఇంతవరకూ 25,239మందికి పైగా చనిపోయారు. మరో 5,30,000మంది ఆ అంటురోగం బారినపడి మంచం పట్టారు. కోలుకున్నవారి సంఖ్య 1,28,000 దాటింది. దాదాపు 86,000మంది రోగులతో ఇప్పుడు అమెరికా అగ్రభాగాన వుంది. అక్కడ మృతుల సంఖ్య 1,306 వరకూ వుంది. దాంతో పోలిస్తే భౌగోళికంగా, జనాభా పరంగా చిన్నదైన ఇటలీ 80,589మందితో తర్వాతి స్థానంలో వుంది. అక్కడ మృతుల సంఖ్య 8,215కి చేరింది. ఆ తర్వాత స్పెయిన్, జర్మనీ తదితర దేశాలున్నాయి. మన దేశంలో అదృష్టవశాత్తూ ఇంత వరకూ బయటపడిన కేసులు 863. మరణాల సంఖ్య 20. మొదటగా వైరస్‌ బయటపడిన చైనాలో 81,782మంది రోగగ్రస్తులై, అందులో 3,291మంది మరణించారు. 

జనాన్ని ఠారెత్తించి, బలవంతంగానైనా తాను అనుకున్నది సాధించే చైనా నమూనాను వేరే దేశాలు అనుసరించడం సాధ్యం కాకపోవచ్చుగానీ...వైరస్‌ నియంత్రణలో అది వైద్యపరంగా అమల్లోకి తెచ్చిన చర్యలేమిటో అధ్యయనం చేయడం అవసరం. అలాగే కరోనా తీవ్రత అంతగాలేని రష్యా విధానాలనుంచి కూడా నేర్చుకోవాల్సింది వుంటుంది. చైనాకు పొరుగునున్న దక్షిణ కొరియా కూడా కరోనాను అదుపు చేయడం మెరుగైన విజయం సాధించింది. ఆ దేశంలో 9,137మందికి ఈ వైరస్‌ సోకగా మృతుల సంఖ్య 126కి మించలేదు. ఆ దేశాన్ని 2015లో పట్టిపీడించిన మెర్స్‌ వ్యాధి నుంచి అది గుణపాఠాలు నేర్చుకుంది. దాని ఆధారంగా కరోనా వెల్లడైంది మొదలుకొని అది వరస చర్యలు అమల్లోకి తెచ్చింది. ఈ క్రమంలో అది పరిమితమైన లాక్‌డౌన్‌ చేసింది. అంతర్జాతీయ విమా నాల రాకపోకలను అది ఆపలేదు. అనుమానిత కేసులు వెంటవెంటనే ఆరా తీయడం, అందులో వాస్తవంగా కరోనా కేసులెన్నో నిర్ధారించడం ప్రారంభించింది.

25 లక్షలమంది వుండే దక్షిణకొరియా నగరం డీగులో ఫిబ్రవరి నెలాఖరున ఒకే రోజు 735 కేసులు బయటపడగా, రెండున్నర కోట్లమంది వుండే సియోల్‌ నగరంలో 75 కేసులు వెల్లడయ్యాయి. డీగులో తక్షణం పాఠశాలలు మూసివేసింది. భారీగా జనం పాల్గొనే అవకాశమున్న సమావేశాలను, ఉత్సవాలను ఎవరికి వారు స్వచ్ఛందంగా నిలిపేయాలని కోరింది. ఆ వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూడగలిగింది. వారానికి 4,30,000మందిని పరీక్షించగలిగే స్థాయిలో కిట్లు అందుబాటులోకి తెచ్చింది. 100 లాబొరేటరీలు నిర్విరామంగా పని చేశాయి. ఈ చర్యలన్నిటినీ పారదర్శకంగా అమలు చేసింది. వదంతులకు ఆస్కారం లేకుండా చేసింది. గతానుభవాలున్నాయి గనుక పౌరులు కూడా ప్రభుత్వానికి సహకరించారు. అందువల్లే ఆ దేశం విజయం సాధించగలిగింది. 

మన దేశంలో కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్‌ ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచింది. గ్రామ, వార్డు వలంటీర్‌ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు అద్భుతమైన ఫలితాలిస్తున్నాయి. ఈ రెండు వ్యవస్థలూ ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం, వైద్య సిబ్బంది వగైరాలతో సమన్వయం చేసుకుంటూ తాము సేకరిస్తున్న సమాచారాన్ని యాప్‌ల ద్వారా అమరావతిలోని వైద్య ఆరోగ్య శాఖకు చేరేస్తున్నాయి. వివిధ మాధ్యమాల ద్వారా కరోనా మహమ్మారితో వచ్చిపడిన ప్రమాదం గురించి తెలుసుకోవడం వేరు... ప్రత్యక్షంగా తమ ముంగిట్లోకొచ్చినవారు చెప్పేది వినడం వేరు. చేతులు పరిశుభ్రం చేసుకోవడం దగ్గరనుంచి ఇతరత్రా పాటించాల్సిన నియమాల వరకూ వారు బోధిస్తుంటే పౌరుల్లో అవగాహన పెరుగుతోంది.

వైద్య సాయం అవసరమున్న వివిధ వ్యాధిగ్రస్తులకు, గర్భిణిలకు లాక్‌ డౌన్‌ల వల్ల సమస్యలెదురుకాకుండా వారి ఇళ్లవద్దే మందులు, పౌష్టికాహారం వంటివి అంద జేస్తున్నారు. తమ ఇరుగుపొరుగులో విదేశాలనుంచి వచ్చినవారుంటే సమాచారం అందించే చైతన్యాన్ని ప్రజలకు కలిగిస్తున్నారు. బ్రిటన్‌ సైతం ఇప్పుడు అత్యవసరంగా ఇలాంటి వలంటీర్‌ వ్యవస్థను రంగంలోకి దించి కరోనా వైరస్‌ను కట్టడి చేసే పని మొదలుపెట్టింది. నిర్మాణ రంగం, మరికొన్ని ఇతర రంగాల్లో పనిచేస్తున్న వేరే రాష్ట్రాల కార్మికులు లాక్‌డౌన్‌ కారణంగా గత్యంతరం లేక నడక దారిన స్వస్థలాలకు పోవడానికి సిద్ధపడుతున్నారన్న కథనాలు వెల్లడయ్యాక తెలంగాణ సర్కారు అలాంటివారికి ఉచితంగా ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ వైరస్‌ కంటికి కనబడకున్నా శతసహస్ర శిరస్సులున్న పెను రక్కసితో సమానం. దీంతో అన్ని దేశాలూ, రాష్ట్రాలూ తమకు చేతనైన రీతిలో పోరాడుతున్నాయి. ఇతరుల అనుభవాలను గ్రహించి ఆ పోరాటాన్ని మరింత పదునెక్కిస్తున్నాయి. ఇలాంటి సమష్టి పోరాటాలే ఈ మహమ్మారిని త్వరగా అంత మొందించగలవు. ఇందుకు పౌరుల సహాయసహకారాలు అత్యవసరం. 

మరిన్ని వార్తలు