పట్టాలపై నరమేథం!

23 Oct, 2018 01:18 IST|Sakshi

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ సమీపంలో రావణదహనం కార్యక్రమం సందర్భంగా హఠాత్తుగా పెను  వేగంతో వచ్చిన రైలు కింద పడి 59మంది మరణించిన దుర్ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి   చేసింది. ఉత్సవ నిర్వాహకులు మొదలుకొని రైల్వే శాఖ వరకూ ఎవరికి వారు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ విషాదానికి ఆస్కారం ఉండేది కాదు. కానీ అందరి నిర్లక్ష్యమూ జతకలిసి అమా యకుల ప్రాణాలను బలితీసుకుంది. పండగపూట అయినవారిని పోగొట్టుకుని రోదిస్తున్నవారిని చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. ఈ ప్రమాదం మరో 57మందిని తీవ్ర గాయాలపాలు చేసింది.  గాయపడినవారిని వెనువెంటనే ఆసుపత్రులకు తరలించడానికి అందుబాటులో ఏ వాహ నమూ లేకపోవడం, నిర్వాహకుల్లో ఒకరైన మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ ప్రమాదం సంగతి తెలిసిన వెంటనే అక్కడినుంచి జారుకోవడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. మృతుల్లో అత్యధికులు కూలి పనుల కోసం బిహార్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి వలస వచ్చినవారు. 

ప్రమాదం జరిగాక ఎవరికి వారు ఇస్తున్న సంజాయిషీలు, స్వీయ సమర్థనలు, ఆరోపణలు గమనిస్తే మన నాయకుల నైజం వెల్లడవుతుంది. ఇప్పుడింతగా మాట్లాడుతున్నవారు ప్రమాదం గురించి కాస్తయినా ఊహించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ కార్యక్రమం కోసం ఎంచుకున్న స్థలం రైలు పట్టాలకు కేవలం 70 మీటర్ల దూరంలో ఉంది. దాన్ని వీక్షించడానికి ఉన్న స్థలం కేవలం 200మందికి మాత్రమే సరిపోతుంది. ఆ ఒక్క కారణం చాలు కీడు శంకించడానికి. ఇలాంటి కార్య క్రమాలకు జనం భారీయెత్తున హాజరవుతారు. రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న కమిటీకి ఇది తెలి యందేమీ కాదు. కనుక ఇంత ఇరుకైన చోటు భద్రమైనది కాదని వారు ఎప్పుడో గ్రహించి ఉండాలి. వారికా అనుమానం రాకపోయినా అనుమతి మంజూరు చేసిన పోలీసు శాఖ అంచనా వేయగలిగి ఉండాలి. ఆ ప్రాంతంలో రావణ దహనం చూడాలంటే సహజంగానే జనం పట్టాలపై చేరకతప్పదు. అంతకన్నా ముందుకెళ్తే టపాసులు వారిపై పడే ప్రమాదం ఉంటుంది. బాగా వెనక్కొస్తే సరిగా కన బడదు. ఏటా కార్యక్రమం నిర్వహించేరోజున ఇలాగే పట్టాలపై నిలబడి చూస్తామని, ఎప్పుడూ ఇంత స్పీడుగా రైళ్లు రాలేదని స్థానికులు చెబుతున్నారు. ఈసారి రెండు ట్రాక్‌లపైనా ఎదురెదురుగా ఒకేసారి రైళ్లు రావడం వల్ల, ఆ సమయంలోనే రావణ దహనం కార్యక్రమం మొదలుకావడం వల్ల పేలుళ్ల చప్పుళ్లలో రైళ్ల రాకను జనం పసిగట్టలేకపోయారు. ఫలితంగా వారికి తప్పించుకునే అవ కాశం లేకుండా పోయింది. 

భారీయెత్తున జనం హాజరయ్యే వేడుకల్లో తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంలో మన ప్రభుత్వాలు ప్రతిసారీ విఫలమవుతున్నాయి. పన్నెండేళ్లకొకసారి జరిగే కుంభమేళాల్లో కనీసం నాలుగైదు సందర్భాల్లో జనం భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలున్నాయి. 1954 ఫిబ్రవరిలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుని 800మంది చనిపోయారు. ఆ తర్వాత సైతం నాలు గైదుసార్లు తొక్కిసలాటలు జరిగాయి. పదులకొద్దీ ఆ ఘటనల్లో చనిపోయారు. బిహార్‌లో 2014లో దసరానాడు జరిగిన రామ్‌లీలా ఉత్సవాల్లో ఇదేమాదిరి తొక్కిసలాటలో 32 మంది మరణించారు. ఇప్పుడు పంజాబ్‌ ప్రమాదాన్నే తీసుకుంటే ఈ వేడుకల కోసం అవసరమైన అనుమతులన్నీ తీసు కున్నామని నిర్వాహకులు చెబుతారు.

వాటి సంగతి తమకు తెలియనే తెలియదని రైల్వేశాఖ అంటుంది. కార్పొరేషన్‌దీ అదేమాట. తమకు కూడా వేడుకలపై సమాచారం లేదని వివరిస్తుంది. మనకు జాతీయ విపత్తుల నివారణ ప్రాధికార సంస్థ ఉంది. ప్రకృతి వైపరీత్యాలతోపాటే ఇలా భారీయెత్తున జనం గుమిగూడేచోట ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో అది మార్గ  దర్శ కాలు రూపొందించింది. ఆ మార్గదర్శకాలు పోలీసు శాఖ దగ్గరుంటాయి. వాటిని సరిగా అధ్య యనం చేసి ఉంటే అక్కడ ఆ కార్యక్రమాన్ని అనుమతించేవారే కాదు. లేదా తొలుత రైల్వేశాఖ అను మతి తీసుకుని రావాలని సూచించేవారు. కనీసం ఆ సమయంలో రైళ్ల రాకపోకలను నియంత్రిం చాలని రైల్వేశాఖనైనా కోరి ఉండేవారు. అసలు నిర్వాహకులు ఎలాంటి అనుమతులూ తీసుకోలే దని అనుకున్నప్పుడు ఆ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించనీయకూడదు. 

కార్యక్రమం గురించి తమకెవరూ చెప్పలేదని, ప్రజలు అక్రమంగా పట్టాలపైకి వచ్చారని రైల్వే బోర్డు చైర్మన్‌ అశ్వనీ లోహాని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు ఆ ప్రాంతంలోని కాలనీ వాసులందరూ తమ రోజువారీ పనుల కోసం అక్కడ నిత్యం పట్టాలు దాటుతున్నారని ఆయనకు తెలుసో లేదో! దగ్గరున్న అండర్‌పాస్‌ వినియోగానికి తగినట్టుగా ఉండదని స్థానికులు చెబుతున్న మాట. పైగా కాస్త వర్షం వచ్చినా అది నీళ్లతో నిండిపోతుందని వారంటున్నారు. పట్టాలు దాటి అవతలివైపున్న మార్కెట్‌కు వెళ్లడానికి మూడు నిమిషాలు పడితే, దూరంగా ఉన్న రైల్వే గేటు గుండా వెళ్లడానికి అరగంట పడుతుందని, పైగా రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల అది తరచు మూసి ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి ఇబ్బందుల్ని గ్రహించి ఇప్పటికే ఉన్న అండర్‌పాస్‌ను బాగుచేయించి అదనంగా ఒకటిరెండు నిర్మిస్తే మంచిదని రైల్వేశాఖకు ఎప్పుడూ అనిపించలేదు! వాటిని నిర్మించి పట్టాలకు అటూ ఇటూ కంచె నిర్మిస్తే ఇలాంటి ప్రమాదాలకు అవకాశమే ఉండదు.

ఇంతటి విషాదం జరిగాకైనా తమ లోటుపాట్ల గురించి సమీక్షించుకుని సరిదిద్దుకుంటామని చెప్ప కపోగా, తప్పంతా అవతలివారిదేనని ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేయడం దారుణం. రైల్వే శాఖ తమవైపునుంచి ఎటువంటి దర్యాప్తూ అవసరం లేదని చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మెజిస్టీరియల్‌ దర్యాప్తు జరిపిస్తామంటోంది. కానీ ఈ దర్యాప్తులు మన దేశంలో చివరి కేమవు తాయో ఎవరికీ తెలియంది కాదు. సమస్యంతా వ్యవస్థల్లోని బాధ్యతారాహిత్యమే. ఆ సంగతిని చిత్తశుద్ధితో అంగీకరించి, చక్కదిద్దడానికి ముందుకొచ్చినప్పుడే ఈమాదిరి విషాదాలకు తెర పడుతుంది.

మరిన్ని వార్తలు