మూలాలు తాకని ‘తరలింపు బిల్లు’

26 Dec, 2018 02:07 IST|Sakshi

ప్రజల్ని ఇబ్బందులు పెట్టే చట్టాలు, నిబంధనలు అర్ధరాత్రుళ్లు చడీచప్పుడూ లేకుండా విరుచుకు పడేచోట... వారికి మేళ్లు కలిగించే చర్యల అమలుకు ఏళ్లూ పూళ్లూ పడుతోంది. వ్యక్తుల అక్రమ తర లింపు (నిరోధం, పరిరక్షణ, పునరావాసం) బిల్లు అందుకొక ఉదాహరణ. అందుకు ఒక సమగ్ర చట్టం అవసరమని ఏళ్ల తరబడి ఎందరో అడుగుతున్నా అది నెరవేరలేదు. మొన్న జూలైలో లోక్‌సభ ఆమోదం పొంది, ఈ పార్లమెంటు సమావేశాల్లో రాజ్యసభ ముందుకు రాబోతున్న తాజా ముసా యిదా బిల్లు సైతం ఆ విషయంలో అరకొరగానే ఉంది.  కావల్సింది కొత్త చట్టం కాదని, సమగ్రమైన చట్టమని నిపుణులు చెబుతున్నా వారి మాట వినేవారు లేరు. 

వ్యక్తుల అక్రమ తరలింపు నిరోధానికి మన దేశంలో ఇప్పటికే వేర్వేరు చట్టాలున్నాయి. సెక్స్‌వర్కర్లు, వెట్టి కార్మికులు, కాంట్రాక్టు కార్మి కులు, అంతర్రాష్ట్ర వలస కార్మికులు, బాల కార్మికులు, బాలల లైంగిక దోపిడీ వగైరా అంశాల్లో చర్యలు తీసుకోవడానికి ఈ చట్టాలు పనిచేస్తున్నాయి. ఇవిగాక భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్‌ 370ని 2013లో సవరించి వెట్టిచాకిరీకి, అవయవాల మార్పిడికి, వ్యభిచార వృత్తి చేయించ డానికి బాలలతోసహా ఎవరినైనా తరలించడం నేరంగా పరిగణించారు. ఇలా వేర్వేరు అంశాలకు వేర్వేరు చట్టాలుండటాన్ని నేరగాళ్లు న్యాయస్థానాల్లో తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సులభంగా తప్పించుకుంటున్నారు. 

ఈ రంగంలో పనిచేస్తున్న నిపుణులు, సంస్థలు చట్టాల్లో పునరుక్తులు, కొన్నిటి విషయంలో కొత్త నిర్వచనాలు ఉన్నాయని...ఆచరణలో ఇవి సమస్యగా మారుతున్నాయని తెలిపారు. అక్రమ తర లింపు సంబంధమైన భిన్న నేరాలను ఒకేచోట చేర్చి సమగ్రమైన చట్టం రూపొందేలా చర్యలు తీసు కోవాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు మొన్న ఫిబ్ర వరిలో కేంద్ర కేబినెట్‌ వ్యక్తుల అక్రమ తరలింపుపై ముసాయిదా బిల్లును ఆమోదించడానికి ముందు కూడా ఈ సంగతిని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. 

మూడేళ్లక్రితం ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సైతం ఇలాంటి సూచనే చేసింది. చట్టాల్లోని లోటుపాట్లను నిందితులు ఉపయోగించు కుంటున్నారని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖను హెచ్చరించింది. అయినా పాత చట్టాలను అలాగే ఉంచి తాజా ముసాయిదా బిల్లు తీసుకొచ్చారు. లోక్‌సభలో దీన్ని ఆమోదించినప్పుడే ఐక్య రాజ్యసమితి నిపుణులు పెదవి విరిచారు. దీనికి మానవహక్కుల ప్రాతిపదికగానీ, బాధితులకు ఆస రాగా నిలిచే తీరుగానీ లేవని వ్యాఖ్యానించారు.  

మనుషుల అక్రమ తరలింపు అంశంలో మన దేశం అఫ్ఘానిస్తాన్, కాంగో, పాకిస్తాన్, సోమా లియా వంటి దేశాలను కూడా తలదన్నింది. జాతీయ క్రైం రికార్డుల బ్యూరో వెల్లడించిన గణాంకాల ప్రకారం 2016లో దేశవ్యాప్తంగా 8,137 అక్రమ తరలింపు కేసులు బయటపడ్డాయి. ఇందులో మహిళలనూ, మైనర్‌ బాలికలను వ్యభిచార కూపాల్లోకి దించిన ఉదంతాలకు సంబంధించిన కేసులు 7,670. బాలల్ని బూతుచిత్రాల కోసం తరలించిన కేసులు 162. అక్రమ తరలింపు నుంచి విముక్తు లైనవారు 23,000మంది ఉన్నారంటే ఏ స్థాయిలో మాఫియా పనిచేస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. 

ఈ తరలింపు బాధితులు కేవలం ఇక్కడి పౌరులు మాత్రమే కాదు. మయన్మార్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్‌ వంటి దేశాలనుంచి కూడా తీసుకొస్తున్నారు. వారిని వ్యభిచార కూపాలకు, వెట్టిచాకిరీ చేయించే పరి శ్రమలకూ విక్రయిస్తున్నారు. కొన్ని గణాంకాల ప్రకారం సగటున రోజూ కనీసం 15మంది ఈ సాలె గూటిలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. వాస్తవంగా చోటుచేసుకునే ఉదంతాలతో పోలిస్తే బయటి కొస్తున్నవి చాలా తక్కువని ఈ దురాచారానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారి అభిప్రాయం. 

ఈ ఉదం తాల విషయంలో కేసు నమోదు, దర్యాప్తు, విచారణ, శిక్షలు వంటివి చాలా తక్కువని చెప్పాలి. మనుషుల అక్రమ తరలింపు విషయంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయ మైనవే అయినా... అవి ఏ మూలకూ రావని ఆర్నెల్లక్రితం అమెరికా విదేశాంగ శాఖ అభిప్రాయప డింది. ప్రభుత్వ సిబ్బంది సహాయసహకారాలు లేకుండా ఈ దుర్మార్గం ఇంత యధేచ్ఛగా కొనసా గదని తెలిపింది. అక్రమ తరలింపులో చిక్కుకుంటున్నవారిలో అత్యధికులు దళితులు, ఆదివాసీలు, మైనారిటీలేనని వివరించింది.  

అయితే పాత చట్టాలతో పోలిస్తే కొన్ని అంశాల్లో తాజా ముసాయిదా బిల్లు నిస్సందేహంగా మెరుగైందే. ముఖ్యంగా తమను అక్రమంగా తరలిస్తున్నారని బాధితులు నిరూపిస్తేనే గతంలో నిందితుల నేరం రుజువయ్యేది. కానీ తాజా బిల్లు ప్రకారం ఇకపై నిందితులే తాము ఎలాంటి నేరా నికీ పాల్పడలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే బాధితుల రక్షణ, పునరావాసం విష యంలో పాత వైఖరే కొనసాగుతోంది. వారిని నేరం చేసినవారిగా పరిగణించి ఏదో ఒక చోట నిర్బం ధించడం వల్ల వారి మానసిక స్థితి మరింత అధ్వాన్నమవుతుంది. అలాగే ఇష్టపూర్వకంగా వ్యభిచార వృత్తిలో కొనసాగడానికి వచ్చినవారినీ, బాధితులుగా మారినవారినీ బిల్లు ఒకే గాటనకడుతోంది. అందువల్ల అందరికీ ఒకేరకమైన పునరావాస చర్యలుంటాయి. 

ఇవి ఏవిధంగానూ బాధితులకు తోడ్పాటునివ్వదు.  పైగా ఈ రంగంలో ఇప్పటికే అనేక ప్రభుత్వ విభాగాలు పనిచేస్తుండగా, తాజా బిల్లు మరికొన్నిటిని చేర్చింది. పర్యవసానంగా చివరకు జవాబుదారీతనం ఎవరిదో తెలియని స్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యకున్న మూలాల్ని గుర్తించడంలోనూ ముసాయిదా బిల్లు విఫలమవు తోంది. పేదరికం, ఉపాధి లేకపోవడం, స్వస్థలాలనుంచి వలసపోక తప్పనిస్థితి ఏర్పడటం వంటివి ఈ తరలింపు సాలెగూటిలో చిక్కుకోవడానికి తోడ్పడుతున్నాయి. కఠిన శిక్షల విధింపువంటివి నేర గాళ్లను భయపెట్టగలవనడంలో సందేహం లేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని అట్టడుగువర్గాల సమ గ్రాభివృద్ధికి తోడ్పడే చర్యలు సరిగా అమలు కాకపోతే ఈ జాడ్యం ఎప్పటికీ దుంపనాశనం కాదు. కనుక ఆ విషయంలోనూ ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ చూపాలి.

మరిన్ని వార్తలు