ప్రజాతీర్పే పరిష్కారం

25 Jul, 2019 00:52 IST|Sakshi

‘ఇంకెన్నాళ్లు...?’ అని అందరి చేతా పదే పదే అనిపించుకున్నాక, మూడు వారాలపాటు  కాలయాపన చేశాక కర్ణాటకలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి ప్రభుత్వం అధికారం నుంచి తప్పుకుంది. అక్కడి రాజకీయ పరిణామాలతో విసుగు చెందిన జనం ఊపిరిపీల్చుకునేంతలోనే మధ్యప్రదేశ్‌లో కుర్చీలాట మొదలైంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని 24 గంటల్లో కూల్చేస్తామని బీజేపీ ప్రకటించగా, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను తమకు అనుకూలంగా మలుచుకుని ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ఈ సవాలుకు జవాబిచ్చారు. ఆ రాష్ట్రంలోని రాజకీయం మరెన్ని మలుపులు తిరుగు తుందో రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది. కర్ణాటక రాజకీయ చదరంగంలో అటు అధికార పక్షమూ, ఇటు విపక్షమూ రెండూ సాధారణ ప్రజానీకానికి ఏవగింపు కలిగించాయి. నిరుడు మే నెలలో కూటమి ప్రభుత్వం ఏర్పడిననాటినుంచి దినదిన గండంగానే బతుకీడుస్తోంది.

104మంది ఎమ్మెల్యేలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ... యడ్యూరప్ప సారధ్యంలో సర్కారు ఏర్పరి చినా అది మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. అటుపై 116మంది బలం ఉన్న కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి డీకే కుమారస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ కూటమి ప్రభు త్వానికి పాలనపై దృష్టి పెట్టే అవకాశమే కలగలేదు. స్వీయ రక్షణే దాని ఏకైక ఎజెండాగా మారింది. కూటమి సర్కారును కూల్చడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని స్వల్పకాలం ఏలిన యడ్యూరప్ప కాచుక్కూర్చోగా... కేవలం 37 స్థానాలు మాత్రమే గెల్చుకున్న కుమారస్వామి అందలం ఎక్కడాన్ని కాంగ్రెస్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య జీర్ణించుకోలేక   పోయారు. వెలుపలి నుంచి యడ్యూరప్ప, లోపలినుంచి సిద్దరామయ్య ఇలా రగిలిపోతుంటే కుమారస్వామి భరోసాతో ఉండటం ఎలా సాధ్యం? అందుకే ఆయన రాజీనామా చేసి పోతానని అనేకసార్లు బెదిరించారు. ఒక సందర్భంలో కంటతడి పెట్టారు. ఎవరినీ సంతృప్తిపరచలేక, సము దాయించలేక అయోమయానికి లోనయ్యారు. అయినా సిద్దరామయ్యను అదుపు చేయడంలో కాంగ్రెస్‌ విఫలమైంది. ఆయన్ను ఏదోవిధంగా సముదాయించినా ఆ పార్టీలో ఇతరేతర వర్గాలున్నాయి. వాటి డిమాండ్లు వాటికున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైతం కూటమి ప్రభుత్వం 14 నెలలు అధికారంలో కొనసాగడం నిజంగా వింతే.

ఇప్పుడు యడ్యూరప్ప వెంటనే ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తారో, లేదో చూడాల్సి ఉంది. సభకు గైర్హాజరైన 17మంది కాంగ్రెస్, జేడీఎస్‌ సభ్యుల వ్యవహారం ఏ మలుపుతిరుగుతుందో కూడా ఆసక్తికరమే. అయితే యడ్యూరప్ప ఏర్పరిచే ప్రభుత్వమైనా సుస్థిరంగా ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఇప్పుడు పదవులు దక్కని కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు చేసినట్టే, రేపు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించరని చెప్పలేం. 2008లో అధికారంలోకి వచ్చాక బీజేపీలో చెలరేగిన అంతర్గత కుమ్ము  లాటలు ఎవరూ మరిచిపోరు. తొలుత యడ్యూరప్ప, ఆ తర్వాత సదానంద గౌడ, అటుపై జగదీశ్‌ శెట్టార్‌లకు అధికార పగ్గాలు అప్పగించినా అసంతృప్తి సద్దుమణగలేదు. పార్టీలో ముఠా తగాదాలు ముదిరిపోగా అధిష్టానం నిస్సహాయంగా మిగిలిపోయింది. చివరకు 2013లో దారుణంగా ఓటమి పాలయింది.

ఇప్పుడు కొత్తగా వచ్చిచేరే కాంగ్రెస్, జేడీఎస్‌ సభ్యుల అండతో ఏర్పడబోయే ప్రభుత్వం ఎన్నాళ్లు మనుగడ సాగించగలదో చూడాలి. అధికారం కోల్పోయిన కాంగ్రెస్, జేడీఎస్‌    లకు ప్రభుత్వాన్ని పడగొట్టే స్థాయిలో వనరులు లేవు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఉండగా అదంత సులభమూ కాదు. కాంగ్రెస్, జేడీఎస్‌లు ఇప్పుడున్న ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగితే అదే గొప్ప అనుకోవాలి. అసలు ఆ రెండూ ఇప్పుడున్నట్టే మిత్రపక్షాలుగా కొనసాగుతాయన్న నమ్మకం ఎవరికీ లేదు. అయితే బీజేపీ తెరవెనక ఉండి ఆడించిన రాజకీయ క్రీడ వల్ల తాము అధికారం కోల్పోయామని ప్రజల ముందు ఏకరువు పెట్టి సానుభూతి సంపాదించుకోవడానికి వాటికి అవ కాశం ఉంటుంది. రెండూ కలిసి నడిస్తేనే ఇదంతా సాధ్యం.  

తగినంత మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వాలు ఫిరాయింపుల వల్ల కూలిపోవడం విచారించదగ్గ విషయమే. కానీ దేశంలో వామపక్షాలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తప్ప ఏ పార్టీ కూడా ఫిరాయింపుల విషయంలో సూత్రబద్ధమైన వైఖరితో లేవు. ఫిరాయింపుల వల్ల బలైనప్పుడు ఒకలా, వాటివల్ల లబ్ధి పొందే పరిస్థితులున్నప్పుడు మరొకలా మాట్లాడటం ఆ పార్టీలకు అలవాటైపోయింది. సాగినన్నాళ్లు కాంగ్రెస్‌ ఫిరాయింపులను ప్రోత్సహించింది. ప్రభుత్వాలను పడగొట్టింది. గతంలో కాంగ్రెస్‌ను తప్పుబట్టిన బీజేపీ ఇప్పుడు అధికారం అందుకున్నాక తానూ ఆ మార్గాన్నే అనుసరిస్తోంది. ఫిరా యింపుల నిరోధక చట్టం ఆచరణలో పనికిమాలినదని రుజువయ్యాక కూడా కేంద్రంలో అధికారం చలాయించిన ఏ పక్షమూ దాన్ని సరిచేయడానికి పూనుకోలేదు. అలా చేయనివారే నష్టపోయినప్పుడల్లా అన్యాయం జరిగిందని శోకాలు పెడుతున్నారు.

తాము అధికారంలోకొచ్చినప్పుడు మళ్లీ ఆ ఫిరాయింపులనే ప్రోత్సహించి, వాటితోనే మనుగడ సాగిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునే హక్కు స్పీకర్‌ పరిధి నుంచి తొలగించి ఎన్నికల సంఘానికి కట్టబెడితే ఈ సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. కానీ అది ముందుమునుపూ ఏం సమస్యలు తెచ్చిపెడు తుందోనన్న భయంతో అలాంటి సవరణకు ఏ ప్రభుత్వమూ సిద్ధపడదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పది కాలాలపాటు నిలబెడదామని, విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉందామని పార్టీలు భావించనంతకాలమూ పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఫిరాయింపుల్ని, వాటిని ప్రోత్స హించే పార్టీలనూ ప్రజలు ఏవగించుకుంటే పార్టీలు పంథా మార్చుకోక తప్పని స్థితి ఏర్పడుతుంది. అంతవరకూ ఈ రాజకీయ సంతలు, బేరసారాలు కొనసాగక తప్పదు. కర్ణాటకలో ఇప్పుడున్న రాజ కీయ అస్థిరత సమసిపోవాలన్నా, అనైతిక రాజకీయాలకు కళ్లెం పడాలన్నా కొత్తగా ప్రజల తీర్పు కోరడమే శ్రేయస్కరం. అయితే అందుకు ఎన్ని పార్టీలు సిద్ధపడతాయన్నది ప్రశ్నార్థకమే. 

మరిన్ని వార్తలు