‘కర్ణాటకానికి’ తెర!

30 Jul, 2019 00:44 IST|Sakshi

అనుకున్నట్టే కర్ణాటకలో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సోమవారం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం మొదలైననాటి నుంచీ సంచలనాలకు కేంద్రంగా ఉన్న స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ పరిణామాలన్నీ చూశాక అందరికీ ఒకటి మాత్రం అర్ధమైంది– ప్రభుత్వం సంఖ్యాపరంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తీసుకొచ్చే విశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్‌ ఎడతెగని సీరియల్‌లా రోజుల తరబడి సాగుతాయి. తగినంత బలం ఉందనుకున్నప్పుడు పెట్టే తీర్మానం ఆగమేఘాల మీద పూర్తవుతుంది. రాజీనామాలిచ్చి మహారాష్ట్ర తరలిపోయి మకాం వేసిన కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు 17మంది విప్‌ విషయంలో తానిచ్చిన నోటీసులకు జవాబివ్వలేదన్న కారణం చూపి స్పీకర్‌ వారిపై అనర్హత వేటు వేసిన పర్యవసానంగా బల నిరూపణకు అవసరమైన కనీస సంఖ్యాబలం 104కు తగ్గింది. సొంత బలం 105కు తోడు అదనంగా స్వతంత్ర సభ్యుడి ఆసరా తీసుకుని యడియూరప్ప గట్టెక్కారు. ఎంతకాలం అధికారంలో కొనసాగుతారన్న అంశాన్ని పక్కనబెడితే త్రుటిలో చేజారిన సీఎం పదవిని చేజిక్కించుకు తీరాలన్న ఆయన పట్టుదల నెరవేరింది.

కర్ణాటకలో నిరుడు మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించినా... గవర్నర్‌ వజూభాయ్‌ వాలా తొలి అవకాశమిచ్చినా ఆయన దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. చివరకు కాంగ్రెస్‌–జేడీఎస్‌ ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. గత 14 నెలలుగా యడియూరప్ప అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేల్లో కొందరిని సమీకరించుకోవడానికి కృషి చేస్తూనే ఉన్నారు. అందుకు సంబంధించి ఒకరిద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేయడమే కాదు...సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫోన్‌ సంభాషణల ఫైళ్లు కూడా వెలుగుచూశాయి. కూటమి ప్రభుత్వం మాత్రం అంతర్గత కుమ్ములాటలతో కాలం గడిపింది. కుమారస్వామికి సక్రమంగా పాలించడానికి అవకాశమే చిక్కలేదు. 17మంది ఎమ్మెల్యేలు వలసపోవడానికి బీజేపీ ఏం చేసిందన్న సంగతలా ఉంచితే నిరంతర కలహాలతో మునిగితేలే కూటమి నుంచి నిష్క్రమించడానికి ఆ ఎమ్మెల్యేలకు సాకు దొరికిందన్నది వాస్తవం. 

ఈ మొత్తం వ్యవహారంలో రమేశ్‌ కుమార్‌ పాత్ర గురించి చెప్పుకోవాలి. ఆ పదవి హుందాతనాన్ని నిలబెట్టడంలో, పార్టీలకు అతీతంగా పనిచేయడంలో అసెంబ్లీల మొదలుకొని పార్లమెంటు వరకూ సభాధ్యక్షులు విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వర్తమానంలో ఆయన ప్రశంశనీయంగా వ్యవహరించారు. కూటమి తరఫున స్పీకర్‌ పదవిని అధిష్టించినా చాలా వరకూ తటస్థంగా ఉన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించే విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఒకపక్క, విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ ఫలానా సమయానికల్లా పూర్తికావాలన్న గవర్నర్‌ తాఖీదులు మరోపక్క వచ్చినా తన విధుల విషయంలో ఆయన స్పష్టంగానే, నిష్కర్షగానే ఉన్నారు. ఒత్తిళ్లకు లొంగడానికి సిద్ధపడలేదు. విశ్వాస తీర్మానంపై జరిగే చర్చను మరింత పొడిగించాలని అప్పటికి సీఎంగా ఉన్న కుమారస్వామి కోరినా నిరాకరించారు. ఓటింగ్‌ను ఎలాగైనా ఇంకోరోజుకు వాయిదా వేస్తే ఏదో ఒరుగుతుందన్న భ్రమలో ఉన్న కుమారస్వామికి చివరకు నిరాశే మిగిల్చారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నేత ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్నప్పుడు ఆనాటి స్పీకర్‌ యనమల రామకృష్ణుడు, గత అయిదేళ్లలో కోడెల శివప్రసాదరావు ఎలా వ్యవహరించారో, ఆ పదవికే ఎలా కళంకం తెచ్చారో తెలుగు ప్రజలు మరిచిపోలేరు. పదవి నుంచి వైదొలగక తప్పనిస్థితి ఏర్పడిన ఒక ముఖ్యమంత్రి అందుకు గల కారణాలను చెప్పుకుందామంటే రామకృష్ణుడు ఆయనకు అవకాశమివ్వలేదు. ఏ పరిస్థితుల్లో తాను పదవి కోల్పోవలసి వచ్చిందో ఎన్టీఆర్‌ స్వయంగా చెప్పిన వీడియోలు సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ఇప్పుడు అందరికీ అందుబాటులోకొచ్చాయి. కానీ యనమల అనుసరించిన వైఖరి కారణంగా అసెంబ్లీ రికార్డుల్లో మాత్రం ఆయన స్వరం లేదు. కోడెల తీరు కూడా ఎన్నో విమర్శలకు తావిచ్చింది. సభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య ఎంతో ఆయనకు తెలుసు. అందులో ఎందరు ఫిరాయించారో తెలుసు. ఎందరికి మంత్రి పదవులొచ్చాయో తెలుసు. కానీ స్పీకర్‌గా అలాంటి సభ్యులపై చర్య తీసుకోవడం తన బాధ్యతన్న సంగతిని మాత్రం మరిచారు.

కానీ సభలోనూ, బయట వేదికలపైనా విలువల గురించి గంభీరోపన్యాసాలివ్వడం మానుకోలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాదు... ఒక సందర్భంలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడానికి కూడా ఆయన వెనకాడలేదు. ఈ బాపతు నేతలే స్పీకర్‌లుగా అధికారాలు చలాయిస్తున్న దేశంలో ఫిరాయింపుల నిషేధ చట్టంతోసహా అన్ని రకాల రాజ్యాంగ విలువలూ మంట కలవడంలో వింతేముంది? ఇలాంటి పరిస్థితుల్లో రమేశ్‌ కుమార్‌ సభా సంప్రదాయాలనూ, స్పీకర్‌గా తనకున్న అధికారాలను సవ్యంగా వినియోగించుకోలగడం ప్రశంసనీయం. రాజకీయ వ్యూహప్రతివ్యూహాల దశ ముగిసింది కనుక కర్ణాటక ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి ఏం చేయాలన్న విషయంపై కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సాగు సంక్షోభం, ఉపాధి లేమి  గ్రామీణ ప్రాంతాలను ఊపిరాడనీయకుండా చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కొత్త ప్రభుత్వం తక్షణ చర్యలకు నడుం బిగించాల్సిన అవసరం ఉంటుంది. అయితే యడియూరప్ప అధికారంలో ఎన్నాళ్లు నెట్టుకు రాగలరన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. పదవి కోసం కూటమి సర్కారును కూల్చిన ఎమ్మెల్యేల వైనం కళ్ల ముందు కనబడుతుండగా, బీజేపీలో పదవు లాశిస్తున్నవారు సైతం రేపన్న రోజున అదే పని చేయరన్న గ్యారెంటీ లేదు. అదీగాక 17 స్థానాలకూ ఉప ఎన్నికలు వస్తే యడియూరప్పకు అదొక అగ్ని పరీక్ష అవుతుంది. వీటిని ఆయన ఎలా అధిగమిస్తారో, ఎలాంటి ఎత్తులు వేస్తారో వేచి చూడాలి. 

మరిన్ని వార్తలు