సేవ చేసేవారిపై దాడులా?

4 Apr, 2020 00:24 IST|Sakshi

కరోనా మహమ్మారి కాటేయాలని చూస్తున్న వర్తమానంలో వైద్య సిబ్బంది ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పనిచేయాల్సివస్తున్నదో తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో వైద్యులపై రెండురోజుల్లో జరిగిన దాడులు వెల్లడించాయి. గడిచిన మూడు రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా రోగుల సంఖ్య రెట్టింపయింది. అంతక్రితం రెండురోజుల పరిస్థితితో బేరీజు వేస్తే ఒక్కసారిగా ఇలా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. కొత్తగా వెల్లడైన రోగుల్లో ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లొచ్చినవారే అధికం. వారిలో అనేకమంది ఇంకా వైద్య పర్యవేక్షణలో వున్నారు. అమెరికా తదితర దేశాలతో పోలిస్తే అదృష్టవశాత్తూ మన దేశంలో బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య ఇంకా తక్కువే. లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు కావడం వల్లే ఇది సాధ్యమైంది. ఇన్నాళ్లుగా విదేశాలనుంచి వచ్చిన వారిపైనే ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాయి. వారి కుటుంబసభ్యులను, వారిని కలిసిన ఇతరులను పరీక్షించడంవంటివి చేశాయి.

కొత్తగా బయటపడిన నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఉదంతంతో ఆ సదస్సుకు వెళ్లినవారిని గుర్తించి, తరలించడం మొదలైంది.  సింగపూర్, దక్షిణ కొరియాలతో పోలిస్తే కొన్ని అంశాల్లో మనమింకా వెనకబడి వుండటం వల్ల పూర్తి స్థాయిలో నియంత్రించడం సాధ్యపడటంలేదు. పకడ్బందీ నిఘా వుంచడం, గరిష్టంగా పరీక్షలు జరపడం, వైద్యులకు అవసరమైన రక్షణ ఉపకర ణాలు అందించడం వగైరాల్లో లోటు కనిపిస్తోంది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో సేవలందిస్తున్న అయి దారుగురు వైద్యులు ఈ వ్యాధిబారిన పడటం ఇందువల్లే. ఈ నేపథ్యంలోనే వైద్యులకు, ఇతర సిబ్బందికి అవసరమైన ఉపకరణాలు అందించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే రాగల వారాల్లో పరీక్షలు, రోగుల గుర్తింపు, తరలింపు వంటి అంశాలపై దృష్టిపెట్టాలని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పిలుపునిచ్చారు.

ఉన్నకొద్దీ రోగుల సంఖ్య పెరిగే అవకాశం వుండటం వల్ల వైద్యులపై ఒత్తిళ్లు పెరుగుతాయని ఇప్పుడు జరిగిన ఘటనలు తెలియజేస్తున్నాయి. ఇతర రంగాల్లో పనిచేస్తున్నవారితో పోలిస్తే వైద్యులు తమ పని గంటల్ని మించి వుండవలసి వస్తుంది. డ్యూటీ ముగుస్తున్న సమయంలో అనుకోకుండా ప్రాణాపాయ స్థితిలో ఎవరైనా రోగి వస్తే చికిత్స మొదలెట్టక తప్పదు. మన దేశంలో వైద్యుల సంఖ్య చాలా దేశాలతో పోలిస్తే తక్కువ. ప్రస్తుతం సగటున 1,404 మంది పౌరులకు ఒక డాక్టర్‌ వున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వేయిమందికి ఒక డాక్టర్‌ వుండాలని సూచించింది. వాస్తవానికి దేశంలో ఇప్పుడున్న 9.61 లక్షలమంది వైద్యుల్లో 52 శాతంమంది మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో వున్నారు.

మిగిలిన రాష్ట్రాలన్నిటిలో మిగిలిన 48శాతంమంది వున్నారని గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. గత నెలలో రాజ్యసభలో ఒక ప్రశ్నకు జవాబిస్తూ నమోదైన వైద్యుల్లో రాష్ట్రాల వారీగా మహారాష్ట్ర–15 శాతం, తమిళనాడు–12 శాతం, కర్ణాటక–10శాతం, ఆంధ్రప్రదేశ్‌–8 శాతం, ఉత్తరప్రదేశ్‌–7 శాతంమంది వున్నారని మంత్రి వివరించారు. ఢిల్లీ, అస్సాం, ఒడిశాల్లో 2 శాతం, తెలంగాణ, హరియాణా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లలో ఒక శాతం చొప్పున వైద్యులు వున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య కళాశాలలు పెంచకపోవడం వల్ల, ఉన్నతశ్రేణి ఆస్పత్రుల్ని నెలకొల్పకపోవడం వల్ల ఈ పరిస్థితి వుంది. అందువల్లే రోగుల సంఖ్య పెరగకుండా చూడటం ఇప్పుడు ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యంగా మారింది.

ఇందులో భాగంగానే దేశంలో చాలాచోట్ల అనుమానితుల్ని గుర్తించి, తరలించడానికి వైద్యులు, ఇతర సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. హైద రాబాద్‌లో కరోనా రోగి చనిపోయినందుకు ఆగ్రహించి అతని బంధువులు దాడి చేశారు. ఇతరత్రా వ్యాధులుండి, ఈ కరోనా బారినపడే వృద్ధులకు మిగిలినవారితో పోలిస్తే ప్రమాదం ఎక్కువని వివిధ మాధ్యమాల ద్వారా వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే వున్నారు. కానీ కొందరిలో మూర్ఖత్వం ఇంకా పోలేదని ఈ ఉదంతం చాటుతోంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో అదే రోజు కరోనా రోగితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తిని గుర్తించి అతనికి పరీక్షలు నిర్వహించేందుకు వెళ్లిన వారిపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహిళా డాక్టర్లు గాయపడ్డారు. తెలంగాణలోని నిజామాబాద్‌లో, కర్ణాటకలోని బెంగళూరులో, మహారాష్ట్రలోని ముంబైలో కూడా ఈమాదిరి దాడులు జరిగాయి.

కరోనా వ్యాధికి సంబంధించినంతవరకూ మన దేశంలో ఇప్పుడున్న పరిస్థితులు ఎంతో సంక్లిష్టమైనవి. సకాలంలో రోగుల్ని గుర్తించడంలో, వారికి వైద్య చికిత్స అందించడంలో జాప్యం జరిగితే ప్రాణనష్టం తప్పదు. పైగా తమకు రోగం వచ్చిన సంగతి గుర్తించకుండా ఇష్టానుసారం ఎటుపడితే అటు వెళ్లేవారివల్ల చుట్టూవున్న సమాజానికి కూడా చేటు. ఈ పరిస్థితుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది తమ ప్రాణాలొడ్డి పనిచేస్తున్నారు. సాధారణ సమయాల్లోకన్నా ఎక్కువగా వారు ఆసు పత్రుల్లో గడపవలసి వస్తోంది. వారందిస్తున్న సేవల్ని సమాజం గుర్తించాలని, వారికి కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలపాలని ప్రధాని పిలుపునిస్తే గత నెల 22న జనమంతా పాటించారు. కానీ కొందరు ఆ పిలుపు వెనకున్న స్ఫూర్తిని మరిచి ఇలాంటి దాడులకు దిగుతున్నారు. కరోనా వ్యాధిని గుర్తించి, సకాలంలో చర్యలు తీసుకోవడంలో జాప్యం చేసిన అమెరికా అందుకు మూల్యం చెల్లి స్తోంది. భారీ సంఖ్యలో ఆసుపత్రులు, వైద్యులు అందుబాటులో వుండి, అత్యంతాధునిక వైద్య సదుపాయాలున్నా క్షణక్షణానికీ పెరుగుతున్న రోగుల సంఖ్యతో ఏం చేయాలో తెలియక ఆ దేశం తలపట్టుకుంది. వైద్య సిబ్బంది కృషికి అడ్డుతగిలితే ఇక్కడ కూడా ఆ పరిస్థితులే ఏర్పడతాయి. ఇలాంటి దుండగులతో కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే కేంద్రం మార్గదర్శకాలిచ్చింది. వైద్యుల కృషికి సహకరిస్తేనే సమాజం సురక్షితంగా వుండగలుగుతుందని అందరూ గుర్తించాలి. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు