సయోధ్యకు మధ్యవర్తిత్వం

9 Mar, 2019 00:32 IST|Sakshi

రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదం విషయంలో మధ్యవర్తిత్వం నెరపి, ‘శాశ్వత పరిష్కా రాన్ని’ సాధించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని నియమిస్తూ సర్వోన్నత న్యాయస్థానం శుక్ర వారం వెలువరించిన ఆదేశాలు ఏడు దశాబ్దాలుగా సాగుతున్న ఆ వివాదాన్ని కొత్త మలుపు తిప్పాయి. సంఘర్షణ కంటే సామరస్యత ఎప్పుడూ మంచిదే గనుక  ఇది స్వాగతించదగ్గదే. మధ్య వర్తిత్వం కోసం నియమించిన బృందంలో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌తోపాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఫకీర్‌ మహమ్మద్‌ ఇబ్రహీం కలీఫుల్లా, మధ్యవర్తిత్వం కేసుల్లో నిపు ణుడిగా పేరున్న సీనియర్‌ న్యాయవాది శ్రీరాం పంచు ఉన్నారు. వీరు అవసరమనుకుంటే మరికొం దరిని సభ్యులుగా చేర్చుకోవచ్చు. ఈ బృందం 8 వారాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

నాలుగు వారాల్లోగా తాత్కాలిక నివేదికను అందజేయాలని ధర్మాసనం కోరింది. అయితే సంబంధిత పక్షాలతో జరిపే సంప్రదింపుల వివరాలను వెల్లడించరాదని సుప్రీం కోర్టు నిర్దేశించింది. ఈ వివాదం విషయంలో ఇటీవల తీవ్ర స్వరాలు వినిపించాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు, సంఘ్‌ పరివార్‌కు చెందిన ఇతర నేతలు ఎన్నికల్లోగా రామమందిర నిర్మాణం ప్రారంభించాల్సిందేనని పట్టుబట్టారు. సుప్రీంకోర్టు దీన్ని ఇప్పటికప్పుడు తేల్చనిపక్షంలో ఆర్డినెన్స్‌ జారీకి కూడా వెనుకాడరాదని ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఒక దశలో పార్లమెంటు సమావేశాలు ముగిశాక ఆర్డి నెన్స్‌ వెలువడుతుందన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం ఆలోచన చేసి, అందుకోసం ఒక బృందాన్ని నియమిం చడం ఇదే మొదటిసారి. కానీఈ తరహా ప్రయత్నాలు లోగడ జరగకపోలేదు. 1990లో స్వల్పకాలం ప్రధానిగా ఉన్న చంద్రశేఖర్, 1992లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, 2003లో ప్రధానిగా వాజపేయి మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించారు. పీవీ హయాంలో ఆయన సలహాదారుగా పని చేసిన ఉన్నతాధికారి స్వర్గీయ పీవీఆర్‌కే ప్రసాద్, ఆయనతోపాటు చంద్రస్వామి పీఠాధిపతులతో, హిందూ మత పెద్దలతో, ముస్లిం సంఘాలతో మాట్లాడారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కా రానికి వారు చేరువగా వచ్చారన్న కథనాలు కూడా వెలువడ్డాయి. కానీ చివరికది మూలన పడింది. 

రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదం మౌలికంగా మతపరమైన మనోభావాలతో, విశ్వా సాలతో ముడిపడి ఉన్న సమస్య. సమస్య ఆస్తుల పంపకానికి సంబంధించిందో, సరిహద్దు వివా దానికి సంబంధించిందో అయినప్పుడు మధ్యవర్తిత్వంపెద్ద కష్టం కాదు. అక్కడ ఇచ్చిపుచ్చుకోవ డాలుంటాయి. వివాదం సాగదీసేకొద్దీ నష్టపోతామన్న అవగాహన ఉంటుంది. కానీ ఇది అలాం టిది కాదు. 1949లో మహంత్‌ రామచంద్ర దాస్‌ పరమహంస రామమందిరం ఉన్న ప్రాంతంలో పూజ, దర్శనం కోసం అనుమతించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు అక్కడినుంచి రాముడి విగ్రహాన్ని తొలగించాలని హషీమ్‌ అన్సారీ అనే వ్యక్తి కూడా కోర్టుకెక్కారు. కానీ అది ఈ స్థాయిలో దేశమంతా తెలిసింది 80వ దశకంలో సంఘ్‌ పరివార్‌ సంస్థలు రామజన్మభూమి విముక్తి పేరిట సాగించిన ఉద్యమం, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అడ్వాణీ చేపట్టిన రథయాత్రల వల్లనే. 1992 నాటి బాబ్రీమసీదు కూల్చివేత దేశవ్యాప్తంగా మతకల్లోలాలకు దారితీసి 2,000మంది ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది గాయాలపాలయ్యారు. ఆపై జరిగిన పలు హింసాత్మక ఉదంతా లకూ, ఉగ్రవాద ఘటనలకూ బాబ్రీ మసీదు కూల్చివేతలోనే బీజాలున్నాయి. అయితే ఇప్పుడు 90వ దశకంనాటి ఉద్రిక్తతలు లేవు. తమ తమ విశ్వాసాల మాటెలా ఉన్నా వివాదం న్యాయస్థానం పరిధిలో ఉంది గనుక అదిచ్చే తీర్పు కోసం ఎదురు చూడాలన్న దృక్పథం ఇరు వర్గాల్లోనూ ఏర్ప డింది. విశ్వాసానికి సంబంధించిన వివాదంలో న్యాయస్థానాలు చెప్పేదేమిటని హిందుత్వ సంస్థ లకు చెందినవారు కొందరు వ్యాఖ్యానించినా మొత్తం మీద ఆగ్రహా వేశాలు కట్టుదాటలేదు.

మధ్యవర్తిత్వం ద్వారా వైరి వర్గాలను ఒప్పించి సామరస్యపూర్వక పరిష్కారం సాధించాలను కోవడం ఆదర్శవంతమైనదే. ప్రజాస్వామ్యబద్ధమైనదే. కానీ ఈ వివాదం సాధారణమైనది కాదు. అత్యంత జటిలమైనది. భావోద్వేగాలతో, విశ్వాసాలతో ముడిపడి ఉండే ఒక వివాదంలో మధ్యవ ర్తిత్వం ద్వారా పరిష్కారం కనుగొనడం సాధ్యమేనా? అది సాధ్యం కావాలంటే ఇరుపక్షాలూ ఇచ్చి పుచ్చుకునే వైఖరిని ప్రదర్శించాలి. ఎవరి వరకో ఎందుకు... ప్రస్తుత బృందంలోని శ్రీశ్రీ రవిశంకరే అలాంటి వైఖరి ఈ వివాదంలో సాధ్యపడదని తేల్చిచెప్పారు. వివాదస్పద ఎకరం స్థలాన్ని హిందు వులకు బహుమతిగా ఇచ్చి దానికి బదులు సమీపంలో మరోచోట 5 ఎకరాలు తీసుకుని మసీదు నిర్మాణం చేపట్టడమే ఉత్తమ పరిష్కారమని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డుకు నిరుడు రాసిన లేఖలో ఆయన ప్రతిపాదించారు.

ఈ వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏ పక్షానికి వ్యతిరేకంగా ఉన్నా తీవ్రవాదం పెరుగుతుందని, అంతిమంగా అది అంతర్యుద్ధానికి దారి తీస్తుం దని హెచ్చరించారు. కనుకనే శ్రీశ్రీ రవిశంకర్‌ను బృందంలో చేర్చడంపై ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు బృంద సభ్యుడుగా ఇరు వర్గాలకూ ఆయనేం ప్రతిపాదిస్తారన్నది ఆసక్తికరమైనదే. ఈ మొత్తం ప్రక్రియ సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే సాగుతుంది కనుక ఒవైసీలాంటివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికైతే ఈ వివాదం తాత్కా లికంగా సద్దుమణిగింది. మధ్యవర్తిత్వ బృందం తుది నివేదిక ఇచ్చేనాటికి ఎన్నికలు కూడా పూర్తవు తాయి. కానీ ఆ తర్వాతైనా పరిష్కారం సాధ్యమవుతుందా? అనుమానమే. ప్రజలెన్నుకునే ప్రభు త్వాలే చొరవ తీసుకుని సమాజంలో తలెత్తే వివాదాలకు అన్ని వర్గాలతో చర్చించి ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడం సరైంది. కానీ అందుకు చిత్తశుద్ధి, దృఢమైన సంకల్పం ఉండాలి. స్వీయ ప్రయోజనాలను పక్కనబెట్టగలిగే విశాల దృక్పథం ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమేనా?
 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు