హసీనా అఖండ విజయం

2 Jan, 2019 03:41 IST|Sakshi

గత ఏడాది దక్షిణాసియాలోని మూడు దేశాల్లో–పాకిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్‌–  చట్టసభలకు ఎన్నికలు జరిగాయి. ఎవరు గెలిచి అధికారంలోకొచ్చినా సైన్యానిదే పైచేయి అయ్యే పాకిస్తాన్‌ సంగతలా ఉంచితే, మాల్దీవుల్లో అడుగడుగునా భారత వ్యతిరేకతను  ప్రదర్శించిన అబ్దుల్లా యామీన్‌ ఓడిపోయి, విపక్ష కూటమి అభ్యర్థి సోలిహ్‌ దేశాధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ఆదినుంచీ మనకు మిత్ర దేశంగా ఉన్న బంగ్లాదేశ్‌లో సైతం ఇప్పుడు ప్రధాని షేక్‌ హసీనా వాజెద్‌ నేతృత్వంలోని అవామీ లీగ్‌ కూటమి అఖండ విజయం సాధించింది.

ఇప్పటికే వరసగా రెండు దఫాలనుంచి అధికారంలో కొనసాగుతున్న హసీనా మూడోసారి కూడా విజేత కావడం మనకు అనుకూల పరిణామం. బంగ్లాదేశ్‌లో మిలిటెన్సీ బలపడితే దాని ప్రభావం పశ్చిమ బెంగాల్‌పైనా, ఈశాన్య రాష్ట్రాలపైనా ఎక్కువగా ఉంటుంది. పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ అందుకోసం తెగ ప్రయత్నిస్తోంది. మన దేశం బంగ్లా ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంతోపాటు ఉగ్రవాదంపై ఎప్పటికప్పుడు దాన్ని అప్రమత్తం చేస్తూ ఆ ప్రయత్నాలను వమ్ము చేస్తోంది. బంగ్లా సైతం మూడో దేశం ప్రమేయానికి తావీయకుండా మనకు చెక్కుచెదరని మిత్ర దేశంగా ఉంటున్నది. 

అవామీ లీగ్‌ కూటమికి వచ్చిన విజయం అసాధారణమైనది. ఊహకందనిది. పార్లమెంటులోని 300 స్థానాల్లో ఆ కూటమి 299 చోట్ల పోటీచేయగా ఏకంగా 96 శాతం సీట్లు...అంటే 288 వచ్చాయి. ఈ సందర్భంగా హసీనా గెలుపును గురించి చెప్పుకోవాలి. ఆమెకు మొత్తం 2,29,539 ఓట్లు రాగా, ప్రత్యర్థి పక్షమైన బంగ్లా నేషనల్‌ పార్టీ(బీఎన్‌పీ) అభ్యర్థికి కేవలం 123 ఓట్లు లభించాయి. మరో అభ్యర్థికి 71 ఓట్లు వచ్చాయి. మొన్న డిసెంబర్‌ 30న పోలింగ్‌ పూర్తయిన వెంటనే ‘నిశ్శబ్ద ప్రజా వెల్లువ’ బ్యాలెట్‌ పెట్టెల్ని ముంచెత్తిందని అభివర్ణించిన బీఎన్‌పీ ఆధ్వర్యంలోని జాతీయ ఐక్య ఫ్రంట్‌ చివరకు  ఏడంటే ఏడు స్థానాలకు పరిమితమై అందరినీ విస్మయపరచడంతోపాటు తానూ అయోమయంలో పడిపోయింది.  

అధికార అవామీ లీగ్‌ ‘ఇది ప్రజా తీర్పు’ అంటుంటే...‘అంతా మోసం, దగా’ అని విపక్షాలు ఆక్రోశిస్తున్నాయి. తిరిగి ఎన్నికలు జరపాలని డిమాండు చేస్తున్నాయి. ఈ ఫలితాలను న్యాయస్థానాల్లో సవాలు చేస్తామంటున్నాయి. ఈ ఎన్నికల్లో హింస విస్తృతంగా జరిగిన మాట వాస్తవం. అయితే 18మంది మృతుల్లో అవామీ పార్టీ కార్యకర్తలే అధికం. బంగ్లా ఎన్నికల్లో రివాజుగా ఉండే భారత వ్యతిరేక ప్రచారం ఈసారి లేకపోవడం గమనించదగ్గది. భారత్‌ను దూరం చేసుకోవడం మంచిది కాదని విపక్ష బీఎన్‌పీ కూడా భావించడంవల్లే ఈ మార్పు. ఈ ఎన్నికల్లో తొలిసారి ప్రయోగాత్మకంగా కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలు ఉపయోగించారు. మన దేశంతోసహా వేర్వేరు దేశాలకు చెందిన 175మంది నిపుణులు ఈ ఎన్నికలకు పరిశీలకులుగా వచ్చారు.  వీరంతా వివిధ పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్టు ఎక్కడా తమ దృష్టికి రాలేదని చెప్పారు. కానీ ఒక మీడియా ప్రతినిధికి రెండు మూడుచోట్ల పోలింగ్‌ కేంద్రాల్లో అసలు విపక్షాల ఏజెంట్లే కనబడలేదు.

వాస్తవానికి ఈ స్థాయిలో హసీనా నేతృత్వంలోని కూటమికి అసాధారణ మెజారిటీ రావడంపై అనుమానాలున్నాయి తప్ప ఆమె నెగ్గే అవకాశమే లేదని ఎవరూ అనడం లేదు. విపక్షాలు క్రితంసారి ఎన్నికలను బహిష్కరించినప్పుడు సైతం ఆ కూటమి 234 స్థానాలు గెల్చుకుంది. ఇప్పుడు ఆ పక్షాలన్నీ రంగంలో ఉన్నాయి గనుక మెజారిటీ తగ్గొచ్చునని కొందరు అంచనాలు వేశారు. కానీ అందుకు భిన్నంగా రికార్డు స్థాయిలో సీట్లు గెలుచుకోవడమే అందరినీ అయోమయానికి గురిచేసింది. తమ పార్టీ గెలుపును సమర్థించుకోవడానికి హసీనా మన బీజేపీ, కాంగ్రెస్‌లను ఉదహరిస్తున్నారు. నాయకుడెవరో తెలియని పార్టీలకు ఓట్లేయరని వివరిస్తున్నారు. 

ఈ పోలికల మాటెలా ఉన్నా గత పదేళ్లుగా హసీనా అవలంబించిన ఆర్థిక విధానాలు బంగ్లా ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పు తీసుకొచ్చాయన్నది వాస్తవం. పేదరికం గణనీయంగా తగ్గింది. ఆహారభద్రత ఏర్పడింది. సార్వత్రిక ప్రాథమిక విద్య వంటి అంశాల్లో దేశం ముందంజలో ఉంది. అతి తక్కువ అభివృద్ధి సాధించిన దేశాల జాబితా నుంచి బంగ్లాదేశ్‌ తప్పుకుని వర్ధమాన దేశాల జాబితాలో చేరింది. అవినీతి నిర్మూలనలో, ఛాందసవాద మిలిటెంట్ల ఆగడాలను అదుపు చేయడంలో కఠినంగా వ్యవహరించింది. అలాగని అంతా సవ్యంగా ఉన్నదని చెప్పడం అవాస్తవమవుతుంది. భావప్రకటనా స్వేచ్ఛకు ఆటంకాలు, విచ్చలవిడి ఎన్‌కౌంటర్లు, మనుషుల్ని అదృశ్యం చేయడం వంటివి ప్రభుత్వ తీరుతెన్నుల్ని ప్రశ్నార్థకం చేశాయి.  

బీఎన్‌పీ అధినేత ఖలీదాతోసహా ఎందరో నేతల్ని అవినీతి కేసుల్లో శిక్షలు పడేలా చేయగలిగామని చెబుతున్నా...స్వపక్షం అవినీతి విషయంలో హసీనా సర్కారు ఉదాసీనంగా ఉంటోంది. భూ కబ్జాలు, మెగా ప్రాజెక్టుల్లో స్వాహాలు, పబ్లిక్‌ రంగ సంస్థల్లో అవినీతి, ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగంలో విచ్చలవిడిగా రుణాల మంజూరు, ఎగవేతదార్లపై చర్యలు తీసుకోకపోవడం వగైరాలు ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్నాయి. మిలిటెన్సీని అణిచేస్తున్నామని చెబుతున్నా సెక్యులర్‌ విలువలున్న కళాకారులు, రచయితలపై ఆ సంస్థల దాడులు తగ్గలేదు. ఏదో ఒక సాకుతో విపక్ష నేతల్ని, వారి మద్దతుదార్లను జైళ్లలోకి నెట్టి ఆ పార్టీలకు నాయకత్వమే లేకుండా చేసిన తీరు ఎన్నికల ప్రక్రియపైనే సందేహాలు రేకెత్తించింది.

ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సంయమనం పాటించాలని తమ శ్రేణులకు హసీనా పిలుపునిచ్చారు. మంచిదే. కానీ వచ్చే అయిదేళ్లలో ప్రభుత్వం సైతం అదే రీతిలో మెలగాలి. అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు జనం మనసుల్ని గెల్చుకుని ఉండొచ్చుగానీ, ప్రభుత్వం అదే పనిగా నియంతృత్వ పోకడలకు పోతున్నదన్న అభిప్రాయం కలిగిస్తే మున్ముందు అది ఆమె పార్టీపైన మాత్రమే కాదు...మొత్తంగా ప్రజాస్వామిక వ్యవస్థపైనే అవిశ్వాసాన్ని ఏర్పరుస్తుంది. అలాంటి పరిస్థితి ఏర్పడకుండా చూస్తేనే, అందరినీ కలుపుకొని వెళ్తేనే బంగ్లాదేశ్‌ చరిత్రలో హసీనా సమర్థ ప్రధానిగా శాశ్వతంగా నిలిచిపోతారు.

మరిన్ని వార్తలు