నిబ్బరంగా సాగుదాం!

30 Sep, 2017 01:43 IST|Sakshi

యావద్భారతం దసరా సంబరాల్లో తేలియాడుతోంది. దుష్టసంహారిణి దుర్గ తొమ్మిది రోజుల భీకర సంగ్రామం తర్వాత లోక కంటకుడైన మహిషాçసురుని కడతేర్చి నేల నాలుగు చెరగులా శాంతి సౌఖ్యాలను వెలయించిన రోజు విజయ దశమి. హిందువుల పండుగే అయినా దసరా వేడుకల అంతస్సారం, అంతర్నిహిత సందేశం మతాలకతీతం, లౌకికం, సార్వత్రికం. చెడుపై మంచి విజయం అనివార్య మనే సార్వత్రిక సత్యం ఎవరిలో మాత్రం ఆత్మవిశ్వాసాన్ని నింపదు, ఎంతటి నైరాశ్యపు ఎడారి బతుకుల్లో ఆశల పూలను పూయించదు? భిన్నత్వంలో ఏకత్వానికి మారు పేరైన భారతంలోని అత్యధిక సంఖ్యాకుల హిందూ మతంలోనే ఉన్న ప్రాంతీయ, సాంస్కృతిక వైవిధ్యమంతా దసరా ఉత్సవాల్లో ప్రస్ఫుటంగా కనిపి స్తుంది.

అయితే ఎక్కడైనా దసరా అంటే శక్తి పూజే. శక్తి స్వరూపిణిగా మహిళ విశ్వ రూపాన్ని ఆవిష్కరించే సమయమే. ఎంతటి వారైనా ఆమె ముందు మోకరిల్లే సందర్భమే. అందుకే ఇది ‘ఆమె’కు మనం చూపుతున్న స్థానం ఏది? అని ప్రశ్నించు కోవాల్సిన సందర్భం అయింది. చెడుపై మంచి విజయం అనివార్యమేనా? అసలు సాధ్యమేనా? అని అడుగడుగునా రేగే సందేహాలకు సమాధానాలను వెతకాల్సిన సమయమూ అయింది. దేశ జనాభాలోని మహిళల సంఖ్య క్రమంగా క్షీణిస్తోందని తెలిసిందే. 1971లో 15–34 ఏళ్ల వయస్కులైన వెయ్యి మంది యువకులకు 961 మంది యువతులుగా ఉన్న నిష్పత్తి, 2011 నాటికి 939కి పడిపోయిందనీ, అది 2021 నాటికి 904కు, 2031 నాటికి 898కి పడిపోతుందని ప్రపంచ బ్యాంకు తాజా అంచనా. ఇప్పుడు హారతులెత్తుతున్న ఆ అమ్మలగన్న అమ్మకు ప్రతిరూపమైన ఎందరు అమ్మల కడు పున ఊపిరి పోసుకుంటున్న శక్తులను చిదిమేసి, కళ్లయినా తెరవని పసి శక్తుల గొంతులు పిసికేసి ఇంతటి ఘనతను మూటగట్టుకుంటున్నాం?  

చెడును పరిమార్చే ఆ అమ్మ ఈ దురాగతాన్ని సహిస్తుందా? మొక్కులు చెల్లించామని మన్నిస్తుందా? విద్య, ఉద్యోగావకాశాల్లో ఆడపిల్లల పట్ల చూపుతున్న వివక్షను అధిగమించి మరీ ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళలపై లైంగిక వేధింపులు 2014–15 మధ్య 51 శాతం పెరిగాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఉద్యోగులుగా ఎంతటి ప్రతిభను, సమర్థతను కనబరుస్తున్నవారైనా 74 శాతం ఇలాంటి వేధింపులపై అసలు ఫిర్యాదే  చేయరంటే పర్యవసానాల భయం ఎలాం టిదో ఊహించుకోవచ్చు. విద్యావంతులైన, ఉద్యోగాలు చేస్తున్న మహిళల పరిస్థితే ఇలా ఉంటే ఇళ్లలో, వీధుల్లో, విద్యాలయాల్లో మహిళలపై సాగే వేధింపులు, హింస, అత్యాచారాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో చెప్పనవసరం లేదు, గణాంకాలు ఏకరు వు పెట్టాల్సిన అవసరమూ లేదు.

శక్తి స్వరూపిణిగా మహిళను ఆరాధించే మనం మన సొంత కూతుళ్లు, అక్కచెల్లెళ్లు, కన్న తల్లి, కట్టుకున్న ఆలి, సహాధ్యాయిని, తోటి ఉద్యోగిని, శ్రామికురాలు, ఎవరైతేనేం మహిళను పురుషునితో సర్వ సమానమైన మనిషిగా చూడగలుగుతున్నామా? గౌరవించగలుగుతున్నామా? నునులేత మొహా లపై యాసిడ్‌ సీసాలు విసిరి, అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడి, ఆత్మ హత్యలకు పురిగొల్పి ఏ మొహం పెట్టుకుని అమ్మవారి దర్శనం కోసం వెళు తున్నాం? ఆ మహిషాసురమర్దని పట్ల చూపే భక్తిప్రపత్తులపై ఈ రాక్షసత్వం ఆనవాళ్లు కనిపించకుండా ఉంటాయా? ఈ పరిస్థితిని భరిస్తున్న సమాజంగా మనం ఆ శక్తి స్వరూపిణి ముందే కాదు, భారత స్త్రీ శక్తి ముందు కూడా దోషులం కాకుండా పోతామా? దేవీ నవరాత్రి ఉత్సవాల నిజ స్ఫూర్తిని గ్రహించగలిగితే, చెడుపై పోరాటం చేయడానికి వెనుకాడటం, చెడు చేయడంతో సమానమేనని గ్రహించే వాళ్లం కాదా? ‘ఈ ప్రపంచం ప్రమాదకరంగా తయారైంది దుష్టులవల్ల కాదు, వారి దుష్కృత్యాలను చూస్తూ ఏమీ చేయని వారి వల్ల (ఐన్‌స్టీన్‌).’ నేడైనా ఆ పోరుకు దిగి, విజయాన్ని కోరి ‘ఆయుధ పూజ’ చేద్దాం.

శమీ వృక్షాన్ని పూజించడమైనా, రావణ దహనమైనా చెడును నిర్జించడానికి ప్రతిన బూనడానికి సంకేతాలే తప్ప అర్థ రహితమైన ఆరాధనా కాదు, వినోదం అంతకన్నా కాదు. విజయదశమితో ఆ దుర్గమ్మ తల్లి మíß షాసుర సంహారం ముగుస్తుంది. నేడు చేసే ఆయుధ పూజ విజయాన్ని సాధించగలమనే ఆత్మవిశ్వాసం నింపి, ఇనుమడిం చిన శక్తితో మనల్ని కర్తవ్యోన్ముఖుల్ని చేస్తుంది. కానీ రేపటి నుంచి అడుగడుగునా చెడు ఎదురవుతూనే ఉంటుంది. మహిషారులు ప్రత్యక్షమౌతూనే ఉంటారు. అన్యా యం, అసమానత, అవినీతి, అజ్ఞానం, అసహనం అసమర్థత, అక్రమం, అధికార దుర్వినియోగం, దురాక్రమణ, దురాగతం, దురాచారం,  మూఢనమ్మకం, వివక్ష, నిరక్షరాస్యత ఇలా ఎన్ని రూపాలలో చెడు విచ్చలవిడిగా చెలరేగి పోవడం లేదు? పేదరికాన్ని మించిన సామాజిక హింస మరేదీ లేదు.

ఆ చిత్రహింసల కొలిమిలో, రోగాల పుట్టల్లో కునారిల్లుతున్న 30 కోట్ల అభాగ్యుల మాటేమిటి? నిరుద్యోగులు కావడం అంటే ఆచరణలో జీవించే హక్కును కోల్పోవడమే. కొత్త ఉద్యోగాలు వేలల్లో ఉంటే కొత్త నిరుద్యోగులు లక్షల్లో పెరుగుతున్నారు. ఈ భూతాలను ఎవరు పరిమార్చాలి? అవి ప్రభుత్వాలు చేయాల్సిన పనులే, 70 ఏళ్లుగా అరకొరగా చేసీ చేయకుండా వదిలేసిన బాధ్యతలే. అట్టహాసంగా దసరా ఉత్సవాలు జరుపుతూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపే ప్రభుత్వాలు... దాచిన ఎన్నికల ప్రణాళికలు, చేసిన వాగ్దానాల దుమ్ముదులిపి ఈ విజయదశమినాడైనా అమలు చేయడానికి పూనుకుంటాయని, ఆ కృషిలో విజయం కోసం ప్రార్థిస్తాయని ఆశిద్దాం. అయితే ఆ పాల కులను ఎన్నుకునేది మనమే. కాబట్టి ప్రభుత్వాలు నిజంగానే ప్రజల అధికారానికి ప్రాతినిధ్య సంస్థలుగా పనిచేసేలా చేయడమూ మన బాధ్యతే. ఈ పండుగ రోజున ఇన్ని చేదు వాస్తవాలను గుర్తుకు తెచ్చుకోవడం వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని సమ కూర్చుకోవడానికే. జీవితం, సమాజం సమస్యల సుడిగుండమైనప్పుడు కావా ల్సింది గుండె దిటవు. విజయదశమి రోజున ఆ ఆదిశక్తిని కోరాల్సింది అదే. విశ్వ కవీంద్రుడు అన్నట్టు ‘ఆపదల నుంచి కాపాడమని కాదు, ఆపదలను ఎదుర్కో వాల్సి వచ్చినప్పుడు నిర్భయంగా ఎదుర్కొనేలా చేయమని ప్రార్థిద్దాం’.

మరిన్ని వార్తలు