రచ్చకెక్కిన సీఏఏ!

5 Mar, 2020 00:14 IST|Sakshi

దేశంలో పెను వివాదం రగిల్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) తాజాగా ఒక అసాధారణ పరిస్థితిని సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి హైకమిషనర్‌(యూఎన్‌ హెచ్‌సీహెచ్‌ఆర్‌) ఆ చట్టం రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు జరిపే విచా రణలో కోర్టు సహాయకారిగా పాల్గొనడానికి అనుమతి కోరుతూ అభ్యర్థించింది. సంస్థ హైకమి షనర్‌గా వ్యవహరిస్తున్న చిలీ మాజీ దేశాధ్యక్షురాలు మిషెల్‌ బెక్‌లే ఈ అభ్యర్థన చేశారు. ఇది పూర్తిగా ఆంతరంగిక వ్యవహారమన్నది మన ప్రభుత్వం వాదన.

దేశ న్యాయ చరిత్రలో ఒక విచారణలో అంతర్జాతీయ సంస్థ జోక్యం చేసుకోవడానికి అనుమతి కోరిన దాఖలా లేదు. సీఏఏ విషయంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ ఇంకా మొదలు కావలసివుంది. దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు, ఇతర ప్రజాసంఘాలు ఆ చట్టంపై  పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆఖరికి బీజేపీ మిత్రపక్షాల్లో లోక్‌  జనశక్తి, అకాలీదళ్‌ వంటివి కూడా అందులో మార్పులు అవసరమని అభిప్రాయపడ్డాయి. ఆ చట్టాన్ని అమలు కానీయబోమని కొన్ని రాష్ట్ర శాసనసభలు తీర్మానించాయి. దేశ రాజధాని ఢిల్లీలో షహీన్‌బాగ్‌లో మూడు నెలలనుంచి ధర్నా కొనసాగుతోంది.

ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్‌వంటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అదే సమయంలో సీఏఏను బీజేపీ, కేంద్రంలో ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం గట్టిగా సమ ర్థించుకుంటున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వివాదాస్పద అంశంలో అనుకూల, ప్రతికూల అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా చర్చ జరగడం మన దేశంలో నెలకొన్న ఆరోగ్యకరమైన ప్రజాస్వామిక సంప్రదాయానికి ప్రతీక. ఆ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారంతా పాకిస్తాన్‌ ఏజెంట్లనీ, దేశద్రోహులని కొందరు నోరు పారేసుకున్న మాట వాస్తవమే. కానీ అలాంటివారికి చాలా దీటైన జవాబులొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అంతర్జాతీయ సంస్థ జోక్యానికి తావెక్కడుందన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. 

మన దేశంలో కోర్టు సహాయకారిగా ఉండమని న్యాయస్థానాలు అభ్యర్థించడమే తప్ప,  ఆ పాత్ర పోషిస్తామని తమంత తాముగా ఎవరూ ముందుకొచ్చిన ఉదంతాలు దాదాపు లేవనే చెప్పాలి. ఏదైనా కేసు అప్పీల్‌కొచ్చినప్పుడు ఆ కేసుకు సంబంధించిన అంశాల్లో నైపుణ్యం ఉన్నదని భావిం చేవారిని  కోర్టుకు సహాయకారిగా ఉండమని న్యాయస్థానాలు అభ్యర్థిస్తాయి. తమ ముందున్న కేసులో కక్షిదారుల తరఫు న్యాయవాదులు వినిపించే వాదప్రతివాదాలకు, వారు దాఖలుచేసే రికా ర్డులకు మించిన కీలకమైన అంశాలు ఇమిడివున్నాయని... ఈ విషయంలో తామిచ్చే తీర్పు ప్రభావం సమాజంపై విస్తృతంగా ఉండొచ్చునని న్యాయమూర్తులు భావించినప్పుడు కోర్టు సహాయకారిగా ఉండమని నిష్ణాతులైనవారిని కోరడం సర్వసాధారణం. వారు నిష్ణాతులైనవారు మాత్రమే కాదు... నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని, ఆ కేసులో వెలువడే తీర్పు ద్వారా వారికి ఏ ప్రయోజనం కలగదని భావించినప్పుడే కోర్టులు అభ్యర్థిస్తాయి. ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైన సందర్భాల్లో సహా యకారిని నియమించడం ఎక్కువగా కనబడుతుంటుంది. అలా ఉండేవారు న్యాయవాదే కానవసరం లేదని, సంబంధిత అంశంలో లోతైన అవగాహనగల నిపుణులైతే చాలని అంటారు. కానీ న్యాయ వాదులు మినహా వేరేవారిని అలా నియమించిన సందర్భాలు దాదాపు లేవు. 

సీఏఏపై సమాజంలో విస్తృతమైన చర్చ జరుగుతున్నప్పుడు, దానిపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించడానికి సిద్ధపడుతున్నప్పుడు యూఎన్‌ హెచ్‌సీహెచ్‌ఆర్‌ అయినా, మరొకటైనా అందులో కల్పించుకుని కొత్తగా చెప్పాల్సింది ఏముంటుంది? భారత్‌ అంగీకరించిన అంతర్జాతీయ ఒడంబడికలకూ, ఈ చట్టానికీ మధ్య వున్న వైరుధ్యమేమిటో... ఆ ఒడంబడికలను ఇదెలా ఉల్లం ఘిస్తున్నదో చెప్పదల్చుకుంటే ఆ పని పిటిషన్‌ దాఖలు చేసిన దేబ్‌ ముఖర్జీ కూడా చెప్పగలరు. ఆయన అంతర్జాతీయ వ్యవహారాల్లో నిపుణుడైన విశ్రాంత ఐఎఫ్‌ఎస్‌ అధికారి. బంగ్లాదేశ్‌ మాజీ హైకమిష నర్‌గా పనిచేశారు. గమనించదగ్గదేమంటే... సీఏఏను హెచ్‌సీహెచ్‌ఆర్‌ పూర్తిగా వ్యతి రేకించడం లేదు. ఆ చట్టం వల్ల వివిధ దేశాల్లో వేధింపులను ఎదుర్కొంటున్న వేలాదిమంది శర ణార్థులకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతోంది. కాకపోతే శరణార్థుల్ని బలవంతంగా వెనక్కు పంపే ప్రమాదం ఉన్నదని ఆ సంస్థ ఆందోళన పడుతోంది. సీఏఏపై మన దేశంలో వాదనల సారాంశం భిన్నం.

తమ దగ్గర అక్రమ వలసదారులుగా తేలిన 19 లక్షలమందిలో అధికంగా వున్న హిందువుల్ని కాపాడటానికి దీన్ని తెచ్చారన్న అభిప్రాయం అస్సాంలో వుంది. అస్సామేతరులు ఎవరైనా, వారిది ఏ మతమైనా రాష్ట్రం నుంచి నిష్క్రమించాల్సిందేనని అక్కడి ఉద్యమకారులు డిమాండ్‌ చేస్తున్నారు. దేశంలో ఇతర ప్రాంతాల్లో ఈ చట్టంపై ఉన్న భయాందోళనలు వేరు.తమ జన్మస్థలానికి సంబంధించి తగిన రికార్డులు సమర్పించలేని ముస్లింలను అక్రమ వలసదారులుగా తేల్చి పంపేయడానికే దీన్ని తెచ్చారన్నది ఆ భయాందోళనల సారాంశం. ఒకరి పౌరసత్వాన్ని నిర్ణయించడానికి మతం ప్రాతిపదిక కారాదని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మానవహక్కుల సంఘాల వాదన.

కోర్టు సహాయకారిగా తీసుకోమంటున్న హెచ్‌సీహెచ్‌ఆర్‌ 47మంది సభ్య దేశాలుండే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి తోడ్పడే సంస్థ. దాని హైకమిషనర్‌ నిర్ణయం ఆ మండలి అభిప్రాయాన్ని ప్రతిబింబించదన్న వాదన కూడా ఉంది. ఇప్పుడున్న నిబం ధనల్నిబట్టి ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించినా ఆశ్చర్యం లేదు. కానీ ఈ సమస్య అంతర్జాతీయంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తుందన్నది వాస్తవం. సీఏఏపై దేశంలో దాదాపు మూడు నెలలుగా సాగుతున్న ఆందోళనలు సాగుతున్నా అపోహలు పోగొట్టడానికి లేదా అందుకు అవకాశమిస్తున్న అంశాలను సవరించడానికి సిద్ధపడని కేంద్ర ప్రభుత్వ వైఖరే ఈ పరిస్థితి ఏర్పడటానికి కారణం.

మరిన్ని వార్తలు