సీబీఐకి ‘సుప్రీం’ కవచం

10 Jan, 2019 01:04 IST|Sakshi

మూడు నెలలక్రితం హఠాత్తుగా ఓ అర్థరాత్రి సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మను సెలవుపై పంపిన ఎన్‌డీఏ ప్రభుత్వ నిర్ణయానికి సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆయన్ను తిరిగి ఆ పదవిలో కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తయ్యేవరకూ అలోక్‌ వర్మ ప్రధానమైన విధాన నిర్ణయా లను తీసుకోరాదని స్పష్టం చేసింది. ఆయనపై ఇప్పటికే ప్రధాన విజిలెన్స్‌ కమిషనర్‌(సీవీసీ) దర్యాప్తు చేసి సమర్పించిన నివేదిక ప్రభుత్వం దగ్గరుంది. దాన్ని ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతలతో కూడిన ఎంపిక సంఘం పరిశీలించి వారంలోగా తన నిర్ణయాన్ని ప్రకటించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.

అయితే అలోక్‌ పదవీకాలం ఈ నెలాఖరుతో పూర్తవుతుంది. ఇప్పటికే ఆయన వారసుడి ఎంపిక కోసం కేంద్రం 9మందితో ఒక జాబితా రూపొందించింది. అలోక్‌ విషయంలో తమ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు మౌలికంగా తప్పు బట్టలేదని, కేవలం ఎంపిక సంఘం చేయాల్సిన పనిని ప్రభుత్వమే చేసిందన్నదే దాని అభ్యంతర మని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అంటున్నారు. అందుకు రుజువుగా ప్రధానమైన విధాన నిర్ణయాలు తీసుకోరాదని అలోక్‌పై ఆంక్షలు విధించడాన్ని చూపుతున్నారు. అయితే సెలవుపై పంప డానికి కారణమైన సీవీసీ నివేదికను ఈ విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమ ర్పించింది. దాన్ని చూశాక కూడా అలోక్‌ వర్మ యధావిధిగా పదవిలో కొనసాగవచ్చునని ధర్మాసనం చెప్పిందంటే ఆ ఆరోపణల్లో అంత పసలేదన్న అభిప్రాయం అందరికీ కలుగుతుంది.

సీవీసీ నివేదికపై అభిప్రాయం చెప్పమని రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే పట్నాయక్‌ను సుప్రీంకోర్టు కోరింది. ఆయన అభిప్రాయం వెల్లడయ్యాకే ధర్మాసనం తాజా ఉత్తర్వులిచ్చింది. చివరిగా ఎంపిక సంఘం ఏం తేలుస్తుందన్న సంగతలా ఉంచితే సీబీఐ స్వతంత్రతను కాపాడటానికి సుప్రీంకోర్టు పడుతున్న తపనను ఈ తీర్పు తేటతెల్లం చేస్తోంది. ప్రస్తుతం సీబీఐకి తాత్కాలిక డైరెక్టర్‌గా ఉంటున్న జాయింట్‌ డైరెక్టర్‌ ఎం. నాగేశ్వరరావును ధర్మాసనం ఆ బాధ్యతలనుంచి తప్పించింది. ఇంతకూ అలోక్‌తో లడాయికి దిగిన ఆ సంస్థ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్థానా పరిస్థితేమిటో మాత్రం తీర్పు స్పష్టం చేయలేదు. కేంద్రం నిర్ణయాన్ని అలోక్‌ సవాలు చేశారుగానీ ఆస్థానా మౌనంగా ఉండి పోయారు. కానీ తనకు వ్యతిరేకంగా అలోక్‌ నమోదు చేయించిన అవినీతి కేసును కొట్టేయాలని ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అదింకా పెండింగ్‌లో ఉంది. 

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కారు ఆ సంస్థను ఎంతగా భ్రష్టు పట్టించిందో ఎవరూ మరిచిపోలేరు. దేశంలోనే ఉన్నతశ్రేణి దర్యాప్తు సంస్థగా పేరు ప్రఖ్యాతులున్న ఆ సంస్థ యూపీఏ ప్రభుత్వ తీరుతో నీరసించింది. ఒక దశలో ‘పంజరంలో చిలుక’లా వ్యవహరించవద్దని సీబీఐని సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టవలసి వచ్చింది. కానీ దానికి అధిపతులుగా వచ్చినవారిలో మాత్రం ఆ వ్యాఖ్య ఏ మార్పూ తీసుకురాలేదు. ఇవాళ ఎన్‌డీఏ సర్కారు కొత్తగా దాన్ని, మరికొన్ని ఇతర వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని ఆరోపిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను విపక్షంలో ఉండి కూడా కాంగ్రెస్‌తో చీకటి లాలూచీలు నడిపి సీబీఐని చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి ఎలా ప్రయత్నించారో అందరికీ గుర్తుంది. సమస్యంతా ఇలాంటి వారితోనే.

అటు కాంగ్రెస్‌కూ, ఇటు చంద్రబాబుకూ సీబీఐ తమ పంజరంలో చిలుకలా ఉండాలి. కానీ వేరేవాళ్ల పంజ రంలో ఉండటమే వారికి అభ్యంతరకరం. తమ చరిత్రలు ప్రజలకు తెలుసన్న ఇంగితజ్ఞానం ఈ బాపతు నేతలకు ఉండటం లేదు. కేంద్రంలోని ఇతర విభాగాల కంటే సీబీఐపైనే ఎక్కువగా ఆరోపణలు వస్తుంటాయి. అది అధికారంలో ఉన్నవారు చెప్పినట్టల్లా ఆడుతోందన్నది వాటిల్లో ప్రధానమైనది. కానీ ఈమధ్య కాలంలో దాని వ్యవహారాలు మరింతగా శ్రుతిమించాయి. అలోక్‌ వర్మ  రాకేష్‌ ఆస్థానాపై దర్యాప్తు మొదలెట్టారు. ఈ సంగతి తెలిసి ఆస్థానా సైతం అలోక్‌ వర్మపై ఎదురు దర్యాప్తునకు ఆదేశాలిచ్చి అందరినీ విస్మయంలో పడేశారు. అంతేకాదు...ఇద్దరూ సీవీసీ దగ్గర పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.

అలా ఫిర్యాదులు చేసుకున్నప్పుడు దాన్ని ఆసరాగా తీసుకుని సీబీఐ వ్యవహారాలను తన చేతుల్లోకి తీసుకోవాలనుకోవడం కేంద్రం చేసిన తప్పిదం. సంక్షోభం తలెత్తినప్పుడు ఏం చేయాలన్న విషయంలో నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పుడు వాటిని కాదని ఇష్టానుసారం చేయడం సరికాదు. తాము అలోక్, ఆస్థానాలను బదిలీ చేయడం లేదా తొలగించడం వంటివి చేయలేదు గనుకే ఎంపిక సంఘాన్ని సంప్రదించలేదన్న అటార్నీ జనరల్‌ వాదనను సుప్రీంకోర్టు అంగీ కరించలేదు. ఎంపిక సంఘం ద్వారా సీబీఐ నిర్వహణా బాధ్యతల్ని తీసుకున్న అలోక్‌ను వాటినుంచి తప్పించడమంటే సారాంశంలో ఆయన్ను పంపించడమే అవుతుందని, ఇది ఎంపిక సంఘం పరి ధిలోనిదని స్పష్టం చేసింది. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి సీబీఐని, ఇతర వ్యవస్థలనూ ఇష్టానుసారం వినియోగించుకునే దుస్సంప్రదాయాన్ని నిలువరించడానికి తాజా తీర్పు ఎంతోకొంత దోహదపడుతుందనడంలో సందేహం లేదు.

ఇకపై ప్రభుత్వాలు సీబీఐ విషయంలో మెలకువతో వ్యవహరిస్తాయి. కానీ డైరెక్టర్లుగా వచ్చేవారు ఈ తీర్పును కవచంలా ఉపయోగిం చుకుంటారా లేక యధాప్రకారం పాలకుల అభీష్టాన్ని నెరవేర్చే అలవాటును కొనసాగిస్తారా అన్నది చూడాలి. త్రికరణశుద్ధిగా విధులు నిర్వర్తించాలని, తాము నేతృత్వం వహిస్తున్న సంస్థ అత్యుత్తమ ప్రమాణాలను అందుకునేలా తీర్చిదిద్దాలన్న సంకల్పం కొరవడినప్పుడు ఎవరూ ఏం చేయలేరు. సంస్థలో తీసుకునే నిర్ణయాలన్నిటికీ అన్ని స్థాయిల్లోనూ జవాబుదారీతనం ఉండేలా పకడ్బందీ నిబంధనలు రూపొందేవరకూ వ్యక్తుల నిజాయితీపైనే వ్యవస్థల విశ్వసనీయత ఆధారపడక తప్పదు.
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎట్టకేలకు లోక్‌పాల్‌

విలక్షణ వ్యక్తిత్వం

ఉన్మాద కాండ

మళ్లీ మోకాలడ్డిన చైనా

భద్రతే ప్రాణప్రదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’ టైటిల్‌ లోగో లాంచ్‌

నాడు నటుడు.. నేడు సెక్యూరిటీ గార్డు

‘అర్జున్‌ రెడ్డి’లాంటి వాడైతే ప్రేమిస్తా!

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

సైరా కోసం బన్నీ..!

సమ్మరంతా సమంత