సంయమనం అవసరం

5 Jan, 2019 00:52 IST|Sakshi

పురాతన కాలం నుంచీ మన దేశం వేదభూమి, కర్మభూమి గనుక మత విశ్వాసాలను ప్రోత్సహించడంలో తప్పులేదని వాదించేవారికీ...ఈ సెక్యులర్‌ దేశంలో రాజ్యాంగం చెబుతున్నట్టు ప్రభుత్వాలు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలనేవారికీ మధ్య ఏళ్లతరబడి సాగుతున్న వివాదాలు మాయమై ఇప్పుడు ‘ప్రార్థించే హక్కు’ చుట్టూ గొడవ రాజుకుంది. శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో 10–50 ఏళ్ల మధ్య ఉన్న ఆడవాళ్లకు ప్రవేశాన్ని నిరాకరిస్తున్న నిబంధన చెల్లదని, అది రాజ్యాంగ విరుద్ధమని గత సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన మెజారిటీ తీర్పు ఈ గొడవకంతకూ మూలం. దానికి అనుకూలంగా, వ్యతిరేకంగా వేలాదిమంది మహిళలతో ర్యాలీలు జరిగాయి. ప్రభుత్వం నుంచి ఏదైనా విధాన నిర్ణయం వెలువడినప్పుడో, న్యాయస్థానాలిచ్చిన తీర్పుల విషయంలోనో వాగ్యుద్ధాలు నడవటం వింతేమీ కాదు.

అవి మన ప్రజాస్వామ్య వ్యవస్థ చలనశీలతకు నిదర్శనం. కానీ ఆ వాగ్యుద్ధాలు కాస్తా ముదిరి నడిరోడ్డుపై పరస్పరం దాడులు చేసుకునే వరకూ వెళ్లడం అనారోగ్యకరం. నిజానికి సంక్రాంతి ఆగమిస్తున్న ఈ సమయంలో  భక్తుల శరణుఘోషతో శబరిమల మార్మోగుతుండాలి. కానీ దానికి విరుద్ధంగా అది రణఘోషతో అట్టుడుకుతోంది. ఆలయంలోకి నూతన సంవత్సర ఆరంభవేళ వేకువజామున ఇద్దరు మహిళలు ప్రవేశించి పూజలు నిర్వహించారన్న వార్త తెల్లారేసరికి గుప్పుమనడంతో కేరళ అంతటా ఉద్రిక్తతలు అలముకున్నాయి. మహిళల రాకతో అపచారం జరిగిందంటూ ఆలయ పూజారులు గర్భగుడిని శుద్ధి చేశారు. మూడో తేదీన శ్రీలంక మహిళ ఒకరు దర్శనం చేసుకున్నారని తాజాగా వెల్లడైంది.  

గురువారంనాడు 12 గంటల హర్తాళ్‌ పాటించాలన్న హిందూ సంస్థలు ఇచ్చిన పిలుపుతో అక్కడ హింస చెలరేగడం, సీపీఎం కార్యాలయాలపై దాడులు, బీడీ తయారీ కేంద్రంపై నాటుబాంబు విసరడం, ఆఖరికి మీడియా ప్రతినిధులపైనా దాడులకు తెగబడటం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. ఒక బీజేపీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరైంది కాదన్న అభిప్రాయం ఉండటంలో తప్పులేదు. దాన్ని మర్చాల్సిందేనని డిమాండు చేయడమూ సబబే.

కానీ తమకు దర్శనభాగ్యం కలిగించాలని ఆలయం వద్దకు చేరిన మహిళలపై దాడులు చేయడం, అలా వచ్చేవారికి రక్షణ కల్పిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వానిది మహాపరాధమన్నట్టు చిత్రించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేరళలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నా ఆ పనే చేయాలి. మహారాష్ట్రలోని శనిసింగణాపూర్‌ శనీశ్వరాలయం ప్రధాన వేదికపైకి మహిళలను అనుమతించకూడదన్న ఆచారం రాజ్యాంగ విరుద్ధమని నిరుడు బొంబాయి హైకోర్టు తేల్చి చెప్పాక అక్కడున్న బీజేపీ–శివసేన సర్కారు దాన్ని శిరసావహించింది. రాజ్యాంగబద్ధంగా నడుచుకునే ఏ ప్రభుత్వమైనా ఆ పని చేయాల్సిందే. 

స్వామి సన్నిధిలో అమలవుతున్న విధినిషేధాల సారాంశాన్ని గ్రహించకుండా వెలువరించిన తీర్పు వల్ల అక్కడ తీరని అపచారం జరుగుతుందని అయ్యప్పభక్తులు ఆందోళన పడుతున్న మాట వాస్తవం. అదే సమయంలో తాము ఎందుకు అనర్హులమని ప్రశ్నించే మహిళా భక్తులు కూడా అంతటా ఉన్నారు. వారి సంగతలా ఉంచి సీనియర్‌ బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి, కేరళ బీజేపీ ప్రధాన కార్యదర్శి కె. సురేంద్రన్‌ తీర్పు వెలువడిన వెంటనే దాన్ని సమర్థిస్తూ ప్రకటనలు చేశారు. ఆరెస్సెస్‌ సైతం ఆ పనే చేసింది. అయ్యప్ప భక్తుల మనోభావాలను గుర్తించి తమ వైఖరి మార్చుకున్నామని ఆ రెండు సంస్థలూ చెప్పినా సుబ్రహ్మణ్యస్వామి తీర్పును సమర్థిస్తూనే ఉన్నారు.

ఇంతకూ సుప్రీంకోర్టు చెప్పిందేమిటి? శరీర ధర్మాల ఆధారంగా మహిళలను అడ్డుకోవటం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనంలోని మెజారిటీ న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. మరో న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా మాత్రం సెక్యులర్‌ దేశంలో ప్రజలు తమ విశ్వాసాలను అవి హేతుబద్ధమైనవైనా, కాకున్నా ఆచరిస్తారని...వాటిని కోర్టులు ప్రశ్నించజాలవని తీర్పునిచ్చారు. మెజారిటీ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌పై ఈ నెల 22న వాదనలు వింటానని ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పింది. ఆలయంలోకి మహిళలు వస్తే ప్రధాన ద్వారాలు మూసేస్తానని హెచ్చరించిన ఆలయ తంత్రిపై ఆమధ్య దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌నూ, ఇప్పుడు గర్భగుడిని శుద్ధిచేసిన పూజారులపై తీసుకొచ్చిన ధిక్కార పిటిషన్‌నూ అత్యవసరంగా వినేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.  

అయితే ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సరిగా వ్యవహరించలేదనే చెప్పాలి. భక్తుల ప్రతినిధులతో అది చర్చలు జరిపి ఉంటే పరిస్థితి ఇంత ఉద్రిక్తంగా మారేది కాదు. తీర్పు అమలు చేయడం తమ రాజ్యాంగ వి«ధ్యుక్తధర్మమని, ఆ తీర్పుతో విభేదిస్తున్నవారు శాంతియుతంగా ఉద్యమం చేస్తే అభ్యంతరం లేదని వారికి తెలియజేసి ఉండాల్సింది. శనిసింగణాపూర్‌లో సైతం అక్కడి గ్రామస్తులు, ఆలయ ట్రస్టు సభ్యులు మహిళల ప్రవేశం ససేమిరా కుదరదని భీష్మించుకున్నప్పుడు చర్చలే సామరస్య పరిష్కారానికి దోహదపడ్డాయి. ఆ చర్చలకు శ్రీశ్రీ రవిశంకర్‌ మధ్యవర్తిత్వం వహించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఎలాంటి అభిప్రాయమున్నా శబరిమల ఆందోళనలో రాజకీయ జోక్యం తగదని భావిస్తున్న హిందూ మతాచార్యులు అనేకులున్నారు.

భక్తులతో మాట్లాడటానికి వారి సహాయసహకారాలు తీసుకోవాల్సింది. ఏ ఆందోళనైనా హద్దులు దాటనంతవరకూ ఆహ్వానించదగ్గదే. కానీ కేరళలో సాగిన హింస, ముఖ్యంగా అక్కడి బీజేపీ అధికార పత్రికలో ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ పదవినుంచి తప్పుకుని కులవృత్తి చేసుకు బతకాలంటూ వేసిన కార్టూన్‌ ఆందోళనలు హద్దు మీరిన తీరును సూచిస్తున్నాయి. ఇది ఎవరికీ మేలు చేయదు. సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యవహారంలో ఏం చెబుతుందన్న సంగతలా ఉంచి, ఈలోగా చర్చల ప్రక్రియ కొనసాగించటం అవసరం.  

మరిన్ని వార్తలు