హడావుడి ఆర్డినెన్స్‌!

21 Sep, 2018 01:48 IST|Sakshi

తక్షణ తలాక్‌ విధానం ద్వారా విడాకులివ్వడాన్ని నిషేధిస్తూ, దాన్ని నేరపూరిత చర్యగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. తక్షణ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమంటూ నిరుడు ఆగస్టులో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించాక కేంద్రం ఈ విషయంలో పట్టుదలగా వ్యవహరిస్తోంది. నిరుడు డిసెంబర్‌లో కేంద్ర మంత్రివర్గం దీనికి సంబంధించిన బిల్లును ఆమోదించింది. అనంతరం ఆ బిల్లుకు లోక్‌సభ ఆమోదాన్ని పొందింది. ప్రతిపక్షాల ఆధిక్యత ఉన్న రాజ్యసభలో దీనికి అవాంతరాలు ఎదురయ్యాయి. అక్కడా, వెలుపలా వ్యక్తమైన అభిప్రాయాల్లో కొన్నిటికి చోటిచ్చి తాజా ఆర్డినెన్స్‌ రూపొందించారు. దానికి బుధవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెల్పడం, ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం చకచకా పూర్తయ్యాయి.

ఈ దురాచారం ముస్లింలలో ప్రబలంగా లేదు. దాన్ని ఆచరించేవారి సంఖ్య స్వల్పం. అయితే బాధి తుల సంఖ్యతో నిమిత్తం లేకుండా అన్యాయం జరుగుతున్నదనుకుంటే దాన్ని చక్కదిద్దవలసిందే. ఆ విషయంలో రెండో మాటకు తావులేదు. పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలు ఇంకా ఖరారు కాకపోయినా అవి డిసెంబర్‌లో ఉండే అవకాశం ఉంది. ఆ సమావేశాల వరకూ ఆగి బిల్లు ప్రవేశపెడితే... దాని ఆమోదానికి, ఆ తర్వాత చట్టంగా రూపొందడానికి మరో అయిదారు మాసాలు పడుతుంది. కనుక ఆర్డినెన్స్‌ తప్పనిసరైందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్‌ చెబుతున్నారు. దానికి మద్దతుగా కొన్ని గణాంకాలు కూడా ఆయన ఏకరువు పెట్టారు.

నిరుడు జనవరి మొదలుకొని ఈ నెల వరకూ దేశవ్యాప్తంగా 430 తక్షణ తలాక్‌ ఉదంతాలు చోటు చేసుకున్నాయని ఆయన వివరించారు. ఇందులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పునివ్వకముందు 229, ఇచ్చాక 201 జరిగాయి. తక్షణ తలాక్‌ ఆచరణ మన దేశంలో ఎంత స్వల్పమో ఈ లెక్కలే చెబు తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో ముస్లింలు 14.23 శాతం. అంటే దాదాపు 17 కోట్ల 23 లక్షలు.
అయితే గతంలో రాజ్యసభలో ఈ బిల్లుకు ఎదురైన అవాంతరాలకు గల కారణాలనుగానీ, ముస్లిం వర్గాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలనుగానీ తాజా ఆర్డినెన్స్‌ పరిగణనలోకి తీసు కున్నట్టు కనబడదు. కనీసం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే ముందైనా ఆయా వర్గాలతో, మరీ ముఖ్యంగా ముస్లిం మహిళలతో కేంద్రం మరోసారి మాట్లాడితే బాగుండేది.

ఎందుకంటే తక్షణ తలాక్‌ విధానం పోవాలని కోరుకునేవారు సైతం కొన్ని నిబంధనల విషయంలో అభ్యంతరం చెబుతున్నారు. లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లు తక్షణ తలాక్‌ చెప్పటం దానికదే శిక్షార్హమైన నేరంగా పరిగణించి అందుకు మూడేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా విధించవచ్చునని ప్రతిపాదించింది. ఇప్పుడు ఆ నిబంధనను స్వల్పంగా సవరించి భార్య లేదా ఆమె తరఫు రక్త సంబంధీకులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని నిర్దేశించారు. దీన్ని రాజీకి వీలైన నేరంగా కూడా మార్చారు. అంటే ఇరుపక్షాలూ ఏకాభిప్రాయానికొచ్చి కేసును ఉపసంహరించుకోవచ్చు. అలాగే ఇది నాన్‌బెయిలబుల్‌ కేసు అయినా, విచారణ సమయంలో బెయిల్‌ పొందేందుకు వీలు కల్పించారు. గతంతో పోలిస్తే ఇవి మెరుగైన మార్పులే.

అయితే లోగడ బిల్లును వ్యతిరేకించినవారు కోరింది ఇవి మాత్రమే కాదు. అసలు తక్షణ తలాక్‌ చెప్పడాన్ని నేరంగా పరిగణించే విధానమే రద్దు కావాలని వారు డిమాండ్‌ చేశారు. ఇందులో అహేతుకత ఏమీ లేదు. తక్షణ తలాక్‌ చెల్లదని సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే చెప్పింది గనుక లేని హక్కును చలాయించటం భర్తకు అసాధ్యం. ఒకవేళ గెంటేస్తే దాంపత్య హక్కుల్ని పరిరక్షించుకోవటానికి ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చు. తలాక్‌ చట్టవిరుద్ధం గనుక ఆ పెళ్లి రద్దు కాలేదని న్యాయ స్థానం స్పష్టం చేస్తుంది. ఈ విషయంలో భర్త ఆమె హక్కులు కాలరాయాలని చూస్తే గృహహింస చట్టం కింద ఆమె కేసు పెట్టొచ్చు. సుప్రీంకోర్టు సైతం తక్షణ తలాక్‌ చెల్లదని చెప్పింది తప్ప, దాన్ని శిక్షార్హమైన నేరంగా పేర్కొనలేదు.

భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు వచ్చినప్పుడు, అవి తీవ్రరూపం ధరించినప్పుడు విడాకుల వరకూ వెళ్తుంది. అయితే ఇతర మతస్తుల విషయంలో దాన్ని నేరపూరిత చర్యగా పరిగణించనప్పుడు ముస్లింలకు వేరే విధమైన నిబంధన ఎందుకు? ఇది తమ పట్ల చూపిస్తున్న వివక్షలో భాగమని వారనుకునే అవకాశం లేదా? ఆవేశం అవధులు దాటినప్పుడు  భార్య లేదా ఆమె తరఫు బంధువులు కేసు పెట్టి తక్షణ తలాక్‌ చెప్పిన వ్యక్తిని అరెస్టు చేయిస్తే రాజీకి దారులు మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. భర్త నుంచి విడిపోయిన మహిళకు వెనువెంటనే కావాల్సింది భరణం. ఆమె, ఆమెతో ఉండే సంతానం జీవించడానికి అవసరమైన జీవనభృతి జైలు పాలైన భర్త సమకూర్చగలుగుతాడా? అలాంటి సందర్భాల్లో ఆమె మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించవచ్చునని ఆర్డినెన్స్‌ చెబుతోంది. కానీ ఆ జీవనభృతి ఇచ్చేదెవరో, ఎలా లెక్కేస్తారో ఈ ఆర్డినెన్స్‌లో లేదు. 

మారే కాలానికి అనుగుణంగా ఎవరైనా మారక తప్పదు. పౌర హక్కుల భావన లేనికాలంలో మహిళలకు అన్యాయం చేసే పలు సంప్రదాయాలు, విధానాలు అమల్లోకి వచ్చాయి. ప్రపం చంలోని అన్ని మతాల్లోనూ ఈ ధోరణులు కనిపిస్తాయి. ప్రతి మతం లోని పెద్దలూ ఎప్పటికప్పుడు ఈ అంశాలపై దృష్టి పెట్టి కాలం చెల్లిన విధానాలకు స్వస్తి పలకటం అవసరం. అదే సమయంలో ముస్లింల విషయంలో ఏకపక్షంగా, వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ రాకుండా చూసుకోవటం ప్రభుత్వం బాధ్యత. డిసెంబర్‌లోగా జరగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఆదరా బాదరాగా ఆర్డినెన్స్‌ తెచ్చిందని ఇప్పటికే కాంగ్రెస్‌ తదితర పక్షాలు ఆరోపించాయి. ఎవరినీ సంప్రదించకుండా, ఇప్పటికే వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకోకుండానే ఆర్డినెన్స్‌ జారీ చేసి ఆ విమర్శలను కేంద్రం నిజం చేసింది.

మరిన్ని వార్తలు