కటోవీస్‌ మొక్కుబడి!

20 Dec, 2018 00:17 IST|Sakshi

పారిస్‌ వాతావరణ ఒప్పందం అమలుకు అవసరమైన నిబంధనల్ని రూపొందించేందుకు  పోలాండ్‌లోని కటోవీస్‌లో సమావేశమైన ప్రతినిధులు ఎట్టకేలకు ఆ పని పూర్తిచేశారు. పక్షం రోజులు అను కున్న సదస్సు మరో రోజు పొడిగించాల్సివచ్చింది. అయితే రూపొందిన నిబంధనలు సంతృప్తిక రంగా లేవు. నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు అవి ఏమేరకు దోహదపడతాయో సందేహమే. 200 దేశాల నుంచి వచ్చిన 23,000మంది ప్రతినిధులు 2020 నుంచి అమలు కావాల్సిన ఈ నిబంధన లపై చర్చించారు. కటోవీస్‌ సదస్సు సంక్లిష్ట పరిస్థితుల మధ్య జరిగింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పారిస్‌ వాతావరణ ఒప్పందంలో మార్పులు చేయకపోతే దాన్నుంచి వైదొలగుతా మని నిరుడు హెచ్చరించడమేకాక, అమెరికా చాన్నాళ్ల క్రితమే మూతబడిన బొగ్గు ఆధారిత కర్మాగా రాలను తిరిగి పని చేయించడం ప్రారంభించారు. ప్రపంచంలో కర్బన ఉద్గారాలను అధికంగా వదిలే దేశాల్లో చైనా తర్వాత అమెరికా రెండో స్థానంలో ఉంది.

మరోపక్క వచ్చే ఏడాది తమ దేశంలో జరగాల్సిన కాప్‌–25 సదస్సుకు లోగడ ఇచ్చిన అంగీకారాన్ని ఉపసంహరించుకుంటున్నా మని బ్రెజిల్‌ ప్రకటించింది. అంతేకాక పర్యావరణానికి ప్రమాదం ముంచుకొస్తున్నదన్న ప్రచార మంతా పెట్టుబడిదారీ దేశాలను దెబ్బతీయడానికి ‘మార్క్సిస్టులు’ పన్నిన కుట్రగా అభివర్ణించింది. అక్కడ మితవాద పక్ష నాయకుడైన జైర్‌ బోల్సొనారో దేశాధ్యక్షుడిగా గెలిచాక బ్రెజిల్‌ వైఖరి మారింది. చివరకు ఆ సదస్సును చిలీలో జరపాలని నిర్ణయించారు. కర్బన ఉద్గారాలను అధికంగా వదిలే దేశాల జాబితాలో బ్రెజిల్‌ది 11వ స్థానం. దీనికితోడు అక్టోబర్‌లో విడుదలైన ఐక్యరాజ్యస   మితి వాతావరణ నివేదికను తప్పుబడుతూ చమురు ఉత్పత్తి చేసే దేశాలు అమెరికా, రష్యా, సౌదీ అరేబియా, కువైట్‌లు కటోవీస్‌ సదస్సుకు ముందు చేసిన ప్రకటన అందరిలోనూ సందేహాలు రేకె త్తించింది. సదస్సు కర్తవ్యాలను అడ్డుకోవడానికి, వీలైతే నీరుకార్చడానికి ఈ దేశాలన్నీ ప్రయత్ని స్తున్నాయన్న ఆందోళన తలెత్తింది. వీటన్నిటినీ దాటుకుని నిబంధనలు ఖరారయ్యాయి. అయితే ఇవి ఉండాల్సినంత పటిష్టంగా లేవు. నిర్దిష్టమైన అంశాల విషయంలో తప్పించుకునే ధోరణే వ్యక్త మైంది. తాజా నిబంధనలను అనుసరించి ప్రతి దేశమూ తన కర్బన ఉద్గారాలు ఏ స్థాయిలో ఉన్నాయో, వాటిని తగ్గించడానికి తాము చేస్తున్న ప్రయత్నాలేమిటో వివరిస్తూ ప్రతి రెండేళ్లకూ నివే దిక సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమం 2024 నుంచి అమలవుతుంది. 

కర్బన ఉద్గారాల వల్ల ముంచుకొచ్చే ప్రమాదం గురించి ఇప్పుడు దాదాపు అన్ని దేశాల్లో అవగాహన ఉంది. కానీ వాటిని నివారించేందుకు అవసరమైన సాంకేతికతను అమలు చేయడం వాటికి పెద్ద ఇబ్బందిగా ఉంది. ఈ సాంకేతికత అమలుకు కావల్సిన వ్యయం గురించి వర్ధమాన దేశాల్లో ఆందోళన ఉంది. ఆ విషయంలో అందించాల్సిన ఆర్థిక సాయంపై అంగీకారం కుదిరింది. 2020లోగా ఏడాదికి 10,000 కోట్ల డాలర్లను సమీకరించాలని లోగడ పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించా లని నిర్ణయించారు. 2025 నుంచి అమలయ్యే కొత్త లక్ష్యాలను రూపొందించాలన్న అవగాహన కుది రింది. అయితే ఈ నిధుల్ని అన్ని దేశాలూ కాలుష్య నివారణ చర్యలకు వినియోగించేందుకు అవసర మైన ప్రణాళికలు ఖరారు చేసుకోవాలి. ఇప్పుడు కాప్‌–24 సదస్సు జరిగిన పోలాండ్‌ విద్యుదుత్పా దన ప్రాజెక్టుల్లో 80 శాతం బొగ్గు ఆధారితమైనవే. 2030 కల్లా ఉద్గారాల తీవ్రతను దాదాపు 35 శాతం తగ్గించుకుంటామని పారిస్‌ వాతావరణ సదస్సులో దేశాలన్నీ ప్రకటించాయి. అలాగైతేనే పారిశ్రామికీకరణకు ముందునాటి స్థాయికంటే రెండు డిగ్రీల సెల్సియస్‌కి మించి ఉష్ణోగ్రత పెరగ కుండా చూడగలమని ఆ సదస్సు తెలిపింది. అయితే పర్యావరణవేత్తలు మాత్రం ఈ లక్ష్యాలు ఏమాత్రం సరిపోవని చెబుతున్నారు.

నిజానికి 2030నాటికి ఒకటిన్నర డిగ్రీలకు మించి పెరగ కుండా చూస్తేనే జరగబోయే ఉపద్రవాన్ని నివారించగలమని వారు చెబుతున్న మాట. ఆ కోణంలో చూస్తే కటోవీస్‌ సదస్సు మిశ్రమ ఫలితాలు సాధించిందని చెప్పాలి. నిబంధనలు పారదర్శకంగా ఉండాలని సదస్సుకు ముందునుంచీ అందరూ కోరారు. దానికి ఆమోదం లభించింది. అయితే కర్బన ఉద్గారాలకు పరిమితులు విధించేందుకు అవసరమైన యంత్రాంగాల రూపకల్పనకు సంబం ధించిన నిబంధనలపై ఈ సదస్సులో ఏకాభిప్రాయం కుదరలేదు. అది వచ్చే ఏడాది జరిగే చిలీ సద స్సులో పరిశీలించాలని నిర్ణయించారు. సముద్ర మట్టాలు పెరిగితే ప్రమాదంలో చిక్కుకునే ద్వీప కల్ప దేశాల ప్రతినిధులు మాత్రం కర్బన ఉద్గారాల అదుపునకు కఠినమైన నిబంధనలు ఉండాల్సిం దేనని వాదించారు. లక్ష్యాల సాధనలో విఫలమయ్యే దేశాలపై కఠిన చర్యలుండాలని సూచించారు. నిజానికి పారిస్‌ వాతావరణ సదస్సులో నిర్ణయించిన లక్ష్యాలన్నీ ఆయా దేశాలు స్వచ్ఛందంగా ప్రక టించినవే. అటువంటప్పుడు వాటిని సాధించనిపక్షంలో పెనాల్టీలు విధించడానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ పెనాల్టీల బదులు ఆ దేశాలపై ఒత్తిళ్లు తీసుకురావడంతో సరి పెట్టాలని కటోవీస్‌లో నిర్ణయించారు. అసలు దేశాలన్నీ తమ తమ కర్బన ఉద్గారాల స్థాయిపై పార దర్శకంగా వివరాలందిస్తాయా, అలా ఇవ్వకపోతే విధించే పెనాల్టీలేమిటన్న సందేహాలున్నాయి. కానీ సదస్సు ఈ విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదు. అమెరికా అడ్డం తిరగడాన్ని సాకుగా తీసుకుని కొన్ని దేశాలు సదస్సులో స్వరం మార్చాయి.

పర్యావరణానికి కలిగే ముప్పు వల్ల ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొనవలసి వస్తుందో మన దేశంతోసహా అందరికీ ఇప్పుడు అనుభవపూర్వకంగా అర్ధమైంది. కటోవీస్‌ సదస్సుకు ముందు కొన్ని ఆందోళనకర పరిణామాలు ఏర్పడిన మాట వాస్తవమే అయినా మూడేళ్లనాటి పారిస్‌ వాతావ రణ ఒప్పందాన్ని అమలు చేయడం విషయంలో మెజారిటీ దేశాలు గట్టి సంకల్పంతో ఉన్నాయి. అయినప్పటికీ నిబంధనల రూపకల్పనలో ఇది ప్రతిబింబించకపోవడం నిరాశ కలిగిస్తుంది. ముప్పు ముంచుకొస్తున్నదని తెలిసినా ఉదాసీనత ప్రదర్శించడం క్షంతవ్యం కాదు.

మరిన్ని వార్తలు