ముక్తకంఠం 

20 Jun, 2020 00:10 IST|Sakshi

లద్దాఖ్‌లోని గాల్వాన్‌ లోయలో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద మన భూభాగంలోకి చొచ్చుకొచ్చి 20మంది జవాన్ల ఉసురు తీసిన చైనా కుతంత్రంపై శుక్రవారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సంక్షోభాలు తలెత్తినప్పుడు, ఇరుగు పొరుగు దేశాలతో సమస్యలెదురైన ప్పుడు అఖిల పక్ష సమావేశాలు నిర్వహించడం, అందరి అభిప్రాయాలూ తీసుకోవడం మన దేశంలో రివాజు. అందులో వ్యక్తమయ్యే విలువైన సూచనల్ని స్వీకరించడం, వాస్తవ పరిస్థితిపై అందరికీ అవగాహన కలిగించడం ప్రభుత్వం చేసే పని. ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా అన్ని పక్షాలకూ ప్రజల్లో అంతో ఇంతో పలుకుబడి వుంటుంది. అందువల్ల ఆ పార్టీలకు సమస్య పూర్వాపరాలు వివరించి, ఆ సమస్య పరిష్కారానికి అనుసరిస్తున్న విధానాలను, వాటి వెనకున్న కారణాలను తెలియజెప్పడం...వారి మనోగతాన్ని తెలుసుకోవడం, సందేహాలను తీర్చడం అఖిల పక్ష సమావేశాల నిర్వహణ వెనకుండే ఆంతర్యం.

తమ నిర్ణయానికి అనుగుణంగా అందరినీ కూడ గట్టడం కోసం చేసే ప్రయత్నమిది. ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఏకపక్షంగా కాకుండా, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నదన్న అభిప్రాయం ప్రజానీకంలో కలగడానికి, సమష్టి భావనకు ఇవి దోహదపడతాయి. ముఖ్యంగా పొరుగు దేశాలతో సంబంధాలు క్షీణించినప్పుడు, అవి సైనిక ఘర్షణకు దారితీసే పరిస్థితులున్నప్పుడు అఖిల పక్ష సమావేశాలు జాతీయంగానే కాదు... అంతర్జాతీయ కోణంలో కూడా చాలా అవసరం. తాము నిర్ణయాత్మకంగా వ్యవహరిం చబోతున్నామన్న స్పష్టమైన సందేశం ఘర్షణ పడే పొరుగు దేశానికి పంపడం ముఖ్యం. అఖిలపక్ష సమావేశంలో వ్యక్తమయ్యే అభిప్రాయాలు సమస్య తీవ్రతను ప్రపంచానికి చాటుతాయి. అవి నైతిక మద్దతిచ్చేందుకు దోహదపడతాయి.     

కల్నల్‌ సంతోష్‌ బాబుతో సహా 20మంది జవాన్లను అయిదు రోజులక్రితం చైనా సైనికులు అత్యంత దారుణంగా రాళ్లతో, ఇనుప రాడ్లతో కొట్టి చంపారు. మరో పది మంది జవాన్లను అపహ రించుకుపోయారు. చర్చల తర్వాత విడుదల చేశారు. ఎప్పటినుంచో మన అధీనంలోవుంటున్న గాల్వాన్‌ లోయ నుంచి వెనక్కు వెళ్లాలని, ఈ విషయంలో అంతక్రితం కుదిరిన ఉమ్మడి అవ గాహనను గౌరవించాలని కోరినందుకు వారు విరుచుకుపడ్డారు. సరిహద్దుల్లో సైనిక ఘర్షణలెలా వుంటాయో మన సినిమాల్లో చూపిస్తుంటారు. ఆ దృశ్యాలను చూడటానికి అలవాటుపడినవారికి చైనా సైనికులతో జరిగిన ఘర్షణలుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో వున్న దృశ్యాలు చూసిన ప్పుడు సహజంగానే ఆశ్చర్యం కలిగింది. అత్యాధునిక ఆయుధాల వినియోగం, పరస్పరం కాల్పులు, అందుకోసం పొజిషన్లు తీసుకోవడం వంటివిలేవు. ఒకరినొకరు తోసుకోవడం, ఆగ్రహంతో ఊగి పోతూ మాట్లాడటం కనబడింది. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకి కూడా ఇలాంటి సందేహమే కలిగింది. చైనా సైనికులతో సమావేశానికెళ్లే మన జవాన్లు నిరాయుధంగా ఎందుకెళ్లవలసి వచ్చిందని ప్రశ్నించారు. అందుకు 1996, 2005 సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్యా కుదిరిన ఒప్పందాలు కారణమన్నది విదేశాంగమంత్రి జైశంకర్‌ జవాబు.

వాటి ప్రకారం ఎల్‌ఏసీకి రెండు కిలోమీటర్ల లోపులో కాల్పులు జరపకూడదని, పేలుడు పదార్ధాలు, ప్రమాదకరమైన రసాయనాలు వినియోగిం చకూడదన్నవి షరతులు. ఉపయోగించాల్సిన పరిస్థితి వుంటే అయిదు రోజుల ముందు చెప్పాలని కూడా ఆ ఒప్పందాల్లో వుంది.  భవిష్యత్తులో అనుకోనివిధంగా సరిహద్దులు ఉద్రిక్తంగా మారిన ప్పుడు మారణాయుధాలు, బాంబులు వినియోగిస్తే ఇరువైపులా ప్రాణనష్టంతో పరిస్థితి చేయిదాటి పోతుందని, పరిష్కారం జటిలమవుతుందని భావించబట్టే ఇవి ఉనికిలోకి వచ్చాయని ఎవరికైనా అర్ధమవుతుంది. కానీ చైనాకు ఇదంతా పట్టలేదు. మారణాయుధాలు వినియోగించకూడదు కాబట్టి కర్రలతో, ఇనుపరాడ్లతో, రాళ్లతో ఏమైనా చేయొచ్చని అది భావించినట్టుంది. ఇలాంటి కుతంత్రాన్నే మన జవాన్లు కూడా అనుసరిస్తే పరిస్థితి వేరుగా వుండేది. కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవిం చడం, వాటికి కట్టుబడటం ఏ దేశానికైనా గౌరవప్రతిష్టలు తెస్తుందే తప్ప వాటిని మసకబార్చదు. సమస్య పరిష్కారానికి వివిధ ప్రత్యామ్నాయాలున్నాయి. స్థానికంగా సైన్యంలోని బ్రిగేడ్‌ కమాండర్‌ స్థాయి అధికారులు మొదలుకొని దౌత్యపరమైన మార్గాల వరకూ అనేకం వున్నాయి.

అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నవారంతా కేంద్రం తీసుకోబోయే ఎలాంటి చర్యలకైనా సంపూర్ణ మద్దతునిస్తామని చెబుతూనే  దౌత్యపరంగా, వాణిజ్యపరంగా అన్ని రకాల ప్రయత్నాలూ చేయాలని సూచించడం హర్షించదగ్గది. చైనా దురాగతానికి దేశమంతటా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతు న్నాయి. అయితే యుద్ధమే అన్నిటికీ పరిష్కారమనే వైఖరి ఎప్పుడూ మంచిది కాదు. గాల్వాన్‌ లోయ వద్ద ఇప్పుడు జరిగిన పరిణామాల్లో అంతర్జాతీయంగా ప్రతిష్ట కోల్పోయింది చైనాయే. ఎల్‌ఏసీ పొడవునా వున్న దాదాపు 23 సమస్యాత్మక ప్రాంతాల్లో గాల్వాన్‌ ఎప్పుడూ లేదని ప్రపంచ దేశాలు గుర్తించాయి. చైనా ఎత్తుగడల్లోని ఆంతర్యాన్ని గ్రహించాయి. ఈ సమయంలో దౌత్యపరంగా ఒత్తిళ్లు తీసుకురావడం అవసరం.

అలాగే సరిహద్దుల్లో నిఘా పెంచడం కూడా కీలకం. మన జవాన్లతో చైనా సైనికులు తగాదాకు దిగే సమయానికి సంఖ్యాపరంగా వారు తక్కువుండటం...తోపులాటలతో, వాగ్వాదాలతో కాలక్షేపం చేసి, తమవారిని సమీకరించుకున్నాక దాడికి దిగడం వారి కుటిలత్వానికి అద్దం పడుతుంది. గాల్వాన్‌లో చైనా సైనికుల కదలికలు గురించి నెల్లాళ్లుగా స్థానికులు చెబుతున్నా ఆ సమాచారం మన సైన్యానికి లేదన్న విమర్శలున్నాయి. ఈ ఘర్షణల సమయంలోనూ అంతే. వెనకనుంచి వారికి మద్దతుగా మరిన్ని బలగాలు వస్తున్నాయన్న సమాచారం లేదు. ఇలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. సరైన సమయంలో అప్రమత్తమయ్యే స్థితివున్నప్పుడు ప్రత్యర్థిపక్షం ఆటలు సాగవు.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా