అడవెందుకు అంటుకోదు?

31 Aug, 2019 01:17 IST|Sakshi

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుంది బ్రెజిల్‌ ప్రభుత్వ నిర్వాకం. అమెజాన్‌ అటవీ కార్చిచ్చును ఆర్పే చర్యల్ని జాప్యం చేసింది. ఇప్పుడిక దిద్దుబాటు చర్యలూ మొదలెట్టింది. హెలికాప్టర్లు, విమా నాల ద్వారా నీరు చిమ్మి మంటలనార్పే పనులొక వంక జరుగుతుంటే, దేశంలో దహనాలపై నిషేధం అమల్లోకి తెచ్చారు. ఎటువంటి దహనాలూ చేపట్టకుండా దేశమంతటా అరవై రోజుల నిషే«ధం విధించారు. ఆరంభంలో బొల్సనారో ప్రభుత్వ నిర్లక్ష్యం, మరో వంక అంతర్జాతీయ సమాజం ఆదుర్దా వ్యక్తం చేయడంలోని వైరుధ్యత సమస్య తీవ్రత మూలాలను పట్టిస్తోంది. బ్రెజిల్‌లో అంతర్గతంగా నెలకొన్ని ఇలాంటి ఇంకొన్ని పరస్పర విరుద్ధ పరిస్థితులే సమస్యను జఠిలం చేశాయి. 

అమెజాన్‌ అడవుల్లో కార్చిచ్చు కొత్త కాదు. కానీ, ఇప్పుడు జరుగుతున్న ప్రమాద తీవ్రత, దానిపై ఏ మాత్రం శ్రద్ధపెట్టని ప్రభుత్వ నిర్లక్ష్యపు వైఖరే కొత్త! నిరుడు ఇదే కాలంలో జరిగిన మంటలతో పోల్చి చూస్తే, ఈ సారి 84 శాతం ఎక్కువ (76వేల ఘటనలు) చోటు చేసు కోవడం విశ్వసమాజాన్ని విస్మయపరిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద సతతహరితారణ్యమైన అమె జాన్‌ మంచి–చెడులు ఒక్క బ్రెజిల్‌ దేశ పాలకుల ఆలోచనలపై ఆధారపడాలా? జీవరాశి ఉన్న ఏకైక గ్రహం భూమి ఆవరణంలోకి 12 నుంచి 18 శాతం ఆక్సిజన్‌ను వదిలే గొప్ప అడవి మనుగడ ఒక దేశాధ్యక్షుని ఇష్టాయిష్టాల ప్రకారం సాగాలా? ఇక పర్యావరణ పరిరక్షణ కోసం జరిపే విశ్వసద స్సులు, ఐక్యరాజ్య సమితి(యుఎన్‌) చొరవ, అంతర్జాతీయ ఒప్పందాలకు అర్థమేముంది? కార్చిచ్చు తీవ్రత నేపథ్యంలో... ఈ ప్రశ్నలు తలెత్తాక, బ్రెజిల్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిళ్లు పెరిగాయి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియల్‌ మాక్రాన్‌–బ్రెజిల్‌ అధినేత బొల్సనారోల మధ్య మాటల యుద్ధం పరిస్థితిని మరింత దిగజార్చింది. మాట పట్టింపులకుపోయి, విపత్తు సహాయాన్ని బ్రెజిల్‌ అధినేత నిరాకరించాక వ్యతిరేకత ఎదురైంది. 

ప్రపంచ వ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు, హెచ్చరికలు, బెదిరింపులూ పెరగడంతో... బ్రెజిల్‌ వాణిజ్యంపైన, ఆర్థిక పరిస్థితిపైనా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదాన్ని శంకించిన ప్రభుత్వపెద్దల ఆలోచనల్లో మార్పు వచ్చింది. మంటలు కొనసాగడం, అదుపులోకి రావడాన్ని బట్టి అంతర్జాతీయంగా రాగల పరిణామాలుంటాయనేది అంచనా. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, ఐరోపా సంఘం (ఈయూ) దక్షిణ అమెరికా మధ్య, ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని సమర్థించేది లేదని ఈయూ దేశాలైన ఫ్రాన్స్, ఐర్లాండ్‌ ఇప్పటికే ప్రకటించాయి. బ్రెజిల్‌ నుంచి తోలు ఉత్పత్తుల కొనుగోళ్లని 18 అంతర్జాతీయ ఫ్యాషన్‌ బ్రాండ్లు నిలిపివేశాయి. బ్రెజిల్‌ నుంచి మాంస దిగుమతులపై ఆంక్షల గురించిన ఆలోచనలిప్పుడు సాగుతున్నాయి. ఇదే జరిగితే బ్రెజిల్‌ ఆర్థిక పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకే!

తెలుగునాట ఆగస్టునెల ప్రకృతి–రాజకీయ పెనుతుఫాన్లకు నెలవు అని ప్రచారం. బ్రెజిల్‌ లోనూ ఆగస్టు నెల రాజకీయ సంక్షోభాలకు ప్రతీతి! తాను ఈసడించిన ఒక పర్యావరణ అంశం ఇలా తన ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సంక్షోభంలోకి నెడుతుందని బొల్సనారో భావించి ఉండరు. నిజానికి ప్రస్తుత కార్చిచ్చు సమస్య ప్రభుత్వ వి«ధానాల కన్నా, నిర్వహణా సామర్థ్యం కన్నా బ్రెజిల్‌ పాలకుల ఆలోచనా పెడధోరణికి ప్రతిబింబం. అధ్యక్షుడు బొల్సనారో, ఆయన సర్కారు ముఖ్యులు, వారు ప్రోత్సహిస్తున్న లాబీయిస్టులు, అమెజాన్‌పై కన్నేసిన అమెరికా కార్పొరేట్‌ శక్తులు.. అందరిదీ ఒకే ధోరణి. అమెజాన్‌ అడవిని మరింత నరకాలి. మైనింగ్‌–సాగు పెంచి బ్రెజిల్‌ ఆర్థికపరిస్థితి ఉద్ధరించామనిపించుకోవాలి. అడవిని పలుచన చేసి పశుసంపద విస్తరించాలి. లాభా లార్జించి సొంతఆస్తులు గడించాలి. ఇందుకు ఆదిమజాతుల్ని అడవినుంచి తరిమేయాలి, తగలే యాలి. 

ఖాండవదహనాలు మరిన్ని జరిపిస్తే... అది రావణకాష్టంలా రగులుతూ ఉండాలి! ఎవ రైనా, అదేమని ప్రశ్నిస్తే.... ‘ఏం అమెజాన్‌లో మంటలు కొత్తా?’ అని ఎదురు ప్రశ్నలు. అసలు భూతాపోన్నతి, వాతావరణమార్పు అన్నదే కట్టుకథ అని ఖండించిన ఘనాపాఠీలు వీరు! అందుకే అటవీమంటల్ని నియంత్రించే వ్యవస్థ బడ్జెట్‌ నిధుల్ని సగానికి తగ్గించారు. పర్యావరణ పరిరక్షణ, అటవిని కాపాడ్డం, మంటల నియంత్రణ... అంటేనే ఎగతాళి చేశారు. గత జనవరిలో బొల్సనారో సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాందోళనల్ని తొక్కిపెట్టారు. పెద్ద సంఖ్యలో విద్యా ర్థులు, శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, కళాకారులు, కార్యకర్తలపై అణచివేత పెంచారు. అంతర్జాతీయ సమాజం మాటలతో ఆర్తిచూపడం కాకుండా ఆర్థికతోడ్పాటు, సహాయక చర్య లతో అడవిని ఆదుకోవాలి. 

అమెజాన్‌ హరితారణ్య పరిరక్షణకు నడుం కట్టాలి. చొరవతో యూఎన్‌ ఈ ప్రక్రియను సమైక్యపరచాలి. ఇది సాధారణ సమస్య కాదు. వేల చదరపు కిలోమీటర్ల మేర అడవి దహించుకుపోతోంది. అరుదైన తెగల అడవిబిడ్డలు అసువులు బాస్తున్నారు. కొన్ని వందల జీవ జాతులు అగ్నికి ఆహుతౌతున్నాయి. ఇప్పటికే ముప్పిరిగొన్న ‘వాతావరణ మార్పు’ ‘అటవీ కార్చిచ్చు’ అత్యంత ప్రమాదకర జోడీ! ఇది వర్షపాతాన్ని తగ్గించి, పొడి వాతావరణాన్ని తద్వారా అటవీమంటల్ని పెంచుతుంది. పెద్ద చెట్లు కాలి, నేలకు కూలుతూ చేసే ఖాళీలతో సూర్యరశ్మి నేలను తాకుతుంది. అది చిత్తడినేల పొరను, ఆకులు–అలముల్ని ఎండగొట్టి రాచ్చిచ్చును ఇంకా పెంచు తుంది. ఇదొక విషవలయమై అడవిని కబళిస్తుంది. 

భస్మమయ్యే ఎకోసిస్టమ్‌ పునరుద్ధరణ జరగా లంటే, అన్నీ సానుకూలించినా వంద నుంచి రెండొందల ఏళ్లు పట్టొచ్చని శాస్త్రవేత్తలంటున్నారు. వేల ఏళ్లుగా చిక్కటి అమెజాన్‌ అడవిలో జీవస్తున్న అటవీతెగ బిడ్డల్లో వంశానుగతంగా వస్తున్న ఓ నమ్మకం ఉంది. ‘అడవెందుకు అంటుకోదు?’ అంటే, ‘మన చెడు మాటలు, తప్పుడు చేష్టలు, నేరాలు... అడివికి అగ్గి అంటిస్తాయి. మనం అవి చేయం కనుక అడవి అంటుకోదు, అదే మనకు రక్ష!’ అన్నది అడవిబిడ్డల గట్టి నమ్మకం. ఇది పాలకులు గ్రహిస్తే మేలు!

మరిన్ని వార్తలు