సుంకాల బాదుడు

6 Mar, 2019 03:03 IST|Sakshi

దాదాపు ఏడాదిన్నర నుంచి భారత్‌–అమెరికాల మధ్య సాగుతున్న సుంకాల వివాదంలో మంగళ వారం కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 50 ఏళ్లుగా మన దేశానికి సాధారణ ప్రాధాన్య తల వ్యవస్థ(జీఎస్‌పీ)కింద కల్పిస్తున్న వెసులుబాట్లను రద్దు చేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రతినిధుల సభకు లేఖ రాశారు. తన మార్కెట్లలో అమెరికాకు సమానమైన, సహేతుకమైన ప్రాధాన్యతనివ్వడానికి భారత్‌ ముందుకు రాకపోవడం వల్ల ఈ చర్య తీసుకోవాలని ట్రంప్‌ కోరారు. కానీ మన దేశం వాదన వేరేలా ఉంది. మనం విధిస్తున్న దిగుమతి సుంకాలు ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలకు లోబడే ఉన్నాయని చెబుతున్నది.

వాస్తవానికి ఈ విషయంలో తనకేమైనా ఫిర్యాదులుంటే అమెరికా డబ్యూటీఓలో తేల్చుకోవాలి. కానీ అక్కడికెళ్తే తమ వాదన వీగిపోతుందన్న భయంతో కావొచ్చు... అమెరికా ఇలా సొంత నిర్ణయాలు తీసుకుం టోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జరిగినప్పుడే ప్రపంచ దేశాల చేతుల్లో అమెరికా ఎలా మోసపోతున్నదో, ఎంత నష్టపోతున్నదో ట్రంప్‌ ఏకరువు పెట్టేవారు. తాను అధ్యక్ష పీఠం అధిష్టిం చిన వెంటనే దీన్నంతటినీ సరిచేస్తానని చెప్పేవారు. ఏడాదిన్నరగా ట్రంప్‌ ఈ సుంకాల రణం తీవ్రతను పెంచారు. నిరుడు చైనాపైనా, 28 సభ్య దేశాలున్న యూరప్‌ యూనియన్‌(ఈయూ) పైనా ట్రంప్‌ అదనపు సుంకాలు విధించగా... దానికి ప్రతీకారంగా అటు చైనా, ఇటు  ఈయూ కూడా అమెరికాకు అదే భాషలో జవాబిచ్చాయి.

నిరుడు జూన్‌లో మనం ఎగుమతి చేసే ఉక్కుపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం చొప్పున అమెరికా సుంకాలు పెంచిన ప్పుడు...ఆ వెంటనే మన దేశం కూడా అమెరికా నుంచి వచ్చే పప్పులు, ఇనుము, ఉక్కు, యాపిల్స్‌ తదితర 29 ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచుతామని ప్రకటించింది. కానీ అలా ప్రకటించ డమే తప్ప మన దేశం ఇంతవరకూ ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదు. సుంకాలు పెంచే నోటిఫికే షన్‌ అమలును తరచు వాయిదా వేస్తూ పోతోంది. గత నెలాఖరునే ఈ నిర్ణయం మరోసారి వాయిదా పడింది. అయినా అమెరికా ఎక్కడా సంతృప్తి పడింది లేదు. మన ఉక్కు, అల్యూమి నియం ఉత్పత్తులపై ఆ దేశం పెంచిన సుంకాల అమలు అప్పట్లోనే మొదలైంది. ఇప్పుడు తాజా ప్రతిపాదన సైతం రేపో మాపో అమల్లోకి రావడం ఖాయం. స్వేచ్ఛా వాణిజ్యం పేరిట, ప్రపంచీ కరణ పేరిట ప్రపంచ దేశాలను నయానా భయానా లొంగదీసుకున్న అమెరికా నుంచి ఇలాంటి పరిణామాలను ఎవరూ ఊహించరు. కానీ డోనాల్డ్‌ ట్రంప్‌ వచ్చాక ఇది రివాజుగా మారిపోయింది. 

ఇప్పుడు జీఎస్‌పీ కింద భారత్‌కు కల్పిస్తున్న వెసులుబాట్లు రద్దు చేయాలన్న ట్రంప్‌ సూచన అమల్లోకొస్తే మన దేశం నుంచి అక్కడి మార్కెట్‌కు ఎగుమతయ్యే దుస్తులు, యంత్ర పరికరాలు, ఇతర వస్తువులు వేరే దేశాల ఉత్పత్తుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొనవలసి ఉంటుంది. మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే సరుకుల్లో దాదాపు 12 శాతం ఈ జీఎస్‌పీ కిందికి వస్తాయి. ఇది దాదాపు 560 కోట్ల డాలర్లు ఉండొచ్చునని అమెరికా అంచనా వేస్తుంటే...మన అధికారులు మాత్రం 19 కోట్ల డాలర్లు మించదని చెబుతున్నారు. మన దేశానికి నష్టం కలిగించి దారికి తెచ్చుకోవడమే ట్రంప్‌ నిర్ణయాల సారాంశం గనుక ఇవి ఇంతటితో ఆగవు. అనుకున్న స్థాయిలో భారత్‌కు నష్టం చేకూర్చలేకపోతున్నామనుకుంటే వాటిని మరింత పెంచడానికి ట్రంప్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక వాణిజ్య లోటు 2,000 కోట్ల డాలర్లు ఉందని ఆయన ఎప్ప టినుంచో చెబుతున్నారు. దీన్ని గణనీయంగా తగ్గించడమే ధ్యేయమంటున్నారు. ఆయన తాజా నిర్ణయం వెనక అమెరికాకు చెందిన రెండు లాబీలు గట్టిగా పనిచేశాయని కథనాలు వినిపిస్తు న్నాయి. వైద్య పరికరాల పరిశ్రమ, పాడి ఉత్పత్తుల సంఘాలు మన దేశంపై చేస్తున్న ఫిర్యాదుల ఫలితంగానే ట్రంప్‌ భారత్‌పై తరచు కారాలు మిరియాలూ నూరుతున్నారు. గుండె రక్త నాళాల్లో ఏర్పడే అవరోధాలకు వాడే స్టెంట్లు, మోకాళ్లలో వాడే ఇంప్లాంట్స్‌ వగైరాల ధరల్ని గణనీయంగా తగ్గించడం అమెరికా వైద్య పరికరాల పరిశ్రమలకు కంటగింపుగా ఉంది. పశువులకు దాణా బదులు మాంసాహారాన్ని అందించి రాబట్టే పాడి ఉత్పత్తుల్ని అనుమతించకూడదని పదేళ్లనాడు మన దేశం విధించిన నిబంధన పాడి పరిశ్రమకు ఆగ్రహం కలిగిస్తోంది.

ఈ రెండింటి విషయంలో సడ లింపులు ఇవ్వడానికి మన దేశం నిరాకరించడంతోపాటు అమెజాన్, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌ తదితర సంస్థల్ని ప్రభావితం చేసే ఈ–కామర్స్‌ కొత్త నిబంధనలు అమెరికాకు నచ్చడం లేదు. అలాగే మాస్టర్‌కార్డ్, వీసా తదితర సంస్థలు తమ డేటా సర్వర్‌లను భారత్‌కు తరలించాలని మన ప్రభుత్వం కోరడం ఆ దేశానికి ఆగ్రహం తెప్పిస్తోంది. వెరసి ఇవన్నీ ట్రంప్‌ తాజా ప్రతిపాదనలకు దారితీశాయి. అయితే ఏ దేశమైనా తనకు అనువైన, లాభదాయకమైన వాణిజ్య విధానాలు రూపొం దించుకుంటుంది. వాటిపై అభ్యంతరాలుంటే తగిన వేదికలపై ఫిర్యాదు చేయాలి తప్ప ఇష్టాను సారం వ్యవహరిస్తానంటే చెల్లదు. 90వ దశకానికి ముందు మన సుంకాలు బాగా అధికంగా ఉండేవి.

అయితే ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక అవి క్రమేపీ తగ్గడం మొదలుపెట్టాయి. 1991–92లో వ్యవసాయేతర ఉత్పత్తులపై అత్యధికంగా 150 శాతంమేర సుంకాలుంటే... అవి 1997–98నాటికి 40 శాతానికి పడిపోయాయి. 2004–05 నాటికి 20 శాతానికి వచ్చాయి. ఆ తర్వాత మరో మూడేళ్లకు 10 శాతానికి చేరుకున్నాయి. వాస్తవానికి డబ్ల్యూటీఓ గణాంకాలనుబట్టి మన సగటు సుంకం 13శాతం మించడం లేదు. అమెరికా ప్రారంభించిన ఈ సుంకాల రణం అనూహ్య పరిణామాలకు దారితీస్తుంది. ప్రభావిత దేశాలు తమ వంతుగా ప్రతీకార చర్యలకు దిగితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుంది. కనుక ట్రంప్‌ విజ్ఞతతో మెలగి సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి.

మరిన్ని వార్తలు