విస్తరించిన హరితావరణం

10 Jan, 2020 00:04 IST|Sakshi

దేశంలో అటవీ ఆచ్ఛాదన నానాటికీ తగ్గిపోతున్నదని, పర్యావరణం ప్రమాదంలో పడుతున్నదని ఆందోళన పడేవారికి కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ఈమధ్య విడుదల చేసిన నివేదిక ఊరటనిస్తుంది. ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌(ఐఎస్‌ఎఫ్‌ఆర్, 2019) పేరిట విడుదల చేసిన ఆ నివేదిక ప్రకారం 2017తో పోలిస్తే 5,188 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. అంతేకాదు... దేశంలో దాదాపు నాలుగోవంతు భూభాగం... అంటే 25 శాతం అడవులతో, వృక్షాలతో నిండివుంది. అభివృద్ధి పేరుతో, ప్రాజెక్టుల పేరుతో అటవీ భూముల్ని తెగనరకడానికి ఉదారంగా అనుమతులిచ్చే దేశంలో ఇలా అటవీ శాతం పెరగడం చల్లని కబురే. మూడేళ్లక్రితం దేశంలో అడవులు, వృక్షాలు 8,02,088 చదరపు కిలోమీటర్లుంటే అవి ఇప్పుడు 8,07,276 చదరపు కిలోమీటర్ల మేరకు పెరిగా యన్నది నివేదిక సారాంశం. అయితే పర్యావరణ పరంగా భద్రంగా వుండాలంటే ఈ పెరుగుదల ఏమాత్రం సరిపోదు.

పర్యావరణంపై 2015లో కుదిరిన అంతర్జాతీయ ఒడంబడిక కింద 2030నాటికి మనం 2.5 బిలియన్‌ టన్నులనుంచి 3 బిలియన్‌ టన్నుల మేర కార్బన్‌ డైఆక్సైడ్‌ ను వాతావరణం నుంచి పారదోలేలా వృక్షాలను పెంచాల్సివుంటుంది. ఆ లెక్కన దేశ భూభాగంలో 33 శాతం మేర అడవులు, వృక్షాలు ఉండాలి. 1952, 1988నాటి జాతీయ అటవీ విధానాలు దాన్నే సంకల్పంగా చెప్పుకున్నాయి. కానీ ఆ విషయంలో పదే పదే విఫలమవుతున్నామని ఏటా విడుదలవుతున్న అటవీ నివేదికలు చెబుతున్నాయి. యూపీఏ హయాంలో వివిధ ప్రాజెక్టుల కోసం 2.40 లక్షల హెక్టార్లలో వున్న అడవుల్ని తొలగించడానికి అనుమతులిచ్చింది. ఎన్‌డీఏ హయాంలో 2015–18 మధ్య గనులు, బొగ్గు, విద్యుత్‌ ప్రాజెక్టులు, రోడ్డు, రైల్వేలు, నీటిపారుదల ప్రాజెక్టులు వగైరాల కోసం 20,000 హెక్టార్ల అటవీ భూమిని వినియోగించడానికి అనుమతులు మంజూరయ్యాయని కేంద్రం 2018 డిసెంబర్‌లో పార్లమెంటులో తెలిపింది. 2006లో వచ్చిన అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీల అభిప్రాయాలు, గ్రామసభల అభిప్రాయాలూ పరిగణనలోకి తీసుకోకుండా కార్పొరేట్‌ సంస్థలకూ, ఆనకట్టల నిర్మాణానికి అటవీ భూముల్ని అప్పగించకూడదు. కానీ ప్రభుత్వాలేవీ ఈ నిబంధనల్ని సక్రమంగా పాటించడం లేదని ల్యాండ్‌కాన్‌ఫ్లిక్ట్‌ వాచ్‌ సంస్థ లోగడ ఆరోపించింది. ఇప్పుడు ఏదోమేర అటవీ విస్తీర్ణం పెరగడం సంతోషించదగ్గదే అయినా ఉదార అనుమతులు ఇవ్వడాన్ని బాగా తగ్గించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

తాజా నివేదిక ప్రకారం దట్టమైన అటవీ భూములున్న రాష్ట్రాల్లో– మధ్యప్రదేశ్‌(77,482చదరపు కిలోమీటర్లు), అరుణాచల్‌ప్రదేశ్‌(66,688చ.కి.మీ.) ఛత్తీస్‌గఢ్‌(55,611చ.కి.మీ)లు మొదటి మూడు స్థానాల్లో వున్నాయి. ఆ తర్వాత ఒడిశా 51,619చ.కి.మీ.తో, మహారాష్ట్ర 50,778చ.కి.మీ.తో తర్వాతి స్థానాల్లోవున్నాయి. అడవుల్ని విస్తరించిన రాష్ట్రాల్లో తొలి స్థానం కర్ణాటకది. అది 1,025చ.కి.మీ. మేర పెంచగలిగింది. ఆంధ్రప్రదేశ్‌ 990 చ.కి.మీ.లతో రెండో స్థానంలోవుంది. కేరళ(823), జమ్మూ– కశ్మీర్‌(371), హిమాచల్‌ ప్రదేశ్‌ (334)తదనంతర స్థానాల్లోవున్నాయి. ఇప్పుడున్న చట్టాల్లో ఎక్కడా అడవికి సరైన, సమగ్రమైన నిర్వచనం లేదు. అడవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడేది. అందులో వుండేది ఆదివాసీలు మాత్రమే కాదు... వైవిధ్యభరితమైన వృక్షజాతులుంటాయి. జంతుజాలంవుంటుంది. అడవుల్ని నరికినప్పుడు ఏదోమేరకు ఆదివాసీలకు పునరావాసం కల్పిస్తున్నామని ప్రభుత్వాలు వాది స్తున్నా, అందులోని అరుదైన వృక్ష, జంతుజాలాల పరిస్థితేమిటన్నది పట్టించుకోవడం లేదు. ప్రభు త్వాలు చట్టాల్ని ఉల్లంఘించి అనుమతులిచ్చి అడవుల ధ్వంసానికి కారణమవుతుంటే అత్యంత విలు వైన ఎర్రచందనం, టేకు వగైరాలను దోచుకుపోతున్న దొంగలు చేసే నష్టం కూడా తక్కువేమీ కాదు.

జనాభా పెరుగుతుండటం వల్ల అడవులపై ప్రభావం పడుతున్నదని తాజా నివేదిక చెబుతున్న మాట వాస్తవమే. దాని ప్రకారం దేశంలోని 6,50,000 గ్రామాల్లో 1,70,000 గ్రామాలు అడవులకు సమీ పంలో వున్నాయని, ఇక్కడి జనాభా వంటచెరుకు, పశుమేత, ఆవాసాల నిర్మాణం వగైరాల కోసం అడవులపైనే ఆధారపడుతున్నదని నివేదిక తెలిపింది. అయితే ప్రభుత్వాల వల్ల, అటవీ దొంగల వల్ల అడవులకు కలిగే నష్టంతో పోలిస్తే అత్యంత స్వల్పం. దీనికి సంబంధించిన లెక్కలు కూడా తీస్తే ఆ విషయం ధ్రువపడుతుంది. అడవుల్ని ప్రాణప్రదంగా చూసుకునే దేశాలున్నాయి. అలాగే అటవీ భూముల్ని కోల్పోయిన పర్యవసానంగా కష్టాలెదుర్కొని, తమను తాము సరిదిద్దుకుని వాటి పునరు ద్ధరణను ఒక యజ్ఞంగా భావించి విజయం సాధించినవి ఉన్నాయి. అవన్నీ మనకు పాఠం నేర్పాలి.  

ప్రపంచంలోని కాలుష్య నగరాల్లో సగం మన దేశంలోనేవున్నాయి. ఏటా వేల సంఖ్యలో చెట్లు నరికేస్తుండటం వల్ల హరితావరణం నాశనమవుతోంది. ఇది చివరకు ప్రకృతి వైపరీత్యాలకు కారణ మవుతోంది. అకాల వర్షాలు, కరువుకాటకాలు తప్పడం లేదు. రాగల 25 సంవత్సరాల్లో మార్గ దర్శకంగా వుండటం కోసమని  కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లక్రితం జాతీయ అటవీ విధానాన్ని రూపొందించే పని ప్రారంభించింది. 2018లో ఆ విధానం ముసాయిదా విడుదల చేసి దానిపై అందరి అభిప్రాయాలు చెప్పాలని కోరింది. అయితే పర్యావరణవేత్తలు, సామాజిక ఉద్యమకారులు, గిరిజన సంఘాల నేతలు ఆ విధానం లోపభూయిష్టంగా ఉన్నదని విమర్శించాయి.

దాంతో కేంద్రం దాన్ని ముందుకు తీసుకుపోలేదు. కొత్త అటవీ విధానం కోసం నిర్దిష్టమైన కాలపరిమితిని విధించ లేదని, ఇప్పటికీ 1988నాటి విధానమే అమల్లోవుందని నిరుడు జూలైలో పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్‌ సుప్రియో పార్లమెంటులో చెప్పారు. ఇలా నిరవధికంగా వాయిదాపడటం మంచిది కాదు. అన్ని వర్గాల మన్ననలు పొందేవిధంగా, ముఖ్యంగా ఆదివాసీల హక్కుల్ని పరిరక్షించేవిధంగా వర్తమాన అవసరాలకు అనుగుణంగా మన జాతీయ అటవీ విధానం రూపొందాలి. అప్పుడు మాత్రమే అటవీ సంరక్షణ మరింత మెరుగ్గావుంటుంది.
 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు