ఆశావహ స్వరం

30 Jan, 2018 01:22 IST|Sakshi
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలూ పదేళ్ల తర్వాత మళ్లీ పుంజుకుంటున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్న వేళ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ 2018–19 ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రధాన బడ్జెట్‌కు ముందు ఏటా లాంఛనంగా ప్రవేశపెట్టే ఈ సర్వే దేశ ఆర్థిక స్థితిగతులెలా ఉన్నాయో, వివిధ రంగాల పనితీరు ఎలా ఉన్నదో చెబుతుంది. ఎలా ఉండ బోతున్నదో అంచనా వేస్తుంది. అందులో ఆశావహం కలిగించేవీ ఉంటాయి. బెంబే లెత్తించేవీ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు, అది తీసుకున్న వివిధ చర్యలు ఎలాంటి ఫలితాలిచ్చాయో సర్వే గణాంకాలు సమగ్రంగా వెల్లడిస్తాయి.

దేశ సాంఘికార్థిక పరిస్థితుల గురించి కూడా ఆర్థిక సర్వే ఏకరువు పెడుతుంది. సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది జరగాల్సి ఉన్నా అవి ఇంకా ముందే ఉండొచ్చునని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అందువల్లే కావొచ్చు... ఆర్థిక సర్వే మరీ నిరాశాపూరిత అంచనాల జోలికి పోలేదు. కొన్ని రంగాల్లో పరిస్థితులు సక్రమంగా లేవని చెప్పినా వాటిని అధిగమించడానికి అవకాశాలున్నాయనే ధ్వనించింది. ముఖ్యంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7–7.5 శాతం మధ్య ఉండొచ్చునని అది చెప్పిన మాట మార్కెట్‌లో ఉత్సాహం నింపింది. 
 
గత ఆర్థిక సంవత్సరం కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం, ఇప్పుడు ముగుస్తున్న ఆర్థిక సంవత్సరంలో సరుకులు, సేవల పన్ను(జీఎస్‌టీ) అమలు నిర్ణయం అత్యంత కీలకమైనవి. ఈ రెండూ దేశ ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధం చేయడానికి ఉద్దేశించిన చర్యలు. అయితే ప్రపంచమంతా ఆర్థిక వ్యవస్థలు మెరుగవుతున్న సూచనలు కనిపిస్తుండగా, మనం మాత్రమే వెనకబడి ఉండటానికి కారణం ఈ రెండు నిర్ణయాల ప్రభావమేనన్న మాట వాస్తవం. ఈ సర్వే పెద్ద నోట్ల రద్దు ప్రభావం గురించి నేరుగా ప్రస్తావించలేదు. జీఎస్‌టీ అమలు సాహ సోపేతమైన నిర్ణయమని, అది విజయవంతంగా అమలవుతున్నదని చెప్పినా... స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)పైనా, ఉపాధి కల్పనపైనా దాని ప్రభావమేమిటో వివరించలేకపోయింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ వల్ల అదనంగా 18 లక్షలమంది పన్ను చెల్లింపుదారులు వచ్చిచేరినా వారిలో అత్యధికులు తక్కువ స్లాబ్‌లో ఉన్నవారే. కాబట్టి వీరి వల్ల ఇప్పటికైతే సర్కారుకు ఆదాయం పెద్దగా పెరిగే అవకాశం లేదు. 

వీరి వార్షికాదాయం రాగల సంవత్సరాల్లో పెరగాలంటే ఆరోగ్య వంతమైన ఆర్థిక వ్యవస్థ అవసరమవుతుంది. మెరుగైన ప్రభుత్వ విధానాలు మాత్రమే అలాంటి ఆర్థిక వ్యవస్థలకు దోహదపడగలవు. నిరుటి ఆర్థిక సర్వే పెద్ద నోట్ల రద్దు వల్ల జీడీపీపై 0.5 శాతం కోత పడి 6.5 శాతంగా ఉన్నదని చెప్పింది. 2017–18లో తిరిగి సాధారణ స్థితి ఏర్పడి జీడీపీ 7.5 శాతానికి ఎగబాకుతుందని జోస్యం చెప్పింది. ఆ తదుపరి రెండేళ్లలో 8 నుంచి 10 శాతం వరకూ తీసుకెళ్తామని కూడా భరోసా ఇచ్చింది. కానీ జరిగిందేమిటి? అది 6.75 ఉండొచ్చునని ప్రస్తుత ఆర్థిక సర్వే భావిస్తోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పర్యవసానాలను సరిగా గుర్తించలేదని నిరుటి ఆర్థిక సర్వేపై అప్పట్లో ఆర్థిక నిపుణులు విమర్శించారు. ఈ నేపథ్యంలో రాబోయే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7–7.5 శాతం మధ్య ఉండొ చ్చునంటున్న అంచనాలు ఏమేరకు సాకారమవుతాయో వేచిచూడాలి. 

మొత్తానికి దేశ ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధం చేయడానికి ఉద్దేశించిన రెండు నిర్ణయాలూ అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదని సర్వే చూస్తే అర్ధమవుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతూ పోతున్న చమురు ధరలు దేశ ఆర్థిక వ్యవస్థపై చూపబోయే ప్రభావాన్ని గురించి ఈ ఆర్థిక సర్వే పలుమార్లు ప్రస్తావిం చిన సంగతిని మరిచిపోకూడదు. ఒక బ్యారెల్‌ చమురు ధర 10 డాలర్లు పెరిగితే వృద్ధిని అది 0.2 నుంచి 0.3 శాతం వరకూ తగ్గిస్తుందని సర్వే వివరిస్తోంది. ముగు స్తున్న ఆర్థిక సంవత్సరంలో చమురు ధరలు సగటున 14 శాతం పెరిగాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ పెరుగుదల 10–15 శాతం వరకూ ఉండొచ్చునని అంటు న్నది. ఈ సవాళ్లను సర్కారు ఎలా అధిగమిస్తుందో చూడాలి. 

అయితే ఆర్థిక సర్వే వ్యవసాయ రంగానికి సంబంధించి నిరాశాజనకమైన అంచనాలే ఇస్తోంది. వాతావరణ మార్పుల పర్యవసానంగా ఆ రంగంలో వార్షిక ఆదాయం సగటున 15 నుంచి 18 శాతం వరకూ పడిపోవచ్చునని లెక్కేస్తోంది. నీటిపారుదల సౌకర్యం సక్రమంగా లేని ప్రాంతాల్లో ఇది 20 నుంచి 25 శాతం మధ్య ఉండొచ్చునని కూడా చెబుతోంది. కష్టాల సేద్యం చేస్తున్న రైతాంగానికి ఇది దుర్వార్తే. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు సరిగా పండకపోవడం ఒకపక్క కనబడుతుంటే పంటలు పండిన సందర్భాల్లో సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడం మరోపక్క ఉంటుంది. ఈమధ్యకాలంలో ఉల్లిపాయలు, ఆలు గడ్డలు, టమోటాల వగైరా «ధరలు భారీగా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితులు రైతాంగాన్ని రుణ ఊబిలోకి నెడుతున్నాయి. విత్తనాలు మొదలుకొని ఎరువులు, పురుగుమందుల వరకూ అన్నిటి ధరలూ ఆకాశాన్నంటడంతో సాగు వ్యయం అపరిమితంగా పెరిగింది. 

దిగుబడుల ధరలు మాత్రం దిగజారుతున్నాయి. దిగు బడికైన వ్యయానికి 50 శాతాన్ని జోడించి గిట్టుబాటు ధరను నిర్ణయించాలన్న స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సును పాలకులు మరిచారు. చిత్రంగా ఆర్థిక సర్వే దాని ఊసే లేకుండా విద్యుత్, ఎరువులు సబ్సిడీలను ఎత్తేసి నగదు బదిలీ ప్రవే శపెట్టమని చెబుతోంది. బిందుసేద్యం, తుంపర సేద్యంవంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలంటున్నది. ఇవి అమలు చేస్తే 2022నాటికి సాగు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని చెబుతోంది. సాగు రంగానికొచ్చేసరికి మన విధాన నిర్ణేతలు ఎప్పుడూ బోర్లాపడుతుంటారు. సర్వేలో ప్రస్తావించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఆలోచనలేమిటో, ఆర్థికరంగ జవసత్వాలకు అది తీసుకోబోయే చర్యలేమిటో మరో మూడురోజుల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ తేటతెల్లం చేస్తుంది.


 

మరిన్ని వార్తలు