‘వివాద’యాన సంస్థ!

10 Nov, 2017 01:20 IST|Sakshi

చేసేది విమానయాన వ్యాపారమే కావొచ్చు...అందులో పోటీదారులందరినీ దాటు కుని శరవేగంతో దూసుకుపోతూ ఉండొచ్చు... ఫలితంగా లాభార్జన సైతం అదే స్థాయిలో పెరుగుతూ పోవచ్చు. ఆ వ్యాపారంలో మెలకువల్ని గ్రహించి, నైపు ణ్యాన్ని సాధించి ప్రారంభించిన స్వల్పకాలంలోనే విజేతగా నిలిచినందుకూ, ప్రయాణికుల అభిమానాన్ని కొల్లగొట్టినందుకూ అందరూ అభినందిస్తారు. కానీ కాళ్లు నేలపైనే ఉండాలన్న సంగతిని విజేత గ్రహించాలి. కళ్లు నెత్తికెక్కిన భావన కలగనీయకూడదు. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలని మరవకూడదు. ఈమధ్య కాలంలో ఇండిగో విమానయాన సంస్థ తీరుతెన్నులు గమనిస్తే ఈ స్వల్ప విషయం దాని అవగాహనకు రావడం లేదన్న అనుమానం కలుగుతుంది. 

గత నెల 15న న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ సంస్థ సిబ్బంది రాజీవ్‌ కత్యాల్‌ అనే ప్రయాణికుడిపట్ల అమానుషంగా ప్రవర్తించి, కిందపడేసి పీక నులుముతున్న దృశ్యాలు రెండురోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో బయటికొచ్చాయి. దానిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోక్‌ గజపతిరాజు, బీజేపీ నేత షా నవాజ్‌ హుస్సేన్‌ మొదలుకొని ఎన్నికల సంఘం మాజీ చీఫ్‌ ఎస్‌వై ఖురేషీ వరకూ అందరూ ఆ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అశోక్‌గజపతి రాజు దానిపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌(డీజీసీఏ)ను ఆదేశించారు. 

తదుపరి చర్యలు ఏమి ఉంటాయన్న మాట అటుంచి అసలు ఈ ఉదంతంలో ఇండిగో స్పందించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక ఉద్యోగిపై చర్య తీసుకున్నామని తొలుత ఆ సంస్థ తెలి పింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన దృశ్యాలు గమనిస్తే కత్యాల్‌పై దాడి చేసిన వారు ముగ్గురని స్పష్టంగా తెలుస్తుంది. మరి ఒక్కరిపైనే చర్య తీసుకున్నారేమని ఆరా తీస్తే ఆ ఒక్కరూ వీడియో తీసిన వ్యక్తే అని తేలింది. అతనా పని చేయకపోయి ఉంటే ఈ ఘటన బయటికొచ్చేదే కాదు. కేవలం ఆ కారణంతో మాత్రమే చర్య తీసు కున్నట్టు కనబడుతున్నా పొంతన లేని సంజాయిషీ ఇస్తూ జరిగిన తప్పిదానికి అదే శిక్ష అన్నట్టు సంస్థ మాట్లాడుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. 

ఘటన సంగతి వెల్లడై అశోక్‌ గజపతిరాజు కఠినంగా వ్యవహరిస్తామని చెప్పాక ఇండిగో ఎండీ ప్రయాణికుడికి క్షమాపణ చెప్పారు. సంస్థ నియమావళి ప్రకారం దీనిపై దర్యాప్తు జరిపి కఠిన చర్య తీసుకున్నట్టు కూడా వివరించారు. తీరా మరికొన్ని గంటల తర్వాత వారు చర్య తీసుకున్నది వీడియో చిత్రించిన మోంటు కల్రా అనే ఉద్యోగిపై అని తెలిసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. జరిగినదాన్ని లోకానికి వెల్లడించిన వ్యక్తిని శిక్షిస్తారా అని  నిలదీస్తే... అసలు అలా గొడవపడమని ప్రేరేపించింది మోంటుయేనని వింత జవాబిచ్చారు. అది నిజమే అనుకున్నా ప్రయాణికుడిపై లంఘించిన మిగతా ముగ్గురి దోషమూ అసలు లేనేలేదని ఎలా నిర్ధారించుకున్నారో అనూహ్యం. ఈ విషయంలో పోలీసుల తీరు కూడా క్షమార్హమై నది కాదు. ఘటన జరిగిన వెంటనే ప్రయాణికుడు ఫిర్యాదు చేస్తే వారు చేసిందల్లా రాజీ కుదర్చడమే. పైగా ఫిర్యాదు చేస్తే వారి ఉద్యోగాలు పోతాయంటూ పోలీసులు నచ్చజెప్పారని ప్రయాణికుడంటున్నారు. జరిగిన ఉదంతంపై ఇండిగోను మాత్రమే కాదు...ఢిల్లీ పోలీసులనూ బోనెక్కించాలి. 

ఏ వ్యాపార సంస్థకైనా అది తన వినియోగదారులతో వ్యవహరించే తీరునిబట్టే పేరుప్రఖ్యాతులు వస్తాయి. దాని విశ్వసనీయత పెరుగుతుంది. 2006లో విమా నాలు నడపడం ప్రారంభించిన ఇండిగో సంస్థ 2012 కల్లా దేశంలో అత్యధిక సంఖ్యలో ప్రయాణికులను చేరవేస్తున్న సంస్థగా గుర్తింపు సాధించింది. ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో దాని నికర లాభం భారీగా పెరిగింది. నిరుడు ఇదే కాలానికి ఆ సంస్థ 139.85 కోట్ల నికరలాభం ఆర్జిస్తే ఈసారి అది రూ. 551.55 కోట్లకు చేరుకుంది. సమయపాలన సరిగా పాటిస్తున్న విమానయాన సంస్థగా కూడా దానికి గుర్తింపు వచ్చింది. ఎక్కువమంది తమ విమానాల్లో ప్రయా ణించడంవల్లే ఇదంతా సాధ్యమైందన్న సంగతిని సంస్థ గుర్తిస్తే మరింత బాధ్యతగా వ్యవహరించేది. 

కానీ జరుగుతున్నదంతా అందుకు భిన్నం. రియో ఒలింపిక్స్‌లో దేశానికి రజిత పతకం తెచ్చిన తెలుగు తేజం పీవీ సింధు ఈ నెల 4న తన విషయంలో ఇండిగో ఉద్యోగి దురుసుగా ప్రవర్తించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. దీనిపై విమానంలోని ఎయిర్‌హోస్టెస్‌ను కూడా వాకబు చేయొచ్చునని సూచించారు. ఆ విషయంలో ఇండిగో చేసిందేమిటో తెలియదు గానీ... కనీసం విచారం కూడా వ్యక్తం చేయకుండా ఆమె పెద్ద సైజు బ్యాగ్‌ తీసుకురావడం వల్లనే ఇబ్బంది తలెత్తిందని, తమ సిబ్బంది చాలా మర్యాదగా ప్రవర్తించారని సంజాయిషీ ఇచ్చుకుంది. ప్రముఖుల విషయంలోనే ఇంత నిర్ల క్ష్యంగా ఉన్నప్పుడు తమ పరిస్థితి ఏమిటన్న సందేహం సాధారణ ప్రయాణికుల్లో తలెత్తుతుందని దానికి అనిపించలేదు. 

విమానయానంలో నంబర్‌ వన్‌గా ఉంటున్న సంస్థ ఇంత యాంత్రికంగా, నిర్లక్ష్యంగా జవాబిస్తుందని ఎవరూ భావించరు. మొన్న ఏప్రిల్‌లో ఇండిగో విమానంలో వెళ్లిన ప్రయాణికుడొకరు ‘ఏకకాలంలో నన్ను కోల్‌కతాకు, నా లగేజీని హైదరాబాద్‌కు చేర్చినందుకు కృతజ్ఞతలు’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేస్తే దాని అంతరార్ధాన్ని గ్రహించకుండా అందుకు ప్రతిగా ఇండిగో సంస్థ ‘సంతోషం...’అంటూ ఇచ్చిన జవాబు అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రయాణికుడితో సంస్థ సిబ్బంది కలబడుతున్న వీడియో వెల్లడయ్యాక కూడా చాలా మంది నెటిజన్లు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఎయిరిండియా అయితే ‘మేం చేయెత్తేది నమస్కరించడానికి మాత్రమే...’అంటూ మహారాజా లోగోను పెట్టింది. ఈమధ్యకాలంలో తరచుగా తమ సంస్థపైనే ఎందుకు విమర్శలొస్తున్నాయో ఇండిగో గ్రహించాలి. ఈ విషయంలో కేంద్రం తగిన చర్య తీసుకోవడంతోపాటు ఇలాంటి సందర్భాల్లో ఎవరి బాధ్యతలేమిటో, జవాబుదారీతనం ఎంతో మార్గ దర్శకాలు జారీ చేయాలి. ఈ మాదిరి ఉదంతాలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయని గుర్తించాలి.
 

మరిన్ని వార్తలు