ఉగ్ర ఖాకీ!

14 Jan, 2020 00:28 IST|Sakshi

చుట్టూ ఉన్న వాస్తవాలను గమనిస్తూ, తమ ఊహాశక్తికి పదనుపెట్టి, ఆ వాస్తవాలకు కాల్పనికత జోడిస్తారు సృజనాత్మక రచయితలు. కానీ ఒక్కోసారి వాస్తవం కాల్పనికతను మించిపోతుంది. ఎవరి ఊహలకూ అందనంత దిగ్భ్రాంతికరంగా వుంటుంది. జమ్మూ–కశ్మీర్‌లోని శ్రీనగర్‌ విమానాశ్రయ భద్రతా వ్యవహారాలు పర్యవేక్షిస్తూ, గత ఆగస్టు 15న రాష్ట్రపతి పురస్కారాన్ని కూడా పొందిన డీఎస్‌పీ దేవిందర్‌ సింగ్‌ కరుడుగట్టిన హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది నవీద్‌ బాబా, అతని అనుచరుడితో కలిసి కారులో ప్రయాణిస్తూ శుక్రవారం పోలీసులకు చిక్కిన ఉదంతం ఇటువంటిదే. నవీద్‌ బాబా ఇటీవలికాలంలో ఎందరో అమాయకుల ప్రాణాలు బలిగొన్నాడు. అలాంటివారికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల ప్రాంతంలోని తన ఇంట్లో ఆశ్రయమివ్వడం ఊహకందదు. పంజాబ్‌లో మిలిటెన్సీ తీవ్రంగా వున్నప్పుడు కూడా ఉగ్రవాదులకు కొందరు పోలీసు అధికారులు సహకరించిన వైనం బట్టబయలైంది.

కానీ ఆ ఉదంతాలకు లేని ప్రాముఖ్యత ఇప్పుడు దీనికి రావడానికి ముఖ్యమైన కారణం వుంది. 2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడిలో అరెస్టయిన నిందితుల్లో ఒకడైన అఫ్జల్‌ గురు అప్పట్లో తన న్యాయవాది సుశీల్‌కుమార్‌కు రాసిన లేఖలో తొలిసారి దేవిందర్‌  పేరు ప్రసావించాడు. తనను ఈ రొంపిలోకి లాగింది ఆయనేనని ఆ లేఖలో అఫ్జల్‌ గురు నేరుగా చెప్పాడు. కానీ అప్పట్లో అతని మొర ఆలకించినవారు లేరు. చివరకు సర్వోన్నత న్యాయస్థానం సైతం అఫ్జల్‌ గురును దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధించింది.  2005 ఆగస్టులో అతని ఉరిశిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేయగా, 2013 ఫిబ్రవరి 9న అతన్ని ఉరితీశారు. పార్లమెంటుపై ఉగ్రవాద దాడి జరిగాక న్యాయ ప్రక్రియంతా ముగిసి ఉరిశిక్ష ఖరారు కావడానికి నాలుగేళ్ల సమయం పడితే, అతని క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికి మన రాజకీయ నాయకత్వానికి దాదాపు ఎనిమిదేళ్ల వ్యవధి కావలసివచ్చింది! దురదృష్టమేమంటే... ఏ దశలోనూ అతను ప్రస్తావించిన దేవిందర్‌పై వచ్చిన ఆరోపణల్లోని నిజానిజాలేమిటో ఎవరూ పట్టించు కోలేదు.

అఫ్జల్‌ గురు అఫిడవిట్‌లో దేవిందర్‌ సింగ్‌ పేరు ప్రస్తావించినప్పుడు బాధ్యతగల ప్రభుత్వం లోతుగా ఎందుకు దర్యాప్తు చేయించలేదన్నది కీలకమైన ప్రశ్న. ఏ నేరంలోనైనా సంశయానికి తావులేని స్థాయిలో ప్రమేయం ఉన్నదని రుజువైనప్పుడే నిందితుడికి న్యాయస్థానాలు శిక్ష విధి స్తాయి. ఉరిశిక్ష విధించినప్పుడైతే ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి. అఫ్జల్‌ విషయంలో అది జరగలేదని నిర్ద్వంద్వంగా చెప్పలేం. ఎందుకంటే పార్లమెంటుపై ఉగ్రవాద దాడికి పాల్పడి, భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన మహమ్మద్‌ను కశ్మీర్‌ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చిందీ, అతను పాత కారు కొనుక్కోవడానికి సాయపడిందీ అఫ్జలే. అతనితోపాటు తాను కూడా ఆ కారులో ప్రయాణించి ఢిల్లీలోనే వేర్వేరు వ్యక్తులను కలిశామని కూడా అఫ్జల్‌ అంగీకరించాడు. ఆ పాత కారులోనే ఉగ్రవాదులు పార్లమెంటుకొచ్చి దాడి చేశారు. అందులో పాల్గొన్న అయిదుగురు ఉగ్ర వాదులూ మరణించగా, కారు నంబర్‌ ఆధారంగా దాన్ని కొన్నదెవరో పోలీసులు తెలుసు కోగలిగారు.

పోలీసులు ప్రశ్నించినప్పుడు అదనంగా అఫ్జల్‌ ఇంకేమి చెప్పాడన్నది అలావుంచితే, ఉరిశిక్ష పడ్డాక అతను దేవిందర్‌ పేరును ప్రస్తావించి, ఆయన తనను చిత్రహింసలకు గురిచేశాడని, చివరకు మహమ్మద్‌ను పరిచయం చేసి, అతన్ని ఢిల్లీకి తీసుకెళ్లమన్నాడని అఫ్జల్‌ గురు ఆరోపిం చాడు. అతను మరో ముఖ్య విషయం చెప్పాడు. మహమ్మద్‌ను కశ్మీర్‌ వాసిగా దేవిందర్‌ పరిచయం చేసినా, అతని ముఖకవళికలు అలా అనిపించలేదని, అతనికి కశ్మీరీ భాష కూడా రాదని, కానీ విధిలేక ఆ అధికారి చెప్పినట్టల్లా చేశానని తెలిపాడు. అప్పట్లో కశ్మీర్‌ పోలీసులు ఈ ఆరోపణను కొట్టిపారేశారు. కేసు నుంచి తప్పించుకోవడానికి అఫ్జల్‌ నాటకమాడుతున్నాడని చెప్పారు. అఫ్జల్‌ నేర ప్రమేయంపై వారికి నమ్మకం ఏర్పడటాన్ని తప్పుబట్టనవసరం లేదు.

కానీ ఒక నిందితుడు అంత వివరంగా దేవిందర్‌ గురించి చెబుతున్నప్పుడు కాస్తయినా సంశయం కలగొద్దా? ఇది అఫ్జల్‌ కోసం కాదు...తమలో ఒకడిగా వున్న అధికారిపై తీవ్ర ఆరోపణలు వచ్చినప్పుడు వాటి నిజానిజాలు నిర్ధారించడం అత్యవసరమని అనిపించలేదా? పోనీ ఇలా ఒక అధికారిపై ఆరోపణలు రావడం కశ్మీర్‌లో మొదటి సారి కావచ్చునేమోగానీ, ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్‌ వంటిచోట్ల అంత క్రితం బయటపడలేదా? సైన్యంలో పనిచేస్తూ గూఢచర్యానికి పాల్పడినవారిని పట్టుకున్న ఉదం తాలు లేవా? ఏ ఉద్దేశంతో అప్పట్లో దేవిందర్‌సింగ్‌ పాత్రపై దర్యాప్తు చేయలేదన్నది ఇప్పుడు తేల వలసివుంది. అలా దర్యాప్తు చేసివుంటే, ఎన్నో దిగ్భ్రాంతికర అంశాలు బయటపడేవి. వందల మంది ప్రాణాలు  కాపాడటం, ఆస్తుల విధ్వంసాన్ని నివారించడం సాధ్యమయ్యేది.

అఫ్జల్‌ ప్రస్తావించడానికి చాలా ముందే దేవిందర్‌సింగ్‌ వివాదాస్పద అధికారిగా ముద్ర పడ్డాడు. మిలిటెన్సీని సమర్థవంతంగా అదుపు చేసినందుకు ఆరేళ్ల వ్యవధిలో ఎస్‌ఐ నుంచి డీఎస్పీ దాకా ఎదిగాడు. కానీ తన పరిధిలో లాకప్‌ మరణాలు జరగడంతో మళ్లీ వెనక్కు పంపారు. అనంతరకాలంలో చాలా త్వరగానే కోల్పోయినదాన్ని సాధించుకున్నాడు. అఫ్జల్‌ను ప్రశ్నించడం, చిత్రహింసలు పెట్టడం వాస్తవమేనని అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో దేవిందర్‌ అంగీకరించాడు. ఏ ఉగ్రవాద ఘటనైనా స్థానికంగా వుండేవారి తోడ్పాటులేనిదే సాధ్యం కాదు. ఇప్పుడు ఎటూ పార్లమెంటు దాడి కేసులో తిరిగి దర్యాప్తు జరుగుతుంది. ఇన్నేళ్లుగా దేవిందర్‌ సింగ్‌ ఎలాంటి ఘోరాలకు ఒడిగట్టాడో తేలుతుంది. కనీసం ఇకముందైనా నేరాల దర్యాప్తునకు, ముఖ్యంగా ఉగ్ర వాద నేరాల దర్యాప్తునకు అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలేమిటో, సూక్ష్మ స్థాయి అంశాలపై సైతం ఎంత తీక్షణమైన దృష్టి సారించాలో, ఎందుకు సారించాలో మన దర్యాప్తు విభాగాలు గ్రహిం చగలిగితే అది దేశ భద్రతకు ఎంతగానో మేలుచేస్తుంది.

మరిన్ని వార్తలు