జనం చూస్తున్నారు...జాగ్రత్త!

11 Jul, 2019 00:34 IST|Sakshi

అంతర్గత సంక్షోభంలో కాంగ్రెస్‌ పీకల్లోతు కూరుకుపోయి చేష్టలుడిగిన వేళ, ఆ పార్టీ జేడీ(ఎస్‌)తో కలిసి కర్ణాటకలో నడుపుతున్న సంకీర్ణ ప్రభుత్వం గుడ్లు తేలేసింది. అది కూలిపోవడం ఖాయమన్న విషయంలో అందరికీ ఏకీభావముంది. భిన్నాభిప్రాయాలు ఉంటే గింటే... అది ఎప్పుడు జరుగుతుందన్న విషయంలో మాత్రమే! ఎందుకంటే ‘తిరుగుబాటు’ ఎమ్మెల్యేల స్కోరు బుధవారానికల్లా 16కి చేరింది. ఇది ఇక్కడితో ఆగుతుందన్న నమ్మకం ఎవరికీ లేదు. వీరందరి రాజీనామాలు స్పీకర్‌ ఆమోదిస్తే సంకీర్ణ సర్కారు బలం 101కి పడిపోతుంది. బీజేపీ బలం ఇద్దరు ఇండిపెండెంట్లతో కలుపుకుని 105. మహారాష్ట్ర వేదికగా సాగుతున్న ఈ అయోమయ, అసంబద్ధ నాటకం ఇంకా ఒక కొలిక్కి రాకుండానే, దానికి పొరుగునే ఉన్న గోవా కాంగ్రెస్‌ శాసనసభాపక్షంలో ఉన్నట్టుండి ముసలం పుట్టింది. ఏం జరుగుతున్నదో తెలిసే లోపే అక్కడున్న 15మంది పార్టీ ఎమ్మెల్యేల్లో 10 మంది విడివడి బీజేపీలో విలీనమయ్యారు.  

కొన్ని దశాబ్దాలక్రితం కాంగ్రెస్‌ మార్కు రాజకీయాలు తెలిసినవారికి పాత పాపాలు ఆ పార్టీకి శాపాలుగా మారి కాటేస్తున్నాయన్న అభిప్రాయం కల గొచ్చు. కానీ ఈ క్రమంలో ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ రాజకీయాలు నవ్వులపాలవుతున్నాయి. తాము పట్టంగట్టి చట్టసభలకు పంపినవారిలో అనేకులకు కనీసస్థాయి నైతిక విలువలు లేవని సాధారణ జనం గ్రహిస్తున్నారు. ఇప్పుడు కర్ణాటక సంక్షోభం ఒకచోట కాదు... వేర్వేరుచోట్ల ప్రకం పనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి డీకే కుమారస్వామి రాజీనామా చేయాలంటూ బెంగళూరు విధానసౌధ ముందు బీజేపీ ధర్నా చేస్తే, రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరత్వంపాలు చేయడం ఆపా లని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటు ఉభయసభల్లోనూ విపక్షాలు ఆందోళన చేశాయి. 

కర్ణాటక సంక్షోభానికి కర్త, కర్మ, క్రియ బీజేపీయేనని కాంగ్రెస్, జేడీ(ఎస్‌)లు మొదట్లో ఆరో పించినప్పుడు అదంతా వారి అంతర్గత వ్యవహారమని, తమకేం సంబంధమని బీజేపీ నేతలు ఎదురు ప్రశ్నించారు. ఇప్పుడూ ఆ మాటే అంటున్నారు. కానీ ఎవరేమిటో చేతలే చెబుతున్నాయి. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా బీజేపీ ఏలుబడిలోని మహారాష్ట్రలో తలదాచుకోవడం, వారున్న హోటల్‌ ముందు బుధవారం జరిగిన డ్రామా వగైరాలు గమనిస్తే ఈ విషయంలో ఎవరికీ ఏ అను మానమూ తలెత్తదు. 225 స్థానాలున్న అసెంబ్లీకి నిరుడు మే లో జరిగిన ఎన్నికల్లో అప్పటివరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు కేవలం 78 మాత్రమే దక్కగా, 104 స్థానాలతో బీజేపీ అగ్రస్థానంలో ఉంది. ‘కింగ్‌ మేకర్‌’ అవుతుందనుకున్న జేడీ(ఎస్‌) 37తో సరిపెట్టుకుంది. బీజేపీకి అధికారం దక్కనీయరాదన్న పట్టుదలతో కాంగ్రెస్‌ జేడీ(ఎస్‌)తో కూటమి కట్టింది. సీఎం పదవి ఆ పార్టీకే ఇస్తానని వాగ్దానం చేసింది. అయినా అతి పెద్ద పార్టీగా అక్కడి గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా బీజేపీకే అవకాశమిచ్చారు. యడ్యూరప్ప నేతృత్వంలో ఏర్పడ్డ బీజేపీ సర్కారు మూన్నాళ్ల ముచ్చటే అయింది. కనీసం మరో 9మంది ఎమ్మెల్యేల అవసరం ఉండగా అప్పట్లో అది సాధ్యం కాలేదు.

చివరకు డీకే కుమారస్వామి నాయకత్వాన కాంగ్రెస్‌–జేడీ(ఎస్‌) కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఇంతవరకూ కాంగ్రెస్‌ తెలివిగానే చేసినా ఆ తర్వాతకాలంలో తప్పుటడుగులు వేసింది. సీఎం పదవికి దూరం కావడంతో లోలోన కుమిలిపోయిన సిద్ధరామయ్య తన వర్గం ఎమ్మెల్యేలతో తరచు కుమారస్వామికి సమస్యలు సృష్టిస్తూనే వచ్చారు. ఒక సందర్భంలో సీఎం కన్నీటిపర్యంతమ య్యారు. రాత్రుళ్లు నిద్ర కూడా పట్టడం లేదని వాపోయారు. దీన్నంతటినీ సకాలంలో జోక్యం చేసుకుని సరిదిద్దాల్సిన కాంగ్రెస్‌ పెద్దలు మౌనం వహించారు. చివరకు అలకపాన్పు ఎక్కినవారిని పదవులతో సంతృప్తిపరిచారు. ఇది సంకీర్ణాన్ని మరింత బలహీనపరిచింది. ఒకపక్క అధికారానికి కూతవేటు దూరంలో ఆగిపోయిన బీజేపీ అవకాశం కోసం కాచుక్కూర్చున్నదని తెలిసినా ఇల్లు చక్కదిద్దుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమైంది. సావాసదోషం కావొచ్చు...ముగ్గురు జేడీ(ఎస్‌) ఎమ్మె ల్యేలు కూడా ‘తిరుగుబాటు’ ఎమ్మెల్యేలతో జతకలిశారు.

దేశంలో స్పీకర్ల వ్యవస్థ ఎలా ఉన్నదో అటు కర్ణాటక పరిణామాలు చూసినా, బుధవారం గోవాలో చోటుచేసుకున్న డ్రామాను గమనించినా అర్థమవుతుంది. అధికారపక్షం ఏవైపు ఉందన్న దాన్నిబట్టే ఆ రెండు రాష్ట్రాల్లోనూ స్పీకర్‌ల నిర్ణయాలున్నాయి. కర్ణాటక ఎమ్మెల్యేలు రాజీనామాలిచ్చి రోజులు గడుస్తున్నా అక్కడి స్పీకర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించడంలో తాత్సారం చేస్తున్నారు. కొందరి రాజీనామా పత్రాలు సక్రమంగా లేవంటున్నారు. అది నిజమే కావొచ్చు. కానీ గోవాలో కాంగ్రెస్‌ చీలికవర్గం తాము బీజేపీలో విలీనమవుతున్నామని చెప్పిన మరుక్షణం అక్కడి స్పీకర్‌ ఆమోదముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అనుసరిస్తున్న వైఖ రిని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. తాము ఫిరాయింపుల్ని ప్రోత్సహించబోమని, ఒకవేళ తాము ఆ పని చేసినా స్పీకర్‌ స్వతంత్రంగా వ్యవహరించి ఫిరాయించినవారిపై అనర్హత వేటు వేయొ చ్చని ఆయన అసెంబ్లీలో చెప్పారు. రాజకీయాల్లో విలువలు లుప్తమైపోతున్న వర్తమాన దశలో ఒక ముఖ్యమంత్రి నిండు సభలో ఇలా ప్రకటించడం చాలామందికి ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చు. కానీ ఆయన ఎంచుకున్న మార్గం అది. 

అసలు 1985లో  ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చినప్పుడే దాన్ని కట్టుదిట్టంగా రూపొం దించడంలో ఆనాటి ప్రభుత్వం విఫలమైంది. ఆ తర్వాత సవరణలు చేసినవారు సైతం మరికొన్ని కంతల్ని విడిచిపెట్టారు. అందుకనే కేంద్ర స్థాయిలోనూ, వివిధ రాష్ట్రాల్లోనూ తరచుగా ఫిరా యింపులు యధేచ్ఛగా సాగుతున్నాయి. కర్ణాటక తెరిపిన పడగానే మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో ఈ మాదిరి డ్రామాలు మొదలైనా బిత్తరపోనక్కరలేదు. పార్టీలన్నీ బాధ్యత గుర్తెరిగి ప్రవర్తించకపోతే మన ప్రజాస్వామ్యం నవ్వులపాలవుతుంది. జనానికి నమ్మకం పోతుంది. ఆ సంగతి అందరూ గుర్తిస్తే మంచిది.

మరిన్ని వార్తలు