నేర సామ్రాజ్యం

7 Jul, 2020 01:02 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ రూరల్‌ జిల్లా బిక్రూలో గత గురువారం అర్థరాత్రి దాటాక పేరుమోసిన నేరగాడు వికాస్‌ దూబే ఎనిమిదిమంది పోలీసుల ప్రాణాలు బలిగొన్న ఉదంతం దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతిలో ముంచెత్తింది. ఆ రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీలతో సత్సంబంధాలున్న వికాస్‌ దూబే ముఠా తమను అరెస్టు చేయడానికొచ్చిన పోలీసు బృందంపై  గుళ్లవర్షం కురిపించి తప్పించుకుపారిపోవడం, ఇప్పటికి నాలుగు రోజులు గడుస్తున్నా దూబే ఆచూకీ లేకపోవడం గమనిస్తే ఆ రాష్ట్రంలో పోలీసు శాఖ ఎంత నిస్సహాయ స్థితిలో పడిందో అర్థం చేసుకోవచ్చు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ 2017 మార్చిలో అధికారంలోకొచ్చినప్పుడే నేరగాళ్ల అంతుచూస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత ఎన్‌కౌంటర్ల పరంపర సాగింది. 

నిరుడు డిసెంబర్‌లో విడుదలైన గణాంకాల ప్రకారం 17,745మంది నేరగాళ్లు లొంగిపోవడమో, తమ బెయిల్‌ రద్దు చేసు కుని జైలుకుపోవడమో జరిగితే...113మంది ఈ ఉదంతాల్లో మరణించారు. దాదాపు 2,000మంది గాయపడ్డారు. మొత్తంగా అప్పటికి యూపీలో 5,178 ఎన్‌కౌంటర్లు జరిగాయి. కానీ ఈ ఎన్‌కౌంటర్ల సెగ నేర చరిత్రగల వికాస్‌ దూబేను తాకలేదు. పోలీసుల దృష్టిలో పడకపోవడానికి అతగాడు సాధారణ నేరస్తుడు కాదు. 60 కేసుల్లో ముద్దాయిగా వున్న కరుడుగట్టిన నేరస్తుడు. 2001లో బీజేపీ హయాంలో సంతోష్‌ శుక్లా అనే మంత్రిని నడిరోడ్డుపై ఆపి గొడవపెట్టుకుని తీవ్రంగా కొట్టడమేకాక, ఫిర్యాదు చేయడానికి ఆయన పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అక్కడే కాల్చిచంపిన దుర్మార్గుడు. ఆ కేసులో పోలీసులెవరూ సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో నిర్దోషిగా బయటికొచ్చాడు. 

ఈలోగా జైల్లో వుంటూనే ఇద్దరిని హత్య చేయించాడు. 2017లో సైతం అరెస్టయి ప్రత్యర్థిని హతమార్చడానికి పథకరచన చేశాడని చెబుతారు. అయినా సులభంగా బెయిల్‌పై బయటకు రాగలిగాడు. తన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి ఎవరూ అడ్డురాకుండా వుండేందుకూ, జిల్లా రాజకీయాల్లో తన మాటే చలా మణి అయ్యేందుకూ అతను బెదిరింపులు, అపహరణలు, హత్యలు వగైరాలు కొనసాగిస్తూనే వున్నాడు. భారీయెత్తున ఆయుధాలు పోగేసుకోవడం, అవసరమైతే తప్పించుకుపోవడానికి వీలుగా రహస్య మార్గం ఏర్పాటు చేసుకోవడంవంటివి పూర్తికావడానికి కొన్ని నెలలో, సంవత్సరాలో కాదు... దశాబ్దాలకాలం పట్టివుంటుంది. అయినా అన్ని వ్యవస్థలూ కళ్లు మూసుకున్నాయి. 

యూపీలో రాజకీయాలు, నేరాలు చెట్టపట్టాలేసుకుంటున్న ఉదంతాలు బయటపడుతూనే వున్నాయి. ఎక్కడికక్కడ నేరగాళ్లు సొంత సామ్రాజ్యాలు నిర్మించుకోవడం, తమ మాటకు ఎదురు చెప్పేవారిని బెదిరించడం, హత్యలు చేయడం ఒకప్పుడు చాలా ఎక్కువ. ఇలాంటి ఇతివృత్తాలతో గతంలో చాలా హిందీ సినిమాలు వచ్చాయి. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం వచ్చాక సాగించిన ఎన్‌కౌంటర్ల వల్ల నేర సామ్రాజ్యాలు తుడిచిపెట్టుకుపోతాయని కొందరు నిజంగానే ఆశపడ్డారు. కానీ వాటి బారినపడినవారిలో చాలామంది ఛోటా మోటా నేరస్తులేనని, కొందరు అమాయకులు కూడా వున్నారని మీడియా కథనాలు వెల్లడించాయి. పైగా నేరాలు తగ్గకపోగా అవి మరింత పెరిగాయి. నిరుడు విడుదలైన 2018 సంవత్సరానికి సంబంధించిన జాతీయ క్రైం రికార్డుల బ్యూరో  (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం మహిళలపై నేరాల్లో యూపీ దేశంలోనే అగ్రభాగాన వుంది. మరోపక్క యూపీ ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ విచారణలో వుంది. 

తాజా ఉదంతం జరిగిన తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక వ్యాపారినుంచి దోచుకున్న మొత్తాన్ని తిరిగి అతనికి ఇచ్చేయాలని దూబేను బతిమాలడానికి ఒక పోలీసు బృందం వెళ్తే అతని ముఠా కొట్టి పంపించింది. ఆ తర్వాత ఇరుగు పొరుగు పోలీస్‌స్టేషన్లనుంచి పోలీసుల్ని పంపితే వారు కూడా అతని ధాటికి తట్టుకోలేక వెనక్కొచ్చారు. చివరకు దాదాపు 50మంది పోలీసులు దాడికి వెళ్లినప్పుడు డీఎస్‌పీని, ముగ్గురు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, మరో నలుగురు కానిస్టేబుళ్లను ఆ ముఠా చిత్రహింసలు పెట్టి కాల్చిచంపింది. ఒక నేరగాడిని పోలీసులు బతిమాలే స్థితి ఎందుకొచ్చింది? అతనికి రాజకీయంగా పలుకుబడి వుందన్న భయమో, మరొకటో లేకపోతే ఇది జరిగేదా? గతంలో ఎస్‌పీ, బీఎస్‌పీ ప్రభు త్వాలున్నప్పుడు సైతం నేరాలు అధికంగానేవుండేవి. కానీ ఇలా దాడిచేసిన ఉదంతాలు లేవు. మరి ఈ మూడేళ్లుగా యోగి ప్రభుత్వం ఎన్‌కౌంటర్లతో సాధించిందేమిటి? 

ఈ ఉదంతంలో పోలీసుల తీరు ఎన్నో అనుమానాలు కలగజేస్తుంది. దాడికి వెళ్తున్న తమ సహచరుల వివరాలను కొందరు పోలీసులు ముందే అతనికి చేరేశారంటే అది కేవలం అతనిచ్చే డబ్బుకు ఆశపడటం వల్లనా లేక ఉన్నతస్థాయిలో అతనికి సంబంధాలున్నాయన్న కారణం చేతనా అన్నది తేలాలి. ఎందుకంటే ఈ ఉదంతంలో మరణించిన డీఎస్‌పీ దేవేందర్‌ మిశ్రా మూడు నెలలక్రితమే స్థానిక పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎస్‌ఎస్‌పీకి లేఖ రాశారని చెబుతున్నారు. అదే నిజమైతే ఎస్‌ఎస్‌పీ ఎలాంటి చర్యలు తీసుకున్నారో విచారించాలి. ఆయన చురుగ్గా వ్యవహరించివుంటే పోలీసుల విలువైన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడేది కాదు. 

ప్రస్తుతం దాడి సమాచారాన్ని దూబేకు అందించారన్న ఆరోపణపై ఇద్దరు ఎస్‌ఐలు సహా అర డజనుమంది పోలీసులపై సస్పెన్షన్‌ వేటు పడింది. పేరుమోసిన నేరగాళ్ల తీరుతెన్నులపైనా, వారి కుండే సంబంధబాంధవ్యాలపైనా ఇన్ని దశాబ్దాలుగా పాలకులకు తెలియలేదంటే ఎవరూ నమ్మ లేరు. ఇంటెలిజెన్సు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే అలాంటి సమాచారం ఎప్పటికప్పుడు వస్తూనే వుంటుంది. ఎడాపెడా ఎన్‌కౌంటర్లతో ఆర్భాటం చేయడానికి బదులు అటువంటి వ్యవస్థలను ప్రక్షా ళన చేసి పదునుదేర్చి వుంటే కాన్పూర్‌ జిల్లాలో ఈ దుస్థితి తలెత్తేది కాదు. సాధ్యమైనంత త్వరగా వికాస్‌ దూబేను సజీవంగా పట్టుకోవడం, పూర్తి స్థాయిలో పోలీసు శాఖను ప్రక్షాళన చేయడం యోగి సర్కారు కర్తవ్యం.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా