హఠాత్‌ నిర్ణయాలు!

6 Aug, 2019 01:31 IST|Sakshi

కశ్మీర్‌కు భారీయెత్తున భద్రతా బలగాల తరలింపు, అక్కడ నిట్‌తోసహా విద్యా సంస్థలన్నిటికీ సెలవులు, అమర్‌నాథ్‌ యాత్ర అర్ధాంతరంగా నిలుపుదల, శ్రీనగర్‌లో నిరవధిక కర్ఫ్యూ వగైరా నిర్ణ యాలతో నాలుగైదు రోజులుగా అందరిలోనూ ఉత్కంఠ రేపి, రకరకాల ఊహాగానాలకు తావిచ్చిన కేంద్ర ప్రభుత్వం సోమవారం చకచకా పావులు కదిపింది. జమ్మూ–కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి నిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేస్తూ రాష్ట్రపతి నోటిఫికేషన్‌ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే అందుకు సంబంధించిన బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టి దాని ఆమోదాన్ని పొందింది. పర్యవసానంగా ఆ రాష్ట్రంలో స్థిరాస్తుల కొనుగోలు అధికారం స్థానికులకు మాత్రమే పరిమితం చేసే 35ఏ అధికరణ కూడా రద్దవుతుంది.

... జమ్మూ–కశ్మీర్‌ రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేసి దాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టే కశ్మీర్‌ పునర్విభజన బిల్లుకు కూడా రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు చట్టమైతే జమ్మూ–కశ్మీర్‌ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా... లడఖ్‌ చట్టసభ రహిత కేంద్ర పాలిత ప్రాంతంగా మారతాయి. ఈ బిల్లులు మంగళవారం లోక్‌సభ ముందుకొస్తాయి. జనసంఘ్‌గా ఉన్నప్పటినుంచీ బీజేపీకి 370, 35ఏ అధికరణల విషయంలో ఉన్న అభిప్రాయాలు ఎవరికీ తెలియనివి కాదు. తమకు సొంతంగా మెజా రిటీ లభిస్తే వాటిని రద్దు చేస్తామని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విడుదల చేసే మేనిఫెస్టోల్లో ఆ పార్టీ హామీ ఇస్తూనే ఉంది. కానీ 2014 ఎన్నికల మేనిఫెస్టో ఆ అధికరణల రద్దుపై సంబంధిత పక్షాలతో చర్చించి ఒప్పిస్తామని తెలిపింది.

ఎన్నికలయ్యాక 2015లో పీడీపీతో కలిసి జమ్మూ– కశ్మీర్‌లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కుదిరిన ఉమ్మడి ఎజెండా స్వయంప్రతిపత్తి అంశంలో యథాతథ స్థితిని కొనసాగిస్తామని తెలియజేసింది. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల మేని ఫెస్టోలో మాత్రం స్వరం మారింది. వీటిని రద్దు చేస్తామని నిర్ద్వంద్వంగా చెప్పింది. ఎవరితోనూ సంప్రదించలేదన్న విమర్శలకు జవాబుగా బీజేపీ ఇప్పుడు ఈ మేనిఫెస్టోనే ఉదహరిస్తోంది. జమ్మూ–కశ్మీర్‌ పునర్విభజన బిల్లు అసాధారణమైనది. ఇంతవరకూ  కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్ర ప్రతిపత్తినిచ్చిన సందర్భాలున్నాయి. కొత్త రాష్ట్రాలు ఆవిర్భవించిన సందర్భాలున్నాయి. కానీ రాష్ట్ర హోదా గల ప్రాంతం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారడం ఇదే తొలిసారి. పరిస్థితులు కుదుటపడితే జమ్మూ– కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర ప్రతిపత్తిని ఇస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అంటున్నారు. అది ఎంతవరకూ సాధ్యమో మున్ముందు చూడాలి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రాల సంఖ్య 29కి పెరగ్గా, అది ఇప్పుడు మళ్లీ 28కి తగ్గింది. 

ఇతర సంస్థానాల విలీనానికీ, జమ్మూ–కశ్మీర్‌ విలీనానికీ మధ్య మౌలికంగా వ్యత్యా సాలున్నాయి. ఇతర సంస్థానాలు కొద్దికాలంలోనే దేశంలో విడదీయరాని భాగంగా మారాయి. కానీ జమ్మూ–కశ్మీర్‌కు అప్పుడు పాలకుడుగా ఉన్న హరిసింగ్‌తో కుదిరిన ఒప్పందం పర్యవసానంగా రాజ్యాంగంలో మొదట 370 అధికరణ, ఆ తర్వాత 35 ఏ అధికరణ వచ్చిచేరాయి. విదేశీ వ్యవ హారాలు, రక్షణ, కమ్యూనికేషన్లు మినహా ఇతర అంశాల్లో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం ఉంటే తప్ప జమ్మూ–కశ్మీర్‌ ప్రాంతంలో కేంద్ర చట్టాలేవీ అమలుకాబోవని 370 అధికరణ చెబుతోంది. అయితే 35ఏ అధికరణ విషయంలో ఆదినుంచీ వివాదం ఉంది. ఇది 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో భాగమైంది.

పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ ద్వారా మాత్రమే రాజ్యాంగాన్ని సవరించి చేర్చాల్సిన అధికరణను ఇలా దొడ్డిదోవన తీసుకురావడమేమిటని అప్ప ట్లోనే జనసంఘ్‌ నేతలు నిలదీశారు. దీని రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై 2015లో జమ్మూ–కశ్మీర్‌ హైకోర్టు తీర్పునిస్తూ 35ఏను సవరణగా కాక 370 అధికరణకు వివరణగా లేదా అనుబంధంగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ సుప్రీంకోర్టులో పెండింగ్‌లోఉంది. అయితే 370 అధికరణ స్వభావరీత్యా తాత్కాలికమైనదే నన్న పిటిషన్‌ను 2016లో సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అందులోని సబ్‌ క్లాజ్‌ 3లోనే అందుకు సంబంధించిన మెలిక ఉన్నదని తెలిపింది.

రాష్ట్ర రాజ్యాంగ సభ సిఫార్సుతో రాష్ట్రపతి నోటిఫికేషన్‌ వెలువరించినప్పుడు మాత్రమే 370 రద్దవుతుందని ఆ క్లాజు చెబుతోంది. ఇప్పుడు రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ద్వారానే అది రద్దయింది. కానీ అసెంబ్లీ సస్పెన్షన్‌లో ఉన్న ప్రస్తుత సమయంలో దాని సిఫార్సు లేకుండా తీసుకున్న ఈ చర్య చెల్లుతుందా అన్నది సుప్రీంకోర్టు తేల్చాల్సి ఉంది. అయితే జమ్మూ–కశ్మీర్‌ మొదటినుంచీ కల్లోలంగా ఉండటం, అది ఉన్నకొద్దీ ఉగ్రరూపం దాలుస్తుండటం వాస్తవం. 2014లో అక్కడ ఉగ్రవాద ఘటనలు 222 జరిగితే నిరుడు అది 614కు చేరుకుంది. అప్పట్లో ఉగ్రవాదం కారణంగా భద్రతా దళాలకు చెందినవారు 47మంది మరణిస్తే, నిరుడు ఆ సంఖ్య 91కి చేరుకుంది. మత ఛాందసవాదుల ఆధిపత్యం గతంతో పోలిస్తే పెరిగింది.

ఇప్పుడు 370 రద్దును గట్టిగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ కూడా పరిస్థితి ఇంతగా దిగజారడానికి కారణమే. తన సుదీర్ఘపాలనా కాలంలో అది జమ్మూ–కశ్మీర్‌లో శాంతి నెలకొనడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. దానికితోడు ఇప్పటికే అక్కడున్న పాక్‌ అనుకూల ఉగ్రవాద ముఠాలకు తోడు ఇతర ఇస్లామిక్‌ దేశాల మిలిటెంట్ల జాడలు కూడా కనబడుతున్నాయి. ఈ దశలో నిర్ణయాత్మకంగా వ్యవహరించకపోతే మున్ముందు పరిస్థితి చేయి దాటిపోతుందన్న ఆందోళన కేంద్రానికి ఉన్నట్టు కనబడుతోంది. తాజా నిర్ణయాల విషయంలో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటివారిని సంప్రదిస్తే బాగుండేది. భారత్‌లో కశ్మీర్‌ విడదీయరాని భాగమని వారు దృఢంగా విశ్వసిస్తున్నవారే. ఏదేమైనా జమ్మూ–కశ్మీర్‌లో సాధ్యమైనంత త్వరగా సామరస్యం నెలకొనాలని, అది నిజమైన భూలోక స్వర్గంగా కాంతులీనాలని దేశ ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు