దేశానికి ‘గల్ఫ్‌’ కష్టాలు

8 Jul, 2020 01:14 IST|Sakshi

కరోనా వైరస్‌ మహమ్మారి చుట్టుముట్టడంతో భూగోళానికి చేటుకాలం దాపురించింది. ఒకపక్క ప్రపంచవ్యాప్తంగా ఆ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య కోటి 20 లక్షలకు చేరవవుతుంటే మృతుల సంఖ్య అయిదున్నర లక్షలకు ఎగబాకుతోంది. నెలల తరబడి అన్ని కార్యకలాపాలూ స్తంభించిపోవడం వల్ల ప్రతి దేశమూ ఒడిదుడుకుల్లో పడింది. ఒకప్పుడు బతుకు తెరువు కోసం తలుపు తట్టినవారిని అక్కున చేర్చుకున్న దేశాలే... వారి స్వేదంతో ఆకాశ హర్మ్యాలు నిర్మించుకున్న దేశాలే ఇప్పుడు వెనక్కిపొమ్మని హుకుం జారీ చేస్తున్నాయి. అందుకోసం రకరకాల నిబంధనలు అమల్లోకి తెస్తున్నాయి. గత కొన్ని నెలలుగా అందరూ భయపడుతున్నట్టే కువైట్‌ కూడా విదేశీయుల సంఖ్యను నియంత్రించే ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. 

దాని ప్రకారం కువైట్‌ దేశ జనాభాలో భారతీయులు 15 శాతం మించకూడదు. ఆ దేశ జనాభా 43 లక్షలు. అందులో భారతీయులు14.5 లక్షలు. ఇది చట్టమైతే వారిలో దాదాపు 8 లక్షలమంది నిష్క్రమించక తప్పదు. ఇతర గల్ఫ్‌ దేశాలు కూడా ఇలాంటి ఆలోచనే చేస్తున్నట్టు చెబుతున్నారు. అదే నిజమైతే ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చు. గల్ఫ్‌ దేశాల్లో భారతీయులు 90 లక్షలమంది ఉండొచ్చని ఒక అంచనా. ఇందులో పది శాతంమంది మాత్రమే నైపుణ్యం వున్న శ్రామికులు. మిగిలినవారంతా ఏదో ఒక పని చేసి పొట్టపోసుకుంటున్న వాళ్లే. వీరిలో అత్యధికం నిర్మాణ రంగం, పారిశుద్ధ్యం, రవాణా, ఆతిథ్యరంగాల్లో కార్మికులుగా పని చేస్తున్నారు.

2008లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక మాంద్యం రోజుల నుంచి గల్ఫ్‌ దేశాలన్నీ విదే శీయుల్ని అనుమతించడానికి సంబంధించిన నిబంధనల్ని కఠినతరం చేస్తూ వస్తున్నాయి. పర్యవ సానంగా అంతక్రితం దశాబ్దాలతో పోలిస్తే గల్ఫ్‌ దేశాలకు పోవడం కష్టమవుతోంది. కువైట్‌ ఇప్పుడు ఈ కొత్త చట్టం తీసుకొస్తే అంతంతమాత్రంగా వున్న అవకాశాలు మరింత తగ్గడం ఖాయం. కరోనా వైరస్‌కు తన పర భేదం లేదు. అన్ని దేశాలనూ అది సమానంగా ఊడ్చిపెడుతోంది. కరోనా వాతబడిన ఏ దేశం గణాంకాలు తీసినా గుండె గుభేలుమంటుంది. అన్ని దేశాలూ ఆర్థికంగా చతికిలపడ్డాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా చమురు ధరలు దారుణంగా పడిపోగా, ఈ తొలి త్రైమాసికంలో గల్ఫ్‌ చమురు, సహజవాయు ఎగుమతులు సైతం కుదేలయ్యాయి. భారత్, చైనాలకు అంతక్రితం ఎగుమతులతో పోలిస్తే 4 శాతం కోత పడితే, దక్షిణ కొరియా 7 శాతం, జపాన్‌ 8 శాతం తగ్గించుకున్నాయి. యూరప్‌ యూనియన్‌(ఈయూ), అమెరికాలకు వెళ్లే ఎగుమతులైతే భారీగా తగ్గాయి. ఈయూ 11 శాతం, అమెరికా 9 శాతం ఇంధన దిగుమతుల్ని తగ్గించుకున్నాయి. 

ఈ స్థాయిలో ఆదాయం పడిపోవడం గల్ఫ్‌ సంక్షోభ సమయం తర్వాత ఇదే మొదటిసారి.  2008–09 ఆర్థిక మాంద్యం తర్వాత గల్ఫ్‌ దేశాల పెట్టుబడులకు ఆసియా దేశాల్లో గిరాకీ ఏర్పడింది. స్థిరాస్తి, ఆరోగ్య రంగం, హైటెక్‌ సెక్టార్లలో ఆ దేశాలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. వాటిపై మంచి రాబడి కూడా లభిస్తోంది. కానీ ఆ రంగాలన్నీ ఇప్పుడు కుంటుబడ్డాయి. ప్రపంచ దేశాల్లో ఈ ఏడాది ఆఖ రుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) 30 శాతం తగ్గుతాయని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) ఈమధ్యే అంచనా వేసింది. వాస్తవానికి గత అయిదేళ్లుగా ఎఫ్‌డీఐలు క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి. అనేకులు ఆశిస్తున్నట్టు ఈ ఏడాది ఆఖరుకైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలు కుంటుందా లేదా అన్నది ఇప్పటికైతే ఖచ్చితంగా చెప్పే స్థితి లేదు. కరోనా వైరస్‌ మహమ్మారి విరుచుకుపడటానికి ముందున్న స్థితి రావాలన్నా వచ్చే ఏడాది డిసెంబర్‌కు సాధ్యం కావొచ్చని కొందరి అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో వలస ప్రజలను వీలైనంత మేర వదుల్చుకుందామని గల్ఫ్‌ దేశాలన్నీ చూస్తున్నాయి. ఆ దిశగా కువైట్‌ తొలి అడుగేసింది. 

వాస్తవానికి కరోనా వైరస్‌ మహమ్మారి ప్రతాపం చూపించడం మొదలెట్టిన నుంచీ గల్ఫ్‌ దేశాల్లో వుంటున్న వలస కార్మికులకు కష్టాలు అనేక రెట్లు పెరిగాయి. పశ్చిమాసియాలో వున్న కరోనా కేసుల్లో సగం యూఏఈ, కువైట్, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రైన్‌ వంటి గల్ఫ్‌ దేశాల్లోనే వున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా అన్ని రంగాలూ స్తంభించిపోవడంతో వలస కార్మికులందరినీ ఆ దేశాలు లేబర్‌ క్యాంపులకు తరలించాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు రోజూ ఇచ్చే ఆహారం పొట్లాలే అక్కడ తలదాచుకుంటున్నవారికి దిక్కయ్యాయి. ఆ శిబిరాలు కిక్కిరిసి వుండటంతో కరోనా వేగవంతంగా వ్యాపిస్తోంది. కనుకనే అక్కడ చిక్కుకున్న తమవారిని తీసుకురావాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెరిగాయి. లేబర్‌ క్యాంపుల్లో సదుపాయాలు అంతంతమాత్రంగా వున్నాయి. వాటిని సక్రమంగా నిర్వహించడం చేతకాక దాదాపు గల్ఫ్‌ దేశాలన్నీ చేతులెత్తేశాయి. ఏ దేశానికి ఆ దేశం తమ పౌరుల్ని వెంటనే ఇక్కడినుంచి తీసుకెళ్లాలంటూ అవి భారత్‌తోసహా అన్ని దేశాలనూ కోరాయి. పర్యవ సానంగా కేంద్ర ప్రభుత్వం వందేభారత్‌ మిషన్‌ కింద భారీయెత్తున వలస కార్మికుల్ని వివిధ మార్గాల ద్వారా స్వస్థలాలకు తీసుకొచ్చింది. 

గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్నవారు ఇక్కడ తమ కుటుంబాలకు పంపే మొత్తాలు చాలా ఎక్కువ. నిరుడు విదేశాల్లో స్థిరపడినవారు ఇక్కడికి పంపిన సొమ్ము 8,300 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇందులో అత్యధిక భాగం గల్ఫ్‌ దేశాల్లో వలస కార్మికులుగా వుంటున్నవారినుంచి వచ్చిందే. ఈ సొమ్మంతా ఇక్కడున్న మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ఆధారమవుతోంది. ఇప్పుడు తలెత్తిన కరోనా సంక్షోభం కారణంగా భారత్‌కు వలస కార్మికుల నుంచి వచ్చే మొత్తంలో 23 శాతం...అంటే 1,900 కోట్ల డాలర్లమేర  కోత పడొచ్చని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. ఇలా ఆదాయం తగ్గడంతోపాటు లక్షల్లో వెనక్కివస్తున్న వలస కార్మికులకు ఉపాధి చూపించడం కూడా సమస్యే. మొత్తానికి రాగలకాలమంతా ప్రపంచంతోపాటు మనకూ గడ్డుకాలమే. ఈ పరీక్షా సమ యాన్ని ఎలా అధిగమించగలమన్నది చూడాల్సివుంది.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు