తుపాకి రాజ్యంలో ఉన్మాదం

4 Oct, 2017 00:09 IST|Sakshi

ఆయుధాలపై ఉన్న యావను వదుల్చుకోవడానికి ససేమిరా సిద్ధపడని అమెరికా అందుకు మరోసారి మూల్యం చెల్లించింది. సోమవారం లాస్‌వెగాస్‌లో కోలా హలంగా సాగుతున్న సంగీత కచేరీని తన్మయులై వీక్షిస్తున్న వేలాదిమందిపై అక్కడికి సమీపంలో ఉన్న భవనం నుంచి విచక్షణారహితంగా కాల్పులు సాగించి ఒక ఉన్మాది 59మందిని పొట్టనబెట్టుకుని, మరో 515మందిని గాయపరిచాడు. 32వ అంతస్తు నుంచి ఇష్టానుసారం కాలుస్తుంటే ఎటునుంచి ఎవరు గురిపెట్టారో, ఎటు పోయి ప్రాణాలు దక్కించుకోవాలో తెలియక వేలాదిమంది పరుగులు తీశారు. ఇదంతా తమ ఘనతేనని ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ప్రకటించుకున్నా ఆ సంస్థ నెవరూ విశ్వసించే స్థితి లేదు.

అమెరికా విధానాలనూ, రాజకీయాలనూ తుపాకులే శాసిస్తున్న దుస్థితిలో ఇలాంటి ఉన్మత్త ఉదంతాలు నిరాటంకంగా కొనసాగడంలో వింతేమీ లేదు. ఇప్పుడు విషాద ఘటన చోటుచేసుకున్న లాస్‌వెగాస్‌ నెవడా రాష్ట్రం లోనిది. అక్కడ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నవారికంటే, అంటువ్యాధులతో మరణిస్తున్నవారికంటే తుపాకులకు బలవుతున్నవారి సంఖ్యే అధికంగా ఉన్నదంటే ఆయుధాలెంత విచ్చలవిడిగా పెరిగిపోయాయో అర్ధం చేసుకోవచ్చు. అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ లాస్‌వెగాస్‌ ఘటనపై విచారం వ్యక్తం చేసి ఉండొచ్చు. కానీ ఈ పాపంలో ఆయనా, ఆయన ప్రాతినిధ్యం వహి స్తున్న రిపబ్లికన్‌ పార్టీ తమ బాధ్యత నుంచి తప్పించుకోలేరు. తుపాకుల వినియో గాన్ని నియంత్రించడానికి ఉద్దేశించిన బిల్లు సెనేట్‌ ముందుకొచ్చినప్పుడల్లా రిపబ్లికన్లు గట్టిగా వ్యతిరేకిస్తూ వచ్చారు.

ఆఖరికి నిరుడు జూన్‌లో ఓర్లాండో నైట్‌ క్లబ్‌పై దాడి జరిగి 50మందిని కాల్చిచంపిన తర్వాత కూడా సెనేట్‌లో వచ్చిన ప్రతిపాదనలను వారు తోసిపుచ్చారు. ఈ మాదిరి తుపాకి సంస్కృతి అమెరికాలో మినహా ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు. బ్రిటన్‌తోసహా అభివృద్ధి చెందిన దేశాలన్నీ క్రమేపీ దానికి దూరమయ్యాయి. పరిమితులు విధించుకున్నాయి. అమెరికాలో కూడా తుపాకి లైసెన్స్‌ల జారీలో ఆంక్షలను అమలు చేస్తున్న రాష్ట్రాలు న్నాయి. ఆ రాష్ట్రాల్లో కాల్పుల ఘటనలు అతి స్వల్పంగా ఉన్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయినా వాటిని ఆదర్శంగా తీసుకోవడానికి ఫెడరల్‌ ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలూ నిరాకరిస్తున్నాయి.

సంక్షోభం తలెత్తినప్పుడు దాన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించి పరిష్కరిం చడం, భవిష్యత్తులో తలెత్తకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత. ప్రజల స్పంద నలను తెలుసుకోవడం, వాటిపై చర్చ జరిగేలా చూడటం, సహేతుకమైన నిర్ణయం తీసుకుని  సమాజాన్ని ఒప్పించడం దాని కనీస కర్తవ్యం. కానీ అమెరికాలో దేని దారి దానిదే. ఘటన జరిగిన రోజు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం మినహా ప్రభుత్వం వైపు చేసేదేమీ ఉండదు. అటు విపక్షం నుంచి చెదురుమదురు ప్రకటనలొచ్చినా వాటిని ఖండించేందుకు తుపాకి లాబీల నుంచి కొందరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

లాస్‌వెగాస్‌ ఘటన తర్వాత హిల్లరీ క్లింటన్‌ తుపాకులను అదుపు చేయా లని డిమాండ్‌ చేస్తే ఆ వెంటనే దాన్ని రాజకీయం చేయొద్దని విమర్శిస్తూ ట్విటర్‌ హోరెత్తింది. పైగా కాల్పుల ఘటన చోటు చేసుకున్నాక తుపాకులు ఉండాలా వద్దా అనే అంశంపై సర్వేలు జరగడం, వాటిల్లో అధిక సంఖ్యాకులు ఉండాలని కోరడం రివాజుగా మారింది. రెండేళ్లక్రితం ఒరెగన్‌ రాష్ట్రంలో కళాశాలలోకి ప్రవేశించి ప్రొఫెసర్‌తో పాటు మరో 9 మందిని ఒక ఉన్మాది కాల్చి చంపినప్పుడు అప్పట్లో రిపబ్లికన్‌ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న ట్రంప్, జెబ్‌ బుష్‌లిద్దరూ తుపాకుల నిషేధం డిమాండ్‌ను అవహేళన చేశారు. ‘సమస్య పరిష్కారం తుపా కుల నిషేధంలో లేదు. మరిన్ని తుపాకులు అందుబాటులోకి తీసుకురాకపోవ డంలో ఉంది’ అని వాదించారు. కళాశాల విద్యార్థుల వద్ద తుపాకులుంటే ఆ ఉన్మాదిని సులభంగా నిలువరించేవారని చెప్పారు.

తుపాకులు కొంటున్నవారెవరో, వారికి ఆ అవసరం ఎందుకొచ్చిందో తెలుసు కోవాలన్న ఆసక్తి  ప్రభుత్వాలకు ఉండటం లేదు. కొంటున్నవారి నేపథ్యం తెలియక పోవడం ప్రమాదానికి దారితీయొచ్చన్న సంశయంగానీ, అమ్మకాలపై నిఘా అవసరమనిగానీ వాటికి తోచడం లేదు. లాస్‌వెగాస్‌ ఘటనే తీసుకుంటే ఉన్మాది స్టీఫెన్‌ పెడాక్‌ చాలా సాధారణమైన వ్యక్తి అని, అతనికి ఏ సంస్థతోనూ సంబంధాల్లే వని అతడి సోదరుడు చెబుతున్నాడు. అలా అంటూనే అతన్ని కలిసి ఆర్నెల్లయిం దని అంటున్నాడు. అటు పోలీసులు సైతం పెడాక్‌పై గతంలో ఎలాంటి కేసులూ లేవంటున్నారు.

పెడాక్‌కు స్వయానా సోదరుడైన వ్యక్తికే సరైన సంబంధాలు లేనప్పుడు ఇరుగుపొరుగువారి గురించి చెప్పేదేముంది? సవ్యంగానే ఉన్నాడను కున్న వ్యక్తి ఒక హోటల్‌లో రూం తీసుకుని అక్కడ 45 తుపాకులు పోVó శాడంటే, ఆ సంగతి ఎవరికీ తెలియలేదంటే తామెంతటి ప్రమాదకర స్థితిలో ఉన్నామో అమెరికన్లు అర్ధం చేసుకోవాల్సి ఉంది.  ప్రపంచంలో ఉగ్రవాదం ఏమూలనున్నా అంతం చేస్తామని చెప్పే అమెరికా తన ఇంట ఏం జరుగుతున్నదో తెలుసుకోలేక పోవడం ఒక వైచిత్రి.

దాడి చేసిన వ్యక్తి ముస్లిం అయితే వెనువెంటనే ఆ చర్యను ఉగ్రవాదంగా ప్రకటించే ట్రంప్‌ ఈ ఉదంతంలో దాని ఊసెత్తలేదు. నెవడా చట్టం ప్రకారం విద్రోహ చర్య, భౌతికంగా హాని తలపెట్టడం, బలప్రయోగంతో నిర్బంధించడం, విధ్వంసం సృష్టించడం, భవనం లేదా మరే ఇతర ఆస్తులను, కమ్యూనికేషన్లు, రవాణా సదాపాయాలను విచ్ఛిన్నం చేయడం, ప్రకృతి వనరులకు నష్టం కలిగిం చడం వగైరాలు ఉగ్రవాదం కిందికొస్తాయని చెబుతున్నది.

లాస్‌ వెగాస్‌ ఉదం తంలో ఇవన్నీ వర్తించినా ఆ పదాన్ని ఉపయోగించకపోవడాన్నిబట్టి ట్రంప్‌ ఆంత ర్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఏటా తుపాకులు, తూటాల పరిశ్రమ రూ. 10,000 కోట్లకుపైగా లాభాలను ఆర్జిస్తూ వెలుగులీనుతుంటే రోడ్లపై అమాయకులు పిట్టల్లా రాలుతున్నారు. తుపాకి ఉండటం ఒక హోదాగా భావిస్తూ, ప్రాణానికి అదే గ్యారెంటీ అని నమ్ముతూ బతికితే అసలుకే మోసం వస్తుందని సగటు పౌరులు గ్రహించనంత వరకూ, పాలకులపై ఒత్తిడి తీసుకురానంత వరకూ ఇలాంటి ఉన్మాద చర్యలు ఆగవు.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు