మాటల మంటలు

12 Sep, 2019 01:05 IST|Sakshi

కులం, మతం అనేవి మన సమాజంలో చాలా సున్నితమైన అంశాలు. వాటిపై మాట్లాడవలసి వచ్చినా, స్పందించవలసి వచ్చినా ఎవరైనా అత్యంత జాగురూకతతో మెలగడం తప్పనిసరి. రాజకీయ రంగంలో, రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్నవారైతే ఈ విషయంలో మరిన్ని రెట్లు మెల కువతో వ్యవహరించడం తప్పనిసరి. ఆ మాటలు కొంచెం అటూ ఇటూ అయినా... వేరే అర్థం స్ఫురి స్తున్నాయని అనిపించినా అలా మాట్లాడినవారికి మాత్రమే  కాదు... మొత్తం సమాజానికే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా రాజస్తాన్‌లో సోమవారం జరిగిన అఖిల్‌ బ్రాహ్మణ్‌ మహాసభ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై, ఆ తర్వాత చేసిన ట్వీట్‌ ఇప్పుడు వివాదాస్పదం అయింది. ‘జన్మతః బ్రాహ్మణులు ఉత్కృష్టమైనవారని సమాజం భావిస్తుంద’ని ఆయన ఆ ట్వీట్‌లో చెప్పారు. 

వారి త్యాగం, తపస్సువల్ల వారు ఆ స్థాయికి చేరుకున్నారని, వారు సమాజానికి మార్గదర్శకులుగా ఉంటున్నారని కూడా కొనియాడారు. సమాజంలో విద్య, విలువలు విస్తరించడంలో వారి పాత్ర ఉన్నదన్నారు. భిన్న సామాజికవర్గాలు సభలూ, సమావేశాలు నిర్వ హించుకోవడం, వాటికి ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకావడం ఇటీవలికాలంలో పెరి గింది. ఆ వర్గాల వెనకున్న ఓటు బ్యాంకు ఇందుకు కారణమని వేరే చెప్పనవసరం లేదు. అలా సభలకు హాజరయ్యే నేతలు సహజంగానే ఆ వర్గం గురించి నాలుగు మంచి మాటలు చెబుతారు. తమ వంతుగా ఆ సామాజిక వర్గానికి చేయదల్చుకున్నదేమిటో ప్రకటిస్తారు. అయితే ఆ క్రమంలో మాట్లాడే మాటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని వారు గుర్తించాలి. 

ట్వీట్‌లో ఓంబిర్లా ప్రస్తావించిన ఇతర అంశాల మాటెలా ఉన్నా ‘జన్మతః వారు ఉత్కృష్ట మైనవార’ని అనడం ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. పౌరుల కులం, మతం, ప్రాంతం, జెండర్‌ వగైరాల ఆధారంగా వివక్ష ప్రదర్శించకూడదని చెబుతోంది. ఒక సామాజికవర్గాన్ని ప్రశం సిస్తే, వారి కృషిని మెచ్చుకుంటే దాంతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా అభ్యంతరపెట్టే వారుండరు. కానీ సమాజంలో అందరికంటే ఫలానా సామాజిక వర్గం ఉన్నతమైనదని చెప్పడ మంటే ఇతరులంతా వారితో పోలిస్తే తక్కువవారని ధ్వనించడమే అవుతుంది. ఇలా నోరు జార డంలో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ నేత చంద్రబాబును చెప్పుకోవాలి. ఆయన నేరుగా దళితుల్ని కించపరుస్తూ మాట్లాడారు. ‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని ప్రశ్నించి అందరినీ దిగ్భ్రాంతిపరిచారు. గుజరాత్‌ స్పీకర్‌ రాజేంద్ర త్రివేది నిరుడు ఏప్రిల్‌లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్, ప్రధాని నరేంద్ర మోదీలు బ్రాహ్మణులేనని వ్యాఖ్యానించి పెద్ద దుమారం రేపారు. ఆ తర్వాత తన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని వివరణ నిచ్చారు. 

వర్తమాన పరిస్థితుల్లో కుల సమీకరణలు పెరిగాయి.  ఒకప్పుడు సమాజంలో అణచివేతకు గురయ్యామనుకునే వర్గాలవారు తమ డిమాండ్ల సాధనకు ఏకమయ్యేవారు. తాము ఎదుర్కొం టున్న ఇబ్బందుల్ని ఏకరువు పెట్టేవారు. ఆ వర్గాలవారు కొద్దో గొప్పో హక్కులు సాధించుకోగలిగా రంటే, తమ పట్ల సమాజంలో సాగుతున్న వివక్షను ఏమేరకైనా రూపుమాపగలిగారంటే అలా ఎలు గెత్తి చాటడం పర్యవసానంగానే. పాలకులుగా ఉన్నవారు భిన్న సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను తమంత తాము గుర్తించి పరిష్కరించడం సాధ్యంకాదు. ఆయా వర్గాలు ముందుకొచ్చి తమ సమస్యలు చెప్పుకున్నప్పుడే పరిష్కారం దిశగా బలమైన అడుగులు పడతాయి. వ్యవసా యంలో సంక్షోభం ఏర్పడి అది అంతకంతకు పెరుగుతుండటం, అందులో ఉపాధి అవకాశాలు నానాటికీ అడుగంటడం, ఆర్థిక సంస్కరణల అనంతరం కులవృత్తులు దెబ్బతినడం, ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు మునుపటితో పోలిస్తే తగ్గుముఖం పట్టడం వంటివన్నీ ఇతర కులాల్లో సైతం అభద్రతాభావం ఏర్పరిచాయి. 

రిజర్వేషన్లు అందుకుంటున్న సామాజికవర్గాల్లో వాటిని వర్గీక రించాలన్న డిమాండ్లు ముందుకొచ్చాయి. గుజరాత్‌లో వ్యాపారాల్లో, చిన్న చిన్న కుటీరపరిశ్రమల్లో నిమగ్నమై ఉండే పటేళ్లు తమకు రిజర్వేషన్లు కావాలని నాలుగేళ్ల క్రితం ఉద్యమించారు. వేరే రాష్ట్రాల్లో కూడా ఇలాంటి డిమాండ్లతోనే భిన్న సామాజిక వర్గాలు రోడ్డెక్కాయి. జనరల్‌ కేటగిరిలో ఉండే కొన్ని కులాలు తమను బీసీలుగా గుర్తించాలని ఆందోళనలు చేస్తే, తమను ఎస్టీల్లో చేర్చాలని కొన్ని బీసీ కులాలు డిమాండ్‌ చేశాయి. నిజానికి ఈ పరిస్థితులను గుర్తించబట్టే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో జనరల్‌ కేటగిరీలోని నిరుపేద వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. జనరల్‌ కేటగిరీలోని భిన్న సామాజిక వర్గాలు సమావేశాలు జరుపుకోవడం, తీర్మా నాలు చేయడం, ఆందోళనలకు దిగడం పర్యవసానంగానే ఈ కోటా నిర్ణయం వెలువడింది.

ఓంబిర్లా సాధారణ రాజకీయవేత్త అయితే ఆయన చేసిన వ్యాఖ్యల గురించి పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదేమో! కానీ ఆయన దేశంలోని అత్యున్నత చట్టసభలో స్పీకర్‌గా ఉన్నారు. కనుకనే ఇప్పుడింత వివాదం రేగింది. ఓంబిర్లా రాజకీయాలకు కొత్త కాదు. ఆయన 2003 నుంచి వరసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో కోట నియోజకవర్గం నుంచి గెలిచి తొలిసారి పార్లమెంటులో ప్రవేశించారు. అంతక్రితం ఆయన ఆరెస్సెస్‌లో చురుగ్గా పనిచేసినవారు. సామాజిక కార్యకర్తగా గుర్తింపుపొందినవారు. ఇప్పుడు స్పీకర్‌గా సమర్ధవంతంగా పనిచేస్తూ సభలో విపక్షాలనుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. గత నెలలో పార్లమెంటు సమా వేశాలు ముగిసిన సందర్భంగా లోక్‌సభలో కాంగ్రెస్, ఆర్‌ఎస్‌పీ తదితర పార్టీల నేతలు చేసిన ప్రసంగాలే ఇందుకు నిదర్శనం. అటువంటి నాయకుడు ఒకరి గురించి మంచిమాటలు చెబుతున్న ప్పుడు అవి వేరే అర్ధం స్ఫురిస్తున్నాయేమోనన్న మెలకువ ప్రదర్శించడం అవసరం.

మరిన్ని వార్తలు