కాంగ్రెస్‌ స్వయంకృతం

11 Mar, 2020 00:33 IST|Sakshi

కాంగ్రెస్‌కు సాక్షాత్తూ అధిష్టానమే సమస్యగా మారిన వేళ మధ్యప్రదేశ్‌లోని ఆ పార్టీ విభాగంలో ఉన్నట్టుండి ముసలం బయల్దేరి, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పుట్టి మునగడం ఎవరికీ ఆశ్చర్యం కలి గించదు. అక్కడేం జరుగుతోందో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థంకాని అయోమయంలో సారథులు కూరుకుపోయివుండగానే, కమల్‌నాథ్‌ కేబినెట్‌లోని ఆరుగురు మంత్రులతోసహా 17 మంది ఎమ్మెల్యేలు బెంగళూరుకు ఎగిరిపోయారు. ఈ సంఖ్య చూస్తుండగానే 21కి చేరింది. వారంతా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తామంటున్నారు. ఈ డ్రామాకు కథానాయకుడైన జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం కాంగ్రెస్‌కు చెల్లుచీటీ ఇచ్చి బీజేపీవైపు అడుగులేస్తున్నారు.

ఆ పార్టీ టికెట్‌పై రాజ్యసభకు ఎన్నిక కావడం సింధియాకు ఇక రోజుల్లో పని. రాజీనామా సంగతి తెలిశాక, ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఒక ప్రకటన చేసి పరువు కాపాడుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్‌ నాయకత్వం! ఏమైతేనేం 230మంది సభ్యులుండే అసెంబ్లీలో 114మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్‌ బలం 93కి పడిపోయింది. మరో 30మంది కాషాయ తీర్థం తీసుకోవడానికి సంసిద్ధులవుతున్నారని బీజేపీ నేతలు చెప్పే మాటల్లో నిజమెంతోగానీ... ఈ దశలో స్పీకర్‌ది కీలకపాత్ర. మధ్యప్రదేశ్‌ డ్రామా ఎన్నాళ్లు కొనసాగాలో ఆయన చర్యలే నిర్దేశిస్తాయి. ఆ తర్వాతే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందా లేక అర్ధాంతరంగా ఎన్నికలొస్తాయా అన్నది తేలుతుంది.  

ఇదంతా బీజేపీ కుట్రని ఎంపీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ ఆరోపిస్తున్నారు. కానీ ఈ పరిణామాలకు బీజేపీని నిందించి ప్రయోజనం లేదు. ఏమీ లేని గోవాలోనే పావులు కదిపి అధికారం చేజిక్కించుకోగలిగిన బీజేపీ... అధికారం అంచుల వరకూ వెళ్లి ఆగిపోయిన మధ్యప్రదేశ్‌లో మౌనంగా ఉంటుందనుకోవడం తెలివితక్కువతనం. గతవారం ఎనిమిదిమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను అర్ధరాత్రి గురుగ్రామ్‌లోని హోటల్‌కు తరలించిన ఉదంతంలో ఎలాగోలా కాంగ్రెస్‌ పరువు కాపాడుకోగలిగింది. వారందరినీ వెనక్కు తీసుకు రాగలిగింది. ఈసారి మాత్రం పరిస్థితి చేయి దాటిపోయింది. మధ్యప్రదేశ్‌లో పార్టీ కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య, దిగ్విజయ్‌సింగ్‌ వర్గాలుగా చీలిపోయిందని, ఆ ఇద్దరూ ఏకమై జ్యోతిరాదిత్యను ఇరకాటంలోకి నెట్టారని పార్టీ సారథులకు తెలియందేమీ కాదు.

కేబినెట్‌లో కీలక పదవులన్నీ కమల్‌నాథ్, దిగ్విజయ్‌ అనుచర ఎమ్మెల్యేలకే దక్కాయి. పర్యవసానంగా జ్యోతిరాదిత్యలో ఏర్పడ్డ అసంతృప్తిని పారదోలడానికి, ఆయన వర్గానికి కూడా తగిన అవకాశాలివ్వడానికి పార్టీ పెద్దలు ప్రయత్నించలేదు. పైపెచ్చు సోనియా, రాహుల్‌గాంధీలను కలిసి తన గోడు వెళ్లబోసుకుందామని సింధియా చేసిన ప్రయత్నం ఫలించలేదు. పార్టీలో తాను సంతృప్తిగా లేనని సింధియా కొద్దికాలంనుంచి పరోక్షంగా చెబుతూనేవున్నారు. కేంద్ర ప్రభుత్వం 370 అధికరణను రద్దు చేసి కశ్మీర్‌ పత్రిపత్తిని మార్చినప్పుడు పార్టీ వైఖరికి భిన్నంగా వ్యాఖ్యానించి ఆయన కలకలం సృష్టించారు. ఆ తర్వాత కూడా ఆయన పార్టీకి దూరంగానే వుంటున్నారు.

మధ్యప్రదేశ్‌లోనే కాదు... అధికారం ఉందా లేదా అన్న తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ ఇలా అంతఃకలహాలతో సతమతమవుతోంది. వాస్తవానికిది కాంగ్రెస్‌ పార్టీలో పాతుకుపోయిన పాత తరం నేతలకూ, పార్టీ కోసం శ్రమిస్తూ అందులో తమ భవిష్యత్తును వెదుక్కుంటున్న యువతరానికీ మధ్య సాగుతున్న సంకుల సమరం. చుట్టూ చేరిన వందిమాగధుల బృందగానం తప్ప మరేమీ వినడానికి ఇచ్చగించని అధినేత్రి సోనియాగాంధీకి ఈ యువతరమంటే మొదటినుంచీ అనేకానేక శంకలు. సొంతంగా ఆలోచించేవారన్నా, స్వతంత్రంగా ఎదుగుతారనుకున్నా వారిని దూరం పెట్టడం ఆమె ఒక విధానంగా మార్చుకున్నారు.

పార్టీలో యువతరానికి ప్రాధాన్యమిస్తానని, వారసత్వాన్ని పక్కనబెట్టి పనిచేయడం ఒక్కటే ప్రాతిపదికగా తీసుకుంటామని చెప్పిన రాహుల్‌గాంధీ  పార్టీలో తన మాట చెల్లుబాటు కాకపోవడం, అడుగడుగునా తల్లి జోక్యం పెరగడం చూశాక చాన్నాళ్లక్రితమే కాడి పారేశారు. అడపా దడపా మీడియానుద్దేశించి మాట్లాడటం తప్ప పార్టీలో జరిగే ఏ విషయాలు తనకు పట్టనట్టు ఆయన వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వర్గంగా ముద్రపడి, కేవలం అందువల్లనే నిరాదరణకు గురవుతున్న నేతలకు వేరే ప్రత్యామ్నాయం ఏముంటుంది?

ఎన్నికలకు ముందు జ్యోతిరాదిత్యకు పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించి, ఫలితాల తర్వాత ఆయనకే పట్టం గడతామన్న అభిప్రాయం కలిగించిన కాంగ్రెస్‌...అటుపై ఆ యువ నాయకుడిని పక్కకు నెట్టి కమల్‌నాథ్‌ని పీఠం ఎక్కించింది. మధ్యప్రదేశ్‌నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎన్నికయ్యే అవకాశం వుండగా, ఖచ్చితంగా వస్తుందనుకున్న ఒక్క సీటుకూ దిగ్విజయ్‌సింగ్‌ కాచుక్కూర్చున్నారు. ఆయనకు అది దక్కకుండా చేయడానికి ప్రియాంకగాంధీ పోటీ చేయాలన్న డిమాండు ఈమధ్యే బయల్దేరింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన జ్యోతిరాదిత్య ప్రస్తుత పరిస్థితుల్లో తనకు రాజ్యసభ అవకాశం రావడం అసాధ్యమని గ్రహించివుంటారు.

ఈ పార్టీలో తనకు రాజకీయంగా భవిష్యత్తు లేదన్న నిర్ణయానికొచ్చివుంటారు. రాజస్తాన్‌లోనూ సచిన్‌ పైలెట్‌కు ఇలాంటి పరిస్థితే వుంది. అధికారం లేకుండా బతకలేనని జ్యోతిరాదిత్య నిరూపించారని, అలాంటి నేతలు ఎవరైనా పార్టీని వదిలిపోవచ్చని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ చేసిన వ్యాఖ్యానం ఎవరినుద్దేశించి చేసిందో సచిన్‌ పైలెట్‌ గ్రహించకపోరు. మధ్యప్రదేశ్‌ డ్రామా పూర్తయ్యాక రాజస్థాన్‌లో అది మొదలైనా ఆశ్చర్యం లేదు. కనీసం ఈ దశలోనైనా కాంగ్రెస్‌ అధినాయకత్వం మేల్కొనకపోతే, జనంలో పలుకుబడివున్న నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించి దానికి జవసత్వాలు కలిగించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించకపోతే పార్టీ కనుమరుగు కావడం ఖాయం. 

మరిన్ని వార్తలు