నికార్సయిన ఓటుకు ఏదీ దారి?

14 Dec, 2018 01:12 IST|Sakshi

పంచాయతీ మొదలుకొని పార్లమెంటు వరకూ జరిగే వివిధ ఎన్నికలు సందేహాస్పదంగా, పరిహా సాస్పదంగా మారడం ప్రజాస్వామ్యానికెంతో చేటు తెస్తుంది. లక్షలాదిమంది నిజమైన ఓటర్ల పేర్లు జాబితాల నుంచి మాయం చేయడం, బోగస్‌ ఓటర్లను చేర్చడం వగైరా పనులకు పాల్పడుతున్న  వారు చేస్తున్నది అదే. ఎన్నికల్లో వ్యక్తం కావలసిన పరిణత జనవాణికి పాతరేయడం, ప్రజాస్వా  మ్యాన్ని నేతిబీరలో నెయ్యిగా మార్చడం ఈ దొంగ ఓట్ల సృష్టికర్తల ధ్యేయం. న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) పెద్దలను గురువారం కలిసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు, ఇతర నాయ కులు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రమేయంతో బోగస్‌ ఓట్లు వచ్చిచేరాయని ఫిర్యాదు చేశారు.

మొత్తం 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల్లో  మూడు నెలలక్రితం విడుదలైన ఓటర్ల జాబి తాలను పోలింగ్‌ కేంద్రాలవారీగా అధ్యయనం చేశాక దాదాపు 35 లక్షలమంది నకిలీ ఓటర్లు ఉన్నట్టు ఆ పార్టీ గుర్తించింది. ఈ బోగస్‌ ఓట్లను వివిధ కేటగిరీల కింద విభజించి, దేనికింద ఎంత  మంది ఉన్నారో వివరించింది. గత నెలలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ బోగస్‌ ఓటర్ల సంఖ్య దాదాపు 53 లక్షలు ఉండొచ్చని ఆరోపించారు. ఒక్క ఓటు తేడా కూడా గెలుపోటముల్ని నిర్ణ యించే వ్యవస్థ అమలవుతున్నచోట ఇలా లక్షలకొద్దీ బోగస్‌ ఓట్లు చలామణి కావడం ఎంత ప్రమా దకరమో వేరే చెప్పనవసరం లేదు. ఈ వ్యవహారం ఒకరో, ఇద్దరో వ్యక్తుల వల్ల అయ్యేది కాదు. కొన్ని ముఠాలు పనిగట్టుకుని కోట్ల రూపాయలు వెచ్చించి ఒక పథకం ప్రకారం చేయకపోతే ఇదంతా జరగదు.

బోగస్‌ ఓట్ల తీరుతెన్నులు గమనిస్తే దీని వెనకున్న దొంగల సృజనాత్మకత బయటపడుతుంది. ఒకే గుర్తింపు కార్డుతో రెండుమూడు చోట్ల ఓట్లుండటం... పేరు, చిరునామాతోసహా అన్ని వివ రాలూ సక్రమంగా నమోదై ఉన్నా అసలు అలాంటి మనుషుల్లేకపోవడం, వయసు తేడాతో ఒకే పేరుండటం... తండ్రి పేరు/భర్త పేరు వేరుగా ఉండి ఒకే చిరునామా, పేరు ఉండటం... ఓటు నమోదుకు అవసరమైన కనీస వయసు కంటే తక్కువగా లేదా వందేళ్లకంటే ఎక్కువగా ఉండ టం–ఇలా అనేకానేక కేటగిరీల్లో ఈ బోగస్‌ ఓటర్లున్నారు. కొందరి వయసు చూస్తే వారు ప్రజా స్వామ్య భావనే లేని మొఘల్‌ కాలంలో పుట్టారా అన్న సందేహం తలెత్తుతుంది. ఒక వివాహిత వయసు అయిదేళ్లుగా నమోదైంది.

ఇలా దొంగ ఓట్ల నమోదు మాత్రమే కాదు, నికార్సయిన ఓట ర్లలో తమకు వ్యతిరేకులని నిర్ధారణైనవారి ఓట్లను చడీ చప్పుడూ లేకుండా తొలగిస్తున్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియకు వినియోగించే సిబ్బంది కోసం, జాబితాల, గుర్తింపుకార్డుల ప్రచురణ కోసం ఈసీ కోట్లాది రూపాయలు వ్యయం చేస్తోంది. కానీ అక్రమార్కులు దానితో పోటీ పడి ఆ సిబ్బం దిని ప్రలోభపరిచి మరిన్నిరెట్లు అధికంగా ఖర్చు చేస్తున్నారు. నిజానికిది దేశద్రోహంతో సమా నమైన నేరం. కానీ దురదృష్టమేమంటే... ఈ నేరాన్ని పసిగట్టడానికి అవసరమైన ఉపకరణాలను రూపొందించుకోవడంలో, దొంగలను పట్టుకోవడంలో ఎన్నికల సంఘం పదే పదే విఫలమవు తోంది. ఒక రాజకీయ పార్టీ వివిధ ఉద్యమాల్లో, కార్యక్రమాల్లో తలమునకలవుతూ కూడా తనకున్న పరిమితుల్లో మూడు నెలల వ్యవధిలో ఇన్ని లక్షల నకిలీ ఓటర్లను గమనించి బట్టబయలు చేసిన ప్పుడు ఎన్నికల సంఘం ఇంకెంత చేయాలి? 

నిజానికి ప్రజాస్వామ్య ప్రక్రియను భ్రష్టు పట్టించడానికి కంకణం కట్టుకున్నవారు చేస్తున్న అనేకానేక పనుల్లో ఓటర్ల జాబితాను ఏమార్చడం ఒక అంశం మాత్రమే. మిగతావన్నీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువరించాక, కోడ్‌ అమల్లోకొచ్చాక మొదలవుతాయి. ప్రభుత్వ విభాగాలను విని యోగించుకుని అవసరమైన ప్రాంతాలకు డబ్బు మూటలు తరలించడం...తమ రాజకీయ ప్రత్య ర్థులను అక్రమ కేసులతో బెదిరించటం, భౌతికదాడులకు పూనుకోవటం, వారిపై లేనిపోని వదం తులు సృష్టించటం, ఓటర్లను ప్రలోభపర్చడానికి దొంగ వాగ్దానాలు చేయటం, డబ్బు పంపిణీ– ఇలా అనేకానేక మార్గాల్లో జనాభిప్రాయాన్ని వమ్ము చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దోషరహి తంగా ఓటర్ల జాబితాలను రూపొందించటంలోనే విఫలమవుతున్న ఎన్నికల సంఘం...ఇతర పెడ ధోరణుల్ని సరిచేయడంలోనూ అదే పోకడ కనబరుస్తోంది. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో రూ. 145 కోట్లు పట్టుబడ్డాయి. ఇందులో అత్యధిక భాగం ఆంధ్ర ప్రాంతంనుంచే తరలివచ్చిందని కథనాలు చెబుతున్నాయి. ఏ తనిఖీకీ దొరక్కుండా అంతకు ఎన్నో రెట్ల డబ్బు గమ్యస్థానాలకు చేరిందని అంటున్నారు. 

దేశంలో ఓటర్ల సంఖ్య 80 కోట్ల పైమాటే. కనుక నకిలీ ఓటర్లను పసిగట్టడం ప్రయాసతో కూడిన పనే కావొచ్చు. కానీ అసాధ్యమైతే కాదు. కావలసిందల్లా సంకల్పం. ఇప్పుడు ఉన్నత స్థాయి సాంకేతికత అందుబాటులోకొచ్చింది. ఐటీలో రూపొందిన కృత్రిమ మేథ ఎన్నో సంక్లిష్టతలను లిప్తపాటులో అధిగమించడానికి తోడ్పడుతోంది. అదీగాక మన దేశంలో ఆధార్‌ అమల్లోకొచ్చి పదేళ్ల వుతోంది. దాన్ని ఎన్నిటికో తప్పనిసరి చేస్తున్నారు. చాలాసార్లు సంక్షేమ పథకాలను ఎగ్గొట్టడానికి సాకుగా వాడుతున్నారు. కానీ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకోవడానికి తప్పనిసరైన ఓటరు కార్డుకు మాత్రం ఎందుకు అనుసంధానించరు? ఓటర్ల జాబితాలో అవకతవకలున్నాయని నిర్ధారణ అయ్యాక కారకులపైనా, సూత్రధారులపైనా చర్యలెందుకు తీసుకోలేకపోతున్నారు? అవక తవకల జాబితా ఓటర్ల మొహానకొట్టి దొంగ ఓట్లున్నా, ఓటు మాయమైనా మా బాధ్యత లేదన్నట్టు ప్రవర్తించడం సరైందేనా? ఈ విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ చేసిన డిమాండ్‌ ధర్మబద్ధమైనది. దొంగ నోట్ల–దొంగ ఓట్ల రాజ్యాన్ని స్థాపించి, ఊపిరున్నంతవరకూ సింహాసనాన్ని అంటిపెట్టుకుని ఉండాలనుకునే కుట్రదారుల ఎత్తుల్ని అంతమొందించకపోతే ప్రజాస్వామ్యానికి అర్ధం లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మేల్కొని సమగ్రమైన చట్టాన్ని రూపొందించటానికి పూనుకోవాలి.


 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు