బీఎస్‌ఎన్‌ఎల్‌ పునరుజ్జీవం

26 Oct, 2019 00:31 IST|Sakshi

ఇంట్లో ఫోన్‌ సౌకర్యం ఉండటం సమాజంలో గౌరవప్రతిష్టలకు చిహ్నంగా భావించే రోజుల్లో టెలి ఫోన్‌ విభాగం ఎవరికీ అందనంత ఎత్తులో ఉండేది. సంపన్నులు, రాజకీయ పలుకుబడి ఉన్నవారు ఎవరో ఒకరితో సిఫార్సు చేయించుకుని ఇంటికి ఫోన్‌ అమర్చుకునేసరికి తాతలు దిగొచ్చేవారు. ఆ విభాగం కాస్తా భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌)గా మారిన తర్వాత క్రమేపీ ఎవరికీ అక్కర్లేని, ఎవరూ పట్టించుకోని సంస్థగా అది రూపాంతరం చెందింది. అంతకు చాలాముందే...అంటే 1986లో న్యూఢిల్లీ, ముంబై మహానగరాల్లో కార్యకలాపాలపై దృష్టిసారించేందుకు మహానగర్‌ టెలి ఫోన్‌ నిగమ్‌(ఎంటీఎన్‌ఎల్‌) పేరిట వేరే ఒక లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటుచేశారు. కొన్నాళ్లుగా ఆ రెండు సంస్థలూ సిబ్బందికి జీతాలు చెల్లించలేని స్థితికి చేరుకున్నాయని, ఎప్పుడు మూతబడతాయో... ఉన్న ఉద్యోగం కాస్తా ఎప్పుడు పోతుందో తెలియని అయోమయావస్థలో సిబ్బంది ఉన్నారని తెలిసినప్పుడు ఆశ్చర్యమూ, బాధ కలుగుతాయి.

కానీ బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం దాని పునరుద్ధ రణకు భారీ ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించి సిబ్బందిలో దీపావళికి ముందే వెలుగులు నింపింది. కేంద్రం నిర్ణయం ప్రకారం ఆ రెండు సంస్థలూ విలీనమై ఒకే సంస్థగా ఏర్పడతాయి. స్వచ్ఛందంగా తప్పుకోవాలనుకునేవారికి మంచి ప్యాకేజీ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. వీటితోపాటు సంస్థ మూడే ళ్లుగా ఎదురుచూస్తున్న 4జీ స్ప్రెక్ట్రమ్‌ కేటాయించాలని కూడా తీర్మానించారు. పదవీవిరమణపై ఒత్తి ళ్లేమీ ఉండబోవని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ హామీ ఇచ్చారు. సంస్థల ఆస్తులను అమ్మడం లేదా లీజుకివ్వడం ద్వారా రూ. 37,500 కోట్లు సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో 1.68 లక్షలమంది సిబ్బంది ఉండగా, ఎంటీఎన్‌ఎల్‌లో 22,000మంది ఉన్నారు. ఈ రెండు సంస్థలకూ ఉన్న రుణభారం రూ. 40,000 కోట్లు. టెలికాం రంగంలో గుత్తాధిపత్యం ఉన్నప్పుడు అదొక వెలుగు వెలిగినా, అనంతరకాలంలో ప్రైవేటు ఆపరేటర్లు రంగ ప్రవేశం చేయడంతో ఆ పోటీని తట్టుకోవడం దానివల్ల కాలేదని, కనుకనే క్రమేపీ నీరసించిందని అందరూ అనుకుంటారు. అందులో అర్థసత్యం మాత్రమే ఉంది.

బీఎస్‌ఎన్‌ ఎల్‌గా ఆవిర్భవించిన 2000 సంవత్సరం నుంచి 2009 వరకూ అది లాభార్జనలోనే ఉంది. ఆ తర్వాత సైతం ఎంతో కొంత మేర మెరుగ్గానే ఉంది. అన్ని రకాల పోటీలనూ తట్టుకుని అది నిలబడగలిగింది. టెలికాం రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కున్న అనుభవం ముందుగానీ, దానికి అందుబాటులో ఉన్న వనరుల ముందుగానీ ఏ సంస్థ అయినా దిగదుడుపేనన్నది మరిచిపోకూడదు. అసలు టెలికాం రంగం నుంచి ప్రభుత్వం తప్పుకోవడం సరికాదని, దాన్ని సంస్థగా మారిస్తే ప్రభుత్వం రూపొందించే విధానాలకూ, దాని నిర్వహణకూ మధ్య అగాధం ఏర్పడుతుందని, అది చివరకు ఎటూ కదల్లేని స్థితికి చేరుతుందని అప్పట్లోనే టెలికాం యూనియన్లు ఆందోళన వెలిబుచ్చాయి. దాన్ని చివరకు ప్రైవేటీకరించే ప్రతిపాద నలు మొదలవుతాయని ఆరోపించాయి. ఆ విభాగాన్ని అలాగే కొనసాగనిచ్చి, వృత్తిపరమైన స్వేచ్ఛనీ యాలని కోరాయి. నిజమే... ఒక కార్పొరేషన్‌గా దాన్ని రూపొందించాలనుకున్నప్పుడు ఆ రంగంలో నిష్ణాతులైనవారికి బాధ్యతలు అప్పగించి, వారికి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనివ్వాలి.

కానీ విధానపరమైన నిర్ణయాలన్నీ ప్రభుత్వాలు తీసుకుంటూ వాటి పర్యవసానాలకు మాత్రం సంస్థను నిందించడం రివాజుగా మారింది. ఏ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాలు వచ్చినా ఇదే తంతు నడిచింది. ఇందుకు 4జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపే ఉదాహరణ. ఇతర ప్రైవేటు సంస్థలన్నిటికీ ఎప్పుడో 2016లో దక్కిన ఆ స్పెక్ట్రమ్‌ కోసం బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ సంస్థలు మూడేళ్లు ఎదురుచూడాల్సివచ్చింది. తీరా దాన్ని కేటాయించాలన్న నిర్ణయం తీసుకునేసరికి ఈ రంగమంతా 5జీ స్పెక్ట్రమ్‌ కోసం ఉవ్విళ్లూ రుతోంది. ఈ సంస్థల్లో సమస్యలున్నమాట వాస్తవమే. కానీ ఇతర సంస్థలకు దీటుగా నిలబడకపోతే చందాదారులంతా వలసపోతారు. అసలు ప్రైవేటు ఆపరేటర్లకు లబ్ధి చేకూర్చడమే ఈ జాప్యానికి కారణమని సిబ్బంది సంఘాలు ఆరోపించాయి. ఈ రెండింట్లో దేన్ని దేనితో కలపాలన్న అంశంలో నిర్ణయం తీసుకోవడానికి పదేళ్లుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి.

ఎంటీఎన్‌ఎల్‌ లిస్టెడ్‌ కంపెనీ. బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్పొరేషన్‌. ఎంటీఎన్‌ఎల్‌ లిస్టెడ్‌ కంపెనీ ప్రతిపత్తి రద్దుచేయాలా, బీఎస్‌ఎన్‌ఎల్‌ను సైతం ఆ దోవకు మళ్లించాలా అన్నదే ఈ సుదీర్ఘ మీమాంస సారాంశం. ఆ సంగతలా ఉంచితే ఇన్నాళ్లుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ 3జీ స్పెక్ట్రమ్‌పైనే బండి లాగిస్తూ, అక్కడక్కడ 4జీ సేవలు అందిస్తోంది. కాబట్టి భారీగా నష్టాలు చవిచూస్తోంది. ఇన్ని కష్టాల్లో కూడా అది 12 కోట్లమంది ఖాతాదార్లతో, మార్కెట్‌లో 11 శాతం వాటాతో, రూ. 20,000 కోట్లకుపైగా వార్షిక ఆదాయంతో ఉన్నదంటే ప్రజల కున్న విశ్వాసం కారణం. చంద్రబాబువంటి ఏలికలు బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు ఆపేసి ప్రైవేటుకిస్తా మంటూ బేరాలు పెట్టారు.

ఇప్పుడు ప్యాకేజీ ప్రకటించినంత మాత్రాన ఆ సంస్థ సవ్యంగా మనుగడ సాగిస్తుందని తోచదు. ఎందుకంటే 4జీ సేవల కోసం తహతహలాడినవారంతా ఇతర ఆపరేటర్ల వద్దకు వలసపోయారు. ఇది ‘జియో’ యుగం! ఇప్పుడుంతా ధరల పోటీ నడుస్తోంది. ఆ సేవల్లో కొత్తగా అడుగుపెట్టే సంస్థ వాటి కన్నా చవగ్గా, మెరుగ్గా ఉండగలదా అన్నదే ప్రధాన అంశం. పైగా 4జీ కేటాయించాక అది పూర్తి స్థాయిలో అందుబాటులో రావడానికి దాదాపు 12 నుంచి 15 నెలలు పడుతుందంటున్నారు. బీఎస్‌ ఎన్‌ఎల్‌ ఈ సవాళ్లన్నిటినీ ఎలా అధిగమిస్తుందో, ఎంత వేగంగా పనిచేస్తుందో వేచిచూడాలి. కవి తిల కుడు అన్నట్టు ‘చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది/ శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతోంది/ దారంతా గోతులు యిల్లేమో దూరం/ చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక కవచం’. బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్వ శక్తులూ కూడదీసుకుని, అవాంతరాలను అధిగమించి కోట్లాదిమందితో మళ్లీ శభాష్‌ అనిపించుకుం టుందని, లక్షలాదిమంది సిబ్బంది కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని ఆశించాలి. 

మరిన్ని వార్తలు