నగరమా... తగరమా!

3 Oct, 2017 00:28 IST|Sakshi

మన నగరాల పునాదులు ఎంత బలహీనమైనవో ముంబై మహా నగరంలో దసరా పండగ ముందు రోజు చోటు చేసుకున్న విషాద ఘటన నిరూపించింది. 23మంది ప్రాణాలు కోల్పోవడానికీ, మరెందరో గాయపడటానికీ దారితీసిన ఆ తొక్కిసలాట... మన నగరాల అస్తవ్యస్థ నిర్మాణానికీ, అనారోగ్యకర అభివృద్ధికీ అద్దం పట్టింది. ఆ మహా నగరాన్ని స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుల్లో చేర్చాలంటూ రూపొందించిన నివేదికలో ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ చెప్పిన వివరాలు వింటే ఎలాంటివారికైనా మతి పోవాల్సిందే. రెండేళ్లనాటి ఆ నివేదిక లోయర్‌ పరేల్‌ ప్రాంతం ఇటీవలికాలంలో ‘అభివృద్ధి’ ఎలా మెరిసిపోతున్నదో ఏకరువు పెట్టింది.  ఆ ప్రాంతంలో ఇటీవలి సంవత్సరాల్లో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు మదుపు చేశామని కూడా వివరించింది. అలాంటిచోట రోజుకు కనీసం లక్షమంది ప్రజానీకం వినియోగించే వంతెన నిడివి కేవలం 77 అంగుళాలున్నదంటే ఆశ్చర్యం కలుగుతుంది.

బట్టల మిల్లులుండే గిరంగావ్‌ గ్రామంగా మాత్రమే ఒకప్పుడు అందరికీ తెలిసిన ఆ ప్రాంతం లోయర్‌ పరేల్‌గా రూపుదిద్దుకుని ఇరవైయ్యేళ్లు దాటుతోంది. ఈ కాలమంతా అక్కడ వేలాది కోట్ల రూపాయల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరిగింది. అదింకా కొనసాగుతోంది. మిల్లులు మాయమై ఆకాశాన్నంటే భవంతులు వెలిశాయి. వాటిల్లోకి భారీ కార్పొరేట్‌ సంస్థలొచ్చాయి. ఇతర వ్యాపార సముదాయాలొచ్చాయి. వీటన్నిటి మూలంగా కార్పొరేషన్‌వారి ఖజానా కళకళలాడుతోంది. నేతలు, ఉన్నతాధికారుల జేబులు నిండుతున్నాయి. ఆ ప్రాంతంలోని అనేకానేక సంస్థల్లో దాదాపు కోటిమంది పనిచేస్తున్నారని అంచనా.

మూడు షిఫ్టుల్లో, పరిమిత సంఖ్యలో కార్మికులుండే మిల్లుల స్థానంలో ఇంత చేటు ‘అభివృద్ధి’ జరిగినా అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలన్న స్పృహ మాత్రం ఎవరికీ లేకపోయింది. వాళ్ల చావు వాళ్లు చస్తారని జనాన్ని గాలికొదిలేశారు. ఆ ప్రాంతం ప్రతి ఉదయమూ, సాయంకాలమూ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుందని ఒక పౌరుడు అన్న మాట అక్షరాలా నిజం. పరేల్‌ స్టేషన్‌కూ, ఎల్ఫిన్‌స్టోన్‌ రోడ్‌ స్టేషన్‌కూ మధ్య ఉదయం పూట ఆదరాబాదరాగా రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య 1,43,690 అని 2012 నాటి ఒక నివేదిక తేల్చిచెప్పింది. ఈ అయిదేళ్లలో ఇదింకా ఎంతో పెరిగి ఉంటుంది. ఏతా వాతా ఇన్నాళ్లుగా ప్రమాదం జరగలేదన్న మాటేగానీ...అక్కడ అనునిత్యం తొక్కిసలాట సర్వసాధారణం. ప్రమాదం సంగతి తెలిశాక ఎప్పుడూ జరిగే తొక్కిసలాటకు ఇన్ని ప్రాణాలెలా పోయాయని అధికారులు ఆశ్చర్యపోయి ఉంటారు.

నిర్లక్ష్యంలో రైల్వే శాఖ ముంబై కార్పొరేషన్‌ను మించిపోయింది. దేశ వాణిజ్య రాజధానిగా ఉంటున్న ముంబైలో 300 కిలోమీటర్ల సబర్బన్‌ రైలు వ్యవస్థపైనే నగర ప్రజానీకం ప్రధానంగా ఆధారపడి ఉన్నారని ఆ శాఖకు తోచలేదు. ఇప్పుడు ప్రమాదం చోటుచేసుకున్న వంతెనను ఉపయోగించుకునేవారి సంఖ్య రోజుకు లక్ష దాటిపోయిందని, వెనువెంటనే విశాలమైన వంతెన నిర్మాణం అవసరమని రెండేళ్లక్రితం ఇద్దరు శివసేన ఎంపీలు రాసిన లేఖకు ఈనాటి వరకూ ఆ శాఖ నుంచి సమాధానం లేదు. అక్కడ రూ. 11.86 కోట్లతో వెడల్పయిన వంతెనను నిర్మించబోతున్నట్టు నిరుడు రైల్వే బడ్జెట్‌లో చెప్పినా ఇంతవరకూ అడుగు ముందుకు పడలేదు. ఈ ప్రాజెక్టు మాత్రమే కాదు...దేశంలో ఇతర ప్రాజెక్టుల స్థితి కూడా ఇంతే. గడిచిన 30 ఏళ్లలో రూ. 1,57,883 కోట్ల విలువైన 676 ప్రాజెక్టుల్ని మంజూరుచేస్తే అందులో సగం కన్నా తక్కువ...అంటే 317 పూర్తయ్యాయని 2014లో అప్పటి రైల్వే మంత్రి సదానంద గౌడ చెప్పారు. ఆలస్యమైన కారణంగా మిగిలిన 359 ప్రాజెక్టుల వ్యయం రూ. 1,82,000 కోట్లకు చేరుకుందని ఆయన లెక్కలిచ్చారు. బహుశా అందుకే కావొచ్చు... ఏడాది వ్యవధిలో 3,500మంది రైల్వే ట్రాక్‌లపై పడి మరణించినా ముంబై సబర్బన్‌ రైల్వే వ్యవస్థ ఎంతో స్థిత ప్రజ్ఞతతో మౌనంగా ఉండిపోయింది. ఇక ఆ ఇరుకు వంతెన గురించి దృష్టి పెట్టకపోవడంలో వింతేముంది?  

ప్రమాదం జరగడం ఒక ఎత్తయితే...అది జరిగాక మన అధికార వ్యవస్థలు స్పందించే తీరు మరో ఎత్తు. ఏదైనా మంచి జరిగిందంటే దాన్ని సొంతం చేసుకోవడానికి ఎగబడే పాలకులు, అధికారులు ప్రమాదం జరిగితే మాత్రం పత్తా ఉండరు. తప్పనిసరై అక్కడున్నా బాధ్యతను వేరొకరిపై నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఒకపక్క తొక్కిసలాట జరిగి అనేకమంది చావుబతుకుల్లో ఉంటే కలిసికట్టుగా పరిస్థితిని చక్కదిద్దడానికి బదులు ఈ సంగతి చూసుకోవాల్సింది మీరంటే మీరని వాదులాడుకున్నారని ఒక పత్రిక కథనం వెల్లడించింది. వంతెన రైల్వే శాఖదే కావొచ్చుగానీ, అది నిర్మించిన స్థలం కార్పొరేషన్‌దని, కనుక సిటీ పోలీసులే చూసుకోవాల్సి ఉంటుందని రైల్వే పోలీసులు...వంతెనను వినియోగించేది రైలు ప్రయాణికులు గనుక రైల్వే పోలీసులదే ఆ బాధ్యతని సిటీ పోలీసులు వాదించుకున్నారట. నగర శివారు ప్రాంత జనాభాను కూడా కలుపుకుంటే 2 కోట్ల జనాభా దాటే ముంబై మహా నగరంలో ఎవరి పరిధేమిటో, ఎవరి బాధ్యతలేమిటో ఎవరికీ స్పష్టతలేదని దీన్నిబట్టి అర్ధమవుతుంది.

పర్యవసానంగా చావుబతుకుల్లో ఉన్న మహిళా ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించడం, వారి ఒంటిపైనున్న ఆభరణాలు, నగదు దోచుకోవడం వంటివి జరిగిపోయాయి. ఇంత పెద్ద విషాదాన్ని ఎలాగూ నివారించలేకపోయారు...కనీసం ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలన్న ఆత్రుతైనా లేకపోయింది. వెనువెంటనే సహాయక బృందాలను తరలించి పరిస్థితిని చక్కదిద్దాలన్న స్పృహ లేనేలేదు. మహానగరం నడిబొడ్డున పరిస్థితే ఇలా ఉంటే ఇక మారుమూల ప్రాంతాల గురించి మాట్లాడుకోవాల్సింది ఏముంటుంది? తమ విధానాల పర్యవసానంగా పల్లెల్లో ఉపాధి కరువై నగరాలకు వలసలు పెరుగుతున్నాయని, కనుక కనీస సదుపాయాలు అవసరమని పాలకులు గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికైనా వారు మొద్దు నిద్ర వదిలి స్వీయ ప్రక్షాళనకు పూనుకోవాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం మానుకోవాలి.

మరిన్ని వార్తలు