చిరస్మరణీయుడు

13 Jun, 2017 01:14 IST|Sakshi
చిరస్మరణీయుడు

‘‘అరుణోదయం ఊరుకోదు/ కిరణాలను సారించనిదే/ వసంతోదయం ఊరు కోదు/పరిమళాలను పారించనిదే/ప్రసరించే నీరు ఊరుకోదు/పల్లం అంతు ముట్టనిదే’’ సోమవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూసిన సాహితీవేత్త, బహు ముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్‌ సి. నారాయణరెడ్డి విరచిత ఇతిహాసం ‘విశ్వంభర’ కావ్యంలోని కవితా పంక్తులివి. తన ఏడు పదుల నిరంతర సాహితీ ప్రస్థానం పొడవునా కిరణాలను సారించి, పరిమళాలను పారించి, జలపాతాలను తలపించి వెళ్లిపోయిన నారాయణరెడ్డి సినారెగా జగద్విఖ్యాతుడు.

నిజాం ఏలుబడిలోని తెలంగాణ గడ్డపై కరీంనగర్‌ జిల్లా మారుమూల పల్లెటూళ్లో పుట్టి వీధి బడి మొదలుకొని డిగ్రీ వరకూ ఉర్దూ మాధ్యమంలోనే చదువుకున్న ఒక రైతు బిడ్డడు తెలుగు భాషకు ఇన్ని సొబగులద్దాడని, తెలుగు తల్లికి ఇంతటి కీర్తిప్రతిష్టలను సాధించిపెట్టాడని తెలిసినప్పుడు సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి.

తెలంగాణ పలుకుబడిని, సంస్కృతిని చిన్నప్పటినుంచీ ఒంటబట్టించుకోవడం, చెవులను తాకే జానపదాలను నిశితంగా అవలోకిస్తూ, వాటిని తనలో ఇముడ్చుకోవడం, హరికథలు, బుర్ర కథలు ఎక్కడ జరిగినా వెళ్లడం తదితరాల వల్లనే ఇదంతా సాధ్యమైంది. చదువంతా ఉర్దూ మాధ్యమంలో సాగుతున్నా ఛందస్సు అనేది ఒకటుంటుందని తెలియకపోయినా ఏడో తరగతిలోనే ఆయన చందోబద్ధంగా తొలి పద్యం రాయగలిగారు. గురువు చెప్పేవరకూ అది సీసపద్యమని కూడా తనకు తెలియదని ఒక సందర్భంలో సినారె అన్నారు.

పదో తరగతి చదువు తున్నప్పుడే నైజాం రాష్ట్రానికి స్వాతంత్య్రం రావాలని కాంక్షిస్తూ కవిత రాశారు. విద్యావేత్తగా, కవిగా, వక్తగా, సినీ గేయ రచయితగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, సాంస్కృతిక సలహాదారుగా, సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా సినారె తెలుగు భాషకు అందించిన సేవలు అపారమైనవి. ఒక పదవిని చేపట్టి నప్పుడు దాన్ని సమర్ధవంతంగా, సమగ్రంగా నిర్వహించి చూపడం, అందులో ఒక కొత్త ఒరవడిని ప్రవేశపెట్టడం ఆయనకు మాత్రమే సాధ్యం. విశ్వవిద్యా లయాల కులపతిగా, రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు.

 ఉర్దూ, సంస్కృత భాషలను సైతం ఔపోసన పట్టారు. స్వరజ్ఞానం ఉండటంవల్లా, గాయకుడు కావడంవల్లా ఆయన కలం నుంచి అలవోకగా పాటలు జాలువారేవి. సినారె ప్రయోగశీలి. సాహిత్యంలో కథాగేయ కావ్యాలు మొదలుకొని ఎన్నో ప్రక్రియల్లో ఆయన రచనలు సాగాయి. ఆయన రాసిన తెలుగు గజళ్లలో మానవీయ దృక్పథమూ, మానవ స్వభావమూ,  లోతైన తాత్వికత దర్శనమిస్తాయి. కవిత్వం పాఠకుల్లో చైతన్యాన్ని కల్గించాలని, ఆలోచిం పజేసి పరివర్తనకు దోహదపడాలని ఆయన ప్రగాఢంగా వాంఛించారు. సాహి త్యంలో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను గమనిస్తూ యువ కవులతో పోటీపడి, వారికి దీటుగా కవిత్వం రాయడం చివరి వరకూ ఆయన కొనసాగించారు.

ప్రతి పుట్టినరోజుకూ ఒక కవితా సంపుటిని తీసుకురావడం కొన్నేళ్లుగా కొనసాగిస్తూ వస్తున్నారు. కవిత్వంలో అద్భుత పదచిత్రాలతో సుమ సుగంధాలను వెదజల్లి సమ్మోహనపరిచినట్టే వక్తృత్వంలో సైతం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడం ఆయనకు అలవోకగా అబ్బిన విద్య. కొన్నేళ్లక్రితం వరకు హైదరాబాద్‌ నగరం లోని రవీంద్ర భారతి, త్యాగరాయ గానసభల్లో జరిగే సభల్లో ఆయన వక్తగా ఉండటం రివాజు.

రాష్ట్రంలో, దేశంలోని వివిధ ప్రాంతాల్లో, విదేశాల్లో ఏ మూల తెలుగు భాషా సంస్కృతులపై మహాసభలు, సదస్సులు జరిగినా పాల్గొనడం, విలువైన సందేశమివ్వడం తన కర్తవ్యంగా భావించారు. కవితాసేద్యం సాగిస్తూనే, కొత్త కొత్త ప్రక్రియల్లో ప్రయోగాలు చేస్తూనే ఈ పనులన్నీ ఆయన కొనసాగిం చారు. మంచి పదచిత్రం, మంచి అభివ్యక్తి ఎవరిలో కనిపించినా వారిని ప్రోత్స హించడం, చేయూతనందించడం సినారె అలవాటు. తన దగ్గర చదువుకునే విద్యార్థుల్లోని ప్రతిభాపాటవాలను గుర్తించి, వారికి సలహాలు, సూచనలిచ్చి మెరి కల్లా తీర్చిదిద్దిన ఘనుడాయన. వర్తమాన తెలుగు సాహిత్యంలో లబ్ధ ప్రతిష్టులుగా పేరొందిన ఎంతోమంది ఆయన శిష్యులే.

నిజాం పాలన సమయంలో తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతిని కాపాడటం కోసం సురవరం ప్రతాపరెడ్డి స్థాపించిన ఆంధ్ర సారస్వత పరిషత్‌ ప్రమాణాలను కొనసాగించ డంలో సినారె చేసిన కృషి అద్భుతమైనది. తనకు ముందు ఆ సంస్థకు అధ్యక్షులుగా పనిచేసిన దేవులపల్లి రామానుజరావు, గడియారం రామకృష్ణ శర్మ తర్వాత దాన్ని ఇరవై య్యేళ్లపాటు ఎంతో సమర్ధవంతంగా నడిపి దాని తరఫున ఎన్నో గ్రంథాలను పున ర్ముద్రించారు. సాహిత్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.

సినీ గీత రచయితగా సినారె చేసిన విన్యాసాలు ఆయన ప్రతిభాపాటవాలకు అద్దం పడతాయి. సన్నివేశాలనుబట్టి, సందర్భాలనుబట్టి దేన్నయినా పలికించగల దిట్ట ఆయన. అది శృంగారరసమా, కరుణరసమా, వీరరసమా, జానపదమా, వేదాంతమా... ఏదైనా సినారె అలవోకగా అల్లగలిగారు. అప్పటికే పింగళి, ఆత్రేయ, ఆరుద్ర, శ్రీశ్రీ, దాశరథి, కృష్ణశాస్త్రిలాంటి హేమాహేమీలున్నచోట నిలబడగలిగిన ప్రతిభాశాలి. సినీ పరిశ్రమలో తెలుగు సరే... ఉర్దూ భాషలో సైతం ఎవరికి ఏ సందేహం వచ్చినా తీర్చగలిగేది సినారెనే. చివరివరకూ నిరీశ్వరవాదిగా ఉన్నారు.

తనది ప్రగతిశీల మానవతావాదమని చెప్పుకున్నారు. ఎందరో రాజకీయ నాయకులకు అత్యంత సన్నిహితంగా మెలిగినా, రాజకీయాల్లోకి అడు గుబెట్టి ఎన్నికల్లో పోటీ చేయమని వారిలో చాలామంది కోరినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. కవిగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్‌ చేస్తే ఆ పదవిలో సైతం తన విశిష్టతను చాటారు. ఆధునిక తెలుగు కవిత్వంపై ఆయన పరిశోధనా గ్రంథం ‘ఆధునికాంధ్ర కవిత్వము– సంప్ర దాయములు, ప్రయోగములు’ ఇప్పటికీ విద్యార్థులకు ఒక రిఫరెన్స్‌ గ్రంథం. తన నిరంతర కృషితో తెలుగు సాహితీలోకంపై తనదైన ముద్రవేసిన సినారె చిరస్మరణీయుడు.

మరిన్ని వార్తలు