లోగుట్టు లీక్‌!

27 Aug, 2016 01:36 IST|Sakshi
లోగుట్టు లీక్‌!

మన రక్షణ అవసరాలను తీర్చడానికి అడుగు ముందుకేసినప్పుడల్లా ఏవో అవాంతరాలు వచ్చిపడుతున్నాయి. తాజాగా నౌకాదళం సమకూర్చుకొనబోయే స్కార్పిన్‌ జలాంతర్గాముల శక్తిసామర్థ్యాలకు సంబంధించిన సవివరమైన డేటా ఆస్ట్రేలియాకు చెందిన పత్రికలో వెల్లడై ప్రకపంనలు సృష్టిస్తున్నది. 22,457 పత్రాల్లో ఉన్న ఆ వివరాలన్నీ అత్యంత కీలకమైనవి. స్కార్పిన్‌ గమనంలో ఉండగా దాన్నుంచి ఎంత పౌనఃపున్యంలో ధ్వని వెలువడుతుందన్న దగ్గరినుంచి... దాని కనిష్ట, గరిష్ట వేగం, వేర్వేరు వేగాల్లో ఉన్నప్పుడు దాని ప్రొపెల్లర్లనుంచి వెలువడే ధ్వని వివరాలు, సముద్ర జలాల్లో అది చూడగల లోతులు, వివిధ స్థాయిల్లో దాని సామర్థ్యం తీరు, శత్రు నౌకలపై దాడి చేశాక వెనుదిరగడంలో, వాటి దాడికి అంద కుండా ముందుకు కదలడంలో దాని పటిమ, శత్రు నౌకలనూ, టార్పెడోలనూ, క్షిపణులనూ ధ్వంసం చేయడంలో దానికుండే సామర్థ్యం వగైరాలన్నీ ఆ డేటాలో ఉన్నాయి. ఈ డేటాను అధ్యయనం చేస్తే స్కోర్పిన్‌ను ఎదుర్కొనడానికి అనువైన రక్షణ ఏర్పాట్లను చేసుకోవడం ప్రత్యర్థులకు పెద్ద కష్టం కాదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే లీకైన వివరాలన్నీ జలాంతర్గామికి చెందిన బ్లూ ప్రింట్‌ లోనివేనని, దాని చోదన, ఆయుధ వ్యవస్థల వివరాలు అందులో ఉండవు గనుక అదంత ప్రమాదం కాదని మరికొందరి అభిప్రాయం. రక్షణమంత్రి మనోహర్‌ పరీకర్‌ సైతం ఈ లీకు వల్ల ఏర్పడగల ముప్పేమీ లేదన్న వాదనతోనే ఏకీభవి స్తున్నారు. నిజానికి స్పార్పిన్‌ ప్రపంచంలోని జలాంతర్గాములతో పోలిస్తే అన్ని విధాలా మెరుగైనదన్న పేరుంది. అది నిలకడగా దాదాపు 50 రోజులపాటు నీటి అడుగున ఉండగలదు. మన నౌకాదళం వద్ద ప్రస్తుతం 13 జలాంతర్గాము లున్నా వాటిలో కొన్ని అవసాన దశకు చేరుకున్నాయి. పైగా ఇప్పటి అవసరాలకు అవి ఏమాత్రం సరిపోవు. సముద్ర జలాల్లో ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్న వర్త మానంలో అత్యంతాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటే తప్ప ప్రత్యర్థులపై ఆధిక్యత సాధ్యం కాదు. స్కార్పిన్‌లు ఆ లోటు తీరుస్తాయనుకుంటున్న తరుణంలో ఈ లీకులు వెలుగులోకొచ్చాయి.


స్కార్పిన్‌ జలాంతర్గాములకు సంబంధించిన నిర్మాణ పనులు పదేళ్లక్రితం మొదలయ్యాయి. అవి దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది ఆఖరు కల్లా ఆరు జలాంతర్గాములనూ మన నౌకాదళానికి అప్పగించే అవకాశాలున్నాయం టున్నారు. ఈ దశలో వాటì  డిజైన్‌ను సవరించడం కూడా కష్టమంటు న్నారు. ఈ లీకులు మన దేశాన్ని ఇరకాటంలో పడేయటానికా లేక డీసీఎన్‌ఎస్‌ సంస్థపై కక్ష తీర్చుకోవడానికా అన్నది ఇంకా తేలవలసి ఉంది. లీకుల వల్ల జరిగిన నష్టమెంత అన్నదానిపై ఎటూ సమీక్ష ఉంటుంది. దేశ భద్రతతో ముడిపడిన అంశం గనుక అసలు అందుకు దారి తీసిన పరిస్థితులేమిటో రాబట్టడం ఇప్పుడు ముఖ్యం.


 జలాంతర్గాముల్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా మనకు ఏదో ఒక సమస్య వచ్చిపడుతోంది. 1981లో పశ్చిమ జర్మనీతో కుదిరిన హెచ్‌డీ డబ్ల్యూ జలాంతర్గాముల కొనుగోళ్ల ఒప్పందంలో ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో దేశంలో జలాంతర్గాముల నిర్మాణ కార్యక్రమం అట కెక్కింది. అందులో సాక్ష్యాధారాలు లేవని సుప్రీంకోర్టు కొట్టేశాక 1999లో మళ్లీ కదలిక వచ్చింది.  2005లో రూ. 18,000 కోట్ల విలువైన ఆరు జలాంతర్గాములను మన దేశంలోనే తయారు చేసేందుకు, దానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన్ని బదిలీ చేసేందుకు ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్‌ఎస్‌ సంస్థతో ఒప్పందం ఖరారైంది. అయితే ఆ మరుసటి ఏడాదే ఇందుకోసం 4 శాతం ముడుపులు చెల్లించారని గుప్పుమంది. ఈ వ్యవహారంలో డీసీఎన్‌ఎస్‌కు లబ్ధి చేకూరేలా వ్యవహరించారని 2009లో కాగ్‌ సైతం చెప్పింది. అయితే అది ఎత్తి చూపిన లోపాలు ప్రాజెక్టును ఆపేయవలసినంత ముఖ్యమైనవి కాదని నిర్ణయించారు. ఆ తర్వాత పనులు మొదలయ్యాయి. జలాంతర్గాములను మన దేశంలోనే తయారు చేయడానికి అను వుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడం, దాని రూపకల్పనపై ఇక్కడివారికి శిక్షణనివ్వడం ఒప్పందంలో కీలకాంశాలు. లీకులతో ముప్పేమీ ఉండబోదన్న పరీకర్‌ ప్రకటన వాస్తవం కాదని దీన్ని బయటపెట్టిన పాత్రికేయుడు కామెరాన్‌ స్టీవర్ట్‌ అంటున్నాడు. భారత్, ఫ్రాన్స్‌లు రెండూ జరిగిన నష్టాన్ని తగ్గించి చూపు తున్నాయని, తన దగ్గరున్న మిగిలిన సమాచారం వెల్లడిస్తే అసలు కథ ఏమిటో వెల్లడవుతుందంటున్నాడు. రేపో మాపో ఆ పని చేస్తానంటున్నాడు. అందు వల్ల పూర్తి స్థాయి దర్యాప్తు జరగకుండా లీకు వల్ల నష్టం ఉన్నదనో, లేదనో చెప్పడం తొందరపాటే అవుతుంది. అది దేశ భద్రతకు చేటు తెస్తుంది.


పైకి ఏం చెప్పినా శత్రు దేశాల అంతర్గత భద్రతా వ్యవస్థ తీరుతెన్నుల గురించి ఆరా తీయడం, అందుకోసం వారు చేసుకుంటున్న ఏర్పాట్లపై నిఘా ఉంచడం ఎవ రైనా చేసే పనే. అవతలివారి సమాచారాన్ని రాబడితే తప్ప మనం చేసుకుంటున్న ఏర్పాట్ల లోటుపాట్లేమిటో సంపూర్ణంగా తెలియదు. అదే సమయంలో మనకు సంబంధించిన సమాచారం కాస్తయినా బయటకు పొక్కకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అడపా దడపా శత్రు దేశాల గూఢచారులుగా వ్యవహ రిస్తున్నవారు పట్టుబడుతుంటారు. రక్షణ కొనుగోళ్లు ఆషామాషీగా జరిగే వ్యవ హారం కాదు. టెండర్లు పిలవడం దగ్గర్నుంచి సంస్థల ఎంపిక వరకూ ఎన్నో జాగ్ర త్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ స్థాయిలో రాజీపడినా కాంట్రాక్టు దక్కని సంస్థ దాని కూపీ లాగి యాగీ చేస్తుంది. బోఫోర్స్‌ తుపాకుల స్కాం బయటపడ్డాక కొను గోళ్లలో దళారుల ప్రమేయాన్ని అంగీకరించరాదన్న విధానం పెట్టుకున్నా ముడు పులు చేతులు మారుతూనే ఉన్నాయి. అవి ఏదో ఒక దశలో బయటపడి అనిశ్చితి ఏర్పడుతోంది. ఇప్పుడు లీకైంది ముడుపుల సంగతి కాక ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలు. భారత్‌లోనే లీక్‌ అయి ఉండొచ్చునని డీసీఎన్‌ఎస్‌ అంటుండగా అది అసాధ్యమని పరీకర్‌ గట్టిగా చెబుతున్నారు. ఈ విషయంలో పటిష్టమైన దర్యాప్తు జరిపి దోషుల్ని పట్టుకోనట్టయితే నష్టపోయేది ఫ్రాన్సే.

మరిన్ని వార్తలు