రాష్ట్రాలకు చేయూతే కీలకం

17 Jun, 2020 00:07 IST|Sakshi

కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనడానికి, లాక్‌డౌన్‌ పర్యవసానంగా స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడానికి అమలు చేస్తున్న వ్యూహాలను సమీక్షించి, వాటికి మరింత పదును పెట్టేందుకు ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ తలపెట్టిన రెండు రోజుల భేటీ మంగళవారం మొదలైంది. కరోనాను ఎదుర్కోవడంలో ఇంతవరకూ అనుసరిస్తూ వస్తున్న విధానాల వల్ల లభించిన ఫలితాలనూ, ముఖ్యంగా లాక్‌డౌన్‌ తొలగించాక రాష్ట్రాలకేర్పడిన అనుభవాలనూ పరస్పరం పంచుకోవడానికి, చర్చించడానికి ఈ వీడియో కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించారు. కరోనా ప్రభావం పెద్దగా లేని ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలకులతో తొలిరోజు ప్రధాని సంభాషించారు. ఈ సందర్భంగా మన దేశం సాధించిన విజయాలను ప్రస్తావించారు. భారత్‌లో వ్యాధిగ్రస్తులు కోలుకునే రేటు 50 శాతంగా వుండటాన్ని, మరణాల రేటు కూడా స్వల్పంగా వుండటాన్నిగుర్తుచేశారు. (గతంతో ఘర్షిస్తేనే అమెరికాకు భవిష్యత్తు )

లాక్‌డౌన్‌ ముందునాటి స్థితితో పోలిస్తే ద్విచక్ర వాహనాల ఉత్పత్తి, డిమాండు అందులో 70 శాతాన్ని సాధించిందని వివరించారు. ఖరీఫ్‌ ఉత్పత్తులు కూడా గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 13 శాతం పెరిగాయి. ఈ విజయాలకు సంతోషిస్తూనే, వాటిని స్ఫూర్తిగా తీసుకుంటూనే మనం సరిదిద్దుకోవాల్సినవీ, మరింతగా మన శక్తియుక్తుల్ని కేంద్రీకరించాల్సినవీ చాలావున్నాయి. ఏ సమయంలో లాక్‌డౌన్‌ విధిస్తే బాగుండేది...అందుకనుసరించాల్సిన విధివిధానాలేమిటి అనే అంశాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ ఇప్పటికీ వ్యాధిగ్రస్తుల శాతం తక్కువగా వుండటం, వేరే దేశాలతో పోలిస్తే వారిలో కోలుకునేవారి శాతం ఎంతో మెరుగ్గా వుండటం ఉపశమనం కలిగించేవే. 

కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుపడిన కరోనా వైరస్‌ను ఎదుర్కొనడంలో మనం పాటించిన విధానాల్లో శాస్త్రీయత వుందో లేదో ఇంకా తెలిసే అవకాశం లేదు. మనకే కాదు...ప్రపంచంలో ఏ దేశానికీ ఆ వ్యాధి విస్తృతిపై, తీవ్రతపై పూర్తి అవగాహన కలగలేదు. మొదట్లో ఆ వ్యాధి బయటపడిన చైనా కూడా లాక్‌డౌన్‌ ఎత్తేశాక పలుమార్లు మళ్లీ మళ్లీ విధించాల్సివస్తోంది. విద్యాసంస్థల్ని మూసివేయడం కూడా తప్పడం లేదు. ఆచరణలో ఎదురవుతున్న అనుభవాలనుబట్టి ఎప్పటికప్పుడు దారులు పరుచుకుంటూ ముందుకుపోవడం తప్ప ఎవరికీ తమ విధానాలపైనా, వాటి ఫలితాలపైనా స్పష్టత లేదు. ఈ సమస్య ఎదురైన మొదట్లో ఇంపీరియల్‌ కాలేజ్‌ చేసిన అధ్యయనం ఒక్క అమెరికాలోనే 20 లక్షల మరణాలు వుండొచ్చని అంచనా వేసింది. కానీ ఆ అంచనా ఎన్ని విపరీత పోకడలకు పోయిందో ఇప్పుడు అందరికీ అర్ధమవుతోంది. ప్రపంచంలో చాలా దేశాలు విధించిన లాక్‌డౌన్‌లకు ఆ అధ్యయనమే ప్రాతిపదిక. ఆ నివేదిక చూసి అన్ని దేశాల్లోని ప్రభుత్వాలూ  ఆందోళనపడ్డాయి. అత్యంత కఠినమైన లాక్‌డౌన్‌లు విధించాయి. ఆ అధ్యయనానికి కారకుడైన ప్రొఫెసర్‌ గతంలో కూడా మహమ్మారి వ్యాధులపై మూడు సందర్భాల్లో ఈ మాదిరి తప్పుడు అంచనాలే వేశాడంటున్నారు.

కరోనా గురించి ఆ ప్రొఫెసర్‌ భయపెట్టే గణాంకాలు ఏకరువు పెట్టినప్పుడు అతని జోస్యాన్ని కొట్టిపారేసినవారు లేకపోలేదు. కానీ వారి వాదనలను అంగీకరించే సాహసం ఎవరూ చేయలేదు. ఎందుకంటే వారివద్ద కూడా శాస్త్రీయ ఆధారాలు లేవు. మన దేశం వరకూ మనం అనుసరించిన విధానాలకు ప్రాతిపదికేమిటో ప్రభుత్వమే చెప్పాలి. దాని సంగతలావుంచి లాక్‌డౌన్‌ విధించడం వల్ల వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఎలాంటి ఆదాయమూ లేక రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. ఇప్పుడెదురవుతున్న ఆర్థికపరమైన ఇబ్బందుల్ని అధిగమించడానికి కేంద్రం నేరుగా సాయం అందించాలని కొన్ని రాష్ట్రాలు డిమాండు చేస్తున్నాయి. మరికొన్ని ఎలాంటి ముందస్తు షరతులూ లేని రుణాలివ్వాలని కోరుతున్నాయి. పంజాబ్‌ అయితే దాదాపు రూ. 30,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోయామంటోంది. మూడునెలల రెవెన్యూ గ్రాంటు ఇవ్వాలని కోరుతోంది. కొంత హెచ్చుతగ్గులతో ఇదే రకమైన పరిస్థితి ఇతర రాష్ట్రాలకు కూడా వుంది. 

అలాగే లాక్‌డౌన్‌ నుంచి బయటికి వచ్చే క్రమంలో అన్ని రాష్ట్రాలూ అనుసరించదగిన విధానాలను కేంద్రం రూపొందించలేదు. ఎవరికి వారు నిర్ణయించుకునే పరిస్థితులే వున్నాయి. మన ఆరోగ్యరంగం లోటుపాట్లను ఈ మహమ్మారి బయటపెట్టింది. కొన్ని దశాబ్దాలుగా దేశంలో వైద్య ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితం ఇప్పుడు కొట్టొచ్చినట్టు కనబడుతోంది. చాలాచోట్ల ప్రభుత్వాసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేవు. ముంబై వంటి మహానగరంలో మంచానికి ఇద్దరు రోగులను వుంచినా ఇంకా చోటు చాలక నేలపై పడుకోబెట్టి చికిత్స అందించాల్సి వచ్చింది. వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడానికి సరిపడా వైద్యులు అందుబాటులో లేరు. ఇతర మౌలిక సదుపాయాలు సరేసరి. ప్రస్తుతం విద్యాసంస్థలు తెరవకూడదని ప్రభుత్వాలు నిర్ణయించాయి. అందుకు బదులుగా ఆన్‌లైన్‌లో బోధన నిర్వహిస్తున్నాయి. కానీ దేశంలో అన్నిచోట్లా కనెక్టివిటీ ఒకేలా లేదు. మెరుగ్గా వున్న రాష్ట్రాల్లో సైతం పల్లెటూళ్లకు సమస్యే.

ఈ అసమానతలు విద్యార్థుల ప్రతిభాపాటవాల్లో ప్రతిఫలించక తప్పదు. ఇలాంటి అంశాలను కూడా సీఎంలు చర్చించాలి.  మెరుగైన పరిష్కారాన్ని కనుక్కోవాలి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి అనువైన వ్యవస్థల్ని రూపొందించడంలో సమష్టిగా పనిచేయాలి. ప్రధాని అన్నట్టు ఈ విపత్కర సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేశాయి.  కేంద్రం ఎప్పటికప్పుడు ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాయి. మంగళవారం కూడా గత అయిదురోజుల తరహాలోనే దేశవ్యాప్తంగా 10,000 కరోనా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోగా, దాన్ని ఎదుర్కొనడానికి మరిన్ని చర్యలు అవసరమని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కనుక సీఎంల భేటీ అనంతరం కరోనా కట్టడిలో రాష్ట్రాలను మరింత బలోపేతం చేసేవిధంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఆశించాలి. 

మరిన్ని వార్తలు