రైతులపై దండయాత్ర!

3 Oct, 2018 00:22 IST|Sakshi

పదకొండేళ్లక్రితం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటిస్తూ ఆయన ఇచ్చి వెళ్లిన స్ఫూర్తితో సకల మానవాళికి మానవ హక్కులు దక్కేందుకు కంకణధారులమవుదామని పిలుపునిచ్చింది. పైగా ఈసారి మహాత్ముడి జన్మదినం రోజున దేశవ్యాప్తంగా ఆయన 150వ జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. కానీ తమ కడగండ్లను పాలకుల దృష్టికి తీసుకొచ్చి, తక్షణ పరిష్కారం కోరేందుకు మంగళవారం భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి 70,000మందితో బయల్దేరిన ‘కిసాన్‌ క్రాంతి యాత్ర’ ఇంకా ఢిల్లీ చేరుకోకముందే, ఘజియాబాద్‌ వద్దే దానికి లాఠీలు ఎదురొచ్చాయి. వారిపై బాష్పవాయు గోళాలు, వాటర్‌కేనన్‌లు ప్రయోగించారు.

ఎందరో గాయాలపాలయ్యారు. ఢిల్లీ సరిహద్దు రణరంగాన్ని తలపించింది. ఇది నిన్ననో, మొన్ననో ప్రారంభమైన క్రాంతియాత్ర కాదు. గత నెల 23న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ నుంచి కొన్ని వందలమందితో ప్రారంభమైన యాత్ర ముందుకు సాగినకొద్దీ పెరుగుతూ వచ్చింది. రైతులంతా ఇందులో ఎంతో క్రమశిక్షణతో పాల్గొన్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఢిల్లీలో ప్రవేశించినంత మాత్రాన వారి వల్ల శాంతిభద్రతలకు ముప్పు కలిగేదేమీ ఉండదు. ఒకవేళ దానిపై అనుమానాలుంటే ఆ క్రాంతియాత్ర నిర్వాహకులతో ముందుగానే మాట్లాడి, వారి డిమాండ్ల గురించి అవగాహన ఏర్పర్చుకుని, సాదరంగా చర్చలకు ఆహ్వానించి, తగిన నిర్ణయాలు ప్రకటించాల్సింది. కానీ అందుకు బదులుగా ఆ రైతులను ఢిల్లీ వెలుపలే నిలువరించడానికి పాలకులు నిశ్చయించుకున్నారు. నిషేధాజ్ఞలు విధించారు. రాజధాని నగరంలో అడుగుపెట్టడానికే వీల్లేదన్నారు. ఎండనకా, వాననకా పగలంతా నడుస్తూ...రాత్రుళ్లు పచ్చికబయళ్లలో నిద్రిస్తూ ఎన్నో కష్టాలకోర్చి వచ్చిన రైతులతో ఇలా వ్యవహరించడం సబబేనా? ఇంత జరిగాక రైతులు అడిగిన తొమ్మిది డిమాండ్లలో ఏడింటికి ఒప్పుకున్నామని, రైతులు సంతృప్తి వ్యక్తం చేశారని కేంద్రం ప్రకటించగా, అన్నీ అంగీకరిస్తేనే ఆందోళన విరమిస్తామని ఉద్యమకారులు చెబుతున్నారు.

రైతుల డిమాండ్లు కొత్తవేమీ కాదు. వాటిల్లో అధిక భాగం గత సార్వత్రిక ఎన్నికల్లోనూ, అటుపై జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ హామీ ఇచ్చినవే. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేస్తామని, ముఖ్యంగా సాగు దిగుబడులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, రుణమాఫీ చేస్తామని, చెరకు రైతుల బకాయిలు చెల్లిస్తామని ఆ పార్టీ వాగ్దానం చేసింది. దానికితోడు పదేళ్లువాడిన ట్రాక్టర్లపై జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)లో ఉన్ననిషేధాన్ని రద్దు చేయాలని, డీజిల్‌ ధరలు రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని, వ్యవసాయానికి వాడే విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని కోరుతున్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన ఇన్సూరెన్స్‌ సంస్థలకే తప్ప తమకు ప్రయోజనకరంగా ఉండటం లేదని చెబుతున్నారు. దాన్ని తగిన విధంగా సవరించి అన్ని పంటలకూ వర్తింపజేయాలని విన్నవించుకుంటున్నారు.

చెరకు సీజన్‌ ముగిసినా తమకు రావాల్సిన రూ. 19,000 కోట్ల రూపాయల బకాయిల సంగతి ఎత్తరేమని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 14 రోజుల్లో వీటిని చెల్లిస్తామన్న హామీ ఏమైందని అడుగుతున్నారు. దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాల మాదిరే రుణమాఫీ అమలు చేశామని యోగి ప్రభుత్వం కూడా చెబుతోంది. కానీ పాత రుణాలు మాఫీ కాక, కొత్త రుణాలు లభ్యంకాక అనేకమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మేం అధికారంలోకి రాకముందు కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరణనివ్వడం తప్ప ఇంతవరకూ ప్రభుత్వం చేసిందేమీ లేదు. యోగి ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు 40 శాతం పెరిగాయన్న సమాజ్‌వాదీ నేత అఖిలేష్‌ యాదవ్‌ ప్రకటనలో అతిశయోక్తి ఉండొచ్చు. కానీ అంతక్రితంకన్నా పెరిగాయన్నది వాస్తవం. 

మన వ్యవసాయ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సాగు వ్యయం అపరిమితంగా పెరిగింది. డీజిల్‌ ధర అయితే భరించలేని స్థాయికి చేరుకుంది. వీటన్నిటి కోసం భారీ మొత్తంలో పెట్టుబడి అవసరమవుతోంది. పాత రుణాలు మాఫీ అయ్యాయని ప్రభుత్వాలు చెబుతుండగా, ఆ బకాయిలు తీరకపోవడం వల్ల కొత్త రుణాలివ్వలేమని బ్యాంకులు ముఖం చాటేస్తున్నాయి. పర్యవసానంగా వారు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించక తప్పడం లేదు. కరువు, అకాలవర్షాలతో వచ్చే కష్టాలు సరేసరి. వీటన్నిటినీ ఓర్చుకుని పంటలు పండిస్తుంటే ఆ దిగుబడులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రైతులు చావు తప్ప పరిష్కారం లేదనుకోవడంలో వింతేముంది? క్వింటాల్‌ ధాన్యానికి ఇప్పుడిస్తున్న గిట్టుబాటు ధర రూ. 1,550ను రూ. 1,750కి పెంచుతామని గత నెలలో యూపీ సర్కారు ప్రకటించింది. నిజానికి అది కూడా రైతులకు ఏమూలకూ సరిపోదు.

సాధారణ బియ్యం క్వింటాల్‌ కొనాలంటే వినియోగదారులు రూ. 5,000కు పైగా వెచ్చించవలసి వస్తుండగా ఆరుగాలం కష్టపడిన అన్నదాతకు దక్కుతున్నదెంత? ఒక్క ధాన్యానికి మాత్రమే కాదు, ఇతర పంటలకు కూడా ఇలా అరకొర ధరలే దక్కుతున్నాయి. బీకేయూ నిర్వహించిన క్రాంతియాత్ర అనేకవిధాల చెప్పుకో దగినది. ఇందులో మహిళలు సైతం చిన్న పిల్లలతో సహా వచ్చి పాల్గొన్నారు. మూడేళ్లక్రితం ముజఫర్‌నగర్‌లో హిందూ–ముస్లిం ఘర్షణలు జరిగాక పశ్చిమ యూపీలో రైతు ఉద్యమం దెబ్బతింది. కానీ గత నాలుగేళ్లుగా బీజేపీకి వెన్నుదన్నుగా నిలబడిన జాట్‌ రైతులు మళ్లీ ముస్లిం రైతులతో చేయి కలిపారు. ఒక్క యూపీలో మాత్రమే కాదు...అన్ని రాష్ట్రాల్లోని రైతులు ఏకమవుతున్నారు. ఉద్యమించడానికి సిద్ధపడుతున్నారు. వారి సమస్యలను ఉపేక్షించడం ఇక సాధ్యం కాదని, ఉత్తుత్తి వాగ్దానాలతో కాలక్షేపం చేయడం కుదరదని పాలకులు గుర్తించాలి. 

మరిన్ని వార్తలు