ప్రయాణం భద్రమేనా?

10 Aug, 2018 01:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నిత్యం నెత్తురోడుతున్న రహదార్లు చూసి, ఏటా దాదాపు లక్షన్నరమంది రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూస్తున్న తీరు గమనించి కఠిన చర్యలు అవసరమన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లును రాజ్యసభ ముందుం చింది. నిరుడు ఏప్రిల్‌లో ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందినప్పుడే రాజ్యసభలో కూడా ప్రవేశ పెట్టారు. అయితే సభ్యుల సూచనతో సెలెక్ట్‌ కమిటీకి పంపారు. ఆ కమిటీ  చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని ఇప్పుడీ బిల్లు పెట్టారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన గణాంకాలు చూస్తే భయాందోళనలు కలుగుతాయి. రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యలో ప్రపంచంలోనే మనది ద్వితీయ స్థానం. దేశంలోని అసహజ మరణాల్లో వీటి శాతం 44.

సగటున రోజుకు 17మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, వీరిలో సగానికి పైగా మంది 18–35 ఏళ్ల మధ్యవయస్కులని గణాంకాలను విశ్లేషిస్తే అర్ధమవుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న మోటారు వాహనాల చట్టం 1988 నాటిది. అప్పుడు వాహనాల సంఖ్య తక్కువ. ఇప్పటితో పోలిస్తే జనాభా కూడా తక్కువ. 1988లో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య 49,218 అయితే ఇప్పుడది 1,46,377కి చేరుకుంది. మోటారు వాహనాల చట్టానికి సవరణలు చేస్తామని 2002 మొదలుకొని కేంద్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వమూ చెబుతూనే వచ్చింది.  

ప్రమాదాల విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం అంతా ఇంతా కాదు. ఉద్దేశపూర్వకంగా ప్రజా రవాణా వ్యవస్థ పీకనొక్కుతూ జనం సొంత వాహనాలపై ఆధారపడక తప్పని స్థితి కల్పిస్తున్నవి ప్రభుత్వాలే. తగినన్ని బస్సులు అందుబాటులో ఉంచకపోవటం, అవి కూడా సమయానికి రాక పోవడం వగైరా కారణాల వల్ల పనులపై బయటికెళ్లేవారు, ఉద్యోగాలు చేసేవారు, విద్యార్థులు తప్ప నిసరిగా సొంత వాహనాలు సమకూర్చుకోవాల్సి వస్తోంది. మన రహదార్ల నిర్వహణ సక్రమంగా లేదని తెలిసినా, అవి భారీ సంఖ్యలో వాహనాలను భరించేంత ప్రామాణికమైనవి లేదా విశాలమై నవి కాదని తెలిసినా ప్రభుత్వాలు వాహనాల అమ్మకాలపై నియంత్రణ పెట్టవు. పైపెచ్చు వాహ నాలు కొనేవారికి బ్యాంకులు రుణాలిస్తుంటాయి. కాలం చెల్లిన వాహనాలు తిరుగుతున్నా, అవి కాలుష్యాన్ని వెదజల్లుతున్నా పట్టించుకునేవారుండరు. ప్రస్తుతం తీసుకొచ్చిన మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లులో కొన్ని మంచి అంశాలున్నాయి.

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి పిల్లలకు వాహనాలు అప్పజెబితే వాహన యజమానులు లేదా ఆ పిల్లల సంరక్షకులు కూడా బాధ్యులవు తారు. వాహనాన్ని తమకు తెలియకుండా తీసుకెళ్లారని లేదా తీసుకెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిం చామని వారు రుజువు చేసుకుంటేనే మినహాయింపు ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన పిల్లల్ని జువెనైల్‌ చట్టం కింద విచారిస్తారు. వారు నడిపిన వాహనానికున్న రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు. తాగి వాహనం నడిపిన వారికి ఇప్పుడున్న జరిమానా రూ. 2,000నూ రూ. 10,000కు పెంచారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తే ఇకపై రూ. 5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.  పరిమి తులకు మించిన వేగంతో వెళ్తే ఇది రూ. 2,000 వరకూ ఉంటుంది. అయితే కేవలం భారీ జరిమా నాలు మాత్రమే సమస్యను చక్కదిద్దలేవు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సాయం చేయడానికి ప్రయత్నించినవారికి ఇకపై కేసుల బెడద ఉండదు. పోలీసులకు లేదా వైద్య సిబ్బందికి తమ పేరు వెల్లడించాలో లేదో వారే నిర్ణయించుకోవచ్చు.

ఓలా, ఉబర్‌ వంటి క్యాబ్‌ సర్వీసు సంస్థలు మహిళా ప్రయాణికుల భద్రతకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. క్యాబ్‌ సర్వీసుల్ని ఐటీ చట్టం పరిధిలోకి కూడా తీసుకొస్తారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌కు సంబంధించిన పరీక్ష, లెర్నర్స్‌ లైసెన్స్‌ జారీ వగైరాలు ఇకపై ఆన్‌లైన్‌లోనే ఉంటాయి. ఒక రాష్ట్రంలో తీసుకున్న డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దయిన పక్షంలో వేరే రాష్ట్రంలో లైసెన్స్‌ తీసుకుని దర్జాగా వాహనాలు నడిపేవారికి ఇందువల్ల చెక్‌ చెప్పినట్ట వుతుంది. పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించిన పక్షంలో అదనంగా ఉన్న ఒక్కొక్క ప్రయాణికుడికి వెయ్యి చొప్పున డ్రైవర్‌ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇది హాస్యాస్ప దమైన నిబంధన. రవాణా సదుపాయాలు అంతంతమాత్రంగా ఉండే గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాలు అక్కడివారు తమ తంటాలు తాము పడుతుంటే జరిమానాలతో వేధించాలని చూడటం విడ్డూరం.

అయితే సవరణ బిల్లు కీలకమైన రహదారి భద్రతపై పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. సవరణ బిల్లులో 92 క్లాజులుంటే అందులో మూడు క్లాజులు మాత్రమే రహదారి భద్రతకు సంబం ధించినవి. రహదార్ల భద్రత గురించి తరచు మాట్లాడే పాలకులు సవరణ బిల్లులో దానికంత ప్రాముఖ్యత ఇవ్వకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 50 కన్నా ఎక్కువ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న ప్రాంతాలను ‘బ్లాక్‌ స్పాట్‌’లు గుర్తించి అక్కడ దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నామని ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ చెబుతున్నారు. మంచిదే. కానీ ఇంజనీరింగ్‌ లోటు పాట్లున్నట్టు రుజువైతే సంబంధిత అధికారులపై తీసుకునే చర్యలేమిటన్న ఊసు లేదు.

చట్టానికి ప్రతిపాదించిన 68 సవరణల్లో అధిక శాతం కార్పొరేట్‌ సంస్థలకు మేలు కలిగేలా, రాష్ట్రాల అధికా రాలను కత్తిరించేలా రూపొందించారన్న విపక్షాల విమర్శల్లో వాస్తవం ఉంది. అంతర్రాష్ట్ర రవా ణాలో ప్రైవేటు రంగ ప్రమేయాన్ని పెంచటం, రవాణా రంగంలో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం రాష్ట్రాల్లోని ప్రజా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. తరచు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ చార్జీల వల్లే రోడ్డు రవాణా సంస్థలు కుదేలవుతున్నాయి. ఇప్పుడు ప్రైవేటు రంగ ప్రమే యాన్ని పెంచితే అవి మరింతగా నష్టాల్లో కూరుకుపోతాయి. క్రమేపీ మూతబడే స్థితి ఏర్పడు తుంది. కేవలం రాష్ట్రాల పరిధిలో రవాణా వ్యవస్థ ఉండటమే మొత్తం సమస్యలకు మూల కారణ మన్న అభిప్రాయం సరికాదు. ఈ లోటుపాట్లన్నిటినీ సరిదిద్దాల్సిన అవసరం ఉంది.

>
మరిన్ని వార్తలు