అత్యంత అమానుషం

30 Nov, 2019 00:38 IST|Sakshi

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో వరస దురంతాలు వెలుగు చూసి ఆర్నెల్లు కాలేదు. ఆ తర్వాత కూడా అడపా దడపా ఆడపిల్లలపై అఘాయిత్యాలు సాగుతూనే ఉన్నాయి. కానీ హైదరాబాద్‌ నగర శివారులో, రంగారెడ్డి జిల్లా తొండుపల్లి టోల్‌ ప్లాజాకు సమీపంలో బుధవారం రాత్రి పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డిని అపహరించి, సామూహిక అత్యాచారం చేసి, హతమార్చిన తీరు సమాజం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటనా స్థలి ఎక్కడో మారుమూల లేదు. అది శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉంది. దానికి అత్యంత సమీపాన టోల్‌ ప్లాజా ఉంది. 

పక్కనే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ పోయే అతి పెద్ద జాతీయ రహదారి ఉంది. దానిపై నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. ఉన్నట్టుండి ఆచూకీ తెలియకుండా పోయిన కేసు కూడా కాదిది. తాను ఆపదలో చిక్కుకున్నానని ఆమె సకాలంలో గ్రహించింది. ఆ సంగతినే తన సోదరికి రాత్రి 9.22 నిమిషాలకు ఫోన్‌ చేసి చెప్పింది. హఠాత్తుగా ఆమె ఫోన్‌ స్విచాఫ్‌ కావడంతో కుటుం బసభ్యులు కూడా కీడు శంకించారు. రంగంలోకి దిగారు. కానీ ఇవేవీ ఆ నిస్సహాయురాలిని కాపాడ లేకపోయాయి. ఈ దారుణ ఉదంతం వెల్లడై 24 గంటలు గడవకముందే అదే శంషాబాద్‌ సమీపంలో శుక్రవారం మరో యువతిని దుండగులు దారుణంగా హత్య చేశారు.

ప్రియాంక హత్య అయినా, మరో మహిళ హత్య అయినా మన వ్యవస్థల పనితీరునూ, సమాజం పాటిస్తున్న విలువలనూ ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మన దేశంలో ఎన్నో కఠిన చట్టాలున్నాయి. దేశ రాజధాని నగరంలో 2012లో నిర్భయ ఉదంతం చోటుచేసుకున్నాక అత్యంత కఠినమైన చట్టం వచ్చింది. పోక్సో చట్టంలో ఉరిశిక్షతోసహా కఠిన శిక్షలు విధించడానికి వీలు కల్పించే సవరణ కూడా చేశారు. వీటితోపాటు తెలంగాణలో ఆడపిల్లల రక్షణ కోసం ‘షీ టీమ్‌’లు ఏర్పాటు చేశారు. ఆపత్స మయాల్లో ఫోన్‌ చేయడం కోసం ప్రత్యేక ఫోన్‌ నంబర్లున్నాయి. తెలంగాణలో అయితే రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్‌ కనబడుతూనే ఉంటుంది. ఇన్ని చట్టాలున్నా, ఇన్ని రకాల జాగ్రత్తలు తీసు కుంటున్నా  లైంగిక నేరాలు ఆగుతున్న దాఖలా లేదు. అవి నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. నేర గాళ్లు ఏ మాత్రం భయపడటం లేదు. గడప దాటి బయటికెళ్లే ఏ ఆడపిల్లకైనా ఈ దేశంలో వేధింపులు నిత్యానుభవం. అవి నగరాలా, పట్టణాలా, గ్రామాలా అన్న తేడా లేదు. వీధి చివరా, నడిరోడ్డుపైనా, నిర్మానుష్య ప్రదేశంలోనా అన్న తేడా లేదు. 

ఎక్కడైనా ఆడపిల్లలు భయపడుతూ బతుకీడ్వవలసిన పరిస్థితులే ఉంటున్నాయి. వెకిలిగా నవ్వడం, ఇష్టానుసారం కామెంట్‌ చేయడం, అసభ్యంగా తాకడం వంటి ఉదంతాలు కోకొల్లలు. అత్యంత అమానుషమైన ఘటనలు జరిగినప్పుడు మాత్రమే సమాజం మొత్తం కదిలిపోతుంది. వాటిపై వెనువెంటనే ప్రభుత్వాలు స్పందించడం మొదలెడతాయి. ఇప్పుడు ప్రియాంక విషాద ఉదంతమే తీసుకుంటే బుధవారం రాత్రి ఆమె కుటుంబం దాదాపు ఒంటరిగానే ఆరాటపడవలసి వచ్చింది. ఒక పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే మరో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లమని పంపించేశారని ప్రియాంక తండ్రి చెప్పారు. అక్కడ ఫిర్యాదు చేశాక కూడా పోలీసులు వెనువెంటనే కదలలేదంటున్నారు. తమ ఇంటి దీపం ఏమైందో తెలియక ఆత్రపడుతున్న ఆ కుటుంబానికి ‘లోకంలో మానవత్వం చచ్చిపోయిందా...’అని ఆ క్షణంలో అనిపించిందంటే అది పోలీసుల పనితీరుకు అద్దంపడుతుంది. బాధితుల పట్ల కనీస సహానుభూతి ప్రదర్శించలేని ఆ మనస్తత్వాలను సరిచేసేందుకు చర్యలు తీసుకోనంతకాలం ఈ స్థితి మారదు. 

పిల్లలు తప్పిపోయారని ఫిర్యాదు చేయడం కోసం వెళ్లేవాళ్లకూ, ముఖ్యంగా ఆడపిల్లల ఆచూకీ తెలియడం లేదని ఫిర్యాదు చేసేవారికీ పోలీస్‌స్టేషన్లలో ఎదురవుతున్న ప్రశ్నే ప్రియాంక కుటుంబసభ్యులకు కూడా ఎదురైంది. వారు పోలీసులను ఆశ్రయించినప్పుడు ‘ఏం జరిగిందో నిజాలు మాత్రమే చెప్పండి’ అనడం, ‘ఎవరితోనో వెళ్లివుంటుంది. రేపు వస్తది’ అని నిర్లక్ష్యంగా చెప్పడం బండబారుతున్న వ్యవస్థ తీరుకు నిదర్శనం. ‘వారు సకాలంలో స్పందించివుంటే మా అమ్మాయి మాకు దక్కేది’ అని రోదిస్తున్న ప్రియాంక కుటుంబసభ్యుల్ని ఓదార్చగలిగేది ఎవరు? నిజమే... చాలా తక్కువ వ్యవధిలోనే ప్రియాంక హంతకుల ఆచూకీని పోలీసులు రాబట్టగలిగారు. రాత్రికి రాత్రి దుండగుల్ని అదుపులోకి తీసుకున్నారు. పది టీంలు రంగంలోకి దిగి అణువణువూ గాలించాయి. స్వయానా సీనియర్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు ఈ కేసుపై శ్రద్ధ పెట్టి పర్యవేక్షించారు. ఇవన్నీ పోలీసు వ్యవస్థ సామర్థ్యాన్ని వెల్లడి స్తాయి. అదే సమయంలో దాని బలహీనతల్ని కూడా పట్టిస్తాయి. ఉన్నత స్థాయిలో జోక్యం చేసు కుంటే తప్ప, ఉన్నతాధికార వర్గం ఉరకలెత్తిస్తే తప్ప సత్ఫలితాలు లభించవా అన్న సందేహం కలుగుతుంది.

నేరం చోటుచేసుకున్న వెంటనే నేరగాళ్లను పట్టుకోవడంతోపాటు వారిపై వెంటవెంటనే సాక్ష్యా ధారాలు సేకరించి, సాధ్యమైనంత త్వరగా న్యాయస్థానాల్లో విచారణ మొదలయ్యేలా,అది త్వరగా పూర్తయి, శిక్షలుపడేలా చూసినప్పుడు మాత్రమే ఈ నేరాలు తగ్గుతాయి. అలాగే నేరాలు జరగడానికి ఆస్కారం ఉండే ప్రాంతాల్లో పకడ్బందీ గస్తీ నిరంతరాయంగా జరగాలి. ప్రియాంక విషాద ఉదంతం వెల్లడై 24 గంటలు గడవకుండానే... ఆ కేసు దర్యాప్తు కోసం ఆ ప్రాంతంలో పోలీసులు సంచరిస్తూనే వున్నా అక్కడికి సమీపంలో మరో యువతి హత్యకు గురైన తీరు చూశాక ఇది ఎంత అవసరమో అర్థమవుతుంది. దానికితోడు సమాజంలో, కుటుంబాల్లో ఉన్న లింగ వివక్ష, దానివల్ల కలుగుతున్న దుష్ఫలితాలపై పిల్లలకు అవగాహన కలిగించే పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలి. ఆడపిల్ల బలహీనురా లన్న భావన మృగాళ్లను తయారుచేస్తుంటే... ఆడపిల్లలను నిస్సహాయులుగా మారుస్తోంది. సామా జిక శాస్త్రవేత్తలు, మనస్తత్వ శాస్త్రవేత్తల సాయంతో ప్రభుత్వాలు బహుముఖ చర్యలు తీసుకున్నప్పుడే ఆడపిల్ల భద్రంగా ఉండగలుగుతుంది.

మరిన్ని వార్తలు