అధికారం–రహస్యం!

8 Mar, 2019 03:26 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వమూ, బీజేపీ నేతలూ రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై సాగుతున్న రగడకు ముగింపు పలకాలని ఎంత ప్రయత్నిస్తున్నా అందులో కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తు న్నాయి. ఆ ఒప్పందం విషయంలో దాఖలైన వ్యాజ్యాలను కొట్టేస్తూ గత డిసెంబర్‌ 14న ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలని సుప్రీంకోర్టును కోరుతూ ప్రశాంత్‌ భూషణ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదప్రతివాదాలు జరిగిన బుధవారంనాడే ఆంగ్ల దినపత్రిక ‘ద హిందూ’ రాసిన కథనం పెను సంచలనం సృష్టించింది. ఇలాంటి కథనాలు అధికారంలో ఉన్నవారిని సహజంగానే ఇబ్బంది పెడ తాయి. వారు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఆశ్చర్యకరంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో విచిత్రమైన వాదన చేసింది. యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీ అయ్యాయని, వాటి ఆధారంగా ఆ పత్రిక రఫేల్‌పై వరస కథనాలు రాస్తూ అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన నేరానికి పాల్పడిందని అటార్నీ జనరల్‌(ఏజీ) కెకె వేణుగోపాల్‌ ధర్మాసనానికి చెప్పారు. ఈ దొంగతనం నేరంపై దర్యాప్తు జరుగు తున్నదని వివరించారు. కానీ ఈ క్రమంలో మీడియాలో వెలువడిన కథనం సరైందేనని పరోక్షంగా ఆయన అంగీకరించినట్టయింది.

రఫేల్‌ ఒప్పందంపై కావొచ్చు... మరొక అంశంలో కావొచ్చు మీడియాలో వెలువడుతున్న కథనాలు తప్పయితే వాటిపై అధికారంలో ఉన్నవారు వివరణ ఇవ్వొచ్చు. వాస్తవాలేమిటో ప్రజలకు వివరించవచ్చు. తప్పుడు సమాచారం అందించినందుకు మీడియా సంస్థలపై చట్టప్రకారం చర్య తీసుకోవచ్చు. పొరపాట్లకు మీడియాతో సహా ఎవరూ అతీతులు కాదు. కానీ ఏజీ చేసిన వాదన భిన్నంగా ఉంది. ‘హిందూ’ పత్రిక గత నెల 8న ప్రచురించిన కథనం, ఆ తర్వాత వెలువడిన కథ నాలు, తాజాగా బుధవారం అదే పత్రిక రాసిన కథనం రఫేల్‌ ఒప్పందంపై ప్రభుత్వం చేస్తున్న వాదనలపై సందేహాలు కలిగించాయి. వీటిలో ఏది నిజమో తెలుసుకోవాలని పౌరులు సహజం గానే కోరుకుంటారు. ఈ సమయంలో సంతృప్తికరమైన వివరణనివ్వకపోగా ఒప్పంద పత్రాలను ఎవరో దొంగిలించారని  చెప్పడం వింత కాదా? ఇంతకూ ‘హిందూ’ తాజా కథనం ఏం చెబు తోంది? రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంపై ఏకకాలంలో సమాంతరంగా రెండు బృందాలు ఫ్రాన్స్‌తో మంతనాలు జరపడం పర్యవసానంగా కలిగిన నష్టం గురించి రక్షణ మంత్రిత్వ శాఖ బృందం ఒక నివేదికలో ఏకరువు పెట్టిందని తెలిపింది.

అలాగే ఒప్పందానికి బ్యాంకు గ్యారెంటీ తీసుకోనట్టయితే మనకు నష్టం జరుగుతుందని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వ్యక్తం చేసిన అభి ప్రాయానికి భిన్నంగా ఫ్రాన్స్‌ ప్రధాని ఇచ్చే ‘లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌’తో సరిపెట్టుకుని ఒప్పందానికి అంగీకరించారని కూడా ఆ పత్రిక వివరించింది. గ్యారెంటీలుంటే బ్యాంకులు తీసుకునే కమిషన్లు కూడా కలిసి ఒప్పందం తడిసి మోపెడవుతుందని చెప్పినవారు... అటువంటివి లేకుండానే ఒప్పం దం వ్యయాన్ని పెంచేశారని ఆ కథనం వెల్లడించింది. లోగడ అదే పత్రిక వెల్లడించిన కథనం కూడా కీలకమైనదే. రఫేల్‌ ఒప్పందంపై రక్షణ శాఖ బృందం చర్చిస్తుండగా ప్రధాని కార్యాలయం (పీఎంఓ) అధికారులు కూడా అదే అంశంపై ఫ్రాన్స్‌తో మంతనాలు జరపడం సరికాదని అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పరికర్‌ దృష్టికి రక్షణ అధికారులు తీసుకొచ్చారని ఆ కథనం వెల్లడించింది.

రఫేల్‌ ఒప్పందంపై సాగుతున్న వివాదం త్వరగా ముగిసిపోవాలని కేంద్రం ఆశిస్తోంది. ప్రజలు ఆశిస్తున్నదీ అదే. కానీ అందుకు పారదర్శకంగా వ్యవహరించడం, అన్ని రకాల సందేహా లకూ సవివరమైన, సహేతుకమైన జవాబులివ్వడం అవసరం. అలాగైతేనే అది సాధ్యమైనంత త్వరగా సమసిపోతుంది. గతంలో రాజీవ్‌గాంధీ హయాంలో జరిగిన బోఫోర్స్‌ శతఘ్నుల కొను గోలులో కుంభకోణం జరిగిందని ఆరోపణలొచ్చినప్పుడు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిజాలను తొక్కిపెట్టాలని చూడటంతో అది పెను భూతంలా మారిన సంగతి ఎవరూ మరిచిపోరు.ఈ వ్యవ హారంలో కీలక పాత్రధారి ఒట్టావియో కత్రోకి 2013లో మరణించడంవల్లా, సీబీఐ చేతులెత్తేయడం వల్లా చివరకు అది అటకెక్కింది. అయితే కాంగ్రెస్‌పై ఈనాటికీ ఆ మచ్చ పోలేదు. రక్షణ కొనుగోళ్ల ఒప్పందాలు వివాదాల్లో చిక్కుకుంటే మన సైనిక దళాల అవసరాలు తీరడంలో జాప్యం జరుగు తుంది. అది దేశ భద్రతకు మంచిది కాదు. పాలకులు పారదర్శకంగా ఉంటే ఈ జాప్యాన్ని నివారిం చడం అసాధ్యమేమీ కాదు. ధర్మాసనం ముందు ఏజీ చేసిన వాదన ఆ దిశగా లేదు సరిగదా... అది మీడియాను బెదిరించే పద్ధతుల్లో ఉంది.  

దేశంలో వివిధ భాషల్లో పత్రికలు వెలువడటం మొదలవుతున్న దశలో వాటిని నియంత్రిం చడం కోసం, ప్రజలకు వాస్తవాలు అందకుండా చేయడం కోసం 1889లో బ్రిటిష్‌ వలస పాలకులు ఈ అధికార రహస్యాల చట్టం తీసుకొచ్చారు. దాన్ని 1904లో మరిన్ని కఠిన నిబంధనలు చేరుస్తూ సవరించారు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న చట్టం 1923లో సవరించింది. ఈ చట్టం కొనసాగడం మన మహోన్నతమైన స్వాతంత్య్రోద్యమానికి అపచారం చేయడం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. కానీ కేంద్రంలో కాంగ్రెస్‌ మొదలుకొని ఎన్ని పార్టీలు అధికారంలోకొచ్చినా... సమాచార హక్కు చట్టం వచ్చి దాదాపు పదిహేనేళ్లు అవుతున్నా ఈ అప్రజాస్వామిక చట్టం కొనసాగుతూనే ఉంది. మన పార్టీల చిత్తశుద్ధిని, మన ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తూనే ఉంది. కాలం చెల్లిన చట్టాలను సమీక్షించి బుట్టదాఖలా చేస్తామని నాలుగేళ్లక్రితం కేంద్రం ప్రకటించినప్పుడు అందరూ హర్షిం చారు. ఆ సమీక్ష ఎంతవరకూ వచ్చిందో తెలియదుగానీ... ఇటువంటి చట్టాలు మాత్రం క్షేమంగా కొనసాగుతున్నాయి. ఈ చట్టం విషయంలో కేంద్రం వైఖరిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ సంధించిన ప్రశ్నలు పాలకుల కళ్లు తెరిపించాలి. రఫేల్‌ ఒప్పందంలో అన్ని కీలకాం శాలనూ ప్రజలముందు ఉంచడంతోపాటు అధికార రహస్యాల చట్టాన్ని తక్షణం ఎత్తేయాలి.

మరిన్ని వార్తలు