రాజస్తాన్‌లో ముసలం

14 Jul, 2020 00:54 IST|Sakshi

చేసిన తప్పులకు మనం పెట్టుకునే ముద్దు పేరు ‘అనుభవం’ అన్నాడు ఒకాయన. అలాంటి అనుభవం కాంగ్రెస్‌కు పుష్కలంగా వుంది. బలంగా వున్న రాష్ట్రాల్లో తప్పు మీద తప్పు చేస్తూ బలహీనపడటం... ఎలాగోలా అధికారంలోకొచ్చిన చోట కూడా ఆ తప్పుల పరంపరనే కొనసాగిస్తూ చేజేతులా కొంప ముంచుకోవడం ఆ పార్టీకి రివాజుగా మారింది. మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీకి పదవీ భ్రష్టత్వం ప్రాప్తించి నిండా నాలుగు నెలలు కాలేదు. రాజస్తాన్‌లో సైతం ఇప్పుడు అలాంటి పరిణా మాలే పునరావృతమవుతున్నాయంటే ఆ పార్టీ తప్పులు దిద్దుకునే స్థితిలో లేదని అర్థం.

తనను కాదని వృద్ధ నేత అశోక్‌ గహ్లోత్‌ను ముఖ్యమంత్రి చేసినప్పటినుంచీ తీవ్ర అసంతృప్తితో వున్న యువ నాయకుడు సచిన్‌ పైలట్‌ ఆదివారం రాత్రి పావులు కదపడంతో కాంగ్రెస్‌ మరో సంక్షోభంలో చిక్కు కుంది. 200మంది శాసనసభ్యులుండే అసెంబ్లీలో 107 స్థానాలు గెల్చుకుని 2018లో అధికారంలో కొచ్చిన కాంగ్రెస్‌లో అంతర్గత ఘర్షణలు సాగుతూనేవున్నాయి. పార్టీ ఎమ్మెల్యేల్లో ఇప్పుడు తన వెనక 30మంది వున్నారని పైలట్‌ చెబుతుంటే, సోమవారం జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ    (సీఎల్‌పీ) సమావేశానికి 102మంది హాజరయ్యారని ముఖ్యమంత్రి గహ్లోత్‌ చెబుతున్నారు. ఆ ఎమ్మెల్యేలతోపాటు మరికొందరు ఇండిపెండెంట్లు ఒక విలాసవంతమైన హోటల్‌కు తరలిపోయారు. గహ్లోత్‌ చెబుతున్న ఈ లెక్క నిజమైతే తిరుగుబాటు చేసిన పైలట్‌కు ఫలితం దక్కలేదనుకోవాలి. కానీ బలపరీక్ష వరకూ వెళ్తే ఏమైనా జరగొచ్చు. 

ప్రస్తుతం దేశాన్ని కరోనా వైరస్‌ మహమ్మారి చుట్టుముట్టింది. బాధితుల సంఖ్య చూస్తుండగానే 9 లక్షలకు ఎగబాకింది. సగటున రోజుకు 30,000 కేసులు బయటపడుతున్నాయి. నిజానికి ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాజకీయ నాయకత్వం యావత్తూ తన శక్తియుక్తుల్ని ఈ వ్యాధిని అరికట్టడానికి జరిగే కృషిలో కేంద్రీకరిస్తుందని అందరూ ఆశిస్తారు. కానీ రాజస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలు అందుకు విరుద్ధంగా వున్నాయి. పెళ్లిళ్లకు, చావులకు, ఉత్సవాలకు, ఊరేగింపులకు కరోనా పేరు చెప్పి పరిమితులు విధించినవారే, అన్నిటినీ బేఖాతరు చేస్తూ అధికారం కోసం జరిగే కుమ్ములాటల్లో నిస్సిగ్గుగా తలమునకలయ్యారు.

72మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ అవకాశం కోసం కాచుక్కూ ర్చోవడం కాదు... అలాంటి అవకాశాన్ని సృష్టించుకోవడానికి, మధ్యప్రదేశ్‌ డ్రామాను ఇక్కడ కూడా కొనసాగించడానికి ప్రయత్నిస్తూనే వుందని మీడియా కథనాలు చాన్నాళ్లుగా హెచ్చరిస్తున్నాయి. కానీ కాంగ్రెస్‌లో అధినాయకులుగా వున్నవారికి ఇవేమీ పట్టలేదు. వారంతా ‘ఎలా రాసిపెట్టి వుంటే అలా జరుగుతుందన్న’ నిర్లిప్త ధోరణిలోకి జారుకున్నట్టు గత కొన్నేళ్లుగా కనబడుతూనేవుంది. కనుకనే రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు ముదిరాయి. ఇవి ఏ స్థాయికి చేరాయంటే... ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదుపై మీ జవాబే మిటని ఉప ముఖ్యమంత్రిగా వున్న సచిన్‌ పైలట్‌కు పోలీసు విభాగం స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌(ఎస్‌ఓజీ) నోటీసు ఇచ్చింది.

పార్టీలో అసమ్మతి తలెత్తినప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందో చూసి పరిష్కరించాల్సిన బాధ్యత లెజిస్లేచర్‌ పార్టీ నేతగా, ముఖ్యమంత్రిగా అశోక్‌ గహ్లోత్‌కు వుంటుంది. తన స్థాయిలో సమస్య పరిష్కారం కాదనుకుంటే అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఈ రెండు మార్గాలూ వదిలి ఉప ముఖ్యమంత్రిగా వున్న నేతను, ఆయన అనుచర ఎమ్మెల్యేలను నోటీసులతో భయపెట్టడానికి సిద్ధమయ్యారంటే గహ్లోత్‌ మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రాల్లో వందిమాగధుల్ని ప్రోత్సహించి ఎక్కడికక్కడ పార్టీ పుట్టి ముంచిన అధినాయకత్వం చివరకు దిక్కులేని స్థితిలో పడిందని అడపా దడపా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలే స్పష్టం చేస్తు న్నాయి.

పార్టీ పని తీరుపై ఆవేదనతో సూచనలివ్వబోయినవారిని సైతం నాయకత్వం దూరం పెడుతోంది. పార్టీ అధికార ప్రతినిధిగా వున్న సంజయ్‌ ఝా ఇందుకు ఉదాహరణ. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాయకత్వం మరింత అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన రాసిన వ్యాసంపై ఆగ్రహించి గత నెలలో ఆయన్ను ఆ పదవినుంచి తొలగించారు. రాష్ట్రాల్లో అధికారంలో వున్నచోటా, లేనిచోటా కూడా ఎవరూ అధినాయకత్వాన్ని గుర్తిస్తున్న దాఖలా లేదు. కనుకనే నాలుగు గోడల మధ్య రాజ కీయంగా పరిష్కారం కావాల్సిన రాజస్తాన్‌ వివాదం కాస్తా బజారున పడింది. రాజస్తాన్‌ పరి ణామాల అనంతరం కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ సైతం పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ట్వీట్‌ చేశారు.

ప్రియాంక గాంధీ, రాహుల్‌ గాంధీ రంగంలోకి దిగి రాజస్తాన్‌లో నష్ట నివారణ చర్యలు మొదలెట్టారని మీడియా కథనాలు చెబుతున్నాయి. మంగళవారం వరసగా రెండో రోజు సీఎల్‌పీ సమావేశం జరగబోవడం ఇందుకు నిదర్శనం. ఇవన్నీ ఫలించి ఇప్పటికైతే కాంగ్రెస్‌ అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఈ పరిణామాలతో ప్రభుత్వం బలహీనపడిందన్న మాట వాస్తవం. ఇకనుంచి అది దినదినగండంగా రోజులు వెళ్లదీయక తప్పదు. అలిగి వెళ్లిన పైలట్‌ తగినంతమంది ఎమ్మెల్యేలను కూడగట్టుకుని, పార్టీని చీల్చి బీజేపీలో విలీనం చేస్తారా లేక సొంతంగా పార్టీ స్థాపించి బీజేపీ ఆశీస్సులతో తన ఆశ నెరవేర్చుకుంటారా అన్నది మరికొన్ని రోజుల్లో తేలు తుంది.

2013 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడిపోవడానికి కారకుడైన అశోక్‌ గహ్లోత్‌ను, 2018లో తిరిగి సీఎంగా చేసినప్పుడే అధినాయకత్వమే పార్టీలో అసమ్మతి బీజాలు నాటింది. కనుక ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు బీజేపీని నిందించి ప్రయోజనం లేదు. చుక్కాని లేని నావలా ఎటు పడితే అటు కొట్టుకుపోతున్న కాంగ్రెస్‌ను యువ నాయకత్వంలో సంస్థాగతంగా పటిష్టం చేసుకున్న ప్పుడే, జనాభీష్టమేమిటో తెలుసుకుని మెలిగినప్పుడే పరిస్థితులు చక్కబడతాయి. ఆ సంగతి కాంగ్రెస్‌ ఎప్పటికైనా గుర్తిస్తుందో లేదో చెప్పడం కష్టమే.

మరిన్ని వార్తలు