దశ దేశాల అతిథులు

26 Jan, 2018 00:49 IST|Sakshi

ఈసారి మన గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొనేందుకు ఆగ్నే యాసియా దేశాల సంఘం(ఆసియాన్‌) అధినేతలు వచ్చారు. మన సాంస్కృతిక వారసత్వాన్ని, సైనిక పాటవాన్ని ప్రముఖంగా ప్రదర్శించే ఈ ఉత్సవాలకు ప్రతిసారీ ఒక దేశాధినేత ముఖ్య అతిథిగా రావడం ఆనవాయితీ. అందుకు భిన్నంగా ఈసారి ఆసియాన్‌ అధినేతలందరూ రావడం విశేషం. ఆసియాన్‌తో మన దేశం సంబంధాలు నెలకొల్పుకుని అర్థ శతాబ్ది పూర్తయింది. వాటితో మనకు వ్యూహాత్మక భాగ స్వామ్యం ఏర్పడి పదిహేనేళ్లయింది. ఆసియాన్‌ దేశాలతో భారత్‌ వాణిజ్యపరమైన చర్చలు సాగించేందుకు అనువైన దౌత్య భాగస్వామ్యం ఏర్పడి పాతికేళ్లవుతోంది. ఈ దేశాలతో మనకు ప్రాదేశిక లేదా సముద్ర ప్రాంత సరిహద్దులు లేవు. కనుక వాటికి సంబంధించిన తగాదాలు లేవు. అందువల్ల మనతో ఉన్న స్నేహబంధాన్ని మరింత విస్తరించుకునే విషయంలో వాటికి రెండో అభిప్రాయం లేదు. 

ఆసియాన్‌లోని పది సభ్యదేశాలు– సింగపూర్, బ్రూనై, మలేసియా, థాయ్‌లాండ్, ఇండొనేసియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, లావోస్, కంబోడియా, మయన్మార్‌ల జనాభా మొత్తంగా దాదాపు 65 కోట్లు. వీటి ఉమ్మడి స్థూల దేశీయోత్పత్తి 2.60 లక్షల కోట్ల డాలర్లు. 120 కోట్ల జనాభా, 2.26 లక్షల కోట్ల డాలర్ల జీడీపీ ఉన్న మన దేశంతో మైత్రి రెండు పక్షాలకూ మేలు చేస్తుంది. ఆగ్నేయాసియా దేశాలతో మన దేశానికి చరిత్రాత్మక సంబంధాలున్నా ప్రచ్ఛన్న యుద్ధ (కోల్డ్‌ వార్‌) కాలంలో అవి మందగించాయి. ఆ దేశాలు మొదటినుంచీ అమెరికాతో సన్నిహితంగా ఉండటం, అప్పట్లో మనం సోవియెట్‌ యూనియన్‌తో మైత్రి సాగించడం ఇందుకు కారణం. కానీ పీవీ నరసింహా రావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలకు ద్వారాలు తెరవడంతోపాటు ‘లుక్‌ ఈస్ట్‌’ విధానం పేరిట తూర్పు దేశాలతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పు కోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. అప్పటినుంచి ఆగ్నేయాసియా దేశాలతో మన సంబంధాలు విస్తరిస్తూ వచ్చాయి. 2009లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం, 2014లో దీన్ని వివిధ సేవలకూ విస్తరించడంతో అనుబంధం మరింత పెరిగింది. ‘లుక్‌ ఈస్ట్‌’ను ప్రధాని నరేంద్ర మోదీ ‘యాక్ట్‌ ఈస్ట్‌’(తూర్పుదేశాలతో కార్యాచ రణ)గా రూపుదిద్దడం వల్లనే సంబంధాలు ఇంతగా విస్తృతమయ్యాయి. 

భౌగోళికంగా చూసినా, ఆర్థిక కార్యకలాపాల రీత్యా చూసినా ఆగ్నేయాసియా ప్రాంతం మనకెంతో కీలకమైనది. ఇరు పక్షాల మధ్యా వాణిజ్యం 7,000 కోట్ల డాలర్ల మేర ఉంది. వాణిజ్యంలో ఆసియాన్‌ భారత్‌కు నాలుగో పెద్ద భాగస్వామి. ఈ వాణిజ్యాన్ని మరింత పెంచుకునే దిశగా ఇరుపక్షాలూ ప్రయత్నిస్తున్నాయి. ఇదిగాక ఐటీ, కమ్యూనికేషన్లు వంటి రంగాల్లో భారత్‌ సాధించిన వృద్ధి ఆసియాన్‌ను ఆకట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం నెట్‌వర్క్‌ను పెంచుకోవడంలో అది తమకు సహకారం అందించగలదన్న విశ్వాసం వాటికుంది. అయితే ఇదే సమ యంలో చైనా పాత్రను తక్కువ అంచనా వేయలేం. ఆ దేశం కూడా కొన్ని దశా బ్దాలుగా ఆసియాన్‌ దేశాలతో వాణిజ్యబంధాన్ని విస్తరించుకుంటోంది. ఆ ప్రాంత దేశాలైన ఫిలిప్పీన్స్, మలేసియా, సింగపూర్, వియత్నాం వంటి దేశాలతో దానికి సరిహద్దు వివాదాలున్నా వాటి మధ్య వాణిజ్యం పెరుగుతోంది. అయితే చైనా దూకుడు ఆసియాన్‌ దేశాలకు ఇబ్బందిగానే ఉంటోంది. అది తమపై పెత్తనం చలా యించాలని చూస్తున్నదన్న అనుమానాలు వాటికున్నాయి. 

పర్యవసానంగా అభద్రతకు లోనవుతున్నాయి. అందుకే కేవలం చైనాపై ఆధారపడే విధానాన్ని విడనాడి ఆసియాలో మరో బలమైన దేశం భారత్‌కు మరింత సాన్నిహిత్యం కావాలని అవి భావిస్తున్నాయి. ఆసియాన్‌ దేశాలతో భిన్న రంగాల్లో భారత్‌ సహకారాన్ని విస్తరిం చుకోవడానికి, ఆ అంశాల్లో తరచు సంభాషణలు జరపడానికి 30 రకాల బృందాలు ఏర్పాటయ్యాయి. విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, పర్యాటకం, వ్యవసాయం, పర్యా వరణం, పునరుత్పాదక ఇంధన వనరులు, టెలికమ్యూనికేషన్ల రంగాల్లో మంత్రుల స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. తూర్పు–పడమరలను ఏకం చేసేందుకు చైనా తలపెట్టిన బృహత్తరమైన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌(బీఆర్‌ఐ) ప్రాజెక్టులో ఆసియాన్‌ దేశాలు భాగస్వాములుగా ఉన్నా ఆ ప్రాజెక్టు విషయంలో వాటికి కొన్ని అభ్యంతరాలున్నాయి. మన దేశమైతే ఇందులో చేరలేదు. ఆసియాన్‌ దేశాలతో రాకపోకలను పెంచే భారత్‌–మయన్మార్‌–థాయ్‌లాండ్‌ త్రిభుజ రహదారి నిర్మాణా నికి మన దేశం చేయూతనిస్తోంది. 

డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడయ్యాక ఈ ఏడాది కాలంలో ‘ఇండో–పసిఫిక్‌ పదబంధం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇండో–పసిఫిక్‌ ప్రాంత భద్రతలో భారత్‌ కీలక పాత్ర పోషించాలని ఆయన చెబుతున్నారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో నిబంధనల ఆధారిత ప్రాంతీయ భద్రతా విధానం అవసరమని, ఇది మాత్రమే ఈ ప్రాంత సుస్థిరతకు, భద్రతకు పూచీ ఇస్తుందని  భారత్‌–ఆసియాన్‌ దౌత్య శిఖరాగ్ర సదస్సును ప్రారంభిస్తూ నరేంద్ర మోదీ చెప్పడంతోపాటు సాగర ప్రాంత భద్రతకు అవసరమైన సహకారాన్ని అందించడానికి భారత్‌ సిద్ధంగా ఉన్నదని హామీ ఇవ్వ డాన్నిబట్టి రాగల కాలంలో ఈ దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో మన పాత్ర మరింత పెరుగుతుందని అర్ధమవుతుంది. 

ఇది సహజంగానే చైనాకు కంటగింపుగా ఉంటుంది. హిందూ మహా సముద్ర ప్రాంతంలో తన పరపతిని పెంచుకుంటున్న చైనా వ్యవహారశైలికి జవాబుగానే మన దేశం ఇలా అడుగులేస్తోంది. అయితే ఆసియాన్‌ దేశాలన్నిటితో మన దేశం ఒకే స్థాయిలో సంబంధాలు నెలకొల్పుకోవడం కష్టం. మన వ్యూహాత్మక అవసరాలతోపాటు ఆ దేశాల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆసియాన్‌ దేశాలు అన్నిటా ఒకే మాటపై లేకపోవడం కూడా మన పాత్రను పరిమితం చేస్తోంది. ఈ కారణం వల్లనే వాణిజ్యరంగం అనుకున్నంతగా విస్తరించలేదు. ఈ లోటుపాట్లన్నిటినీ సవరిం
చుకుని ముందడుగేయడానికి అధినేతల రాకపోకలు, సంభాషణలు, శిఖరాగ్ర సదస్సులు దోహదపడతాయి. అందువల్ల ఆసియాన్‌ దేశాధినేతల రాక మంచి పరిణామం.

మరిన్ని వార్తలు